ఫత్వా పట్టు… న్యూస్ కొట్టు

ఫత్వా పట్టు… న్యూస్ కొట్టు

-By  Abdul Wahed
ముస్లిం సముదాయంలో ప్రతిష్ఠాత్మకమైన ధార్మిక విద్యాసంస్థ దేవ్ బంద్ ఒక ఫత్వా జారీ చేసినట్లు వార్త వచ్చింది. ఆ ఫత్వా ఏంటంటే, ’’నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఇస్లామ్ కు విరుద్దమని దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఫత్వా జారీ చేసింది‘‘ అనే వార్త. అంతే ఇక భారత మీడియాకు చేతినిండా పని దొరికింది. జాతీయ మీడియాలో అనేక చానళ్ళు ఇలాంటి వార్త కోసమే కాచుక్కూర్చుంటాయి కాబట్టి వెంటనే డిబేట్లు, చర్చలు భారీ స్థాయిలో ఏర్పాటు చేశాయి. నెయిల్ పాలిష్ పెట్టుకోకూడదా? ఇదెలాంటి మధ్యయుగాల మనస్తత్వం? ఇంత మతఛాందసమా? అంటూ జోకులేసేవారు కొంతమంది. నెయిల్ పాలిష్ పెట్టుకోనివ్వకుండా మహిళలను అణగదొక్కుతున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయేవారు మరికొంత మంది. నెయిల్ పాలిష్ హక్కు ముస్లిం మహిళలకు సాధించిపెట్టకపోతే మహిళా ఉద్యమాలెందుకంటూ నిలదీసేవారింకొంత మంది. మొత్తానికి మీడియాలో సందడే సందడిగా రెండు రోజులు కాలక్షేపం చేశారు.


ఫేక్ వార్తల బండారాన్ని బయటపెట్టే ఆల్ట్ న్యూస్ వెబ్ సైటు ఈ ఫత్వా గొడవేమిటో తేల్చాలని నడుం కట్టింది. ఆల్ట్ న్యూస్ పరిశోధనలో మీడియా దిగజారుడు బయటపడింది. ఫత్వాల తయారీ కర్మాగారాలు నడుస్తున్నాయన్న వాస్తవమూ బయటపడింది.
ముస్లిం మహిళలు గోళ్ళకు నెయిల్ పాలిష్ పెట్టుకోరాదని దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఫత్వా జారీ చేసింది. ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఇస్లాం విరుద్దమని, దానికి బదులు మెహందీ పెట్టుకోవచ్చని దారుల్ ఉలూమ్ ముఫ్తీ ఇష్రార్ గోరా అన్నారంటూ ఏ ఎన్ ఐ ట్వీట్ చేసింది. అందులో ఇష్రార్ గోరా ఫోటో కూడా పెట్టింది. వార్తా సంస్థలకు నిజానిజాలతో సంబంధం ఉండదని నిరూపించిన ట్వీటిది. ఈ ట్వీట్ రాగానే చాలా మంది సోషల్ మీడియాలోనే ఈ ట్వీటును తూర్పారబట్టారు. ఎఎన్ఐ ట్వీటులో ఉన్న వ్యక్తి ముఫ్తీ కాదని నెటిజన్లు తేల్చి చెప్పరు. ముఫ్తీ అంటే ఇస్లాంకు సంబంధించి ధార్మిక విషయాలపై సలహా ఇవ్వగలిగిన ధర్మవేత్త అని అర్ధం. ఇస్లామీయ విద్యాసంస్థలు ముఫ్తీకి సంబంధించిన కోర్సులు నడుపుతాయి. దాదాపు ఆరేడు సంవత్సరాలు ఆ కోర్సు చదవవలసి ఉంటుంది. ఆ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వ్యక్తినే ముఫ్తీ అంటారు. ఎవడిని పడితే వాడిని ముఫ్తీ అనడం జరగదు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ముఫ్తీ కాదు, కనీసం అతనికి దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ తో ఎలాంటి సంబంధమూ లేదని సోషల్ మీడియాలో చాలా మంది వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తి ఎవరో కూడా గుర్తించి చెప్పారు. ఫోటోలో ఉన్న వ్యక్తి సహరాన్ పూర్ జామా మస్జిదు ఇమామ్ తమ్ముడని కూడా చెప్పారు. ఈ వార్త వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడితే ఆయన తానెలాంటి ఫత్వా ఇవ్వలేదని, తాను ఫత్వా ఇవ్వడం సాధ్యం కూడా కాదని స్పష్టం చేశాడు. కానీ దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ 1990లో ఇచ్చిన ఒక ఫత్వా గురించి మాత్రమే తనను అడిగితే చెప్పానని అన్నాడట.
కాని వార్తల్లో మాత్రం కొత్తగా తాజా ఫత్వా అంటూ ఊదరగొట్టారు. ఆల్ట్ న్యూస్ ఈ వ్యవహారం పూర్తిగా చూడాలనుకుంది. దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ తో సంప్రదించడానికి ప్రయత్నించింది. దేవ్ బంద్ సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటుంది. ఫత్వా గురించి వార్తలపై ప్రతిస్పందించడానికి దేవ్ బంద్ నిరాకరించింది. అయితే, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి దేవ్ బంద్ కు ఎలాంటి సంబంధమూ లేదని మాత్రం స్పష్టం చేసింది. ఆల్ట్ న్యూస్ ఆ తర్వాత ఈ ఇష్రార్ గోరాతోనే మాట్లాడాలని నిర్ణయించుకుంది. ఈయనే ముఫ్తీ అంటూ ఏఎన్ఐ కోట్ చేసింది కాబట్టి ఆయన్నే అడిగితే సరిపోతుంది. ఇంతకీ ఆయన పేరు ఇష్రార్ గోరా కాదు, ఇషాక్ గోరా. కనీసం పేరు కూడా సరిగా రాయడం చేతకాని వార్తాసంస్థలున్నాయిప్పుడు. అతను ముఫ్తీ కాదన్నది కూడా అల్ట్ న్యూస్ నిర్ధారించుకుంది. అలాగే అతనికి దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ తో ఎలాంటి సంబంధమూ లేదు. ఈ టీవీ ఉర్దూలో ఈ ఫత్వా గురించి ఒక వార్త వచ్చిందని, ఆ విషయమై తన అభిప్రాయాన్ని ఏఎన్ఐ అడిగిందని, ఆ ప్రశ్నకు జవాబుగా తాను మాట్లాడానని ఆయన అన్నాడు.
అంటే, ఇలాంటి ఫత్వా గురించి ఈటీవీ ఉర్దూ లో ఒక వార్త వచ్చింది. ఆ వార్తపై ఎఎన్ఐ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ ఇషాక్ గోరా జవాబిచ్చాడు. మరి ఈయనే ఫత్వా ఇచ్చినట్లు ఈ వార్తేమిటి? ఇదే విషయాన్ని ఆల్ట్ న్యూస్ ఏఎన్ఐ ఎడిటర్ను అడిగింది. ఏఎన్ఐ వెంటనే ట్వీటు మార్చుకుంది. కొత్త ట్వీటులో ఫోటో తీసేశారు. ఏం రాశారంటే, ఖారీ ఇషాక్ గోరా దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఇచ్చిన ఫత్వాపై మాట్లాడారు. ఆయనకు దేవ్ బంద్ తో ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన జమీఅత్ దావతుల్ ముస్లిమీన్ సంస్థ అధ్యక్షుడు. సహరాన్ పూర్ లో ఇమామ్. అని అప్ డేట్ పెట్టారు. ఇంతకు ముందు ముఫ్తీ అని చెప్పి తర్వాత ఖారీ అని మార్చారు. ఈ ఖారీ అంటే ఏమిటో వివరణ ఇక్కడ అవసరం లేదు. కాని నిర్ధారణ లేన వార్తలు ప్రచారం చేయడమే జర్నలిజమైతే, ఇక పుకార్లకు జర్నలిజానికి తేడా ఏముంది?
ఆయన ఫత్వా జారీ చేశాడన్నది అబద్దమని తేలిపోయింది, కాని ఫత్వా అయితే ఉంది కదా. ఏఎన్ఐ తన ట్వీటును కూడా అప్ డేట్ చేసి అసలు విషయం ఏమిటో కూడా చెప్పింది. కాని దారుల్ ఉలూమ్ ఒక ఫత్వా జారీ చేసినట్లయితే ఆయన చెప్పాడు కదా? ఆ ఫత్వా ఎక్కడుంది? ఎవరైనా దాన్ని చూశారా? ఆ ఫత్వాలో అసలేముంది? ఎఎన్ఐ చెప్పినట్లు ముస్లిం మహిళలు నెయిల్ పాలిష్ వాడడం ఇస్లాం విరుద్దం, చట్టవిరుద్దం అని ఉందా, ఇల్లీగల్ అన్న పదం ఎఎన్ఐ ట్వీటులో వాడింది.
దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ వెబ్ సైటు ఒకటి ఉంది. అక్కడ ప్రశ్నలు జవాబులకు ఒక ఆన్ లైన్ సర్వీసు కూడా ఉంది. ఇస్లామ్ ఆచరణల విషయంలో ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అక్కడ ప్రశ్నలు అడిగితే దేవ్ బంద్ ధర్మవేత్తలు ఆ ప్రశ్నలకు జవాబిస్తారు. సాధారణంగా చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటారు. ఉదాహరణకు ప్రయాణంలో ఉన్న వ్యక్తి రమజాను మాసమైతే ఉపవాసం వదల వచ్చా అని అడగొచ్చు. ఉపవాసం మానడానికి మినహాయింపులేమిటో అక్కడ ముఫ్తీ అవసరమైన రిఫరెన్సులో ఇస్తాడు. ప్రతి వ్యక్తి ధార్మిక గ్రంథాలు చదవడం సాధ్యం కాదు కాబట్టి ముఫ్తీల సహాయం తీసుకుంటారు. మొత్తం సైటంతా వెదికినా ఈ ఫత్వా దొరకలేదు. అంటే ఈ ఫత్వా అసలు లేదా. ఆన్ లైన్ లో కాకుండా వ్యక్తిగతంగా రాతపూర్వకంగా అడిగే ప్రశ్నలు కూడా ఉండవచ్చు. అలా రాతపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ముఫ్తీ రాతపూర్వకంగానే జవాబిస్తారు. ఆన్ లైన్ లో పెట్టడం జరగదు. ప్రశ్న అడిగిన వ్యక్తికే ఆ జవాబిస్తారు.
ఈ ఫత్వా గురించి చెప్పింది ఏఎన్ఐ వార్తాసంస్థ కాబట్టి ఆల్ట్ న్యూస్ మళ్ళీ ఎఎన్ఐ ను సంప్రదించింది. ఈ వార్తకు సంబంధించిన ఫత్వా కాపీ కావాలని అడిగింది. ఎఎన్ఐ ఆ ఫత్వా కాపీ తన వెబ్ సైటులో అప్ లోడ్ చేసింది. దాంతో పాటు ఎఎన్ఐ ట్వీటు కూడా మార్చేసుకుంది. అంతకు ముందు ముస్లిం మహిళలు నెయిల్ పాలిష్ వాడడం ఇస్లాం విరుద్దం, ఇల్లీగల్ అని రాసిన ఎఎన్ఐ ఇప్పుడు ట్వీటు మార్చింది. కొత్త ట్వీటులో ఏం రాశారంటే, ’’భారతదేశంలో ప్రతిష్ఠాత్మకమైన ధార్మిక విద్యాసంస్థ దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఒక ఫత్వా జారీ చేసింది. నమాజు చేస్తున్నప్పుడు ముస్లిం స్త్రీలు, పురుషులు నెయిల్ పాలిష్ వాడడానికి వ్యతిరేకంగా ఫత్వా ఇచ్చింది‘‘ అని కొత్త ట్వీటు. మొదట స్త్రీలకు వ్యతిరేకంగా వచ్చిన ఫత్వా అని చెప్పారన్నది గుర్తించాలి. ఇక్కడ స్త్రీలు, పురుషులు అని ఇద్దరిని సూచిస్తూ ఫత్వా ఉందని అప్ డేట్ చేశారు. అసలు ఫత్వాలో ఏముందన్నది తర్వాత చూద్దాం.
అసలు ఫత్వా అంటే ఏమిటి? ఫత్వాకు ఖచ్చితంగా కట్టుబడాల్సిందేనా? ఈ ప్రశ్నలు ఇక్కడ ముఖ్యమైనవి. ఇస్లాంలో నాలుగు పంథాలున్నాయి. ముఫ్తీ ఏ పంథాకు చెందినవారైతే ఆ పంథా ప్రకారమే ఫత్వా ఇస్తారు. కాబట్టి ఒక సమస్యపై లేదా ఒక ప్రశ్నకు ఒక స్కూలుకు చెందిన ముఫ్తీ ఇచ్చిన ఫత్వాకు మరో స్కూలుకు చెందిన ముఫ్తీ ఇచ్చిన ఫత్వాకు తేడా ఉండొచ్చు. ఏ పంథాను అనుసరించేవారు తమ పంథాకు చెందిన ముఫ్తినే ప్రశ్న అడుగుతారు. ఫత్వా అనేది ఒక ధార్మిక అభిప్రాయం మాత్రమే. తప్పనిసరిగా కట్టుబడవలసిన అవసరమేమీ లేదు. కాని ఎక్స్ పర్ట్ ఒపీనియన్ గా ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. ఇస్లామిక్ నియమాల అవగాహన ఉన్న ధర్మవేత్త అభిప్రాయం కాబట్టి దానికి విలువ ఉంటుంది.
ఫత్వా అంటే ఏమిటో తెలిసింది. ఈ నెయిల్ పాలిష్ ఫత్వా వ్యవహారమేమిటి? ఎందుకు ఈ ఫత్వా ఇచ్చారు? అనే ప్రశ్నలకు కూడా జవాబులు అవసరం. ఎందుకంటే, ఎవరూ ఏ ప్రశ్న అడక్కుండా ముఫ్తీ తనంత తానే ఏదో ఒక ఫత్వా జారీ చేయడం జరగదు. ఫత్వా అనేది ప్రశ్నకు జవాబుగానే ఉంటుంది. ఫత్వా ఉందంటే ఆ ఫత్వాకు సంబంధించిన ప్రశ్న ఉంటుంది. ఫ్రశ్నను అడిగిన వ్యక్తి ఉంటారు. అంతేకాని ఏ ముఫ్తీ అయినా సరే పనీపాటాల లేకుండా ఉన్నట్టుంది ఒక ఫైన్ మార్నింగ్ ఒక ఫత్వా జారీ చేసి చూద్దాం అని ఫత్వాలు ఇవ్వరు. ఈ ఫత్వాకు సంబంధించి వచ్చిన ప్రశ్న ఏమిటంటే, నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చా? చాలా మంది మహిళలు వివాహాలకు హాజరవుతున్నప్పుడు, పార్టీలకు వెళుతున్నప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నారు. గోళ్ళను పొడవుగా పెంచుతున్నారు. ఇలా గోళ్ళను పెంచడం, నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ధార్మికంగా చేయవచ్చా?… ఇది అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నను అడిగిన వ్యక్తి పేరు ముహమ్మద్ తుఫైల్. ఆయన ముజఫర్ నగర్ కు చెందిన వాడు. దీనికి ముఫ్తీ ఇచ్చిన జవాబు ఆ ఫత్వా. అందులో ముఫ్తీ ఏం జవాబిచ్చారంటే, ’’నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు. అయితే నెయిల్ పాలిష్ లో అపరిశుద్ధమైన, హానికారకమైన పదార్ధాలేవీ ఉండరాదు. నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల గోళ్లపై పాలిష్ పొర ఉంటుంది. నీటితో శుభ్రం చేస్తున్నప్పుడు ఈ పొర ఉండడం వల్ల గోళ్లు నీటితో తడవడం జరగదు. అందువల్ల గోళ్ళు శుభ్రం కావు. కాబట్టి ఈ పొర తొలగించకుండా వుజు చేస్తే వుజు పూర్తి కాదు. (వుజు అంటే నమాజుకు ముందు కాళ్ళుచేతులు, ముఖం ఒక పద్ధతి ప్రకారం కడగడం). అలాగే గుసుల్ (అంటే ఇస్లామీయ పద్ధతి ప్రకారం చేసే స్నానం, శరీరమంతా తడవడం అవసరం. నెయిల్ పాలిష్ వల్ల గోళ్ళు తడవడం జరగదు) కూడా పూర్తి కాదు. అందువల్ల వుజు లేదా గుసుల్ చేసే ముందు నెయిల్ పాలిష్ తొలగించి చేయడం అవసరం. స్త్రీలయినా, పురుషులయినా 40 రోజుల వరకు గోళ్ళను పెంచవచ్చు. ఆ తర్వాత గోళ్ళను కత్తిరించాలి… ఇది ఆ ఫత్వాలో ఉన్న విషయం. ఇందులో ఎక్కడా ఎఎన్ఐ ట్వీటులో చెప్పినట్లు నెయిల్ పాలిష్ ఇస్లాంకు వ్యతిరేకం, ఇల్లీగల్ వగైరా మాటలు లేనే లేవు. ఎఎన్ఐ ఈ వివరాలు బయటపడుతున్న కొద్ది ట్వీటును సవరిస్తూ పోయింది. చివరకు నమాజు చదువుతున్నప్పుడు నెయిల్ పాలిష్ వద్దని ఫత్వాలు చెప్పినట్లు రాసింది. ఆఫ్ డేట్ అయిన స్టోరీ క్రింద అసలు ఈ స్టోరీకి కారకుడైన ఇషాక్ గోరా కూడా కామెంట్ చేస్తూ, తన పేరును సరిచేయాలని, తనకు దేవ్ బంద్ కు సంబంధం లేదని కామెంటు కూడా పెట్టారు.
యూపీలోని దారూల్ ఉలూమ్ దేవ్ బంద్ అనే సంస్థ ఫత్వా విడుదల చేసింది. ఇకపై ముస్లిం యువతులు, బాలికలు ఎవరూ కూడా తమ గోళ్లకు నెయిల్ పాలిష్ పూసుకోరాదని ఆ సంస్థ ఫత్వా జారీ చేసింది అంటూ దేశమంతా గగ్గోలు గగ్గోలుగా మీడియా ప్రచారం చేసిన ఫత్వా వెనుక కథ ఇది. ఆల్ట్ న్యూస్ ఫత్వా ఏమిటో నిర్ధారించుకున్న తర్వాత అంతటితో ఆగలేదు. అంతకన్నా ముఖ్యమైన మరో ప్రశ్న ఉంది. ఈ టీవీ ఉర్దూకు ఈ ఫత్వా ఎలా దొరికింది? ఈ ఫత్వా పబ్లిక్ డొమైన్ లో ఉన్నది కాదు. వ్యక్తిగతంగా రాతపూర్వకంగా ఇచ్చిన ఫత్వా. వెబ్ సైటులో అప్ లోడ్ చేసింది కాదు. ఎవరో ఒక వ్యక్తి సలహా కోసం అడిగిన ప్రశ్నకు సంబంధించిన ఫత్వా మీడియా దగ్గరకు ఎలా వచ్చింది? ఇక్కడే ఫత్వా తయారీ కర్మాగారం పనిచేస్తోంది.
ఈ ప్రశ్న అడిగిన పెద్దమనిషిని వెదికి పట్టుకుంది ఆల్ట్ న్యూస్. ఈ ప్రశ్న అడిగిన వ్యెక్తి పేరు ముహమ్మద్ తుఫైల్. ప్రశ్న అడిగిన వ్యక్తి ఫోన్ నెంబరు, చిరునామా దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ కు ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఆ వివరాలు దొరికాయి. కాని ఆ ఫోను తుఫైల్ పేరున ఉన్న ఫోను కాదు. తస్లీం ఖురైషీ పేరుతో ఉన్నట్లు ట్రూ కాలర్ చూపించింది. ఆ నెంబరుకు ఫోను చేస్తే, తస్లీం ఖురైషీ ఫోనెత్తాడు. అతనితో మాట్లాడితే ఈటీవీ ఉర్దూ సంస్థకు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ తస్లీం ఖురైషీయే తన బంధువు తుఫైల్ పేరుతో ఈ ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్న నిజంగా ధార్మిక సందేహంతో అడిగిన ప్రశ్న కాదు. ఒక స్టోరీ చేయడానికి అడిగిన ప్రశ్న. ఒక జర్నలిస్టుగా తాను న్యూస్ స్టోరీ చేయాలి కాబట్టి ఫత్వా ఇవ్వండని అడిగితే దారుల్ ఉలైమ్ దేవ్ బంద్ ఫత్వా ఇవ్వదు కాబట్టి, తన బంధువు పేరుతో ఈ ప్రశ్న అడిగాడు. ఒక సాధారణ ముస్లిం తన ధార్మిక సందేహనివృత్తికి అడిగిన ప్రశ్న కానే కాదు. న్యూస్ మాన్యుఫాక్చరింగ్ కోసం ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్న. ఈయనగారి యుట్యూబ్ చానెల్ లోను, ఇన్ స్టా గ్రాం ఎక్కౌంటులోను అనేక ఫత్వాలపై న్యూస్ కథనాలున్నాయి. ముస్లిం మహిళలు మెహందీ పెట్టుకోవచ్చా? ముస్లిం మహిళలు వాక్సింగ్ చేయించుకోవచ్చా? ఇలాంటి అనేక ప్రశ్నలు, ఆ ప్రశ్నలపై రాబట్టిన ఫత్వాలు, ఆ ఫత్వాలపై ఇతరుల అభిప్రాయాలను అడిగి చేసిన న్యూస్ స్టోరీలు, సంచలనాలు.. వగైరా ఇవన్నీ అక్కడ చూడవచ్చు. ఇలా ఫత్వాలు రాబట్టి ఈ న్యూస్ స్టోరీస్ చేయడం గురించి ఆల్ట్ న్యూస్ ప్రశ్నిస్తే ఆయన గారు నేను జర్నలిస్టునని జవాబిచ్చాడు. జర్నలిస్టు అంటే వార్తలు తయారు చేసేవాడా? వార్తలు వండేవాడా? ’’నేను ముస్లిమునే? నేను ఫత్వా అడక్కూడదని రూలేమన్నా ఉందా? అని ప్రశ్నించాడు. ఆయనకు సంబంధించి జర్నలిజం ప్రమాణాలవి. అతనికే కాదు చాలా మందికి ఇలాంటి ప్రమాణాలే ఉన్నాయి. వార్తలు వండడమే …
ఒక ఫత్వా గురించి న్యూస్ స్టోరీ చేస్తే చాలు సంచలనమైపోతుందనే వాతావరణం ఉంది. ఒక మతంపై చర్చలు పెట్టే అవకాశం మీడియాకు దొరుకుతుంది. ఫత్వాలపై జరుగుతున్న గగ్గోలు చూసిన ఈ సహరాన్ పూర్ జర్నలిస్టు ఫత్వాలు రాబట్టి వార్తలు వండుకునే పని మొదలు పెట్టాడు. ఈ వంటకం వార్తలను వెంటనే జాతీయ మీడియా హాట్ హాట్ గా అమ్మడానికి నడుం కట్టి ముందుకు వచ్చింది. బ్రేకింగ్ … కింగులు వచ్చారు. ముస్లిం మహిళలపై కొత్త ఫత్వా. నెయిల్ పాలిష్ పై ఫత్వా.. వగైరా వార్తలొచ్చాయి.
వ్యక్తిగతంగా రాతపూర్వకంగా ఇచ్చిన ఫత్వా మీడియాకు ఎలా వచ్చింది, అసలు ఫత్వాలో ఏముంది? ఎప్పుడిచ్చిన ఫత్వా? దీని వెనుక అసలు ప్రశ్నేమిటి? ప్రశ్నకు మొత్తం జవాబేమిటి? వంటి ప్రశ్నల గురించి ఆలోచించడం అనవసరమనుకున్నారు ఈ వార్తలు ప్రసారంలో పెట్టిన ఎడిటర్లు. ఏది ఏమైనా ఫత్వా వార్తల వంటకం ఇలా కొనసాగుతూనే ఉంది. ఇది చివరికి కాకపోవచ్చు. ఇలా హాట్ హాట్ గా వండివార్చే ఫత్వాలు మరికొన్ని రావచ్చు. ఇలాంటి వార్తలను మాత్రమే వార్తలుగా భావించే మీడియా ఉన్నంత వరకు ఈ పరిస్థితి తప్పదు.

Leave a Reply

Your email address will not be published.