నీకు పౌరసత్వం లేదు … పో… పో…

నీకు పౌరసత్వం లేదు … పో… పో…
– వాహెద్
—————————————-
అమెరికాలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా విధానాల్లో మార్పులు వచ్చాయి. అమెరికాలో భవిష్యత్తేమిటో అన్న ఆందోళన మనవారిలో మొదలైంది.
ఇక్కడ బిజేపి అధికారంలోకి వచ్చింది. అస్సాంలో మనవాళ్ళెంతమంది, పరాయివాళ్ళెంత మంది తేల్చే ప్రక్రియ ప్రారంభమైంది. దశాబ్దాలుగా అస్సాంలో నివసిస్తున్న కుటుంబాలు ఇప్పుడు ఇక్కడి వాళ్ళు కాదు పొమ్మంటే ఏం చేయాలో పాలుబోని స్థితి. నిన్నటి వరకు సాగు చేసిన పొలంపై హక్కులేదు. నిన్నటి వరకు నివసించిన ఇల్లు పరాయిదైపోయింది.

డిటెన్షన్ క్యాంపులు పుట్టుకు వచ్చాయి.
అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్నార్సీ) తుది ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07లక్షల మంది తమ అస్సామీ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందికి పైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది.
భారతపౌరుడిగా నిరూపించుకోవలసిన బాధ్యత ప్రజల నెత్తినే పడింది. ఒక వ్యక్తి భారత పౌరుడు కాదని గుర్తించి ప్రభుత్వాలు చర్యలు తీసుకునే బదులు, పౌరులే తమ పౌరసత్వం నిరూపించుకోవలసిన దుస్థితి. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ శైలేశ్‌.. ఎన్నార్సీ ముసాయిదా వివరాలను వెల్లడించారు. ‘భారత్, అస్సాం చరిత్రలో ఇదో చరిత్రాత్మకమైన రోజు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఓ అద్భుతమైన న్యాయ ప్రక్రియ’ అని ఈయన పేర్కొన్నారు. అయితే ఇది తుది ముసాయిదా మాత్రమేనని మిగిలిన వారికీ తమ అభ్యంతరాలను వెల్లడించే అవకాశం ఇస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.
ఇప్పుడు ఎన్నార్సీలో 40 లక్షల మంది పౌరులు కాదని ప్రభుత్వం తేల్చేసింది. అంటే ఈ 40 లక్షల మంది దేశం లేని ప్రజలు. ప్రపంచంలో ఇంత పెద్ద సంఖ్యలో దేశం లేని ప్రజలున్నది ఇప్పుడు భారతదేశంలోనే. బిజేపి పరిపాలనలో మనం సాధించిన మరో ప్రగతి ఇది. 40 లక్షల మంది పేర్లను జాబితాలో ప్రచురించకపోవడంపై ఎన్నార్సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్‌ హజేలా మాట్లాడుతూ.. ‘మేం ఎంచుకున్న ప్రక్రియను బహిరంగంగా చెప్పలేం. ఎన్నార్సీ సేవా కేంద్రాలను సందర్శించి తమ దరఖాస్తుల తిరస్కరణకు కారణాలు తెలుసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. అంటే అధికారులు ఒక వ్యక్తి ధరఖాస్తును అడ్డగోలుగా తిరస్కరించి, ఎందుకు తిరస్కరించారో మాత్రం బహిరంగంగా చెప్పరు. నిరుపేద బడుగు ప్రజలు అధికారుల చుట్టు ఎందుకు తిరస్కరించారు మహాప్రభో అని తిరుగుతూ ఉండాలి. పౌరుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన పడనవసరం లేదని హోంమంత్రి గారు అంటున్నారు. ‘దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు జరుగుతుంది. ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు చాలినంత సమయముంది’ అని పేర్కొన్నారు. ఎన్నార్సీ కేంద్రాల్లో ఫిర్యాదు చేయొచ్చనీ.. అదీ కాకపోతే విదేశీ ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేసుకోవచ్చని సూచిస్తోంది. అయితే ట్రిబ్యునల్‌ తీర్పులు ఎన్నాళ్లకొస్తాయో చెప్పలేని పరిస్థితి. ‘తుది జాబితాలో లేని వారిని మేం భారతీయులుగానో, భారతీయేతరులుగానో పిలవడం లేదు. వీరిపై వెంటనే ఓ నిర్ణయానికి రాలేం’ అని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గ్‌ స్పష్టం చేశారు. కాని పౌరులు కాని వారిని దేశం నుంచి గెంటేయాలని, వెళ్ళకపోతే కాల్చి పారేయాలని బిజేపి నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్నార్సీ ముసాయిదా విడుదలపై పార్లమెంటులో విపక్షాలను నిరసన తెలిపాయి. కాంగ్రెస్, తృణమూల్, ఎస్పీ సహా పలువురు విపక్ష సభ్యులు రాజ్యసభలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్సార్సీ ముసాయిదా నుంచి 40 లక్షల మందిని తప్పించడంపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు. ‘సొంతగడ్డపై భారతీయులే శరణార్థులయ్యారు’ అని పేర్కొన్నారు.
నలభై లక్షల మంది ప్రజలు, అందరూ బెంగాలీలే, అందులో చాలా మంది ముస్లిములే, ఈ ప్రజలందరినీ పరాయివారిగా ప్రకటించి దేశంలో మైనారిటీలపై దాడులు ఎన్నిరకాలుగా జరగవచ్చునో అస్సాంలో ప్రభుత్వం చేసి చూపించింది. జాతీయ పౌర జాబితా లేదా నేషనల్ సిటిజన్ రిజీష్టర్ ప్రకారం 1971 మార్చి 21కి ముందు నుంచి అస్సాంలో ఉంటున్నట్లు ప్రతి పౌరుడు నిరూపించుకోవాలి. లేకపోతే పౌరుడిగా మిగలడు. 1971 తర్వాత పుట్టిన వారు 1971 ముందు ప్రపంచంలోనే లేరు అస్సాంలో ఉండడం సాధ్యం కాదు. వారి తండ్రి తాతలు అస్సాంలో ఉన్నట్లు వారు నిరూపించాలి. కూలినాలి జనం ఇలా నిరూపించడానికి అవసరమైన పత్రాలు సంపాదించుకోవాలి. దేశంలో మైనారిటీలను పరాయివారిగాను, శత్రువులుగాను, విలన్లుగాను ప్రచారం చేయడం ద్వారా రాజకీయలబ్ధి పొందుతూ వచ్చిన బిజేపి రానున్న ఎన్నికల్లో గెలవడానికి మతతత్వాన్ని పదును పెట్టుకుంటోంది. జాతీయ పౌర జాబితాలో పేరు లేని ఈ 40 లక్షల మందికి ఇప్పుడు పౌరులుగా హక్కులుండవు. ఓటు వేసే అవకాశం ఉండదు. వారిపై దాడులు పెరిగే అవకాశాలున్నాయి. లించింగ్ ఒక మామూలు వ్యవహారంగా మారిపోయిన నేపథ్యంలో, మూకహత్యలు పెరుగుతున్న వాతావరణంలో ఈ 40 లక్షల మంది ప్రజలు ఇప్పుడు దిక్కుతోచక బిక్కుబిక్కు మంటూ గడిపే పరిస్థితి నెలకొంది.
ఎన్నార్సీ ప్రచురణ విషయంలో సుప్రీంకోర్టు కూడా గట్టిగా చెప్పిందన్నది నిజమే. డిసెంబరు 31వ తేదీ లోపునే ఈ కార్యక్రమం ముగించాలని చెప్పింది కూడా నిజమే. కాని పౌరుల గుర్తింపు ప్రక్రియ మొత్తం ఎలా జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. అస్సాంలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించడంలో నిజాయితీగా వ్యవహరించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అస్సాంలో 3,29,91,384 మంది ఎన్నార్సీలో నమోదు కోసం ధరఖాస్తులు చేసుకుంటే, 2,89,83,677 మంది పేర్లు నమోదు అయ్యాయి. 40,07,707 పేర్లు తిరస్కరించారు. ఇవన్నీ కేవలం నెంబర్లు కాదు. ప్రాణంతో ఉన్న మనుషులు వీళ్ళంతా. ప్రపంచంలో ఇంత భారీస్థాయిలో పౌరసత్వ నిర్ధారణ మరెక్కడా జరగలేదు. పార్లమెంటులో రాజ్ నాథ్ సింగ్ గారు హోం మంత్రిగా ఇది తుది జాబితా కాదు, డోంట్ వర్రీ అభ్యంతరాలు చెప్పుకోడానికి అవకాశం ఇస్తాం అన్నారు. కాని, జులై 30వ తేదీ, ఉదయం 10 గంటలకు ఎన్నార్సీ విడుదల చేసిన కొన్ని నిముషాలకే మణిపూర్ ముఖ్యమంత్రికి సలహాదారుడిగా ఉన్న బిజేపి వ్యూహకర్త రజత్ సేఠీ మాట్లాడుతూ ఎన్నార్సీ ద్వారా అస్సాంలో అక్రమంగా ఉంటున్న 40 లక్షల మంది బంగ్లాదేశీలను గుర్తించాం అని ప్రకటించాడు. అంటే, అర్ధమేమిటి, రాజ్ నాథ్ సింగ్ కంటితుడుపుగా అభ్యంతరాలు తీసుకుంటాం, ఇది ఫైనల్ జాబితా కాదని చెబుతున్నప్పటికీ, బిజేపి నేతలు ఇది ఫైనల్ జాబితాగాను, ఈ 40 లక్షల మంది అక్రమంగా అస్సాంలో ఉంటున్న బంగ్లాదేశీలుగాను నిర్ధారణకు వచ్చేశారని సేఠీ మాటల వల్ల తెలియడం లేదా?
ఇప్పుడు అందరూ తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలి. తమ దేశభక్తిని కూడా రుజువు చేసుకోవాలి. ముస్లిములైతే తప్పనిసరిగా ముందు ఇవి రుజువు చేసుకోవాలి. ఎన్నార్సీ ప్రహసనం ఎంత గొప్పగా జరిగిందో చెప్పడానికి కావలసినన్ని ఉదాహరణలున్నాయి. కామరూప్ జిల్లాలోని ఫారినర్స్ ట్రిబ్యునల్ ముహమ్మద్ అజ్మల్ హక్ పౌరసత్వం నిరూపించుకోవాలని 2016లో నోటీసు పంపించింది. బంగ్లాదేశ్ నుంచి ఆయన అక్రమంగా వచ్చాడని పోలీసు రిపోర్టు తర్వాత ఈ నోటీసు ఇచ్చారు. అజ్మల్ హక్ భారతసైన్యంలో 1986లో చేరారు. 2016లో రిటైరయ్యారు. 30 సంవత్సరాలు సైన్యంలో సేవలందించిన మాజీ సైనికాధికారికే పౌరసత్వం నిరూపించుకోక తప్పలేదు. ఆయన ఊరిలో మరో 40 మందికి కూడా నోటీసులు వెళ్ళాయి. వారంతా భారత పౌరులేనని అజ్మల్ హక్ అన్నారు. తాను ముస్లిం కావడం వల్లనే ఈ వేధింపులు ఎదురవుతున్నాయని భావించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని చాలా బాధపడుతూ చెప్పాడు. ఇది ఒక్క అజ్మల్ హక్ సంఘటన మాత్రమే కాదు, సైన్యం నుంచి రిటైరయిన మరో హవల్దార్ మహీరుద్దీన్ అహ్మద్ అతని భార్య ఇద్దరు అక్రమ బంగ్లాదేశీలని ముద్రవేశారు. మహీరుద్దీన్ అన్నయ్య రిటైర్డ్ సెషన్స్ జడ్జి. విచిత్రమేమంటే మహీరుద్దీన్ తండ్రి పేరు లిస్టులో ఉంది, సోదరుల పేర్లున్నాయి. కాని ఇతని పేరు లేదు. ఎంత నిర్లక్ష్యంగా ఈ జాబితా తయారైందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారు, చదువుకున్నవారు, ఆర్మీలో ఉన్నవారికి కూడా వేధింపులు తప్పనప్పుడు సాధారణ ప్రజలు, కూలినాలి ప్రజలు తమ పౌరసత్వం నిరూపించుకునే పత్రాలు దాఖలు చేయడం సాధ్యమా? నవంబర్ 29, 2016న అర్ధరాత్రి మోర్జినా బీబీని అక్రమ బంగ్లాదేశీ అని అరెస్టు చేశారు. డిటెన్షన్ సెంటరు పేరుతో ఉన్న జైల్లో పారేశారు. జులై 2017న ఆమె తన పౌరసత్వాన్ని నిరూపించుకుని బయటపడగలిగింది. ఆమెకు నష్టపరిహారం ఎవరివ్వాలి? ఆమె అదృష్టవశాత్తు పౌరసత్వం నిరూపించుకోగలిగింది. నిరూపించుకోలేక అలమటిస్తున్నవారెంతమంది? 18 సంవత్సరాల రూహుల్ అమీన్ కథ మరింత విషాదకరమైనది. అతని తల్లిదండ్రులు ఇద్దరిని అక్రమ బంగ్లాదేశీలని వేర్వేరు డిటెన్షన్ క్యాంపుల్లో బంధించారు. అమీన్ మాత్రం అరెస్టు కాలేదు. అమీన్ చదువు మానేశాడు. కోర్టు కేసులకు ఇల్లు వాకిలి అమ్ముకున్నారు. పౌరసత్వం నిరూపించుకోడానికి ఇల్లు వాకిలి, పొలం పశువులు అన్నీ అమ్ముకుని దరిద్రులుగా మారుతున్నారు. ఫారినర్స్ ట్రిబ్యునల్ లో పౌరసత్వం నిరూపించుకున్న వారి పేర్లు కూడా ఇప్పుడు ఎన్నార్సీలో కనబడడం లేదని ఆరోపణలున్నాయి. మరోవైపు ఫారినర్స్ ట్రిబ్యునల్ లో విదేశీయుడిగా నిర్ధారణ అయిన వ్యక్తుల పేర్లు ఎన్నార్సీలో వచ్చాయని కూడా ఆరోపణలొచ్చాయి.
అస్సాంలో అక్రమ బంగ్లాదేశీలన్న సమస్య చాలా దశాబ్దాలుగా ఉంది. రాజకీయ పార్టీలు విద్వేషాలు రెచ్చగొట్టి ప్రయోజనాలు సాధించుకుంటూ వస్తున్నాయి. అక్రమ బంగ్లాదేశీలను గెంటేస్తామని చెప్పే బిజేపి అస్సాంలో అధికారంలోకి వచ్చింది. అక్రమ బంగ్లాదేశీల విషయంలో బిజేపి కేవలం ముస్లిములను మాత్రమే గెంటేస్తామని, హిందువులకు పౌరసత్వం ఇస్తామని కూడా చెప్పింది. అస్సాం గణసంగ్రామ్ పరిషద్ ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోంది. బంగ్లాదేశీలు హిందువులైనా, ముస్లిములైనా అందరు విదేశీలయులే అంటుంది. అస్సాంలో విదేశీయులను గుర్తించడానికి ఇప్పుడు ప్రజలనే వారి పౌరసత్వాన్ని నిరూపించుకోమంటున్నారు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలున్న అస్సాం నటుడు ఆదిల్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు కూడా వేధింపులు తప్పలేదు. ఆదిల్ హుస్సేన్ అన్న ప్రముఖ లాయర్, మాజీ శాసనసభ్యుడు మునవ్వర్ హుస్సేన్ కూడా అనుమానస్పదుడే అయ్యాడు. పద్మశ్రీ అలీ అహ్మద్ కుటుంబసభ్యులకు కూడా వేధింపులు తప్పలేదు. మొదటి ముసాయిదాలో భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కుటుంబ సభ్యుల పేర్లే లేవు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మేనల్లుడు జియావుద్దీన్ అలీ అహ్మద్, ఆయన భార్య అకిమా బేగం, వారి కుమారులు హబీబ్ అలీ, వాజిద్ అలీల పేర్లు లేవు.
కుటుంబంలో అందరు అన్ని పత్రాలు సమర్పించినా కొందరి పేర్లు జాబితాలో లేవు. ఎందుకు లేవో కారణాలు చెబుతూ ఇదంతా వెబ్ సైటులో పెట్టవచ్చు కదా. కాని అలా చేస్తే రాజకీయ పార్టీల స్వార్థపు ఎత్తుగడలు అందరికీ తెలిసిపోతాయి. ఎన్నార్సీలో పేర్లు లేనివారిలో బిజేపి ఎమ్మెల్యే దిలీప్ పాల్ భార్య అర్చనా పాల్ పేరు కూడా ఉంది. అంటే ఆమె అనుమానస్పద ఓటరు కింద ప్రస్తుతం పరిగణించాలి. పొరబాట్లు జరగవచ్చని, తర్వాత అభ్యంతరాల్లో తన భార్య పేరు కూడా సిటిజన్ షిప్ రిజీష్టరులో వస్తుందని పాల్ అన్నారు. ఆయన బిజేపి ఎమ్మెల్యే కాబట్టి బహుశా తేలికగా ఈ పని చేయించుకోవచ్చు. కాని కూలినాలి, బడుగు ప్రజలు ఏం చేయాలి?
కాంగ్రేస్ ఎమ్మెల్యే అతావుర్ రహ్మాన్ మజర్ భయ్యా, ఏఐయుడిఎఫ్ నాయకుడు సమీముల్ ఇస్లాం ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా లేవు. సాయిరా బాను ఇండ్లలో పనిపాటలు చేసుకుని బతుకుతుంది. ఆమె పేరు, ఆమె కుమార్తె పేరు జాబితాలో ఉన్నయి కాని భర్త పేరు లేదు. ఇద్దరు కొడుకుల పేర్లు లేవు. ఈ నిరుపేద కుటుంబం ఫారినర్స్ ట్రిబ్యునల్ లో పోరాడి విజయం సాధించగలదా? 64 సంవత్సరాల అబ్దుల్ లతీఫ్ సోదరుల పేర్లు జాబితాలో ఉన్నాయి కాని ఆయన పేరు లేదు. ముహమ్మద్ మీరాజ్ అలీ కుటుంబంలో అందరి పేర్లు జాబితాలో వచ్చాయి కాని ఆయన భార్య పేరు రాలేదు. ఒకే కుటుంబంలో అందరూ ఒకేమాదిరిగా పత్రాలు సమర్పించినా కొందరి పేర్లు జాబితాల్లో లేవు. ఇలా జరిగిన కేసులన్నీ దాదాపుగా ముస్లిములకు సంబంధించినవే.
విచిత్రమేమంటే, అక్రమ బంగ్లాదేశీలని ముద్రవేయడం జరుగుతోంది. కాని వారిని అక్రమ బంగ్లాదేశీలుగా నిరూపించవలసిన బాధ్యత ప్రభుత్వం స్వీకరించడం లేదు, దానికి బదులు ప్రజలనే తమ పౌరసత్వం నిరూపించుకోమంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి ముస్లిములు 1971 బంగ్లా యుద్ధం తర్వాత అస్సామ్ లో ఎందుకు చొరబడతారు. బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ దేశమైనప్పుడు అక్కడి నుంచి ముస్లిం మైనారిటీ దేశంలోకి ఎందుకు వస్తారు?
నిజానికి ముస్లిములు అస్సామ్ లోకి వలస రావడం అన్నది 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీనికి కారణం బ్రిటీషువారి విధానం. అధికపంటలు పండించడానికి బెంగాల్ కు చెందిన ముస్లిములు వ్యవసాయక్షేత్రాలలో కష్టించి పనిచేసే రైతులని బ్రిటీషు ప్రభుత్వం అస్సాం లో అందుబాటులో ఉన్న విశాల భూభాగాలను సాగు చేయడానికి తరలించారు. ఇరవయ్యో శతాబ్దం మొదటి దశాబ్దాలలో ఈ వలసలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. 1951 నాటికి అస్సాంలో ముస్లిం జనాభా 24 శాతానికి చేరుకుంది. స్వతంత్రం తర్వాత అస్సాంకు ముస్లిములు వలస వెళ్ళడం అన్నది దాదాపు లేదని చెప్పాలి. అంతకు ముందు అస్సాం తరలి వచ్చిన బెంగాలీలు తమ మాతృభాషను కూడా వదిలేసి అస్సామీ మాతృభాషగా స్వీకరించారు.
కాని అస్సాంలో ముస్లిములను బెంగాలీలని వేధించడం కొనసాగుతూ వచ్చింది. అస్సాం ఉద్యమకాలంలో ఊచకోతలు జరిగాయి. ఫిబ్రవరి 14, 1983లో దరాంగ్ జిల్లాలోని చౌల్ఖువాలో 500 మంది బెంగాలీ ముస్లిములు చంపబడ్డారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన నెల్లిలో 3,300 మంది ముస్లిముల ఊచకోత జరిగింది. హతమైనవారిలో పిల్లలు, మహిళలే ఎక్కువ. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చారన్న సాకుతో కొనసాగిన ఊచకోతలివి. ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగాయి. ప్రతిసారీ అక్రమ బంగ్లాదేశీ చొరబాటు అన్న సాకు ప్రచారంలోకి వచ్చింది. 2012లో జరిగిన ఖోఖ్రాజార్ హింసాకాండకు కూడా ఇదే సాకు. ఇప్పుడు చాలా సాధుస్వభావిగా కనిపిస్తున్న ఎల్. కే. అద్వానీ అప్పుడు ఖోఖ్రాజార్ హింసాకాండ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ భారతీయులకు, విదేశీయులకు మధ్య జరిగిన ఘర్షణగా పేర్కొన్నాడు. లక్షలాది ప్రజలు నిర్వాసితులైన సంఘటనలో, వందలాది మంది ఊచకోతలకు గురైనప్పుడు వారంతా విదేశీయులన్నట్లు ఒక సీనియర్ బిజేపి నాయకుడు మాట్లాడాడు. ఆ తర్వాత నిర్వాసితుల పత్రాలను పరిశీలించారు. ఒక్క బంగ్లాదేశీ కూడా లేడు.
అస్సాం ఉద్యమం ప్రధాన డిమాండ్లలో ఒకటి నేషనల్ రిజీష్టర్ ఆఫ్ సిటీజన్స్ ను అప్ డేట్ చేసి అక్రమ బంగ్లాదేశీలను గుర్తించాలన్నది. అస్సాం ఉద్యమ నాయకులు అక్రమ బంగ్లాదేశీలన్న ప్రచారంతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారు కాని ఎన్నడూ ఎన్నార్సీ అప్ డేట్ చేయలేదు. అస్సాంలో ముస్లిమలను విదేశీయులని వేధించడం సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోంది. డిసెంబర్ 2016 నాటికి 4,68,934 కేసులు ఫారినర్స్ ట్రిబ్యునల్ సమక్షంలో ఉన్నాయి. అందులో కేవలం 2,69,522 కేసులు డిస్పోజ్ చేశారు. 80,194 మంది విదేశీయులని తేల్చారు. అందులో 26,026 మంది ప్రవాసులుగా గుర్తించారు. అంటే అనుమానితుల్లో చాలా తక్కువ మంది మాత్రమే విచారణల తర్వాత విదేశీయులుగా తేలింది. కాని వేధింపులు చాలా మంది ఎదుర్కున్నారు. మరో విషయం ఏమంటే, ట్రిబ్యునల్ విదేశీయుడిగా నిర్ధారించినంత మాత్రాన ఆ వ్యక్తి అక్రమంగా దేశంలో ప్రవేశించినట్లు కూడా కాదు. పత్రాల్లో ఉన్న పేరులో స్పెల్లింగ్ తేడాలు, వయసు తదితర కారణాల వల్ల ట్రిబ్యునల్ ఇలా ప్రకటించడం జరిగిన కేసులున్నాయి. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, కుటుంబంలో ఒక్క సభ్యుడు తప్ప మిగిలిన సభ్యులందరు భారత పౌరులే ఉంటారు. ఇలా వేధింపులకు గురవుతున్న చాలా మంది నిరుపేదలు, కూలీలు, నిరక్షరాస్యులు. తమ పౌరసత్వం నిరూపించుకోడానికి అవసరమైన పత్రాలను సమర్పించలేనివారు. ఇలాంటి వారు న్యాయవాదులను ఆశ్రయిస్తున్నారు. న్యాయవాదులకు తమ వద్ద ఉన్న భూమి, ఇల్లు వగైరా అమ్మి ఫీజులు చెల్లిస్తున్నారు. ఈ న్యాయవాదులు డబ్బు సంపాదనే ప్రధానంగా వ్యవహరిస్తున్నారు తప్ప న్యాయం కోసం నిలబడడం లేదు. ట్రిబ్యునళ్ళలో సాంకేతిక కారణాల వల్ల అంటే పత్రాల్లో పేరు సరిగా లేకపోవడం, పత్రాలు సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల విదేశీయులుగా తీర్పులు వస్తున్నాయి. ఎందుకంటే బ్రిటీషు కాలం నాటి చట్టం ది ఫారినర్స్ యాక్ట్ 1946 క్రింద విచారణలు జరుగుతున్నాయి. ఈ చట్టం ప్రకారం అనుమానితుడు స్వయంగా తన పౌరసత్వం నిరూపించుకోవాలి. ప్రభుత్వం బాధ్యతేమీ ఉండదు. ఎన్నార్సీ అప్ డేట్ చేయడం వల్ల ముస్లిములు వేధింపులకు దూరంగా ఉండగలమని కూడా ఆశించారు. కాని పెద్ద సంఖ్యలో ముస్లిముల పేర్లే ఇప్పుడు జాబితాలో రాలేదు. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ పేరు జాబితాలో రాని కేసులు ఎన్నో ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ జాబితా సిద్దమయ్యిందన్నది నిజమే. కాని, ఎన్నార్సీ తయారు చేసిన అధికారులు బిజేపి నేతల అధీనంలో పనిచేసేవారు. బిజేపి నేతలు ముస్లిముల పట్ల ప్రదర్శిస్తున్న వైరం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అస్సాంలో ముస్లిములకు వ్యతిరేకంగా విద్వేష ప్రచారం చేసి బిజేపి అధికారంలోకి వచ్చిందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ అనుమానాలను మరింత బలపరిచేలా బిజేపి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ సభ్యులను కలిసి జాతీయ ప్రయోజనాల కోసం పనిచేసే బంగారు అవకాశం ఇప్పుడు వచ్చిందని ఈ అవకాశాన్ని చేజారనీయరాదని అన్నారట. ఇంతకాలం అస్సాంను పాలించిన ప్రభుత్వాలు జాతి వ్యతిరేకమైనవా? లేక బిజేపి ముఖ్యమంత్రి ఫారినర్స్ ట్రిబ్యునల్ సభ్యులకు నర్మగర్భంగా బిజేపి ఎజెండాను సూచించారా?
ఈ జుడిషియల్ అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిన రెండు సంవత్సరాల కోసం నియమించబడిన వారు. జూన్ 21, 2017వ తేదీన రాష్ట్రప్రభుత్వం 19 మందికి కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత బయటి దారి చూపించింది. అంతేకాదు, మరో 15 మంది పనితీరు మెరుగుపరచుకోవాలని హెచ్చరించింది. కాంట్రాక్ట్ పొడిగింపు నిరాకరించబడిన 19 మంది హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసంది. జుడిషియల్ అధికారుల పనితీరును మదింపు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, గౌహతీ కోర్టు మాత్రమే ఆ పని చేస్తుందని తీర్పు చెప్పింది. ఈ 19 మంది జుడిషియల్ అధికారులు పత్రాలు సక్రమంగా ఉంటే భారతీయులని నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పిన వారని తెలుస్తోంది. బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫారినర్స్ ట్రిబ్యునల్స్ తీర్పుల్లో చాలా మార్పు వచ్చేసింది. 1985 నుంచి 2016 వరకు కేవలం 80,194 మందిని మాత్రమే విదేశీయులుగా ప్రకటించడం జరిగితే, 2016 నుంచి 2017 వరకు ఆ సంఖ్య ఒక్కసారి 93,628కి చేరుకుంది. కేవలం 11 నెలల్లో 13,434 మందిని విదేశీయులుగా ప్రకటించారు.
ఎన్నార్సీ మొదటి ముసాయిదా ప్రచురించినప్పుడు వెంటనే బిజేపి ఎమ్మెల్యే ఈ ముసాయిదాలో చాలా మంది బంగ్లాదేశీల పేర్లు లేవన వ్యాఖ్యానించాడు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే అలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు? మరో బిజేపి పార్లమెంటు సభ్యుడు ఆర్.పి.సింగ్ ప్రకారం అస్సాంలో 70 లక్షల మంది బంగ్లాదేశీ ముస్లిములున్నారట. ఎన్నార్సీ మొదటి ముసాయిదా వచ్చిన వెంటనే బిజేపి నాయకుల ఈ ప్రకటనలు చూస్తేనే అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి. అస్సాం గణసంగ్రామ పరిషద్ కూడా ఈ వైఖరిని తీవ్రంగా విమర్శించింది.
జనవరి 10వ తేదీన హసన్ అలీ అనే కూలివాడిని పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. పోలీసు కస్టడీలో మరణించాడు. ఈ లాకప్ హత్యకు వ్యతిరేకంగా మర్నాడు ప్రజలు ఆందోళన చేశారు. పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో మహీదుల్ ఇస్లాం అనే వ్యక్తి మరణించాడు. ఈ వార్తను బిజేపి మంత్రిగారి యాజమాన్యంలో నడుస్తున్న ఒక పత్రిక ఏం రాసిందంటే, ఎన్నార్సీలో పేర్లు లేని వారు హింసాత్మక ఆందోళనకు దిగారంటూ రాసింది. డిసెంబర్ 31వ తేదీన మొదటి ముసాయిదా ప్రచురించారు. పదిరోజుల పాటు ఎక్కడా ఎలాంటి ఆందోళన జరగలేదు. 10వ తేదీన లాకప్ హత్యపై జరిగిన ఆందోళనను ఎన్నార్సీకి ముడివేయడానికి కారణమేమిటి? ఎన్నార్సీ పేరుతో శాంతిభద్రతల సమస్య తలెత్తాలని బిజేపి కోరుకుందా?
జనవరి 11వ తేదీన స్వరాజ్య పత్రికలో ఎన్నార్సీ ఉద్దేశ్యాలను స్పష్టంగా రాశారు. అక్రమ బంగ్లాదేశీలను పెద్దసంఖ్యలో గుర్తిస్తే బిజేపికి రాజకీయంగా చాలా లాభమని బట్టబయలు చేసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్నార్సీ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి, జాబితాలో పేర్లు లేని వారికి న్యాయం జరుగుతుందని, ఎన్నార్సీ ప్రచురించడం వల్ల అస్సాంలో ముస్లిముల సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని కూడా చాలా మంది ఆశించారు.
ఎన్నార్సీలో అక్రమ బంగ్లాదేశీలను గుర్తించి ఆ తర్వాత ఏం చేస్తారు? అస్సాం ఆర్ధిక మంత్రి హిమంత బిస్వాస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై బంగ్లాదేశ్ తో మాట్లాడుతుందట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మాటలే చెప్పారు. అక్రమ బంగ్లాదేశీలను బంగ్లాదేశ్ పంపేస్తామన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ కూడా ఇదే చెప్పారు. అక్రమ బంగ్లాదేశీలను సరిహద్దులు దాటిస్తామన్నారు. కాని ద్వైపాక్షిక చర్చల్లో అక్రమ బంగ్లాదేశీల గురించి మాట్లాడి ఇండియా ఇప్పుడు బంగ్లాదేశ్ స్నేహాన్ని కోల్పోయే పరిస్థితిలో లేదని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. బంగ్లాదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రోహింగ్యా శరణార్ధులను పెద్ద సంఖ్యలో ఆశ్రయమిచ్చిన బంగ్లాదేశ్ వారిని వెనక్కి పంపించాలని భావిస్తోంది. ఇప్పుడు 40 లక్షల మందిని అక్రమ బంగ్లాదేశీలుగా ముద్రవేసి వారిని బంగ్లాదేశ్ స్వీకరించాలని అడిగితే భారతదేశంతో స్నేహం ఉన్నప్పటికీ హసీనా ప్రభుత్వం ఒప్పుకుంటుందా?
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పుకోదన్న విషయం ఈ రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అందుకే హిమంత బిస్వా శర్మ ఏమన్నాడంటే, ఒకవేళ బంగ్లాదేశ్ ఒప్పుకోకపోతే భారత సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం నిర్ణయం తీసుకుంటారట. కాబట్టి ముందుకు వస్తున్న పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు పౌరసత్వం లేనివారుగా ప్రకటించబడిన వారికి మరో దారి లేదు కాబట్టి వారందరిని సంఘటిత శ్రామికులుగా మార్చేస్తారట. వారికి ఓటు హక్కు ఉండదు. దేశంలో చాలా చోట్ల కూలీల అవసరం ఉంది, శ్రామికలు అవసరం ఉంది, ఇండ్లల్లో పాచిపని చేసేవారి అవసరం ఉంది. అలా వారిని ఉపయోగిస్తామన్నట్లు కొందరు మాట్లాడారు. మరోమాటలో చెప్పాలంటే పెద్ద సంఖ్యలో ప్రజలను బానిసలుగా మార్చబోతున్నారు. వారికి ఓటు హక్కు ఉండదు, వర్క్ పర్మిట్ల వంటివి చేతుల్లో పెట్టి అతి తక్కువ కూలీకి పనిచేసే బానిసలుగా మార్చేస్తారు. ఓటు హక్కు వారికి ఎలాగూ ఉండదు. వీళ్ళంతా దాదాపు ముస్లిములే కాబట్టి బిజేపికి ఇది చాలా లాభదాయకం.
అందుకే అమిత్ షా గర్వంగా యుపియే చేయలేని ఘనకార్యం ఎన్డీయే చేసి చూపించిందని అన్నాడు. కాని ఈ ఘనకార్యాన్ని ప్రతిపక్షాలే కాదు మార్కండేయ కట్జూ వంటి మేధావులు కూడా నిరసిస్తున్నారు. దేశంలో రక్తపాతానికి దారితీసేలా వ్యవహరిస్తున్నారని కట్టూ హెచ్చరించారు. ముస్లిములకు ఓటుహక్కు నిరాకరించడానికే ఇదంతా జరుపుతున్నారు. దీనివల్ల బిజేపికి రాజకీయప్రయోజనాలున్నాయని రాశారు. అస్సాం నుంచి ఎవరిని బలవంతంగా బయటకు పంపడం సాధ్యం కాదు. అసలు అలా పంపాలన్న ఆలోచన కూడా బిజేపికి లేదు. ముస్లిములకు ఓటు హక్కు లేకుండా చేయడమే అసలు ప్లాన్. అస్సాంలో పరాయివారిని భరించలేమని, అస్సాం డంపింగ్ గ్రౌండు కాదని వాదించడం బాగానే ఉంటుంది, కాని ఈ ప్రజలంతా ఇక్కడ దశాబ్దాలుగా ఉంటున్నారు. చాలా మంది ఇక్కడే పుట్టిన వారు. అమెరికాలో కోటి పదిలక్షల మంది మెక్సికన్లు అక్రమంగా నివసిస్తున్నారు. ట్రంప్ ఎన్ని మాటలు చెప్పినా వారిని అక్కడి నుంచి పంపేయడం సాధ్యం కాదు. అలాగే అస్సాంలో ఉంటున్న వారిని అక్కడి నుంచి పంపేయడం సాధ్యం కాదు. కాని విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్ల, లక్షలాది మందికి ఓటు హక్కు లేకుండా చేయడం వల్ల నెల్లి లాంటి పరిస్థితులు తలెత్తవచ్చని ఆయన హెచ్చరించాడు.
ఈ హెచ్చరికలో అతిశయోక్తి ఏదీ లేదనిపిస్తోంది. ఎందుకంటే, బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ వలసదారులందరినీ కాల్చి చంపాలని చెప్పాడు. అక్రమవలసదారులు మర్యాదగా దేశం వదిలి వెళ్ళకపోతే వారిని కాల్చి చంపడమే పద్దతన్నాడు. ఒకవైపు మూకహత్యలు నిత్యకృత్యమైన బిజేపి పాలనలో బిజేపి నేతలు కాల్చి చంపడం గురించి మాట్లాడుతున్నారు. మొన్న మరో బిజేపి నాయకుడు మేధావులను కాల్చి చంపాలన్నాడు. చంపడం గురించి మాట్లాడే నేతలు ఇప్పుడు ఎక్కువయ్యారు. మూకహత్యల నేరస్తులకు బిజేపి కేంద్రమంత్రి పూలదండలేసి సన్మానం చేసి వచ్చాడు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న మరో బిజేపి ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ఆషియన్ గేమ్స్ లో భారత బృందానికి నాయకత్వం వహించడానిక ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఇప్పుడు అస్సాంతో ఈ పరిస్థితి ముగియలేదు. తమ రాష్ట్రాల్లోనూ ఎన్‌ఆర్‌సీ గణన ప్రారంభించాలని మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో డిమాండ్లు బయల్దేరాయి. ముంబయిలోను అక్రమ బంగ్లాదేశీలను గుర్తించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన డిమాండ్ చేసింది. ఇంకా ఎన్నిలక్షల మందిని విదేశీయులుగా ముద్రవేసి ఓటు హక్కు లేకుండా చేస్తారో వేచి చూడవలసి ఉంది. ప్రపంచంలో అత్యధికంగా ఏ దేశానికి చెందని శరణార్థులు, ఓటుహక్కు లేని వారు నివసించే దేశంగా భారతదేశం మారబోతుందా?

– వాహెద్

Leave a Reply

Your email address will not be published.