తిరగబడ్డ ఇస్లామోఫోబిక్ బిడ్డలు !!!

ఇస్లాం/ముస్లింలపై కోపం,ద్వేషం ఉన్నోల్లను ఇస్లామోఫోబులు అని పిలుస్తారు. అలాంటి కొందరు ఇస్లామోఫోబుల పరిచయం ఇది.

1. బల్బీర్ సింగ్, యోగేంద్ర పల్, శివ ప్రసాద్

1992, డిసెంబర్ 6 న అల్లరి మూకలు బాబ్రీ మసీదును కూల్చేశారు. ఆ అల్లరి మూకలో పై ముగ్గురూ ఉన్నారు. బల్బీర్ సింగ్, యోగేంద్ర పల్ లు శివసేన నాయకులు, శివప్రసాద్ భజరంగ్ దల్ యూత్ లీడరు.

బల్బీర్ సింగ్ మసీదును కూల్చడానికి కొన్ని నిమిషాల ముందు, దాని ప్రధాన గుమ్మటం పై ఎక్కి ఫోటోలకు ఫోజులిచ్చాడు. అనంతరం అత్యంత ఉత్సాహంతో ఆ కూల్చివేతలో పాల్గొన్నాడు. బాబ్రీ మసీదు విధ్వంసంలో పాల్గొని వచ్చినందుకు తమ ఊర్లో వీరిద్దరికీ ఘణస్వాగతం లభించింది. బాబ్రీ మసీదు శిధిలాల నుండీ బల్బీర్, యోగేంద్ర లు రెండు ఇటుకల్ని తమ స్వస్థలం పానిపట్ కి తీసుకెళ్ళారు. వాటిని పానిపట్ శివసేన ఆఫీసులో ప్రదర్శనకు ఉంచారు. అనంతరం, దియోబంద్ లోని ఓ ముస్లిం మతపెద్ద మౌలనా కలీం సిద్దిఖీని చంపాలని బల్బీర్ సింగ్ పధకం రచించాడు. దానిలో భాగంగా రెక్కీ నిర్వహించడం కోసం, తలపై టోపీ పెట్టుకుని, ఇతర ముస్లింలతో కలిసి మసీదులోకి వెళ్ళి అతని ప్రసంగాల్ని వినడం మొదలుపెట్టాడు. ఆ ప్రసంగాలు అతని మనసుని కరిగించాయి. తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. ఇస్లాం స్వీకరించి మహమ్మద్ అమీర్ గా పేరు మార్చుకున్నాడు. ఇలాంటి అపరాధభావంలోనే ఉన్న మిత్రుడు యోగేంద్ర పల్ కూడా బల్బీర్ అడుగుజాడల్లో నడిచి ముస్లింగా మారాడు.

Mohammad Amir.
Photo Coutesy : Mumbai Mirror
మిత్రునితో బల్బీర్ సింగ్.(పాత ఫోటో)
Photo courtesy: Mumbai Mirror

ఒకప్పుడు తాము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా, కనీసం 100 మసీదులు కట్టించాలని వీరిద్దరూ కంకణం కట్టుకున్నారు. ఇప్పటికి కౌంటు నలబై దాటింది.

శివ ప్రసాద్ ది కూడా దాదాపు ఇలాంటి పరిస్తితే. బజరంగ్ దల్ యూత్ లీడర్ గా అతను 4000 మందికి కర్రసాము లో శిక్షణ ఇచ్చాడు. బాబ్రీ విధ్వంసంలో చురుగ్గా పాల్గొన్నాడు. కానీ, బాబ్రీ కూల్చిన తర్వాత నుండీ అతని సమస్యలు మొదలయ్యాయి. తీవ్రమైన డిప్రెషన్, హాల్యూషినేషన్ లతో బాధపడ్డాడు. సైక్రియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుని కుదుటపడ్డాక, 1997లో ఉద్యోగం కోసం షార్జా కి వెళ్ళాడు. అక్కడి ముస్లిం సంస్కృతికి, ఇస్లాం కి ఆకర్షితుడై మొహమ్మద్ ముస్తఫాగా మారిపోయాడు.
Source:
1. https://www.dnaindia.com/…/report-responsible-for-razing-ba…
2. https://www.indiatimes.com/…/kar-sevak-who-helped-demolish-…

 

2. ఆర్నడ్ వెన్ డూర్న్( Arnoud van Doorn)

Arnoud van Doorn

‘ఫిత్నా’ అనే పేరుతో 2008లో నెదర్ల్యాండ్స్ లో ఓ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. దీని స్టోరీ లైన్ సింపుల్ – “చూశారా ముస్లింలు ఎంత కిరాతకులో, ఖురాన్ ఎంత వినాశక పుస్తకమో” అని చెప్పడం. దానికోసం ఖురాన్లో అక్కడక్కడా కొన్ని వాక్యాల్ని ఎత్తుకొచ్చి, కొన్ని బాంబుపేలుడు దృష్యాల్నీ, హృదయ విదారక సన్నివేశాల్నీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చూపించి , చూసేవారికి ముస్లింలపై అసహ్యం,ద్వేషం కలిగేలా చేయడం. – ఇదీ ఈ షార్ట్ ఫిల్ తీసినోల్ల లక్ష్యం. ఇది యూరప్ అంతటా అప్పట్లో చాలా వివాదాస్పదం అయ్యింది. అనేక ముస్లిం దేశాల్లో దీనికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఈ సినిమాకు ప్రొడ్యూసర్ + డిస్ట్రిబ్యూటర్ – ఆర్నడ్ వెన్ డూర్న్ . ఇతను నెదల్యాండ్స్లో మన బీజేపీ లాంటిదే ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆ పార్టీ ప్రధాన అజెండా -ముస్లింలపై విద్వేషం వెల్లగక్కడం.

ఇస్లాం గురించి ప్రసంగిస్తూ..
ఇస్లాం స్వీకరించిన కొడుకుతో..

ఈ సినిమా తీసినతర్వాత, దీనికి వ్యతిరేకంగా ఇంత దుమారం చెలరేగడం అతన్నే అశ్చర్యపరచింది. నెదల్యాండ్లోని కొందరు ముస్లింలు అతన్ని కలిసి “మీకు ఇస్లాం గురించి చాలా అపార్థాలూ,అపోహలున్నాయి. ఇతరులు చెప్పేది గుడ్డీగా నమ్మొద్దు, వీలైతే ఓ సారి మసీద్ కి రండి” అని ఆహ్వానించారు. వీరి సంగతేంటో చూద్దామని ఆర్నడ్ వెన్ డూర్న్ , ఓ సారి చెప్పాపెట్టకుండా సడెన్ గా మసీదులోకి వెళ్ళాడు. తాను ఊహించినట్లు, అక్కడ ఆయుధాలూ, ఆవేశపూరిత స్పీచులూ లేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు. అక్కడున్నవారు తనతో ప్రేమతో మాట్లాడిన తీరు, అతని సందేహాలన్నిటికీ ఇచ్చిన సమాధానాలు.. ఇవన్నీ అతనిలో కొత్త ఆలోచనలు కలిగించాయి. అలా కొన్ని సంవత్సరాలపాటు ఇస్లాం గురించి స్టడీ చేశాక, అతను ముస్లిం గా మారిపోయాడు. తన అతివాద రైటిస్ట్ పార్టీకి రాజీనామా చేసి, ప్రస్తుతం ముస్లింలు, కాందిశికుల తరుపున ఓ పార్టీని స్థాపించే ప్రయత్నాల్లో ఉన్నాడు. అట్లే, యూరప్ అంతా తిరిగి, ఇస్లాం గురించి అపోహల్ని తొలగించేలా ప్రసంగాలు ఇస్తున్నాడు.

3. వోనీ రిడ్లీ: (Yvonne Ridley)

Yvonne Ridley- Before and After

ఈ అక్కయ్య ఓ బ్రిటీష్ జర్నలిస్టు. 2001 లో సండే ఎక్స్ ప్రెస్ పత్రికకు పనిచేస్తున్నప్పుడు తాలిబాన్లను తన రాతలతో చీల్చి చెండాడేది. అది చాలదన్నట్లు, ప్రత్యక్షంగా చూసి, అక్కడి మహిళల దుస్థితిని ప్రపంచానికి చాటి చెప్పాలని, బురఖా ధరించి దొంగతనంగా ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించింది. అక్కడో కుక్క ఈమెను అణుమానించి అదేపనిగా అరుస్తుండటంతో, తాలిబన్లకి పట్టుబడింది. 11 రోజులు వారి చెరలో ఉండింది. తరువాత బ్రిటన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం కలిసి తాలిబన్లతో జరిపిన చర్చల ఫలితంగా విడుదలైంది. తాలిబన్లు ఎంత మూర్ఖులు, కృరులూ ఐనప్పటికీ, తమ దేశంలోకి అక్రమంగా చొరబడిన ఓ ఒంటరి మహిళ అయిన తనపట్ల వారు గౌరవంగా మెలిగిన తీరు ఆమెను ఆశ్చర్యపరచింది. విడుదలైన తరువాత ఆమె ఖురాన్ పై పరిశోధన చేసి ముస్లింగా మారింది. ఖురాన్ గురించి ఆమె చెప్పిన మాట – “ఖురాన్ మహిళలకు గొప్ప వరం (మాగ్నా కార్టా). ఇస్లాం గురించి వివరిస్తూ అనేక వ్యాసాలూ, పుస్తకాలూ రాసింది.

4. గ్యారీ మిల్లర్(Dr Gary Miller)

Gary Miller

ఈయన కెనడాలోని, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో లో మ్యాథమేటిక్స్ ప్రొఫెసర్. 15 ఏళ్ళు క్రైస్తవ మిషనరీ లతో కలిసి పనిచేశారు. ఈయన తమ మత గ్రంధమైన బైబిల్ని లాజికల్ గా అనలైజ్ చేసి క్రైస్తవ మత పెద్దలకు అనేక ప్రశ్నలు సంధించేవారు. చివరికి 1978లో, ఖురాన్ లో కూడా ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలి/లోపాల్ని వెలికితీద్దామని దానిని అనలైజ్ చేయడం, చివరికి ముస్లిం గా మారిపోవడం జరిగింది. ఈయన రాసిన ‘ద అమేజింగ్ ఖురాన్ ‘ అనే పుస్తకం, ఖురాన్ని ఓ వినూత్న పద్దతిలో విశ్లేషిస్తుంది. తన మ్యాథమేటిక్స్ బుర్రతో, ‘ఫాల్సిఫికేషన్ టెస్ట్’ వంటి లాజికల్ అంశాల ఆధారంగా ఖురాన్ మానవ నిర్మిత గ్రంధం అయ్యే అవకాశం ఎలా లేదో వివరించాడు. నా మట్టుకు నాకు, ఇతను ఖురాన్ గురించి లాజికల్గా వివరించిన అంశాలు, ఇప్పటివరకూ, ఏ సమకాలీన ముస్లిం స్కాలర్ కూడా వివరించలేదు.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.