జకాత్ సదకాల ఆర్ధిక నీతి

జకాత్ సదకాల ఆర్ధిక నీతి
– వాహెద్
’’మేము ఇస్రాయీలు సంతానం నుండి మరొక వాగ్దానం తీసుకున్నాము. దానిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి : ‘‘అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలుకరించాలి. నమాజును స్థాపించాలి. జకాత్‌ ఇవ్వాలి.’’ (అల్ బఖర : 83)
’’కేవలం పరుల మెప్పును పొందటానికే తన ధనం ఖర్చుచేసేవాని మాదిరిగా అల్లాహ్ ను అంతిమదినాన్నీ విశ్వసించని వాని మాదిరిగా, మీరు దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయపరచి మీ దాన ధర్మాలను మట్టిలో కలపకండి.‘‘ (అల్ బఖర్ : 262)
’’విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాదించిన ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవమార్గంలో ఖర్చుపెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వటానికి పనికిరాని వస్తువులను ఏరితీసే ప్రయత్నం చెయ్యకండి. ఒకవేళ ఆ వస్తువులనే ఎవరన్నా మీకు ఇస్తే, వాటిని మీరు తృణీకార భావంతో తప్ప, మనసారా స్వీకరించరు కదా!‘‘ (అల్ బఖర : 267)
’’విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ, వారందరూ ఒకరికొకరు సహచరులు, వారు మేలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు చెయ్యవద్దు అని నిరోధిస్తారు. నమాజును స్థాపిస్తారు. జకాత్‌ను ఇస్తారు. అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల విధేయత పాటిస్తారు‘‘ (తౌబ : 71)


జకాత్ లేదా తప్పనిసరిగా చెల్లించవలసిన దానం గురించి దివ్యఖుర్ఆన్ లో ఇలాంటి వాక్యాలు అనేకం కనిపిస్తాయి. సమాజంలో దురదృష్టవంతులు, నిర్భాగ్యులైన వారిని ఆదుకోవాలని దానధర్మాలు చేయాలని ఇస్లామ్ బోధిస్తుంది. ముఖ్యంగా రమజాను మాసంలో అందువల్లనే ముస్లిములు ఇతోధికంగా దానధర్మాలు చేస్తుంటారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. దేవుని ప్రసన్నతతో పాటు ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని కూడా అనుభవిస్తారు.
రమజాను మాసం అంటే సాధారణంగా సేమ్యాలు గుర్తొస్తాయి. ముస్లిములు పాటించే ఉపవాసాలు గుర్తొస్తాయి. ఇస్లామ్ లో రమజాన్ మాసానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ ప్రాముఖ్యానికి కారణమేమంటే, దేవున వాక్కు అయిన దివ్యఖుర్ఆన్ ఈ మాసంలోనే ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా మానవాళికి లభించింది. దానికి కృతజ్ఞతగా ఈ మాసంలో ముస్లిములు ఉపవాసాలు పాటిస్తారు. ఈ యావత్తు మాసం ఒక శిక్షణాకాలం వంటిది. ఇస్లామీయ బోధనలు, ప్రమాణాల ప్రకారం జీవితాన్ని గడిపే శిక్షణ ఇచ్చే మాసం. ఈ నెల రోజుల శిక్షణ తర్వాత మిగిలిన పదకొండు నెలలు ఈ ప్రకారమే జీవించడం అలవడుతుంది. ఆరాధనల విషయంలో ఇస్లామ్ నిర్వచనం విభిన్నమైనది. విధిగా చేయవలసిన నమాజ్, రోజా, జకాత్, హజ్ వంటి ఆరాధనలే కాదు, దేవుని ప్రసన్నత కోసం ఖుర్ఆన్ ఆదేశాల ప్రకారం చేసిన ప్రతి మంచి పని ఆరాధన కిందికే వస్తుంది. చివరకు ప్రేమగా తన భార్య నోటికి ఒక ముద్ద ఆహారం అందించడం కూడా పుణ్యప్రదమే. కాబట్టి ఆరాధనల నిర్వచనం ఇస్లాములో విశిష్టమైనది. దైవప్రసన్నత పొందే పనులు ఎప్పుడు చేసినా పుణ్యప్రదమైనవే, ఆరాధనలే. రమజాను మాసంలో ఇవే పనులకు అనేక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. కాబట్టి ముస్లిములు ఈ మాసంలో అత్యధికంగా దానధర్మాలు చేయడం కనబడుతుంది.
ఇస్లాములో దానధర్మాలు కూడా రెండు రకాలు. ఒకటి తప్పనిసరిగా చేయవలసిన దానం. దీన్ని జకాత్ అంటారు. జకాత్ అంటే శాబ్దిక అర్ధం శుభ్రం చేయడం. తన వద్ద ఉన్నసంపదలో రెండున్నరశాతం జకాత్ గా చెల్లించడం ద్వారా సంపదను శుద్ధి చేసుకోవడమే జకాత్. ఇది తప్పనిసరిగా చేయవలసిన దానం. రమజాన్ మాసంలోనే జకాత్ చెల్లింపులు జరుగుతాయి. జకాత్ ఎవరికి చెల్లించాలన్నది కూడా నిర్దిష్టంగా ఉంది. రమజాను మాసంలో తప్పనిసరిగా చేసే మరో దానం ఫిత్ర్. రమజాను మాసం తర్వాత ఈద్ పండగ నమాజు కన్నా ముందే ఇది తప్పనిసరిగా చెల్లించాలి. ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉంటే, తల ఒక్కింటికి రెండున్నర కిలోల ధాన్యం లేదా దాని వెల పేదలకు ఇవ్వాలి. పండగ రోజున పేదసాదలు కూడా ఆనందంగా పండగ చేసుకునే ఏర్పాటిది. ఇవి రెండు తప్పనిసరిగా చేయవలసిన దానాలు. ఇవి కాకుండా సదఖా రూపంలో స్వచ్ఛందంగా చేయవలసిన దానాలను కూడా ప్రోత్సహించడం జరిగింది. అందుకే రమజాను మాసంలో విస్తృతంగా ముస్లిములు దానధర్మాలు చేయడం మనకు కనబడుతుంది.
ఇలా చేసే దానధర్మాల ప్రాముఖ్యమేమిటి? అన్నది ఆలోచించవలసిన విషయం. ఆక్స్ ఫామ్ సంస్థకు స్ట్రాటజిక్ అడ్వయజర్ గా పనిచేసిన డంకన్ గ్రీన్ రాసిన కొన్ని మాటలు ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ’’ఫ్రం పోవర్టీ టు పవర్‘‘ పేరుతో ఆయన ఈ మాటలు రాశాడు. ఒకసారి ఆయన విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన పక్కన ఒక ముస్లిం యువకుడు కూర్చున్నాడు. ఆ ముస్లిం యువకుడు మాటల్లో జకాత్ గురించి చెబుతూ, ముస్లిం సముదాయం వ్యవస్థాగతంగా, ప్రణాళికాబద్దంగా జకాత్ నిధులను నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డంకన్ గ్రీన్ ఈ జకాత్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆయన కాస్త రిసెర్చ్ చేసి గ్లోబల్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రచురించిన ’’యాన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్‘‘ నివేదికను చదివాడు. ఈ నివేదికలో ఏం రాశారో మనం కూడా చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా మానవీయ సహాయం అవసరమైన సంక్షోభాలు అనేకం తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ మానవీయ సహకారం కోసం నిధులు పెరుగుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. చాలా మందికి తెలియకుండానే ఒక గొప్ప ధార్మిక విధి రూపంలో జకాత్ నిధులు మానవీయ సహకారాన్ని అందిస్తున్నాయి. ఇస్లామీయ సోషల్ ఫైనాన్సింగ్ ఇది. మానవీయ సహాయానికి అవసరమైన నిధులను అందించే ఇలాంటి సోషల్ ఫైనాన్సింగ్ టూల్స్ ఇస్లాములో చాలా ఉన్నాయి. ఈ విషయమై గ్లోబల్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ సేకరించిన డాటా ప్రకారం:
స్వచ్ఛంద సంస్థల ద్వారా 2013లో 434 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 2900 కోట్ల రూపాయల ఇస్లామీయ మానవీయ సహకార నిధులు పంపిణీ అయ్యాయి. ఇవి స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ అయిన నిధులు. ఇందులో జకాత్ ఇతర సదఖాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థల వంటి అధికార సంస్థలు సేకరించిన జకాత్ నిధుల విషయానికి వస్తే, ముస్లిం దేశాల్లోనే ఇలా ప్రభుత్వ సంస్థలు జకాత్ నిధులను సేకరించడం జరుగుతుంది. ఇండోనేషియా, మలేషియా, ఖతర్, సౌదీ అరేబియా, ఎమన్ దేశాల డాటాను గ్లోబల్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ సేకరించింది. ప్రపంచ ముస్లిం జనాభాలో 17 శాతం ఈ దేశాల్లో ఉంది. ఈ దేశాల్లో వసూలు చేయబడిన జకాత్ నిధులు ఏటా 5.7 బిలియన్ అమెరికన్ డాలర్లు. 38088 కోట్ల రూపాయలు. ఇది కేవలం 17 శాతం ముస్లిం జనాభా ఉన్న దేశాల జకాత్ నిధుల వివరాలు. మొత్తం ముస్లిముల జకాత్ నిధులు, ఇతర సదఖాల నిధులు కూడా కలుపుకుంటే ఈ మొత్తం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. సేకరించిన డాటా ప్రకారం తెలిసిన మరో విషయమేమంటే, జకాత్ నిధుల్లో 23 నుంచి 57 శాతం వరకు మానవీయ సహకారం కోసం వాడుతున్నారు. ఇప్పుడు జకాత్ వ్యవస్థ, జకాత్ ద్వారా పంపిణీ అయ్యే నిధుల గురించి మొత్తం ప్రపంచం మాట్లాడుతోంది. 2012లో జరిగిన ఒక సర్వే ప్రకారం 200 బిలియన్ డాలర్లు అంటే 1336410 కోట్ల రూపాయల నుంచి 1 ట్రిలియన్ డాలర్లు అంటే 66,82,050 కోట్ల రూపాయల వరకు ఏటా జకాత్ పంపిణీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2011లో పంపిణీ అయిన మానవీయ సహాయం 13 బిలియన్ డాలర్లు అంటే, 86,866 కోట్ల రూపాయలు మాత్రమే. జకాత్ రూపంలో పంపిణీ అయ్యే సహాయం దీనికన్నా దాదాపు 15 రెట్లు ఎక్కువ. అసలు మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో రెండున్నర శాతం అంటే కనీసం 65 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే 4,34,333 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది జకాత్ ఈ దేశాల్లో ఎంత ఉండవచ్చన్న బండ లెక్క. ప్రపంచవ్యాప్తంగా ముస్లిముల జకాత్ లెక్కలు తీస్తే ఎంత ఎక్కువగా ఉంటుందో అంచనా వేయవచ్చు. 2004లో ఆర్ధికవేత్త హబీబ్ అహ్మద్ జకాత్ నిధులను లెక్కించి ముస్లిం దేశాలు జకాత్ నిధులను సక్రమంగా వినియోగిస్తే పేదరికం అన్నదే ఉండదని వివరించాడు.
డంకన్ గ్రీన్ జకాత్ ప్రత్యేకతను కూడా వివరించాడు. అన్ని మతధర్మాలు దానాన్ని ప్రోత్సహిస్తాయి. కాని జకాత్ విభిన్నమైనది. ఇది తప్పనిసరిగా చెల్లించవలసిందే. స్వచ్ఛందంగా ఇష్టమైతే ఇవ్వడం లేకపోతే లేదని తప్పించుకోవడం కుదరదు. అలాగే ఫిత్ర్ కూడా తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఈ సందర్భంగా డంకన్ గ్రీన్ ఆర్ధిక అసమానత్వంపై పుస్తకం రాసిన థామస్ పికెటిని ప్రస్తావిస్తూ, ఇస్లాములో జకాత్ రూపంలో మనకు సంపద పన్ను ఆల్రెడీ ఉందన్న విషయం ఆయనకెవరైనా చెప్పండయ్యా అన్నాడు. అంతేకాదు, ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు తప్పనిసరిగా ఈ పన్ను చెల్లిస్తున్నారు. ప్రపంచ జనాభాలో ముప్పియి శాతం ముస్లిములున్నారు.
ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కుంటుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజలు అనేకమంది క్లిష్టపరిస్థితుల్లో దయానీయంగా బతుకుతున్నారు. సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూస్తున్న ప్రజల్లో ముస్లిములు కూడా ఉన్నారు. జకాత్ ఇచ్చేవారంతా ముస్లిములే. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా మానవీయ సహకారానికి జకాత్, సదకా నిధులను కూడా ఉపయోగిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ దేశాలు 2013లో అంతర్జాతీయ మానవీయ సహకారానికి అందించిన మొత్తం 2.2 బిలియన్ డాలర్లు అంటే 14700 కోట్ల రూపాయలు.
ముస్లిం దేశాల్లో జకాత్ వసూలు ప్రభుత్వ పరంగా జరుగుతుంది. కొన్న ముస్లిం దేశాల్లో స్వతంత్ర సంస్థలు ఈ పని చేస్తున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది. ముస్లిమేతర దేశాల్లో స్వచ్ఛందసంస్థలు జకాత్ వసూలు చేయడం లేదా ముస్లిములు వ్యక్తిగతంగానే జకాత్ అవసరమైన వారికి ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు జకాత్ వసూలు చేసి సేవాకార్యక్రమాలకు, విద్య వైద్యం తదితర కార్యక్రమాలకు వినియోగించడం కూడా జరుగుతోంది. జకాత్ ఫౌండేషన్ భారతదేశంలో సివిల్ సర్వీసు కోచింగ్ వంటి సేవలు కూడా అందిస్తోంది. సమాజంలో సంపద పంపిణీకి జకాత్, సదఖాలు గొప్ప సాధనాలు. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం సాధించడానికి ఇవి ఎంతైనా తోడ్పడతాయి. దాంతో పాటు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో కష్టాలపాలైన నిర్భాగ్యులను ఆదుకోవడానికి అవసరమైన హ్యూమానిటేరియన్ నిధులు కూడా జకాత్ వల్ల లభిస్తాయి. ఉదాహరణకు సిరియాలో అంతర్యుద్ధంలో దాదాపు రెండున్నర లక్షల మంది మరణించారు. టర్కీ తదితర దేశాలు అక్కడ భారీస్థాయిలో మానవీయ సహకారం అందిస్తున్నాయి. ఈ సహకారానికి కావలసిన నిధులు జకాత్, సదకాల నుంచే లభిస్తున్నాయి. అలాగే రోహింగ్యాలపై మయన్మార్ అమానుష దౌర్జన్యాలలో అనేకమంది నిర్వాసితులయ్యారు. వారికి కావలసిన సహాయసహకారాలకు జకాత్ నిధులు ఎంతో తోడ్పడుతున్నాయి. ఇంకా అనేక దేశాల్లో ప్రకృతి విపత్తులు, ఎబోలా వంటి వ్యాధులు ఇలా ఎన్నెన్నో కడగండ్లు. అంతర్జాతీయ మానవ సహకారానికి నిధులు సరిపోని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జకాత్, సదఖా వంటి నిధులు అనేక దేశాల్లో నిర్భాగ్య ప్రజానీకాన్ని ఆదుకుంటున్నాయి.
అంతర్జాతీయంగా మానవసహకారాన్ని అందించే సంస్థలు ఇప్పుడు నిధుల కోసం జకాత్, సదకాల వైపు కూడా చూస్తున్నాయి. డంకన్ గ్రీన్ మరో మంచి మాట కూడా చెప్పాడు. పాశ్చాత్యులు డిజైన్ చేసిన మానవీయ సహాకారం కోసం జకాత్ నిధులను సేకరించడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు, అసలు ఇస్లాములో మానవీయ సహకారానికి చూపించే దిశానిర్దేశనం ఏమిటో కూడా నేర్చుకోవాలని అన్నాడు. ఇంతకు ముందు చెప్పినట్లు థామస్ పికెటీ చాలా గొప్ప ఆర్ధికవేత్త అయినప్పటికీ, సంపద పంపిణీలో అసమానత్వం గురించి ఆయన ఆందోళన, ఆవేదన చెందినప్పటికీ, ఆయనకు ఇస్లాం ప్రతిపాదించిన సంపద పంపిణీ గురించి తెలియదు. అందుకే డంకన్ గ్రీన్ ఆయనకు ఈ విషయం ఎవరైనా చెబితే బాగుండును అన్నాడు. అలాగే మానవీయ సహకారం ఎలా ఉండాలన్న విషయంలోను ఇస్లామ్ దారి చూపిస్తుంది.
’’ మీరు దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయపరచి మీ దాన ధర్మాలను మట్టిలో కలపకండి.‘‘ (అల్ బఖర్ : 262)
దానం చేయడం అంటే ఎదుటి వాడికి ఉపకారం చేయడం కాదు, అది పుచ్చుకునేవాడి హక్కు, ఇచ్చేవాడి బాధ్యత అన్న భావన ఇస్లామ్ లో ముఖ్యమైనది. వివక్ష, పక్షపాతం లేకుండా అధ్యయనం చేస్తే ఇస్లాము నుంచి ప్రపంచం చాలా నేర్చుకోవచ్చు.
“The legislation of Quran will spread all over the world, because it agrees with the mind, logic and wisdom.” – Leo Tolstoy

Writer can be reached at – [email protected]

Leave a Reply

Your email address will not be published.