తెలంగాణా చరిత్ర- కేసీఆర్ ముందుచూపు!! 

తెలంగాణా చరిత్ర- కేసీఆర్ ముందుచూపు!! 

==============================
మీరు రోడ్డు మీద నడుస్తూ వెల్తున్నారు. హఠాత్తుగా ఓ చోట, మీ వర్గం వారు( ఇక్కడ వర్గం అంటే, అది కులం/మతం/ప్రాంతం/భాష etc ఏదైనా కావొచ్చు), మరొక వర్గం వారు పరస్పరం గొడవపడుతూ ఒకరిపై ఒకరు రాళ్ళు వేసుకోవడం, దాడులు చేసుకోవడం చేస్తున్నారనుకోండి. ముందుగా మీరేం చేస్తారు?

ఎవరైనా ముందుగా చేసే పని, వేరే వర్గం వారికి సాధ్యమైనంత దూరంగా వెల్లి, మీ వర్గం వారు ఎక్కువగా ఉన్న చోటుకి చేరిపోవడం. మీకు వ్యక్తిగతంగా ఎలాంటి వర్గ భావం లేకున్నా, ఆ ప్రత్యర్థి వర్గంపై మీకు ఎలాంటి వ్యతిరేక భావం లేకున్నా, అసలు ఆ గొడవ ఎందుకు ఎలా, మొదలైందో తెలీకున్నా, కేవలం ఆ దాడిలో ఎలాంటి గాయాలకు గురికాకూడనే భయం కారణంగా మీరు వెల్లి మీ వర్గం లో చేరిపోతారు. మీ పిల్లల్ని, మరియు ఇంట్లో వారినీ ఆ ప్రత్యర్థి వర్గంతో జాగ్రత్తగా ఉండాలనీ, వారు ఉన్నచోటుకి వెల్లాకూడదనీ హెచ్చరిస్తారు. కొంచెం బుద్ధి ఉన్న ఏ మనిషైనా ఇదే చేస్తాడు.


ఇక ఇక్కడే రాజకీయ నాయకులు ప్రవేశిస్తారు. కులం, మతం వంటి వర్గాల ఆధారంగా కాకుండా, విధానాల ఆధారంగా రాజకీయం చేసే లౌకిక వాద పార్టీల నాయకులు, ఇరు వర్గాలనీ పరామర్శించించి, శాంతియుతంగా ఉండాలనీ, ఆవేశాలకు గురికావొద్దనీ, ఈ గొడవలకు కారణమైన వారిని గుర్తించి, శిక్షించాలనీ స్టేటెమెంట్లు ఇస్తారు. కానీ, వర్గం ఆధారంగా , ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపే పార్టీలైతే, కేవలం తమ వర్గం వారి దగ్గరికే వెల్తాయి. ఈ గొడవలన్నీ ప్రత్యర్థి వర్గం వారే మొదలు పెట్టారనీ, వారంతా విలన్లనీ, తమ వర్గం వారంతా మంచి వారూ, అమాయకులనీ ఎలాంటి విచారణలూ అవసరం లేకుండానే నిర్ధారించేస్తారు. తమ వర్గం వారికి తాము అండగా ఉంటామనీ, అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తామనీ మాంచి పంచ్ డైలాగులతో ఉపన్యాసాలు ఇస్తారు. అప్పటికే భయభ్రాంతులకు గురై ఉన్న వారికి ఈ ఉపన్యాసాలు బాగా నచ్చుతాయి. ఇది అంతిమంగా రెండు పరిణామాలకి దారితీస్తుంది. ఒకటి- వర్గ బేధం చూపని లౌకిక వాద పార్టీలు, నాయకులు ఇరు వర్గాల ప్రజల్లోనూ తమ ప్రాభవం కోల్పోతారు. రెండు- ఇరు వర్గాల ప్రజలూ అయిష్టంగానైనా సరే, తమ వర్గ నాయకులకి మద్దతివ్వక తప్పని పరిస్థితిలోకి వెల్లిపోతారు. మొన్నటి ముజఫర్ నగర్ అల్లర్లతో సహా , దేశంలో ఇప్పటి దాకా జరిగిన మత కలహాల్ని పరిశీలిస్తే ఈ విషయం సులభంగానే బోధపడుతుంది. అసలు ఆ గొడవ ఎక్కడ ఎలా మొదలైందనే విషయం మాత్రం ఎప్పటికీ బయటికి రాకుండా, కొన్నాళ్ళకి పూర్తిగా మరుగున పడిపోతుంది. దేశంలో ఇప్పటి వరకూ అనేక మత కలహాలు జరిగాయి. వీటి వల్ల లాభపడిన పార్టీలు ఏవనే విషయం కాస్త రాజకీయ పరిౙానం ఉన్నవారికి ఎవరికైనా అర్థమయ్యేఉంటుంది.

సమాజంలోని వివిధ వర్గాల మధ్య అపనమ్మకం, ద్వేషబావం ఎంతగా పెరిగిపోతే ఐడెంటిటీ పాలిటిక్స్ చేసే రాజకీయ పార్టీలకి అంత లాభం ఉంటుంది. అందుకే, ప్రజల మధ్య విద్వేశాల్ని పెంచే ఏ అవకాశాన్నీ వీరు వదులుకోరు. ఇలాంటి పార్టీలు, విద్వేషాల్ని పెంచి పోషించే ముడి సరకుగా చరిత్రని వాడుకుంటుంటాయి. ఉదాహరణకి, చరిత్రలో ‘ఆ వర్గానికి’ చెందిన రాజులు, మన వర్గానికి చెందిన ప్రజల్ని చాలా హింసించారనీ, ఇబ్బందులకి గురి చేశారనీ , అనేక అసత్యాల్ని, అర్థ సత్యాల్ని ప్రజల్లోకి తీసుకెల్లడానికి ప్రయత్నిస్తుంటాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నిజాం కి వ్యతిరేకంగా చలామనీలో ఉన్న అనేక కథలు, పుకార్లు. నిజాం పుణ్యాత్ముడనో, గొప్పవాడనో చెప్పే ఉద్యేశ్యం నాకు లేదు కానీ, నిజాం చేసిన మంచి పనుల్ని మరుగున పడేసి కేవలం కొన్ని చెడ్డపనులనే పదే పదే ప్రస్తావిస్తూ నిజాం ని కౄరుడిగా చిత్రించే ప్రయత్నం మాత్రం ఓ కుట్రగానే భావించాల్సి ఉంటుంది.

చరిత్ర విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు, మరియు తెలంగాణాకి ఓ ప్రధాన వ్యత్యాసం ఉంది. మిగతా అన్ని ప్రాంతాల్లో, పాలన మొఘలుల చేతిలో నుండి బ్రిటిష్ వారి చేతిలోకి 1857 నుండే వెల్లగా, తెలంగాణాలో మాత్రం ముస్లిం రాజుల పాలన 1947 వరకూ కొనసాగింది. ముస్లిం రాజులు నాలుగు శతాబ్దాల పాటు తెలంగాణాని ఏలినప్పటికీ, వారు బ్రిటీష్ ప్రభుత్వం లాగా సంపదను దోచుకుని, మక్కాకో, మదీనాకో తరలించలేదు. వారు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, ఇక్కడే గొప్ప గొప్ప కట్టడాలు కట్టించారు, చివరికి ఇక్కడి మట్టిలోనే కలిసిపోయారు.కేవలం చివరి దశాబ్దంలో కొన్ని సంవత్సరాలు తప్ప, మిగతా ఏ కాలంలోనూ హిందూ ప్రజలతో ఘర్షనా పూరితంగా వ్యవహరించలేదు. కేవలం చివరి దశాబ్ధం లో సంభవించిన రజాకార్ల చరిత్రని మొత్తం 4 శతాబ్దాల చరిత్రకి ఆపాదిస్తూ, ఆ ఆవేశం, ఉక్రోశాలని ప్రస్తుత ముస్లిం సమాజంపైకి మల్లించి, దాని ద్వారా రాజకీయ లభ్ది పొందే ప్రమాదం ప్రస్తుతం తెలంగాణాలో ఉంది. ఇలాంటి కుయుక్తులతో , కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో ముస్లింల పై విద్వేషాల్ని రెచ్చగొట్టి, రాజకీయగా అఖండ విజయాల్ని సాధించిన అనుభవమున్న రాజకీయ రాబందులు ఆ ప్రయత్నాల్ని తెలంగాణాలో కూడా చేస్తాయనేదాంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే తెలంగాణా ప్రజలు తమ చరిత్ర పై, అసత్యాలు అపవాదులకి ఆస్కారం లేకుండా వాస్తవిక దృక్పదాన్ని అలవర్చుకోవాలసిన అవసరం చాలా ఉంది. ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా కేసీఆర్ ఈ విషయాన్ని తేలిగ్గానే గ్రహించారనిపిస్తుంది. తెలంగాణాలో అనేక నీటి ప్రాజెక్టులు కట్టించిన నవాబ్ జంగ్ బహద్దుర్ పుట్టిన రోజుని తెలంగాణా ఇంజినీర్స్ డే గా ప్రకటించడం, అవకాశం దొరికినప్పుడల్లా నిజాం చేసిన మంచిపనుల గురించి మాట్లాడుతుండటం లాంటి చర్యల ద్వారా భవిష్యత్తులో మత రాజకీయాల ఆస్కారాన్ని, మొగ్గలోనే తుంచేసేలా కేసీఆర్ ముందుచూపుని, సాహసాన్ని ప్రదర్శించారనిపిస్తుంది. కాంగ్రెస్ లోని దేఢ్ దిమాక్ గాల్లకు ఈ విషయం ఇంకా అర్థమైనట్లు లేదు. వారికి అన్ని తెలివితేటలే ఉంటే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఎందుకేడుస్తుంది.

పొరబాటునో, గ్రహపాటునో, తెలంగాణా 4 శతాబ్ధాల పాటు ముస్లింల ఏలుబడిలో ఉండింది. కానీ ప్రస్తుతం ముస్లింలు పేదరికంలో యస్.సి., యస్.టి. ల కన్నా వెనుకబడి ఉన్నారని అనేక నివేదికలు ఘోషిస్తున్నాయి. తమ చారిత్రక వారసత్వాన్ని గుర్తించాలనో,గుర్తించి తమను ఏనుగులపై ఊరేగించాలనో ముస్లింలు కోరడం లేదు. కేవలం విద్య, ఉద్యోగం, ఉపాధి లాంటివి పొందడంలో చేయూతనిచ్చి మిగతా వర్గాలతో సమాన హోదా పొందేలా కృషిచేయాలనే అడుగుతున్నారు. అభూతకల్పనలు, చారిత్రక అర్థ సత్యాలద్వారా మిగతా వర్గాలకు తమను బూచిగా చూపి, మత రాజకీయాల క్రీడలో తమను పావులుగా వాడుకోవద్ద ని కోరుకుంటున్నారు. వారి ఆశలు నెరవేరాలని ఆశిద్దాం.
-మహమ్మద్ హనీఫ్.యస్.

Leave a Reply

Your email address will not be published.