పేరు మార్చుకుంటే పోలా!!

In search of Purpose-4

పేరు మార్చుకుంటే పోలా!!= ========================

“యాక్చువల్లీ, మా ఆవిడ నిన్ననే వేరే వారికి ఇచ్చేసిందంటా”

“సారీ అండీ, మా బామ్మర్ది వేరే వారిదగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడంట”

“నాకు పర్సనల్గా అభ్యంతరం లేదు. కానీ, అపార్ట్మెంట్ అసోసియేషన్ వారు ఒప్పుకోరు”

“మేము నాన్ వెజ్ తినేవారికి ఇవ్వమండీ”

ఇవీ హైదరాబాద్లో ఇల్లు వెతికేటప్పుడు నాకు కామన్ గా ఎదురయ్యే రెస్పాన్స్ లు.

ముందుగా, టులెట్ బోర్డు చూసి, ‘ఇల్లు చూడొచ్చా అండి ‘ అని అడిగినప్పుడు వారు బాగానే రెస్పాన్స్ అవుతారు. నా ఫేసు చూసి, నా తెలుగు ఉచ్చారణ చూసి వారికి ‘నేనేంటో ‘ క్లూ దొరకదు. మా వూరేది, నేనేం చేస్తుంటాను వంటి పర్సనల్ డీటైల్స్ లోనూ వారికి ఏదీ అభ్యంతరకరంగా అనిపించదు. రెంటూ, అడ్వాన్స్ వంటి వాటికి కూడా నేను పెద్దగా బేరాలాడను కాబట్టి, ఇక ఈ ఇళ్ళు ఓకే ఐనట్లే అనుకున్నంతలో, నా పేరు చెప్పాల్సి రావడం, అది వినంగానే వారి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం.. ప్రతిసారీ జరిగేతంతే. అప్పుడే పైన చెప్పిన వాటిలో ఏదో ఒక సమాధానం వినాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో ఇళ్ళువెతకడానికి వెల్తే, ప్రతి పది ఓనర్లలో కనీసం 7 మంది ఇలాగే రియాక్ట్ అవుతారు. ఇది నేను గత 10 ఏల్ల అనుభవం ఆధారంగా, ఘంటాపధంగా చెప్పగలను.

 

*******************

సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ రాగానే, నెక్స్ట్ టార్గెట్ – ఎప్పుడెప్పుడు H1Bకి అప్లై చేయించుకుని అమెరికాకు చెక్కేద్దామా అనే. ఇలా H1B అప్లై చేయించుకోవాలంటే, పాజెక్ట్ మ్యానేజర్, డెలివరీ మ్యానేజర్, ఆన్సైట్ కో ఆర్డినేటర్ లాంటి వారిని ఎలాగోలా ఇంప్రెస్ చేసి పటాయించుకుంటే సరి. కానీ, అప్పట్లో మా టీంలో ఫైజల్, ఫిరోజ్ అనే ఇద్దరికి అప్లై చేశారు గానీ, వారిని US ఎంబసీ వారు హోల్డ్ లో పెట్టారు. వీరి తర్వాత అప్లై చేసినవారికి కూడా అప్రూవల్స్ వచ్చాయి, వీరికి మాత్రం ‘హోల్డ్’ . అలా ఎన్నాల్లుండాలో కూడా తెలీదు. ” ఆల్రెడి వారిద్దరి పరిస్థితీ చూస్తున్నావ్ కదా, నీ అప్లికేషన్ కూడా అలాగే అవుద్ది. ఇప్పుడసలే రోజులు బాగాలేవు. నీకు నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. అప్పటి దాకా వెయిట్ చేయ్ “- ఇదీ నాకు మా ఆఫీస్ వారు ఇచ్చిన రెస్పాన్సు.

 

ఎందుకో అర్థమంది కదా- అంతా నా పేరు వల్ల – మహమ్మద్ హనీఫ్.

******************

 

నేను కవినో, రచయితనో అయ్యుంటే – నాకు అద్దెకు ఇల్లివ్వనందుకు, కేవలం నా పేరుతో వివక్ష చూపిస్తున్నందుకూ.. ఆ బాధనీ, ఆక్రోశాన్ని కలగలిపి ఓ ఆవేశపూరిత కవితో, ఓ మాంచి సెంటిమెంటల్ కథో రాసి ఉండేవాడిని. దానిని ఏ పత్రికలోనో అచ్చేయించుకుని, దానిని రోజూ చూస్తూ, పదిమందికి చూపించుకుంటూ మురిసిపోయుండేవాడిని. అఫ్కోర్స్ ఆ అచ్చైన కథ చూపించాక కూడా నాకు అద్దెకు ఇల్లిచ్చేవారు కాదనుకోండి అది వేరే విషయం.

 

కానీ, నేను కవిని కాను, రచయితను కాను. కేవలం ఓ పాఠకున్ని. గత పోస్టులో రాసినట్లు, రాంగోపాల్ వర్మ రాతల్ని చదివి, ప్రతి సమస్యను ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేయాలి తప్ప, ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వకూడదు అనే ప్రాక్టికల్ థింకింగ్ ని బుర్రలోకి ఎక్కించుకుని ఉన్నవాన్ని.

 

అందుకే, నాకు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన ఎవరిమీదా కొంచెం కూడా కోపం గానీ, ద్వేషం గానీ కలగలేదు. ఎందుకంటే – సిటీలో ఓ ఇల్లు సంపాదించుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అన్ని కష్టాలూ పడి, ఓ ఇల్లు సంపాదించుకుని, దానిని తీసుకెల్లి ఓ ముస్లిం చేతిలో పెట్టడమా. అతను ఎలాంటి వాడో తెలీదు, ఎవరెవరితో లింకులుంటాయో తెలీదు. అసలే అప్పట్లో సిటీలో కొన్ని వరుస బాంబుదాడులు జరిగాయి. యధాలాపంగా మన మీడియా, ఆ బాంబు బ్లాస్టులు జరిగిన రెండో రోజే కొందరు గడ్డమోల్లని దోషులుగా నిర్ధారించేసింది. ( వాటిలో చాలా ఘటనల వెనక నిజానికి బత్తాయి బ్యాచ్ ఉన్నారనేది తర్వాత తేలింది). ఇలాంటి పరిస్తితుల్లో ఎవరైనా రిస్క్ తీసుకుని ‘పరాయి ‘ వారికి ఎందుకు బాడుగకు ఇస్తారు. వారి పరిస్తితిలో ఉంటే నేను కూడా అలాగే చేసి ఉండేవాడినేమో.

 

సో, ఈ అంశం గురించి నాకు ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ కలగలేదు కానీ, ఓ విషయం మాత్రం బాగా తొలుస్తుండింది. అది – ‘పేరు మార్చుకుంటే పోలా’ అని.

 

నాకు ఇస్లాం పై అప్పటికే అంత మంచి అభిప్రాయం లేదు. అది ఔట్ డేటెడ్ అని అప్పటికే ఫిక్స్ అయి పోయి ఉన్నా. అలాంటప్పుడు గుది బండలా నాకు ఈ పేరు అవసరమా? ఈ పేరు వినగానే జనాలకు, ఏవేవో గుర్తుకొస్తున్నాయి. నాకు తెలియనివి, నాకు నచ్చనివి, నాకేమాత్రం అస్సలు సంబంధం లేనివి.. నేను చేసిన పనికి నేను జవాబుదారీగా ఉంటా, అవసరమైతే సంజాయిషీ చెప్పుకుంటా. కానీ, ఈ గుదిబండ ఏమిటీ. ఐడెంటిటీ అనేది మనుషులకు ఓ మంచి గుర్తింపునో, అవకాశాలనో తెప్పించాలి గానీ, ఇలా ఉన్న అవకాశాల్ని పోగొట్టడమేంటి, అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించడమేమిటి. ఎవరో ఏదో చేస్తే, నాకు ఇల్లు దొరక్కపోవడం , నెలకు మూడు లచ్చలు మిగలబెట్టొచ్చనీ, పబ్బుల్లో, అదేదో బట్టలిప్పే క్లబ్బుల్లో ఎంజాయ్ చేద్దామని అమెరికాకు పోదామనుకుంటే, ఆ అమెరికా వాడు రానీయకపోవడమేంటి.. ఏందిరా బై ఇదంతా.. లాభం లేదు. సమరసిం హా రెడ్డి అనో, నరసిం హ నాయుడనో పేరుమార్చుకుంటే తప్ప లాభంలేదు..

 

Stay Tuned..

Leave a Reply

Your email address will not be published.