తీర్పు చెప్పండి బాబయ్యా!!

తీర్పు చెప్పండి బాబయ్యా!!
( Believers Belief Vs RGV’s Perfect Rationalism Vs Other’s Confused Rationalism)
===============================
“He was acquitted, in the manner, and by such means as have been described. A human tribunal has permitted him to escape. But, there is another and a higher tribunal, where false testimony will not prevail, and where I am willing, so far at least as these statements are concerned, to be judged at last” – Chapter 22, TWELVE YEARS A SLAVE.

ఏంటా పుస్తకం?
అది SOLOMON NORTHUP అను ఒక ఆఫ్రికన్ నల్ల జాతి వ్యక్తి యొక్క ఆటోబయాగ్రఫీ.( ఆత్మ కథ). ఇది 19 వ. శతాబ్ధపు బెస్ట్ సెల్లర్స్ లో ఒకటిగా నిలిచింది. నల్ల జాతి హక్కుల పోరాటంలో కీలకంగా మారింది. దీని ఆధారంగా హాలీవుడ్ లో రెండు సినిమాలు కూడా వచ్చాయి.

ఏంటాయన కథ?
ఓ 150-200 సంవత్సరాల వెనక్కి వెళ్తే, అమెరికాలో ఆవులు,ఎద్దులు,దున్నపోతులకి మరియు నల్ల జాతి వ్యక్తులకు పెద్దగా తేడాలేదు. అవి మాట్లాడలేవు. వీళ్ళు మాట్లాడగలరు అంతే తేడా. తెల్లజాతివారికి ఆ జంతువులు ఎలా వివిధ పనులు చేసిపెడతాయో, నల్లజాతివారు కూడా అంతే. వాటికి గడ్డి వేసినట్లే, వీరికి కూడా ఏదో ఒకటి తినడానికి పడేయడం, వారితో చాకిరీ చేయించుకోవడం.. అదీ తంతు. జంతువుల్ని ఎలా సంతలో కొంటారో , అలాగే నల్లవారిని కూడా కొనేవారు. వారి కండ పుష్టి, వయసు బట్టి, వారి ధర నిర్ణయించబడుతుంది. నల్లజాతి మహిళల్లో పడచువయసు వారికి అత్యధిక ధర ఉంటుంది, ఎందుకంటే వారిని పొలం పనులకే కాకుండా ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చని.. అదేంటో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. పశువులకి గొడ్లచావిడి ఎలా ఉంటుందో, అట్లే వీరిని కూడా ఓ చోట కట్టి పడేసే వారు. దానిని పెన్(PEN) అంటారు. ఇదంతా, పూర్తిగా అప్పటి అమెరికన్ చట్టాలను అనుసరించే, చాలా పద్దతిగా,పవిత్రంగా జరిగింది.

తర్వాత్తర్వాత బానిసత్వం నిషేధింపబడింది. కానీ, అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేసారి నిషేధింపబడలేదు. కొన్ని రాష్ట్రాలు ముందూ, కొన్ని రాష్ట్రాలు చాలా ఆలస్యంగా నిషేధించాయి. ఆ రకంగా న్యూయార్క్ ముందుగా నిషేధించింది. ఆ తర్వాత సుమారు 50 ఏళ్ళకు వాషింగ్ టన్ నిషేధించింది.

SOLOMON NORTHUP న్యూయార్క్ లో 1808లో పుట్టేటప్పటికి అక్కడ బానిసత్వం నిషేధింపబడింది. కాబట్టి ఆయన ‘బానిసత్వం ఇతర రాష్ట్రాల్లో ఉందంట ‘ అని వినడమే తప్ప, అదెలా ఉంటుందో ఆయనకు తెలియదు. 1829లో ఆయనకు వివాహం జరిగింది.వీరికి ముగ్గురు పిల్లలు. SOLOMON అనేక సీజనల్ వృత్తులు నిర్వహించేవారు. సొంతంగా భూమిని కొని వ్యవసాయం కూడా చేసేవారు. ఆయన భార్యకూడా వివిధ పెద్ద పెద్ద హోటల్లలో waitress లా పనిచేసేవారు. ఆయన వయొలిన్ చాలా చక్కగా వాయించేవారు. చుట్టుపక్కల వాల్లు, పండగలకి, శుభకార్యాలకు ఆయనతో కచేరీలు పెట్టించుకునేవారు. ఆ రకంగా కావలసింత సంపాదన, భార్యా,పిల్లలతో ఆయన జీవితం సాఫీగా సాగిపోతుండగా..
ఒకానొక రోజు, 1841లో, ఒక పార్టీలో ఆయన వయొలిన్ వాయించడాన్ని చూసిన ఇద్దరు Strangers, ఆయనను పరిచయం చేసుకుని, వయోలిన్ చక్కగా వాయిస్తున్నారని ఆయన్ని అభినందించి, తమకు వాషింగ్టన్లో సర్కస్ కంపెనీ ఉందనీ, దానికి వయొలిన్ వాయించే వ్యక్తి లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందనీ, ఆయన తమతో పాటు ఒక వారం రోజులు పర్యటిస్తే, తాము అధికమొత్తంలో డబ్బులు చెల్లిస్తామనీ ఆయనకు ఆఫర్ చేస్తారు. తాము ఇప్పటికిప్పుడే, బయలు దేరాల్సి ఉంటుందనీ, ఆయనకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా తొందరపెడ్తారు. ఆ సమయంలో, ఆయన భార్య హోటల్లో పనికి, పిల్లలు స్కూలుకి వెళ్ళి ఉంటారు. ఒక్క వారం రోజులే కదా అని ఆయన కూడా ఎక్కువ ఆలోచించకుండా వీరితో బయలు దేరుతాడు.

అప్పట్లో, రూలు ప్రకారం – ఓ స్వతంత్ర నల్ల జాతి వ్యక్తి, బానిసత్వం అమలులో ఉన్న రాష్ట్రంలోకి అడుగుపెట్టేటప్పుడు, సరిహద్దు దగ్గర , ప్రభుత్వాఫీసులో, తాను స్వతంత్రున్నని ధృవీకరించే పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది గాని తీసుకోకపోతే, ఆ రాష్ట్రంలో ఎవరైనా ఇతన్ని తీసుకెల్లి, ఏమైనా చేసుకోవచ్చు. ( ఇప్పుడు ఊర్లో, ఎవరికీ చెందని బరిగొడ్డో, పాడి ఆవో దొరికితే, తీసుకెల్తారు కదా .. అలా అన్నట్లు.) ఈ రూలు కూడా ఆ స్ట్రేంజర్సే గుర్తుచేసి , సరిహద్దు దగ్గర ఆయనకు ఆ పత్రాన్ని ఇప్పిస్తారు. వారి ఈ మంచి తనాన్ని చూసి, సాలమన్ వీరిని పూర్తిగా నమ్మేస్తాడు.

తర్వాత వాషింగ్టన్ చేరేప్పటికి రాత్రవ్తుంది. ముగ్గురూ ఓ హోటల్లో బస చేస్తారు. రాత్రి బోజనం చేయగానే, సాలమన్ కి కల్లు తిరిగినట్లై వెంటనే నిద్రలోకి జారుకుంటాడు.
సుదీర్ఘ నిద్ర తర్వాత , ఆయన కళ్ళు తెరిచేటప్పటికి ఓ చీకటిగదిలో, చిన్న బోనులో, కాళ్ళకు చేతులకు బేడీలతో ఉంటాడు. తన ఒంటిమీద అండర్వేర్ తప్ప బట్టలేం ఉండవు. తన వయొలిన్, సరిహద్దులో ఇచ్చిన ఫ్రీ మ్యాన్ పత్రం, తన ఇతర వస్తువులు ఎక్కడున్నాయో తెలీదు. మొత్తానికి తనను ఓ బానిస లాగా అమ్మేశారని ఆయనకు అర్థమవుతుంది.మరుసటి రోజు , తనను కొన్న ఏజెంట్ వచ్చి, తినడానికి ఏదో పడేస్తాడు. కష్టమర్లు కొనడానికి వచ్చినప్పుడు వారిముందు నీరసంగా కనిపించకూడదని ఆర్డరేస్తాడు. తాను అసలు బానిసను కాదని, తాను ఓ న్యూయార్క్ కి చెందిన ఫ్రీమ్యాన్ ననీ సాలమన్ గట్టిగా వాదిస్తాడు. ఆ ఏజెంట్ ఓ బలమైన ఇనుప కడ్డీని తెచ్చి, ఒళ్ళు వాతలు తేలేలా కొడతాడు. ఆ దెబ్బలకు తాలలేక సాలమన్ మూర్చపోతాడు. తర్వాత మరుసటి రోజు లేవడం, తాను ఫ్రీమ్యాన్ నని వాదించడం, దెబ్బలు తినడం, సొమ్మసిల్లి పడిపోవడం- కొన్ని రోజులపాటు ఇదేతంతు. తన నోటిలోనుండీ మరోసారి ఫ్రీ మ్యాన్ అనే మాట వచ్చిందంటే, ఇక మరోసారి లేవకుండా, చచ్చేలా కొడ్తానని వార్నింగ్ ఇస్తాడు ఏజెంట్. ఆ తర్వాత, ఓ మంచి బేరానికి, ఒక తెల్లోనికి సాలమన్ ని అమ్మేస్తాడు. ఆయన కొన్నాల్లు వాడుకొని, ఆర్థిక సమస్యల వల్ల, మరో తెల్లోనికి అమ్మేస్తాడు. అలా 12 ఏళ్ళు. ఈ మధ్యలో ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ, అది అత్యంత రిస్క్తో కూడిన వ్యవహారం. బయట ఓ నల్ల వ్యక్తి ఒంటరిగా కనిపిస్తే( తెల్ల యజమాని పక్కన లేకుండా), పోలీసులు గానీ, ఇతర తెల్లోల్లు గానీ ఆ నల్ల వ్యక్తిని ఆపి ఎవరు,ఎక్కడికి పోతున్నావని దబాయించి ప్రశ్నించొచ్చు. తెల్ల యజమాని ఏదైనా పని మీద పంపితే, దానికి సంబంధించి – తెల్ల యజమాని రాసిన పాస్ ని చూపించాలి. అది లేని పక్షంలో, ఇక ఆ నల్ల వ్యక్తిని, పోలీసులుగాని, ఇతర తెల్లోల్లు గానీ ఏమైనా చేసుకోవచ్చు. అలా తప్పించుకున్న ప్రతిసారీ, సాలమన్ మళ్ళీ పట్టుబడి, తీవ్ర శిక్షలకు గురయ్యాడు..

మొత్తానికి ఎలాగోలా, ఓ తెల్ల సంఘ సంస్కర్త చేసిన సహాయం మూలంగా, ఆయన గురించి న్యూయార్లోని తన కుటుంబానికి తెలిసి, అక్కడి గవర్నర్ ధృవీకరణ పత్రం ఆధారంగా, 12 ఏళ్ళ తర్వాత, ఆయన బానిసత్వం నుండి విముక్తి పొందుతాడు. ఈ 12 ఏళ్ళలో ఆయన అనుభవించిన బాధలు, ఆయన చూసిన ఇతర నల్ల జాతివారి కన్నీటి గాధలు అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.

సరే, ఇప్పుడు విషయానికి వద్దాం.

తాను ఫ్రీమ్యాన్ నని నిర్ధారణ అయ్యాక, తనను మొదటగా బానిసత్వంలోకి నెట్టిన ఏజెంట్ , ఇంకా ఆ వృత్తిలోనే ఉన్నాడని తెలుసుకున్న సాలమన్, అతనికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తాడు. తాను ఫ్రీమ్యాన్ నని తెలిసినా, దానికి తన దగ్గరున్న ఆధారాలన్నిటీ నాశనం చేసి, తనను అత్యంత కృరంగా హింసించి, తన 12 సం, జీవితాన్ని తనకు కాకుండా చేసిన ఆ ఏజెంట్ ని శిక్షించాలని ఆయన వాషింగ్టన్ లోని కోర్టుకు విన్నవించుకుంటారు.
కేసు విచారణకు వచ్చినప్పుడు, అతను ఫ్రీమ్యాన్ అని తనకు తెలియదని, అతని పాత యజమానుల నుండీ తాను ఇతన్ని కొన్నాననీ, కొనేటప్పుడు తాను బానిసని, సాలమన్ తనకు తానుగానే చెప్పాడనీ, ఆ ఏజెంట్ వాదిస్తాడు. తన వాదనకు సాక్ష్యంగా ఆ హోటల్ యజమాని, మరియూ మరో వ్యక్తినీ ( ఇద్దరూ తెల్లోల్లు) సాక్ష్యులుగా ప్రవేశపెడ్తాడు. వారి సాక్ష్యం ఆధారంగా కోర్టు, ఆ ఏజెంట్ ని నిరపరాధిగా డిక్లేర్ చేస్తుంది.

దాని గురించి రాస్తూ – సాలమన్ ఈ వాక్యాలు రాశారు. – “”He was acquitted, in the manner, and by such means as have been described. A human tribunal has permitted him to escape. But, there is another and a higher tribunal, where false testimony will not prevail, and where I am willing, so far at least as these statements are concerned, to be judged at last” – Chapter 22, TWELVE YEARS A SLAVE.”

ఇప్పుడు పాయింట్ ఏంటంటె –

సాలమన్ రాసిన పై వాక్యాల్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు అని?

నామట్టుకు నేను- సాలమన్ రాసిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మానవ నిర్మిత న్యాయవ్యవస్థ లోపభూయిస్టమైంది. పలుకుబడి,అధికారం కలిగినోల్లు ఆ న్యాయాన్ని ఎలాగైనా ఆడించగలరు. కానీ, అంతిమ న్యాయ నిర్ణేత ముందు ఎవరి పప్పులూ ఉడకవు. ఆరోజు, అందరూ తమ,తమ పాపాలను తలచుకుని ఏడుస్తారు. కాబట్టి, ఆరోజు ఆ ఏజెంట్ గాడికి అత్యంత కృరమైన శిక్ష వేయాలని నేను దేవున్ని ప్రార్థిస్తాను. ఓ విశ్వాసిగా, ఇదీ నా స్టాండు.

ఇప్పుడు పర్ఫెక్ట్ రేషనలిస్ట్ అయిన ఆర్జీవీ – దీనికి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం.

ఆర్జీవీ ప్రకారం – స్వర్గం,నరకం ఉన్నాయో లేవో తెలీదు. ఉంటే, దాని సంగతేంటో అప్పుడు చూద్దాం. ‘ఇప్పుడు కావలసింది ఏమిటీ’ అనేది ప్రశ్న. ఆ ఏజెంట్ నాకు చాలా తీవ్రమైన హాని చేశాడు. కోర్టులో అతన్ని ఎవరూ ఏమీ పీకలేకపోయారు. సో, కోర్టుతో సంబంధంలేకుండా, అతను నాకు చేసినదానికి ఎలా రివేంజ్ తీర్చుకోవాలానేది నాకు ముఖ్యం. సాధ్యమైనంత తక్కువ రిస్క్ తో, రివేంజ్ ఎలా తీర్చుకోవాలి అనే దానిగురించి ఆలోచించాలి. సాక్ష్యం లేకుండా, నేనే అతన్ని లేపేయడమా, లేక, ఎవరైనా కాంట్రాక్ట్ కిల్లర్ తో పని కానిచ్చేయడమా.. ఏది చేస్తే నా పగ చల్లారుతుంది.. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి , ఏదో ఒక దానిని చూజ్ చేసుకుని, దానిని ఇంప్లిమెంట్ చేయడం.- ఇదీ పర్ఫెక్ట్ రేషనలిస్ట్ చేసే పని.
దీనికి చక్కని ఉదాహరణ – GST సినిమా. పోర్న్ సినిమా తీద్దామనుకున్నాడు. ఇక్కడ తీస్తే చట్టప్రకారం రిస్క్. కాబట్టి యూరప్ లో తీశాడు. యూటూబ్ లో వదిలాడు. అంతే, చాప్టర్ క్లోజ్.( 3 గంటలు పోలీసులు విచారించారు కాబట్టి, అక్కడేదో జరిగిందనో,జరగబోతుందనో పండగ చేసుకునేవారికి నా సింపతీస్..).
( ఆర్జీవీ.. తానేమిటో, తన ఐడియాలజీ ఏమిటో, ఎలాంటి, సిగ్గూ,మొహమాటమూ,భయమూ లేకుండా.. ఉన్నదున్నట్లు చెప్పబట్టి, అతని థాట్ ప్రాసెస్ ఈ విషయంలో ఇలా ఉండొచ్చని నేను ఊహిస్తున్నాను..కాబట్టి – Thanks to RGV, for his Un-censored open talk).

ఇప్పుడు సగం హేతువాదుల గురించి చూద్దాం.

వీల్లు సాలమన్ రాసిన పై వాక్యాల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఓ మిలియన్ డాలర్ కొచెన్.
“ఓ పిచ్చి సాలమన్, అంతిమ దినం లాంటివేం లేవు. జడ్జి గారు చెప్పేసారు కదా ఆ ఏజెంట్ తప్పేమీ లేదని, కాబట్టి మైకంలో నువ్వే బానిసనని ఒప్పేసుకునుంటావ్. అంచేతా, ఓ బాధ్యత గల పౌరుడిగా, కోర్టు తీర్పును గౌరవించి సైలెంటుగా ఇంటికెల్లిపో” – అంటారా..?

“అక్కడ తెల్లోల్లు మెజారిటీ. మైనారిటీల బతుకులెప్పుడూ ఇంతే. అక్కడ మైనారిటీగా పుట్టడం నీదే తప్పు. కాబట్టి, ఇవన్నీ మామూలే..” లైట్ తీస్కో అంటారా..?

హేతువాదుల్లో మళ్ళీ ‘కంఫ్యూజ్డ్ హేతువాదులు వేరయా ‘ అని ఓ ప్రత్యేక కేటగిరీ ఉంది.

ఆల్లే మంటారంటే- “వ్యవస్థలో లోపాల్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలా.. అలా ప్రయత్నిస్తూ పోతే, మనం ఏదో ఓ సమయానికి ఓ ఉత్తమోత్తమ సమాజాన్ని స్థాపించుకుంటాం.”
(అట్టాంటి ఉత్తమోత్తమ సమాజం రాకముందే పుట్టడం – సాలమన్ చేసిన ప్రధాన నేరమన్నట్లు.)
వీళ్ళ కంఫ్యూజన్ ఏ రేంజ్లో ఉంటుందంటే – కామం,క్రోధం,స్వార్థం,అసూయ,ద్వేషం,హింస లాంటివన్నీ మానవునిలో ఇన్ బిల్ట్ లక్షణాలని వీల్లే తీర్మానిస్తారు. ( ఆ టైపు టాపిక్ డిస్కషన్ కి వచ్చినప్పుడు), అలాంటప్పుడు – ఇన్ని నెగెటివ్ లక్షణాలు కలిగిన మానవుడు – నెగెటివ్ లక్షణాలు లేని ఉత్తమోత్తమ సమాజాన్ని ఎలా నిర్మిస్తాడో వీరికే తెలియాలి.
మళ్ళీ ఏమన్నా అంటే, ‘పాజిటివ్ థింకింగ్ ఉండాల’ , ‘ పాజిటివ్ థాట్స్ ఉండాల ‘ అనీ ఒకటే స్పీచులు,సూక్తులు..

” ఏ..? పాజిటివ్ ఎందుకుండాల? అసలు నెగెటివ్ లేకుండా, పాజిటివ్ అనే మాటకు అర్థమే లేదుకదా. అలాంటప్పుడు నెగెటివ్ చెడ్డది ఎందుకైంది, పాజిటివ్ మంచిది ఎందుకైంది? ” ఇదీ ఆర్జీవీ’స్ పర్ఫెక్ట్ రేషనల్ కౌంటర్.

దీనికి ఆన్సర్ ఉండదు.
ఇగ అప్పుడు – “ఇలా ఉంటే సమాజం నడవదు” అనేది సగం హేతువాదులు, కంఫ్యూజ్డ్ హేతువాదుల డిక్లరేషన్.
“సమాజం నడవకుంటే ఆగిపోద్ది, అంతే కదా, ఐతే ఏంటట? మనిషి బతకడానికి కావల్సింది తిండీ,నీరు తప్ప సమాజం కాదు కదా “- ఇదీ వర్మ స్వచ్చమైన అమాకపు కౌంటర్. దీనికీ ఆన్సర్ ఉండదు.
“నువ్వో అరాచకవాదివి, అరణ్యవాదివి” అంటూ.. మరో ఏడుపు.. అంతే.. మన దగ్గర లాజిక్ లేనప్పుడు వచ్చేది ఏమోషనూ,ఏడుపూ.. అభాండాలే..

ఇంతకీ సాలమన్ రాసింది చదివి మీకేమనిపించింది..?

నోట్: న్యాయం ఓడిపోవడం , అన్యాయం గెలవడం అనేది అప్పుడెప్పుడో,అక్కడెక్కడో, సాలమన్ కి మాత్రమే జరిగింది కాదు. అది అప్పుడు, ఇప్పుడూ, అక్కడా,ఇక్కడా.. నిత్యం జరుగుతున్నదే. ఇలాంటి ఉదాహరణలు ఇప్పుడు, మన ప్రస్తుత సమాజంలోనే కోకొల్లలుగా జరుగుతున్నాయి. తమకు అన్నీ తెలుసనుకుని, సమాజానికి సూక్తులు చెప్పే బాధ్యత తమ భుజస్కందాలపై మోస్తున్నామని భావించే కన్ ఫ్యూజ్డ్ రేషనలిస్ట్లు, దీనిని ఏ పర్స్పెక్టివ్ లో చూస్తారనేది నా సందేహం.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.