నాన్న తిట్టని ఆ రోజు!

నాన్న తిట్టని ఆ రోజు!
======================
“నువ్వసలు మనిషివేనా”?
“అడ్డగాడిదలా పెరిగావ్!”
“కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా”?
“అప్పు చేసి నీకు నెలా నెలా డబ్బులు పంపిస్తుంటే, చదవుకోకుండా గాడిదలు కాస్తున్నావా”?
“సంవత్సరమంతా ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని కూడా ఈ ర్యాంక్(14000) వచ్చిందంటే, ఇక నువ్వు ముష్టి ఎత్తుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు.”

నా ఎంసెట్ ర్యాంక్ గురించి తెలియగానే పెద్దన్న(English Teacher) నోటినుంచి వచ్చిన తిట్లు ఇవి. తర్వాత కాసేపటికి రెండో అన్న(Telugu Lecturer) కూడా ఇంట్లోకి రావడం, ర్యాంక్ ఎంత అని అడిగి దాదాపు ఇవే తిట్లని రిపీట్ చేయడం జరిగింది. సినిమా రెండో సారి చూస్తున్నప్పుడు, మొదటి సారి ఫీలైనంత ఎమోషన్ రాదు కదా, కాబట్టి రెండో అన్న తిట్లు అంత కష్టంగా అనిపించలేదు.

“నేనప్పటికీ చెప్తూనే ఉన్న, బేగం(మా అక్క) పెళ్ళికి చేసిన అప్పే ఇంకా తీరలేదు. బాషకి( మా మూడో అన్న, Civil Engineer) దుబాయ్ లో ఇంకా ఉద్యోగం కూడా దొరక్క అవస్థలు పడుతున్నాడు. ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ అంత డబ్బు ఖర్చుపెట్టి వీడికి కోచింగ్ ఎందుకు, ఊర్లోనే ఏ డిగ్రీలోనో చేర్పించమని. కానీ మీరెవ్వరూ నా మాట విన్లేదు”- పక్కనుండి మా అమ్మ కోరస్.

“”ఎందుకు సాయిబూ, కొడుకులు ఇంజనీర్లు,ఉద్యోగస్తులు కావాలని ఆశకు పోయి అప్పులపాలయిపోతావ్. మేమే మాపిల్లల్ని బుద్దిగా డిగ్రీలు చదివించుకుంటుంటే”- అని నాన్న వాల్ల ఆఫీస్లో పైవాల్లందరూ ఇప్పటికే ఎగతాళి చేస్తున్నారంట. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నాన్న ఇంకెంత బాధపడ్తాడో.” పెద్దన్న అన్న ఈ మాట మాత్రం చివుక్కున గుచ్చుకుంది.

“ఆయనకు మామూలుగా కోపం రాదు. వస్తే మాత్రం ఆయన మనిషి కాదు. ఇక ఈ రోజు వీడిని ఏం చేస్తాడో.” – అమ్మ ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

మా నాన్న ఎం.డీ.వో. ఆఫీస్లో అటెండర్. ఇల్లు-> ఎండీవో ఆఫీసు-> మా వీధి చివర్లోని చిన్న మసీదు..ఇవే ఆయన ప్రపంచం.వీటి మధ్య తిరగడానికి ఓ డొక్కు సైకిల్ ఉండేది.

నిజానికి, ఎంసెట్లో ఎత్తిపోయినందుకు నాకెందుకో పెద్దగా బాధ అనిపించలేదు. బహుశా, చదువు రాని మొద్దబ్బాయి పాత్రల్నే హీరోలుగా పెట్టి తీసిన సినిమాల ప్రభావం కావచ్చు. కానీ నా వల్ల మా నాన్న బాధకి, అవమానానికి గురవబోతున్నాడనే విషయం మాత్రం కొంత గిల్టీ ఫీలింగ్ కలిగించింది. ఆయన కోపం గురించి అమ్మ చాలా సార్లు చెప్పడమేగానీ, నేను ప్రత్యక్షంగా చూసింది లేదు. ఎందుకంటే, అంత పెద్ద తప్పు ఎప్పుడూ చేయలేదు కాబట్టి. కానీ ఆ బిగ్ డే, ఇవ్వాలే కాబోతుందేమోనని భయం మొదలైంది.

పైన చెప్పిన తిట్లనే వంతులవారిగా, అమ్మ, అన్నయ్యలు పలు మార్లు రిపీట్ చేసి, నా ముఖంలో పెద్దగా విచారం కనపడక పోవడంతో, ఇక నాన్న వచ్చి కసితీరా కుమ్మితే గాని వీడు దారికి రాడు అని తీర్మానించేసి, నాన్న ఆఫీస్ నుండి వచ్చే టైం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు.

ఆ టైం రానే వచ్చింది. నాన్న ఇంట్లోకి వస్తుండటం చూసి, ఈయన చేత్తో కొడతాడా, కాల్తో తంతాడా, లేక ఆ మూలనున్న దోమతెర కర్రని తీసుకుంటాడా అనే ఆలోచనల్తో,నా ఒంట్లొ చిన్నగా ఒణుకు మొదలైంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరూ సీరియస్ గా ఉండటం చూసి, ఏమైందని అడిగారు.
“ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. వీడికి 14000 ర్యాంక్ వచ్చింది.” – రెండో అన్న చిన్నగా చెప్పాడు.
నాన్న ఓ నిమిషంపాటు మౌనంగా నిల్చున్నారు. తర్వాత ఏమీ మాట్లాడకుండా , ఇంటి బయట ఉన్న మంచంపై నడుం వాల్చారు.. ఆయన నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తున్నారని మూస్తూ,తెరుస్తున్న ఆయన కనురెప్పల్ని బట్టి అర్థమవ్తుంది. కాసేపు తర్వాత మసీదు మైకు నుండి మగరిబ్ నమాజ్ ఆజా(సాయంకాలం నమాజు ) మొదలవడంతో ఆయన లేచి, ఇంట్లోకి వచ్చి , గూట్లోని టోపీ తీసుకున్నారు. వీడిని కిందపడేసి తంతారనుకుంటే, ఇలా ఏమీ చేయకుండా వదిలేశారేంటి, అనే కొచెన్ మార్క్ అందరి ముఖాల్లో ఉండటాన్ని ఆయన గుర్తించకపోలేదు. దానితో, “వీడి భవిష్యత్తుకి నా చేతనైనంతవరకు నేను చేశాను. ఆ తర్వాత, అల్లా వీడి తలరాత ఎలా రాసిఉంటే అలా జరుగుతుంది”, అని చెప్పేసి మసీదుకి వెల్లిపోయారు.
ఇది విని అందరూ నిరుత్సాహంతో, ఓ హేయమైన చూపుని నాపై పడేసి లేచి వెల్లిపోయారు.
మా నాన్న కూడా, ఇంట్లొ మిగతా అందర్లాగే నన్ను తిట్టడమో, తన్నడమో చేసిఉంటే నేను దానిని కూడా లైట్ తీసుకుని ఉండేవాడిని గానీ, ఆయన అలాంటిదేమీ చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇంట్లో మిగతావారి మాటలని,చూపుల్ని లైట్ తీసుకున్నాను గానీ, మా నాన్న నిశబ్ధాన్ని భరించడం చాలా కష్టమైంది. అప్పట్లో ఆయన జీతం నెలకు మూడున్నర వేలు. నాకు నెల్లూర్లో లాంగ్ టెర్మ్ కోచింగ్ కి అయిన మొత్తం ఖర్చు సుమారు 30వేలు. అంటే, మా నాన్న యొక్క 8నెలల కష్టాన్ని నేను వృధా చేశాననే ఆలోచన, ఆయనకు ఇంత నష్టం కలగజేసినా, ఆయన నా మీద కనీసం కోపం కూడా చూపించలేదనే విషయం నన్ను ఓ రకమైన గందరగోళంలో పడేశాయి.
అప్పుడే ఆయన్ను జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాను. మా ఇంటికి వాళ్ళ ఆఫీసు సుమారు రెండు 2కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ ఏరియా మొత్తం చాలా ఎత్తులో ఉంటుంది. దాని పేరే గిరినగర్. ఆ హైట్ కి ఆయన రోజూ ఓ డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళివచ్చేవారు. దాని టైర్లు కూడా కొంచెం వంగిపోయి ఉండేవి, కొత్తవి వేస్తే డబ్బులు ఖర్చైపోతాయని అలాగే వాడుతుండేవారు. ఆయన అంత కష్టపడి సంపాదించిన డబ్బును నేను వేస్ట్ చేశాననే గిల్టీ ఫీలింగ్ నన్ను చాలా కాలం వెంటాడింది. జాబ్ లో చేరిన మొదటి సంవత్సరం లోనే, నా జీతంతో నాన్నకు TVS-50 కొనిచ్చేవరకూ, ఆ గిల్టీ ఫీలింగ్ వదల్లేదు.

ఆ గిల్టీ ఫీలింగ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఎంసెట్ ఫేయిల్యూర్ తర్వాత, డిగ్రీ జాయిన్ అయినా, మల్లీ సొంతంగా చదివి నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ రాసేలా చేసింది. ఈ సారి 7000 ర్యాంక్ వచ్చింది. ఇంజినీరింగ్ లో జాయిన్ అయ్యేటప్పటికి, అన్నయ్యలు జాబ్స్ లో సెటిల్ కావడంతో మా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. నాకు ప్రతినెలా అడిగిన దానికంటే ఎక్కువే పంపేవారు. ఎంసెట్ లో నాన్న డబ్బులు వేస్ట్ చేశాననే గిల్టీ ఫీలింగ్ వల్ల, మరో సారి ఇంట్లో వారి డబ్బులు వేస్ట్ చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నాను. ఆ ఒక్క కారణంగానే, జేబులో డబ్బులున్నా కూడా, మందుకొట్టడం.. వంటివాటి జోలికి ఎప్పుడూ వెల్లలేదు.

నాన్న – ఇస్లాం
==============
నేను-మా జేజబ్బ – పాకిస్తాన్ అనే వ్యాసంలో, మా జేజబ్బ గురించి రాసి ఉన్నాను. మా నాన్న,జేజబ్బ.. వీల్లందరూ కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందినవారు. తరువాత మా చదువుల కోసం, అమ్మా నాన్న పోరుమామిల్లకు షిఫ్ట్ అయ్యారు. నరసాపురంలో ఉన్నన్నాల్లు నాన్నకు ఇస్లాం గురించి ఏమీ తెలీదు. పోరుమామిళ్ళకు వచ్చిన తర్వాతే, అక్కడ ఇంటి దగ్గర్లో మసీదు ఉండటంతో, వారి ప్రభావం వల్ల నాన్న రోజూ 5 పూటలా నమాజు చదవడం మొదలుపెట్టారు. ఆయన చనిపోయే ముందు వరకూ కూడా రోజూ క్రమం తప్పకుండా అది ఫాలో అయ్యేవారు. ఇంట్లో మా అమ్మకూడా ఇప్పటికీ, ఏ ఒక్క నమాజూ మిస్ అవ్వదు.
నాకు మరింత ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే – అమ్మా నాన్న ఇంత నిష్టగా ఇస్లాం ఆచరిస్తూ కూడా, మమ్మల్ని ఏ ఒక్కరోజూ నమాజు చేయమని బలవంతపెట్టలేదు. ఇస్లాం గురించి మాకు బ్రెయిన్ వాష్ చేయాలని చూడలేదు. బహుశా ఏదో ఒకరోజు వాల్లే తెలుసుకుంటార్లే అనే నమ్మకమనుకుంటా. చివరికి వారి నమ్మకమే నిజమైంది. ఇప్పుడు ఆలోచిస్తే, నాన్న ఇస్లాం గురించి మాటల్లో ఏమీ చెప్పకుండానే, చేతల ద్వారా మాకు చాలా చెప్పాడనిపిస్తుంది. కష్టనష్టాలకు కుంగిపోకుండా, దేవుడిపై భారం వేసి మన చేతుల్లో ఉన్నది మనం చేయాలనే గొప్ప ఫిలాసఫీ, నాన్న ఆచరించి చూపారు. చివరికి, ఐదేళ్ళ క్రితం, రంజాన్ నెలలో, పండుగకు ఒక్క రోజు ముందు ఆయనకు అల్లా నుండి పిలుపు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published.