పర్ఫెక్ట్ రేషనలిస్టు : నేరము – శిక్ష

పర్ఫెక్ట్ రేషనలిస్టు : నేరము – శిక్ష
========================
(Continuation to my earlier post)
ఇక్కడ అసలు పాయింట్ – నేరం చేయగలిగే స్థితిలో ఉండికూడా, ఓ వ్యక్తి నేరం చేయకుండా ఆపే డిటరెంట్ ఫ్యాక్టర్ ఏమిటి అనేది.
దీనికి పర్ఫెక్ట్ హేతువాది ఇచ్చే(ఇవ్వాల్సిన) సమాధానం – “తరువాత పోలీసు పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి “- అని.
అప్పుడు వచ్చే నెక్స్ట్ ప్రశ్న – అన్ని నేరాల్నీ పోలీసులు పట్టుకోగలుగుతున్నారా? అనేది.

ఎందుకంటే – పోలీసులు కూడా నేరస్తుడు వదిలిన క్లూస్ ఆధారంగానే పట్టుకుంటారు తప్ప, దివ్యదృష్టితోనో, మూడోనేత్రంతోనో పట్టుకోరు. నేరస్తుడు పోలీసుల కంటే తెలివిగా ఆలోచించి క్లూస్ లేకుండా చేసి, ఎప్పటికీ పట్టుబడకుండా, Un-solvedగా మిగిలిపోయిన కేసులు కోకొల్లలు.
ఇంతా చేసి, నేరస్తుడు దొరికినా, ఏ శిక్ష విధించాలో డిసైడ్ చేసే జడ్జి గారు కూడా మానవ మాత్రుడే. ఆయనకూ, ఆయన ఫీలింగ్లు, భయాలు,బలహీనతలూ, ఆదర్శాలూ అన్నీ ఉంటాయి. ఉదాహరణకు – ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేకున్నా – ‘జాతి ఆత్మను శాంత పర్చడం’ తన బాధ్యతగా భావించిన ఓ జడ్జిగారు, 14 మంది చంపబడిన కేసులో, ముద్దాయికి ఉరిశిక్ష అమలు చేసేశారు.
మరో 97 మంది చంపబడ్డ కేసులో, స్పష్టమైన సాక్ష్యాధారాలతో నేరం నిరూపించబడినా, ‘ఉరి శిక్ష అనాగరికం’ అని భావించిన జడ్జిగారు, నేరస్తురాలికి కేవలం జీవితకాల శిక్షతో సరిపుచ్చారు. ఇప్పుడు ఆమె కావలసినప్పుడల్లా వెజెటబుల్ బిర్యానీ తింటూ, బోర్ కొట్టినప్పుడల్లా బెయిల్ పై బయటికి వస్తూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంది.)

సరే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్ధాం.

ఓ నేరం జరిగింది. పోలీసులు, జడ్జిగారు అందరు భీబత్సంగా పని చేసి నేరస్తున్ని పట్టుకున్నారు. ఉరి శిక్ష ఏసేసారు. ఈ ఉరి అమలు చేసేలోపు , మనోడు తప్పించుకుని బయటికొచ్చారు, ఉంకో రెండు మర్డర్లు, నాలుగు రేపులు చేశాడు. అప్పుడు పోలీసులు మల్లీ భీబత్సంగా పనిచేసి, ఆడ్ని పట్టుకుని జడ్జి గారి ముందు నిలబెట్టారు.

ఇప్పుడు ఆ జడ్జిగారు, ముందు విధించిన ఉరిశిక్షకి అదనంగా, లేటేస్ట్ నేరాల్ని పరిగణలోకి తీసుకుని- మరో ఆరు ఉరిశిక్షల్ని విధించగలరా? అలా విధించలేని పక్షంలో, ఆ ముద్దాయి తరువాత చేసిన నేరాలకు తగిన శిక్ష ఏమిటి?

సరే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ –

ఓ తెలివైన సాఫ్ట్వేర్ ఇంజినీర్, కష్టపడి పని చేయడం కంటే, దొంగతనం చేసి సంపాదించడం వీజీ అనుకున్నాడు. తన మేధస్సును ఉపయోగించి అనేక దొంగతనాలు చేస్తూ దర్జాగా, విలాసవంతంగా బతికాడు. అలా తన యవ్వనమంతా గడిచిపోయింది. వయసు మల్లాక, మనోడికి బి.పి, షుగరు అన్నీ వచ్చేశాయి. డాక్టరు – ఉప్పూ,కారం తినొద్దు-నూనెలు లేని చపాతీ తినాలి, అది కూడా రోజూ కొంచెమే తినాలి, లాంటి అనేక ఆంక్షలు చెప్పారు. అసలే జనాల సొమ్ము అడ్డంగా మెక్కడం అలవాటైన మనోడికి, ఇవన్నీ ఫాలో కావడం యమా కష్టంగా ఉండింది. ఇట్టాంటి పరిస్థితుల్లో – ఓ శుభదినాన – “నేరస్తుడు ఎప్పటికీ తప్పించుకోలేడు- అంతిమంగా న్యాయమే గెలుస్తుంది” అనే జగ్గయ్య డవిలాగు నిజమైపోయి, అతను పోలీసులకి పట్టుబడ్డాడు. జడ్జిగారు అతనికి – ఉప్పూ,కారం లేని చిప్పకూడు, వారానికో కేవలం ఓ గుడ్డు, ఆయిల్ లెస్ చపాతీలు, పండగలప్పుడు మాత్రమే పలావు ఇచ్చేలా ఓ ఏడేల్ల కఠినకారాగార శిక్ష విధించేశారు. ఈ తీర్పు విని మనోడి ముఖంలో ఓ చిరునవ్వు విరిసింది. వీడు ఎందుకునవ్వుతున్నాడో అర్థం కాక, జడ్గిగారూ, పబ్లిక్ ప్రాసిక్యూటరూ కంగారు పడ్డారు.

**********************
అంచాతా, నేచెప్పొచ్చేంటంటే – మానవ నిర్మిత న్యాయవ్యవస్థ అసంపూర్ణమైనది.
“మనందరం మన వ్యవస్థను బాగు చేసుకుని, లోపాలను సరిదిద్దుకుని ఉత్తమోత్తమ వ్యవస్థను నిర్మించుకోవాలని” – తమను తాము పర్ఫెక్ట్ రేషనలిస్టులుగా ఫీలయ్యే వారు ఆవేశంగా స్పీచులు దంచుతుంటారు గానీ, అలాంటి వ్యవస్థేదీ ఇప్పటిదాకా, ఎక్కడా లేదు. “ఉందిలే మంచి కాలం, ముందు ముందునా” అని పాటలు పాడుకోవడం వరకూ ఓ.కే, కానీ, అలాంటి రోజొకటి వస్తుందని ఊహించుకునేవాడు పర్ఫెక్ట్ రేషనలిస్ట్ కాబోడు. ఎందుకంటే- ప.రే. లు కళ్ళ ముందు కనబడే వాటినే నమ్ముతారు తప్ప, ఊహాజనిత అంశాల్ని కాదు.
**********************
అదిసరే గానీ, ఇంత సోది చెప్తున్నావ్.. ఇంతకీ నువ్వు నమ్మే మతం మాత్రం ఏం న్యాయం చేసింది, ఏం పొడిచింది, ఏం ఉద్ధరించింది.. అని నన్ను కామెంట్లలో కడిగిపారేయాలని, మీలో ఇప్పటికే చాలా మంది ఫిక్స్ ఐపోయుంటారని నాకు తెలుసు.( కొందరు ఆల్రెడీ, పైన రాసింది సగమే చదివేసి, కామెంట్ కూడా రాసేసి ఉంటారు).
అయ్యా.. మతం అనేది అన్నిటికంటే గొప్పదనో, నా మతం అన్నిటికంటే గొప్పదనో, మతం అన్ని విషయాల్ని 70యం.యం. తెరమీద చూపించేస్తుందనో నేను చెప్పను. కాకపోతే, పుట్టుక, చావు వంటి వివిధ అంశాల గురించి నాకు కలిగిన అణుమానాలకు, నాకు మతం లో దొరికిన సమాధానాలతో కన్విన్స్ అయ్యాను. కొన్ని అణుమానాలు తీరాయి, కొన్ని ఇప్పట్లో తీరేవి కావని అర్థమైంది. ఆ థాట్ ప్రాసెస్ ఏమిటో ఇప్పటికే కొంచెం రాశాను.. వీలు చూసుకుని రాస్తుంటా..
తరువాత కలుద్దాం..

-మహమ్మద్ హనీఫ్.
2/12/2018.

Leave a Reply

Your email address will not be published.