నేను-మా జేజబ్బ – పాకిస్తాన్!!

నేను-మా జేజబ్బ – పాకిస్తాన్!!
రవీష్ కుమార్- ప్రస్తుతం దేశంలోని హిందీ ప్రసార మాధ్యమాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎన్.డి.టి.వి. వ్యాఖ్యాత. యు.పి లోని దాద్రీలో బీఫ్ తిన్నారనే వదంతులతో ఓ ముస్లిం కుటుంబంపై దాడి జరిగిన వార్తని కవర్ చేయడానికి ఈయన ఆ గ్రామంలో పర్యటించారు. ఆ ఘటనపై, అక్కడి ప్రజలు, ముఖ్యంగా అక్కడి హిందూ యువత ఏమనుకుంటున్నారు, అనే విషయంపై అతను ప్రధానంగా దృష్ఠి పెట్టాడు. వారిలో, ఆ మరణించిన వ్యక్తిపై సానుభూతిగానీ, ఆ ఘటనపై ఏమాత్రం పశ్చాత్తాపంగానీ లేకపోవడాన్ని చూసి తీవ్రంగా చలించిపోయాడు. తన ఆవేదనను ‘ఓ విరిగిన కుట్టుమిషన్, ఓ హత్య, పత్తాలేని పశ్చాత్తాపం ‘ అనే శీర్షికన వ్యాసరూపంలో రాశాడు. దీనిని బి.బి.సి. సహా ఇతర అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. తాను మాట్లాడిన యువకులందర్లోనూ మైనారిటీల పట్ల ఓ రకమైన వ్యతిరేకత అంతర్లీనంగా ఉందనీ, చివరికి ఓ యువకుడు – “1947 దేశవిభజన సమయంలో ముస్లింలకోసం పాకిస్తాన్ ఏర్పాటు చేశారు కదా, అయినా వీరందరూ ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నారని” కెమెరా ముందే అడగటంతో, తాను అవాక్కయ్యాననీ ఆయన వ్యాసంలో రాశాడు. యువకుల్లో ఇలాంటి వ్యతిరేక భావనలు పెరిగిపోవడం సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదనీ, వీటిని మొగ్గలోనే తుంచేయకుంటే ఇవి తీవ్రపరిణామాలకు దారితీసే అవకాశం ఉందనీ, దీనికి సమాజంలోని ఆలోచనాపరులందరూ కృషి చేయాలని విఞప్తి చేశాడు.
“మీకు సమాన హక్కులు కావాలంటే, పాకిస్తాన్ వెళ్ళిపోండి”, “బీఫ్ తినాలనుకుంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి”, “వందేమాతరం పాడటం ఇష్టం లేకుంటే,పాకిస్తాన్ వెళ్ళిపోండి” ఇలాంటి మాటలు ఈమధ్య తరచుగా వినిపిస్తున్నాయి. చరిత్ర, దేశ విభజన లాంటి అంశాల గురించి అసత్యాల్ని, అర్థ సత్యాల్ని ప్రచారం చేసి, యువకుల మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నం కొన్ని సంఘాలు, గ్రూపులు చేస్తున్నాయి. ముస్లింలకు పాకిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటు చేశాక కూడా, వీరు ఇక్కడే ఉండి, మాకు సమాన హక్కులు కావలని అడగటం, మా మనోభావాల్ని గాయపర్చేలా బీఫ్ తినాలని చూడటం ఏంటనే విషయం, నిజానికి వినడానికి ఎవరికైనా సహేతుకంగానే అనిపిస్తుంది. కావున దీనిని కాస్త లోతుగా విశ్లేషిన్చాల్సిన అవసరం ఉంది.
నేను పుట్టింది 1981లో, మా నాన్న పుట్టింది 1950లో. కాబట్టి దేశవిభజనతో మాకు ప్రత్యక్ష సంబంధం లేదు. ఎవరైనా అడగాలనుకుంటే, దేశవిభజన సమయంలో నువ్వు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళలేదని మా జేజబ్బని అడిగి ఉండవచ్చు. ఆయన 1987లోనే మరణించారు కాబట్టి, నిరక్షరాస్యుడు కావడంతో, డైరీలు గట్రా లాంటివేమీ రాయలేదు కాబట్టీ, ఆయన ఎందుకు వెళ్ళలేదనే విషయం కశ్చితంగా తెలిసే ఆస్కారం లేదు. కాకపోతే, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా విశ్లేషిస్తే దానికి సమాధానం దొరికే అవకాశం ఉంది.
-ఆయన కడప,నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న, నరసాపురం అనే మారుమూల కుగ్రామంలో జన్మించారు. మరణానంతరం అక్కడే ఖననం చేయబడ్డారు.
-ఓ పూరి గుడిసె తప్ప ఆయనకు ఇతర ఆస్తులు గానీ,పొలాలు గానీ లేవు. జీవితాంతం ఆ గ్రామంలోని రెడ్ల పొలాల్లో కూలీగానే పనిచేశారు.
-ఆయనకు బాగా తెలిసిన భాష తెలుగు మాత్రమే. హింది,ఉర్దు భాషల్లో కొన్ని,కొన్ని పదాలు మాత్రమే పరిచయం.
– ఆయనకు అరబిక్ సూరాలు గానీ,నమాజు చేసే విధానం గానీ తెలియదు. కేవలం, రంజాన్, బక్రీద్ లాంటి పండగలప్పుడు మాత్రమే మసీదుకు వెళ్ళేవాడు.
– ఆయన స్థోమతకు గొడ్డు మాంసం మాత్రమే అందుబాటులో ఉండింది. పొట్టేలు మాంసం పండగలప్పుడో, చుట్టాలు వచ్చినప్పుడో మాత్రమే తినగలిగేవాడు.
ఈ అంశాల ఆధారంగా మనం కొన్ని నిర్ధారణలకు రావచ్చు.
1. చాతుర్వర్ణ వ్యవస్థ మూలంగా సమాజం నుండి దూరంగా వెలివేయబడ్డ నిమ్న కులాలు, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రధానంగా బోధించే ఇస్లాం,క్రైస్తవ మతాల పట్ల ఆకర్షితులు అయ్యారనేది ఇప్పటికే రుజువైన అంశం. మా జేజబ్బ కూడా అలా ఇస్లాం లోకి మారిన మొదటి లేక రెండవ తరం వ్యక్తి.
2. సహజంగా, ఓ డబ్బున్న వ్యక్తి మతం మార్చుకుంటే, అతను కొత్త మతాచారాలను సాధ్యమైనంత త్వరగా నేర్చుకుని, అమలు చేయడానికి ప్రయత్నిస్తాడు.దానితో అతని జీవిత విధానంలో త్వరిత మార్పులు చూడవచ్చు. దీనినే ఇంగ్లీష్ లో న్యూ కన్వర్ట్స్ జీల్ అంటారు. కానీ, ఓ పేద వ్యక్తి విషయంలో, వనరుల లేమి కారణంగా, ఈ మార్పు రావడానికి చాలా కాలం పట్టవచ్చు. మా జేజబ్బ విషయంలో దీనిని స్పష్టంగా చూడొచ్చు.
సరే మరి ఆయన పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళలేదు అనే విషయాన్ని చూద్దాం. ‘బ్రిటీష్ వారు మన దేశాన్ని దోచుకున్నారు ‘అని ఇప్పటి తరంలో మనం అనుకుంటున్నాం. మరి అప్పటి తరంలో అందరూ కూడా అలాగే అనుకునే వారా? తనకంటూ ఏ ఆస్తి,అస్థిత్వమూ లేక, అగ్రవర్ణాల దయాదాక్ష్యిణ్యాలపై ఆధారపడ్డ నిమ్న వర్గాల వారికి, ఈ దేశం తమదనీ, తమ దేశాన్ని బ్రిటీష్ వారు దోచుకుంటున్నారనీ అర్థం చేసుకునేంత అవగాహన ఉండేదా? అసలు తాము ఈ దేశానికి చెందినవారిమనీ, ఈ దేశం తమకు చెందినదనే స్పృహ వారికి ఉండేదా? క్విట్ ఇండియా, సైమన్ కమీషన్, ద్విజాతి సిద్ధాంతం లాంటివి మనకు సుపరిచిత పదాలు. కానీ, ప్రసార మాధ్యమాలు అంతగా అభివృద్ది చెందని ఆ రోజుల్లో, నిరక్షరాస్యులైన మారుమూల దలిత ప్రజలకు వీటి గురించి తెలిసే అవకాశం ఏ మాత్రం లేదు. నువ్వు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళలేదు, అని ఎవరైనా అడిగి ఉంటే, పాకిస్తానా, అది ఎక్కడుంది అని ఆయన అడిగిఉండేవాడు. దేశ విభజన అనేది బ్రిటీష్ వారికీ, దేశంలోని ఉన్నత వర్గాల నాయకులకీ మధ్య జరిగిన ఒప్పందం తప్ప, ఈ చర్చల్లో సగటు ప్రజానీకం పాత్ర ఎంత? మహమ్మద్ ఆలీ జిన్నా కూడా, ఇస్లాం స్వీకరించిన గుజరాత్లోని సంపన్న మార్వాడి కుటుంబానికి చెందిన వ్యక్తి అనే అంశం ఇక్కడ గమనార్హం. తన అభిప్రాయంతో ఏమాత్రం సంబంధం లేని, తనకు కనీస అవగాహనకూడా లేని ఓ ఒప్పందం గురించి, ఓ వ్యక్తిని నిందించడం పూర్తిగా అసంబద్ధం. ఇది మా జేజబ్బ ఒక్కడి గురించే కాదు. ఈ రకంగా ఇస్లాం స్వీకరించి, ముస్లింలుగా మారిన నిమ్నజాతుల ప్రజలు దేశంలోని ప్రతి గ్రామంలోనూ, మారుమూల పల్లేల్లోనూ, అడుగడుగునా మనకు కనిపిస్తారు. వీరికి పాకిస్తాన్ ఏర్పాటుతో గానీ, అప్పటి రాజకీయాలతోగానీ ఏమాత్రం సంబంధం లేదు.
దేశ విభజన తర్వాత, అదృష్ఠవశాత్తూ డా.అంబేద్కర్ గారి అధ్యక్షతన రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం, దేశంలోని ప్రజలందరికీ వారు పుట్టిన కులమతాలతో సంబంధం లేకుండా సమాన హక్కులు,బాధ్యతలూ కల్పించింది. దేశంలోని ముస్లింలు కూడా మిగతా అన్ని వర్గాలలాగే, చట్టబద్ధంగా మెలుగుతూ, సారే జహాసె అచ్చా, హిందూ సితా హమారా అనే స్పూర్తిని పునికి పుచ్చుకుని జీవిస్తున్నారు. కానీ, ఈ విధానం నచ్చని కొన్ని అల్లరి మూకలు, జాతీయతా భావానికి సంకుచిత అర్థాలు తీస్తూ, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా, మైనారిటీలకు ఇవ్వబడిన సమాన హక్కుల్ని కాలరాయాలని ప్రయత్నిస్తున్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నచ్చని వారు, తమ భావజాలానికి తగ్గట్లు, ప్రత్యేక సంఘిస్తానో, ప్రత్యేక సేనాస్థానో కావాలని ఉద్యమాలు లేవదీసుకోవచ్చు. అంతేతప్ప, రాజ్యంగానికి లోబడి, చట్టబద్ద పౌరులుగా జీవిస్తున్న వారిని దేశంవిడిచి వెళ్ళమని అడిగే అధికారం ఎవరిచ్చారు? ఇలాంటి పెడధోరణుల్ని ఆదిలోనే అడ్డుకొకపోతే, ఇది భవిష్యత్తులో మరిన్ని జటిల సమస్యల్ని సృష్ఠించే ప్రమాదం ఉంది. దేశంలోని ఆలోచనాపరులందరూ, దీనికి అణుగునంగా , ప్రజల్ని చైతన్యవంతుల్ని
చేయాల్సిన అవసరం ఉంది

Leave a Reply

Your email address will not be published.