నాస్తికుడిగా మార్చిన ప్రశ్న!! – మహాత్మా గాంధీ,మదర్ తెరీస్సాలు స్వర్గానికి వెళ్తారా, వెళ్ళరా?

In search of PURPOSE#1
నాస్తికుడిగా మార్చిన ప్రశ్న!! – మహాత్మా గాంధీ,మదర్ తెరీస్సాలు స్వర్గానికి వెళ్తారా, వెళ్ళరా?
=================================

దాదాపు ఇరవై ఏళ్ళు వచ్చేవరకూ, నాకు ఇస్లాం గురించి తెలిసినదానికంటే రామాయణం,మహాభారతం వంటి వాటి గురించే ఎక్కువగా తెలుసు. ఇంటర్నెట్ అందుబాటులోకి రాకముందు, ఇస్లాం గురించి తెలుసుకోవడానికి ఉన్న ఒకేఒక సోర్స్- మసీదులో ఇచ్చే ప్రసంగాలు. కానీ రామాయణం,భారతాల గురించి బోలెడన్ని సినిమాల ద్వారా, తెలుగు వాచకం పాఠాల ద్వారానూ చిన్నప్పట్నుండీ తెలుసుకుంటూనే ఉన్నాను.

మసీదుల్లో ప్రసంగాలు ఇచ్చే పెద్ద మనుషులు జనరల్గా మదరసాల్లో చదువుకుని ఉంటారు. ఈ మదరసాల్లో చాలావరకూ పేదవారు, అనాధల పిల్లలు మాత్రమే చదువుతుంటారు. బయట డిగ్రీ,పి.జీ, పీహెచ్ డీ లు ఉన్నట్లే మదరసా చదువుల్లో కూడా వివిధ దశలు ఉంటాయి. హఫీజ్,ఆలిం, ముఫ్తీ ఇలా ఉంటాయి. మసీదుల్లో ఐదు పూటలా నమాజు చదివించడానికి ఒకరిని, చాలా తక్కువ నెలజీతం తో నియమిస్తారు. వీరిని ఇమాం లంటారు. దీనికి కావలసిన కనీస అర్హత – ఖురాన్ ని మొదటినుండీ, చివరి వరకూ బట్టీ పట్టి ఉండటం.వీరిని హఫీజ్ లంటారు. వీరికి ఖురాన్ ఇంటర్ప్రెటేషన్ గురించి Expertise ఉండాలనేం లేదు. ఇస్లాం కి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉన్నవారిని ముఫ్తీ అంటారు. ఇది మదరసాల్లో పి.హెచ్.డీ లాంటిది. ఇప్పుడు ఒక పీ.హెచ్.డీ చేసిన వ్యక్తి, ఓ మారు మూల గ్రామంలోని పిల్లలకి A,B,C,Dలు నేర్పే పని చేయడానికి ఒప్పుకోరు కదా, అలాగే ఓ మారుమూల పల్లెల్లోని చిన్న సైజు మసీదుకి ముఫ్తీ లాంటి వారు రారు. ఇమాం లు నమాజు చదివించడంతో పాటు, మసీదుకు రాని ముస్లింలను అప్పుడప్పుడు పోగేసి, వారిని నమాజ్ చదివేలా ఇన్స్పైర్ చేయడానికి ఖురాన్,ప్రవక్త గొప్పదనం గురించి స్పీచ్ లు(ఇజ్తెమా) కూడా ఇస్తుంటారు.

ఓ వ్యక్తికి దేవుడిపై విశ్వాసం అనేది, అతని బాల్యంలో ఇంట్లో పెద్దల బోధనలు, ఆచరణల ద్వారా అలవడి ఉండాలి. అలాకాక, అతను మతం కంటే ముందుగా డార్విన్ కోతి-మనిషి సిద్ధాంతాన్ని చదువుకొని ఉంటే ఆ తర్వాత అతనికి దేవునిపై భక్తి కలగడం చాలా కష్టం. అలా కలగాలంటే, ఆ దైవత్వం అనే భావన అతని లాజికల్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేదిగా ఉండాలి. లేదా, దేవుని అస్థిత్వాన్ని గుర్తించేలా చేసే మానవాతీత సంఘటనలు అతని జీవితంలో జరిగి ఉండాలి. మరీ ముఖ్యంగా, ఓ సైన్సు చదివిన వ్యక్తికి మతం గురించి చెప్పాలంటే, ఆ చెప్పే వ్యక్తి కూడా సైన్సును చదివి ఉండి, అది చదివిన వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వారికి ఎలాంటి డవుట్లు వస్తాయో అవగాహన ఉండాలి.

నేను హైస్కూల్లో ఉన్నప్పుడు, మసీదుకు వెళ్ళని ముస్లిం కుర్రాల్లందరినీ పోగేసి వారికి ఖురాన్ గురించీ, ఇస్లాం గురించీ బోధించే కార్యక్రమం మా ఊరి మసీదులో, ప్రతి ఆదివారం చేసేవారు.పైన చెప్పినట్లు, మా ఊరిలాంటి మారుమూల గ్రామాల్లో ఇమాంలు హఫీజ్ స్థాయి కంటే ఎక్కువగా చదువుకొని ఉండరు. కాబట్టి వారి ప్రసంగాలూ, ఎంచుకునే అంశాలు ఏమాత్రం ఆసక్తి కరంగా గానీ, రెలవెంట్గా గానీ ఉండవు. అందుకే, కింద కూర్చుని వినేవారు కూడా తల ఒంచుకుని ఇంకేదో ఆలోచించుకుంటూ ఉంటారు తప్ప, ఆ ప్రసంగాల్ని పెద్దగా అటెంటివ్ గా వినరు.

“ఒరే అబ్బాయిలూ! ఈ జీవితం కేవలం ఒక పరీక్ష లాంటిది. ఇది తాత్కాలికమైనది. మనం ఈ జీవితంలో చేసే పనుల్ని బట్టి, మరణానంతరం మనకు స్వర్గమో,నరకమో డిసైడ్ చేయబడ్తాయి. మంచి పనులు చేసినవారిని స్వర్గంలోనూ, చెడు పనులు చేసిన వారిని నరకంలోనూ పడేస్తారు. నరకంలో తీవ్రమైన శిక్షలుంటాయి. ఎన్ని తప్పులు చేస్తే అన్ని సార్లు మంటల్లో వేసి కాలుస్తారు. ఒక సారి చర్మం కాలి బూడిద కాగానే, కొత్త చర్మం మల్లీ పుట్టించబడుతుంది. అలా ప్రతి తప్పుకూ శిక్ష ఉంటుంది. ” – ఇలా పాపం ఆ పెద్దాయన కళ్ళు మూసుకుని చెప్పుకుంటూపోతుంటే, అది వింటున్న మా ఆలోచనలు మాత్రం మరోలా ఉండేవి.
“ఓసోస్.. ఇదంతా మేము ఆల్రెడీ యముడికి మొగుడు సినిమాలో చూసేశాం, దాంట్లో చిరంజీవి యముడ్ని భలే ఆటపట్టించాడు. అందులోని, పాటలూ, డ్యాన్సులూ కూడా ఎంత బాగుంటాయో. పాపం ఈ పెద్దాయన అవేమీ చూడకుండా చాలా మిస్సవుతున్నాడు” అని ఆయన మీద సానుభూతి ఫీలయ్యేవాల్లం.

“మనందరం అల్లా సృష్టించిన తొలిజంట అయిన ఆదం-హువ్వా(Adam-Eve) ల సంతానం. మనకు ఉండాల్సిన మొట్ట మొదటి లక్ష్యం – ప్రవక్త యొక్క అడుగుజాడల్లో నడిచి సాధ్యమైనంత పుణ్యం మూటగట్టుకోవడం, అంతే తప్ప, డబ్బు సంపాదనో,డాక్టర్లు,ఇంజనీర్లై సమాజం దృష్ఠిలో గొప్ప వారుగా కీర్తింపబడటమో కాదు” ఆయన ఇలా చెప్పుకుంటూ పోతుంటే, నాకు మాత్రం అంతకు ముందు క్లాసులో విన్న డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం, అమీబా, ఏక కణ జీవి, కోతి-చింపాంజీ- ఏప్-వంగినడిచే మానవుడు-నిటారుగా నడిచే మానవుడు ల డయాగ్రం గుర్తొచ్చి -“పాపం ఈయన చదివిన మదరసాలో ఇంకా సిలబస్ అప్డేట్ చేసినట్లు లేదు” అనిపించేది.

అలాంటి ఓ ఆదివారం ప్రసంగంలో, మా ఇమాం గారు ఓ విషయం చెప్పారు. అది -” ఒరే అబ్బాయిలూ- మరణానంతరం స్వర్గం నరకం అని ఉంటాయి. మనందరం ముస్లింలుగా పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే అల్లా ముస్లింల కోసమే స్వర్గాన్ని తయారు చేశాడు. ఇతరుల కోసం నరకాన్ని సృష్టించాడు.”

ఇప్పుడు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో, టీం లో ఎవరు ఎంత పెద్ద సెమినార్లు ఇచ్చినా, మ్యానేజర్ ని ఇంప్రెస్స్ చేయడానికి, షో కోసం డవుట్ అడుగుదామంటే, ఒక్క డవుటూ తట్టి చావదు గానీ, హైస్కూల్లో ఉన్నప్పుడు మాత్రం క్లాసులో తెగ డవుట్లు అడిగేవాన్ని. అప్పట్లో మైండ్ బాగా పనిచేసేదేమో మరి. ఆ ఫ్లో లోనే, పైన ఇమాం గారు స్వర్గం-నరకం గురించి చెప్పినప్పుడు ఠపీమని ఓ డవుట్ అడిగాను. అది – “నరకం ముస్లిమేతరుల కోసమూ, మరియు స్వర్గం ముస్లింల కోసమా? అంటే మీరు చెప్పేదాని ప్రకారం, మహాత్మా గాంధీ-మదర్ థెరీసా లు కూడా ఎప్పటికీ స్వర్గానికి వెళ్ళలేరా?”

ఈ డవుట్ అడగ్గానే, అప్పటి వరకూ తల వంచుకుని తమతమ లోకాల్లో ఉన్న మిగతా పిల్లలందరూ, ‘మసీదులో డవుట్ అడిగినోడు ఎవడ్రా’ అన్నట్లు తలతిప్పి నావైపు చూశారు.అందరూ అలా చూసేటప్పటికి, చేయకూడని తప్పేదో చేసినట్లు నాక్కొంచెం భయం కలిగింది. సరే ఇంతకూ ఇమాంగారు ఏం సమాధానం చెప్తారోనని అందరూ మళ్ళీ ఆయనవైపు ఆసక్తిగా చూశారు. ఇలా క్రాస్ కొచెన్ ని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయని ఇమాం గారు, కాసేపు బ్లాంక్ ఫేసుతో ఉండిపోయి, తర్వాత, “బేటా నీకు సమాధానం చివర్లో చెప్తాను” అన్నారు.

ప్రసంగం ఐపోయి, పిల్లలందరూ లేచి వెళ్ళిపోతుంటే, నేను ఇమాం గారి దగ్గరికి వెళ్ళాను, ఏం సమాధానం ఇస్తారో విందామని. ఆయన మాత్రం – “బేటా, ఐసా మజీద్ మే సవాల్ నై కర్నా” అన్నారు మందలింపుగా. ఇంతకూ నేనడిగిన డవుట్ విషయం ఏంటి అని అడిగితే, “అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, పెద్దయ్యాక తెలుస్తుందిలే” అన్నారు. అది విని నాకు చాలా నిరుత్సాహం కలిగింది. ‘నాకు అర్థం కాకపోతే మరి అలాంటి విషయాలు చెప్పడమెందుకు . ఐనా అంతంత మంచి పనులు చేసిన గాంధీ, మదర్ తెరీస్సాలు స్వర్గానికి వెళ్ళకపోవడమేంటి, కేవలం ముస్లిం పేర్లు పెట్టుకున్నందుకు, మొన్న యూనిట్ టెస్ట్లో చూపించలేదని నన్ను తిట్టిన నాయబ్ రసూల్ గాడు, నా పెన్సిల్ కొట్టేసిన మాబూ పీరా గాడూ స్వర్గానికి వెల్లడమేమిటి. చూస్తుంటే ఇదంతా పెద్ద తిరగడ వ్యవహారంలా ఉంది. ఐనా అసలు నాకు అర్థం కాని విషయాలు నేనెందుకు వినాలి.” – ఇలా సాగాయి నా ఆలోచనలు..

ఇది జరిగింతర్వాత నాకు ఇక మసీదు ప్రసంగాలపై ఏమాత్రం ఆసక్తి లేకుండా పోయింది. పైగా, ఈ నమాజులు గట్రా వంటి వన్నీ, బుర్ర పని చేయనివారికోసమూ, మరియు బుర్ర వాడని వారికోసమేననే అభిప్రాయం కూడా క్రమంగా స్థిరపడిపోయింది. కానీ, సహజంగా అందరికీ లాగే నాకూ, ‘అసలు ఏమిటీ జీవితం ‘ అనే టైపు సందేహాలు మనసులో వస్తూ,పోతూ ఉండేవి. కానీ, దీనికి ప్యారలల్గా, మన దైనందిన కష్టాలు ఎలాగూ ఉన్నాయి కదా – ఎంసెట్లు, ర్యాంకులు, ఎగ్జాంలు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ ప్రయత్నాలు లాంటి.. వీటివల్ల దేవుడు/మతం వంటి అంశాల గురించి క్యూరియాసిటీ ఉన్నా, వాటిని సీరియస్గా తెలుసుకునే వెసలుబాటుగానీ, అవకాశం కానీ కలగలేదు. అలాంటి తీరుబడి కలిగింది – చదువైపోయి, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే.

హమ్మయ్య.. చదువైపోయింది, ఇప్పుడు ఓ ఉద్యోగం కూడా సంపాదించేశాం.. ఆఫీస్ తర్వాత ఫ్రీ టైం కుడా ఉంది.. చేతిలో కూసంత డబ్బు ఉంది. What Next… ఈ డబ్బుని ఇష్టమైనట్లు జల్సాలకు వాడుకోవడమా.? లేదు.. రాత్రింబవల్లు ఆఫీస్ పనే చేసి, తొందరగా ప్రమోషన్లు, లేదా ఎక్కువ జీతంతో మరో కంపెనీకి జంప్.. లేదా మనమే సొంత కంపెనీ.. మరింత డబ్బు.. పేరు..లేకపోతే, H1/L1 అప్లై చేసుకుని.. డాలర్లు, యూరోలు.. ఇంతేనా.. ఇలా ఎంతకాలం.. చివరికి మిగిలేది ఏమిటి..? టైపు ఆలోచనలు మళ్ళీ ముసురుకున్నాయి.

గతంలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమలో మనుషులు సాధువులుగా, దేశద్రిమ్మరులుగా మారిపోయేవారేమో. కానీ నా జెనరేషన్ కి ఆ బాధ తప్పింది. దానికి కారణం – ఇంటర్నెట్.

సైన్సు చదివిన వ్యక్తి, మతంపై సంధించే లాజికల్ ప్రశ్నలకు, మతం సమాధానం ఇస్తుందని, కనీసం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని.. మొదటిసారిగా తెలిసింది , మా అన్న దుబాయ్ నుండి తీసుకొచ్చిన -షేక్ అహ్మద్ దీదాత్ ప్రసంగాల వీడియో క్యాసెట్ ల వల్ల. తర్వాత ఇంటర్నెట్ వాడకం పెరిగి, యూటూబ్ పాపులర్ అయ్యాక, Dr. Gary Miller, Prof. Jeffrey Lang, జకీర్ నాయక్, నోమాన్ అలీ ఖాన్, షబ్బీర్ అలీ, యూసుఫ్ ఎస్టేట్స్, etc…. వీరందరి Scholarly Analysis, మతం/దేవుడి పై నా అవగాహనను సమూలంగా మార్చేశాయి.

(To be continued..)

-మహమ్మద్ హనీఫ్.యస్.
10/09/2017.

Leave a Reply

Your email address will not be published.