తుపాకీ పట్టిన హిజాబీ డాక్టర్

ఒకుయేవా నతాలియా – 1983లో చెచెన్యాలో జన్మించింది. 15 యేళ్ళ వయసులో ఫ్యాషన్ రంగంలో మోడల్ గా అడుగుపెట్టింది. 1999లో రష్యా-చెచెన్యా యుద్ధంలో తన సొంత దేశం చెచెన్యాను రష్యా నుండీ కాపాడుకోవడానికి మిలిటరీ లో జాయిన్ అయింది. సైన్యంలో తన తోటి సైనికుడిని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. ఇస్లాం లోకి మారి అమీనా ఒకుయేవా గా పేరు మార్చుకుంది.

మూడేళ్ళ తర్వాత యుద్ధంలో అతను చనిపోయాడు. చెచెన్యా సైన్యం రెండు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం పుతిన్ తో సంధి కుదుర్చుకుంది. ఈ సంధి ప్రయత్నాలు నచ్చని మరో వర్గం ఉక్రెయిన్,క్రిమియా,డాంబాస్ వంటి ప్రాంతాలకు తరలి వెళ్ళి, రష్యా బలగాలపై గెరిల్లా దాడులు నిర్వహించేవి. వీరికి ఉక్రెయిన్ ప్రభుత్వ అండదండలుండేవనేది బహిరంగ రహస్యం. ఇలాంటి గెరిళ్ళా దాడుల్లో అమినా కూడా పాల్పంచుకునేది. మరో చెచెన్ సైనికున్ని రెండో పెళ్ళి చేసుకుని, ఉక్రెయిన్ లో మెడిసిన్ విద్యను అభ్యసించింది. రష్యన్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి, ఉక్రెయిన్ ప్రభుత్వం అమీనా రెండో భర్తను పట్టుకుని రష్యాకి అప్పగించింది. అక్కడ అతనికి జీవితఖైదు విధించబడింది. తరువాత అతని జాడ ఎవరికీ తెలీలేదు.

2014 లో రష్యా మద్దతిస్తున్న డొనెత్సాక్ వేర్పాటువాదులకు – ఉక్రెయిన్ కి మధ్య జరిగిన యుద్ధంలో అమీనా, గాయపడిన ఉక్రెయిన్ సైనికులకు వైద్యం చేసే డాక్టర్ గా సేవలందించింది. తరువాత ఈమెకున్న షార్ప్ షూటింగ్ స్కిల్ల్స్ గురించి తెలుసుకున్న ఉక్రెయిన్ ప్రభుత్వం ఆమెని ఉక్రెయిన్ మిలిటరీ లో జాయిన్ అవ్వమని అభ్యర్థించడంతో, ఈమె మళ్ళీ తుపాకీ చేతపట్టింది. ఆ యుద్ధంలో స్నైపర్ గా, షార్ప్ షూటర్ గా ఆమె వీరోచిత ప్రతిభ ఉక్రెయిన్ మొత్తం మారుమోగింది.

2015లో, ఆమె మరో మాజీ చెచెన్ సైనికున్ని మూడో పెళ్ళి చేసుకుంది. ఇతనిపై 2012 లో, పుతిన్ పై హత్యాయత్నానికి ప్రయత్నించాడనే అభియోగం ఉంది. ఆరకంగా, భార్యా-భర్త ఇద్దరూ రష్యన్ ఇంటెలిజెన్స్ హిట్ లిస్ట్ లో చేరిపోయారు. 2017లో, అమీనాను ఇంటర్వ్యూ చేయడానికని ఫ్రెంచ్ జర్నలిస్ట్ రూపంలో వారి వద్దకు వచ్చిన ఓ వ్యక్తి సడెన్ గా వారిపై కాల్పులు ప్రారంభించాడు. ఆమె భర్తకు తీవ్ర గాయాలవ్వగా, అమినా మెరుపు వేగంతో స్పందించి ఆ వ్యక్తి శరీరంలో నాలుగు బుల్లెట్లు దింపింది.

అదే సంవత్సరం అక్టోబర్లో కారులో ప్రయాణిస్తున్న అమీనా,ఆమె భర్తపై కొందరు దుండగులు నాలుగువైపుల నుండీ కాల్పులు జరపడంతో అమీనా అక్కడికక్కడే మృతి చెందింది. అమీనా సేవలకు గుర్తుగా, ఉక్రెయిన్ ప్రభుత్వం అనేక వీధులు,ఊర్లకు ఆమె పేరు పెట్టింది.

Leave a Reply

Your email address will not be published.