నల్ల జాతి మేలిమి వజ్రం – మాల్కమ్-X

నల్ల జాతి మేలిమి వజ్రం – మాల్కమ్-X
============================

->”తనను తాను రక్షించుకునే క్రమంలో ఓ వ్యక్తి ఆయుధం పట్టుకుంటే, దానిని ‘హింస ‘ అనకూడదు. ‘బుద్దిని ఉపయోగించడం’ అనాలి”.
->”స్వేచ్చ ఒకరిస్తే వచ్చేది కాదు. నీకు సమానత్వం, న్యాయం ఎవ్వరూ ఇవ్వరు. మనిషివైతే, వాటిని నువ్వే సాధించుకోవాలి.”-
->”నీ వీపులో 9 అంగులాల లోతుకి కత్తి దింపి, ఓ 3 అంగులాలు వెనక్కి లాగితే – అది నీకు ఉపకారం చేసినట్లు కాదు, మొత్తం బయటికి లాగినా అది ఉపకారం కాదు. ఆ గాయం మానేలా దానికి వైద్యం చేస్తే అదీ – ఉపకారం. కానీ, నల్ల జాతివారి వీపులో దింపిన కత్తిని వెనక్కి లాగే పనే, అమెరికాలో ఇప్పటికీ మొదలవలేదు”

ఇలాంటి కొన్ని వందల కొటేషన్లు, స్టేట్మెంట్లు మాల్కమ్ నోటినుండి తూటాల్లా వెలువడ్డాయి.

20వ. శతాబ్ధంలో అమెరికాలోని నల్లజాతివారిని ప్రభావితం చేసిన వ్యక్తుల లిస్టు రాస్తే, దానిలోని అగ్రగణ్యుల్లో ఒకటిగా నిలిచే పేరు – మాల్కమ్-X.

అమెరికాలోకి నల్లవారు ఎలా వచ్చారు?
17,18 శతాబ్దాల్లో, అమెరికన్లు ఆఫ్రికన్ దేశాలపై దాడిచేసి, అక్కడి నల్ల వారిని పట్టుకుని బంధించి, అమెరికాకు ఓడల్లో తరలించి, అక్కడి Slave మార్కెట్లలో వేలం వేసి అమ్మేవారు. వారిని కొన్న తెల్ల యజమాని వారితో ఎంతటి చాకిరీ అయినా చేయించుకోవచ్చు. ఆ నల్లజాతి వ్యక్తి పడచు వయసులో ఉన్న మహిళ ఐతే, ఆమెను శారీరకంగా కూడా వాడుకునేవారు. ఆమెకు సంతానం కలిగితే, వారిని కూడా మళ్ళీ స్లేవ్ మార్కెట్ లో అమ్మకానికి పెట్టేవారు. ఆ పిల్లల సర్ నేం లో( ఇంటి పేరులో) తెల్లోడి పేరు, ఓ యజమాని పేరులా ఉంటుందే తప్ప, తండ్రి పేరులా కాదు. అలా మాల్కమ్-X అసలు పేరు – మాల్కమ్ లిటిల్. లిటిల్ అనేది తెల్ల యజమాని పేరు తప్ప, తండ్రి పేరు కాదు. పెద్దవాడయ్యాక, ఈ చరిత్రనంతటినీ తెలుసుకున్న మాల్కమ్ లిటిల్, తెల్లోడి పేరు నా పేరులో ఉండట మేమిటని, తన పేరులోని లిటిల్ ని తీసిపడేశాడు. తన ఇంటి పేరు – ఆఫ్రికాలోని తన పూర్వీకులైన ముస్లింల ఇంటిపేరై ఉంటుందనీ, అదేంటో తెలీదు కాబట్టి, తెలియని దానిని -X అనుకొనుము అనే మ్యాథ్స్ ఫార్ములా ఆధారంగా తన ఇంటిపేరును -Xగా మార్చుకున్నాడు.

నేషన్ ఆఫ్ ఇస్లాం(NOI) లోకి ఎంట్రీ:
ఆరేళ్ళప్పుడు మాల్కమ్ తండ్రి చనిపోయాడు. ఈ షాక్ తో, అతని తల్లి మతిస్థిమితం కోల్పోయింది. అలా అనాధగా మారిన మాల్కమ్, తెల్లోల్ల ఇళ్ళలో దొంగతనాలు చేసిన కేసులో అరెస్టయి జైలుకి వెళ్ళాడు. అక్కడే అతనికి నేషన్ ఆఫ్ ఇస్లాం గురించి తెలిసింది.
అరేబియాలో పుట్టిన ఇస్లాం, అక్కడినుండీ మొదటగా వ్యాపించింది ఉత్తర ఆఫ్రికా ఖండానికే. అంటే, “అమెరికన్లు ఆఫ్రికా నుండీ ఎత్తుకొచ్చిన తొలితరం నల్లవారిలో చాలామంది ముస్లింలే. వారికి నిజమైన ముక్తి, మల్లీ ఇస్లాంలోకి మారడం ద్వారానే వస్తుంది” – అనే సిద్ధాంతం ఆధారంగా 1930లో అమెరికాలో మొదలైన ఉద్యమమే -నేషన్ ఆఫ్ ఇస్లాం’. తెల్ల వారి జాత్యహంకారానికి వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం, కొన్ని విపరీత భావాలను కలిగిఉండేది. వాటిలో ఒకటి -బ్లాక్ సుప్రిమసీ. అంటే -తెల్లోల్ల కంటే, నల్లోల్లే అధికులు/గొప్పోల్లు/ఉన్నతులు అనే భావన. తెల్లోల్లందరూ సైతాన్లనీ. నల్లవారు వారితో కలిసి ఉండటం అసాధ్యమనీ, నల్లోల్లకి ప్రత్యేక దేశం కావాలనీ వారు డిమాండ్ చేసేవారు.ఈ రకమైన భావజాలం, తెల్లోల్లల్లను భయభ్రాతులకి గురిచేసి, కొన్ని సార్లు హింసాత్మక ఘటనలకు కూడా దారితీసింది. ఈ నేషన్ ఆఫ్ ఇస్లాం వ్యవస్థాపకుడైన ఎలిజా మొహమ్మద్ తో, జైలు నుండి మాల్కం ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాడు.

జైలు నుండీ విడుదల కాగానే, ఆయనని కలిసి ముస్లింగా మారి, నేషన్ ఆఫ్ ఇస్లాం లో సభ్యత్వం తీసుకున్నాడు. తన అద్భుతమైన వాక్చాతుర్యం, ప్రతిభాపాఠవాలతో అనతి కాలంలోనే నేషన్ ఆఫ్ ఇస్లాం లో నెంబర్-2 స్థాయికి ఎదిగాడు. మాల్కం ఉపన్యాసాలు నల్లజాతి ప్రజల్ని కట్టిపడేసేవి. మొదట్లో     వేలల్లో ఉన్న సభ్యుల సంఖ్య, మాల్కం ఉపన్యాసాల ఫలితంగా     లక్షల్లోకి వెల్లింది.
ఇలా మాల్కం వల్ల ఇస్లాం కి ఆకర్షితులైన     లక్షలాది మందిలో  ఒకడు – Cassius Marcellus Clay. ఇతనే ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం – మహమ్మద్ అలీ.

ఇలా నేషన్ ఆఫ్ ఇస్లాం ఓ మహా ఉద్యమంగా సాగుతున్న సమయంలో, మాల్కం కి, ఎలిజా మహమ్మద్ గురించిన కొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి. అతను అనేక మంది స్త్రీలతో వివాహేతర సంబంధాలు నెరుపుతున్నాడనీ, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాడనీ తెలుసుకుని, ఇస్లాం కి పూర్తి వ్యతిరేకమైన ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారని ఆయన్ని నిలదీశాడు. అసలే మాల్కం ఎదుగుదలతో అభద్రతా భావానికి గురై ఉన్న ఎలిజా మహమ్మద్, ఈ సాకుతో , మాల్కం ని నేషన్ ఆఫ్ ఇస్లాం నుండి బయటికి పంపించాడు.

1964లో మాల్కమ్ చేసిన హజ్ యాత్ర అతని ఆలోచనలను మరింతగా మార్చేసింది. ఇస్లాం, పేద-ధనిక,తెలుపు-నలుపు, తేడా లేకుండా అన్ని జాతులవారూ 100% సమానులని చెప్పడమే కాకుండా ఆచరణలోనూ చేసి చూపుతుందని , హజ్ ద్వారా మాల్కమ్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అప్పడి నుండీ, నేషన్ ఆఫ్ ఇస్లాం చెప్పే ‘బ్లాక్ సుప్రిమసీ ‘ అనేది తప్పుడు వాదన అని నిర్ధారించుకున్నాడు. సున్నీ ముస్లిం గా మారి, ‘నల్ల జాతి విముక్తి అంటే తెల్లవారిని ద్వేషించడం కాదనీ ‘, చక్కటి విద్యను పొంది, వ్యక్తిగతంగా ఎలాంటి చెడు అలవాట్లకు గురికాకుండా ఓ పరిపూర్ణ వ్యక్తిగా మారడానికి ప్రతి వ్యక్తీ, ప్రతి సమాజమూ నిరంతరం శ్రమించాలనే కొత్త తరహా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనిని మరింతగా ముందుకు తీసుకెల్లే ప్రయత్నాల్లో ఉండగానే, 1965లో ఆయన్ని స్టేజీపైనే కొందరు దుండగులు కాల్చి చంపారు.

మహమ్మద్ ఆలీ పశ్చాత్తాపం!!
మాల్కమ్, నేషన్ ఆఫ్ ఇస్లాం నుండీ బయటికి వచ్చినప్పుడు, ఎలిజా ముహమ్మద్ గురించి అతను చెప్పిన విషయాల్ని ఎవరూ నమ్మలేదు. చివరికి మహమ్మద్ ఆలీ కూడా. తనతో కలిసి సున్నీ ముస్లిం గా మారమని మాల్కం చేసిన అభ్యర్థనను ఆలీ తిరస్కరించాడు. ఎలిజా ముహమ్మద్ తో విబేధించి, మాల్కం చాలా పెద్దతప్పు చేస్తున్నాడని అతన్ని నిందించాడు. కానీ, 1975లో ఎలిజా ముహమ్మద్ మరణించిన తర్వాత, ఎలిజా ముహమ్మద్ సొంత కుమారుడే తన తండ్రిపై మాల్కం చేసిన ఆరోపణలన్నీ పూర్తి యదార్థాలనీ వాటన్నిటికీ తాను ప్రత్యక్ష సాక్షిననీ ప్రకటించాడు. అతను కూడా NOI నుండి బయటికి వచ్చి సున్నీ ముస్లిం గా మారాడు. దీనితో నిజం తెలుసుకున్న మహమ్మద్ ఆలీ కూడా, NOI నుండి బయటికి వచ్చి సున్నీ ముస్లింగా మారాడు. మాల్కమ్ ని నమ్మకుండా, అతని అభ్యర్థనని తిరస్కరించడం తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరబాటనీ, ఈ అలోచన తనకు ఎప్పటికీ అంతులేని దుఃఖాన్ని కలిగిస్తుంటుందనీ మహమ్మద్ ఆలీ తన ఆటో బయాగ్రఫీ లో రాసుకున్నాడు.
చనిపోయేనాటికి  మాల్కమ్ వయస్సు కేవలం 40 సం. మాల్కమ్  ని చంపింది NOI సభ్యులే అని కొందరిని పట్టుకుని శిక్షలు కూడా వేశారు గానీ, దీని వెనుక కొంత వివాదం కూడా ఉంది.

“There is nothing in our book, the Quran, that teaches us to suffer peacefully. Our religion teaches us to be intelligent. Be peaceful, be courteous, obey the law, respect everyone; but if someone puts his hand on you, send him to the cemetery. That’s a good religion.”
“MESSAGE TO THE GRASS ROOTS,” SPEECH, NOV. 1963, DETROIT (PUBLISHED IN MALCOLM X SPEAKS, CH. 1, 1965)

– మహమ్మద్ హనీఫ్.
www.shukravara.in

Leave a Reply

Your email address will not be published.