బుర్ఖా – జైలు – ఓ ధిక్కారం!!

బుర్ఖా – జైలు – ఓ ధిక్కారం!!

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, 1920-30 ల మధ్య జరిగిన ఓ కీలక పరిణామం – చివరి ఇస్లామిక్ సామ్రాజ్యమైన – అట్టోమాన్ సామ్రాజ్యం నేలకొరిగి, ఖిలాఫత్ వ్యవస్థ నిర్మూలించబడి, ఓ చిన్న దేశం -టర్కీ గా మిగిలింది. అనంతరం టర్కీ అధ్యక్షుడిగా ఎన్నికైన ముస్తఫా కమాల్, టర్కీ నుండీ ఇస్లాం ని నామరూపాలు లేకుండా చేసి, దాన్ని మరో వెస్ట్రన్ కంట్రీ గా మార్చాలని కంకణం కట్టుకున్నాడు. స్విట్జర్ల్యాండ్ యొక్క సివిల్ కోడ్ నీ, ఇటలీ యొక్క క్రిమినల్ కోడ్ నీ టర్కీ రాజ్యాంగంలో పొందుపరిచాడు. అరబిక్ ని నిషేధించి, మదరసా లను మూసేయించి యూరోప్ తరహా విద్యా వ్యవస్థను స్థాపించాడు. ఇలాంటి అనేక చర్యల వల్ల, అనతి కాలంలోనే అక్కడ ఇస్లాం పరాయిదైపోయింది. గెడ్డం,తలపై టోపీ తో ఉన్న పురుషులు, బురఖా ధరించే మహిళలూ దాదాపుగా కనుమరుగైపోయారు.

అలాంటి టర్కీ లో, 1938లో జన్మించింది – సులె యెక్సెల్ సెన్లర్. పేదరికం కారణంగా, ప్రాధమిక విద్యతోనే చదువు ఆపేసింది. కొన్నాల్లు టైలరింగ్ పని చేసింది. 14 సంవత్సరాల వయసులో ఈమె రాసిన కథలు,ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితమయ్యాయి. దానితో ఆమె కెరీర్, రచనా రంగం వైపు, జర్నలిజం వైపు మళ్ళింది. సుమారు పాతికేల్లు వచ్చే వరకూ, ఆమెకు ఇస్లాం గురించి తెలిసింది చాలా తక్కువ. నాన్ ప్రాక్టీసింగ్ ముస్లిం గా తనను తాను పిలుచుకునేది. కానీ, జీవితం గురించిన ఆలోచనలు ఆమెను ఇస్లాం,ఖురాన్ స్టడీ చేసేలా ప్రేరేపించాయి. ఆ స్టడీ ఆమెను నాన్ ప్రాక్టీసింగ్ నుండీ, ప్రాక్టీసింగ్ ముస్లిం గా మార్చేసింది. ఆప్పటికే ఇస్లామిక్ చిహ్నాలు టర్కీ సమాజం నుండీ దాదాపుగా నిర్మూలింపబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె బురఖా ధరించడం మొదలుపెట్టింది. జర్నలిస్టు ఉద్యోగానికి కూడా బురఖాలోనే వెళ్ళేది. తనకు ఉన్న టైలరింగ్ బ్యాక్గ్రౌండ్ తో, పాతకాలం నాటి పై నుండీ కిందకు వేసుకునే నల్లటి ముసుగులాంటిది కాకుండా, వదులుగా ఉండే గౌన్ సపరేట్ గా, తలకు చుట్టుకునే హెడ్ స్క్రాఫ్ సపరేట్ గా ఉండేలా, రంగురంగుల బట్టలతో తన బట్టలను డిజైన్ చేసుకునేది.

ఇస్లాం గురించి తన ఆలోచనలను వివిధ పత్రికల్లో వ్యాసాలుగా రాసేది. అనేక సభల్లో ప్రసంగాలు చేసేది. ఇవి చాలా మందిని, ముఖ్యంగా టర్కీ మహిళల్ని ఆకర్షించడం మొదలైంది. ఆమె మొదలు పెట్టిన మాడ్రన్ హెడ్ స్క్రాఫ్, ఓ ట్రెండ్ సెట్టర్ గా మారి, చాలా మంది మహిళలు, కాలేజీ విద్యార్థినులు అవి ధరించడం మొదలుపెట్టారు. టర్కీ మహిళలపై ఈమె ప్రభావం ఎంతగా ఉందంటే- టర్కీ ని మరో వెస్ట్రన్ కంట్రీగా చేయాలని కంకణం కట్టుకున్న టర్కీ పాలకులకు ఈమె ను చూసి భయం పట్టుకుంది. ఇస్లాం ని ప్రాపగేట్ చేయడం ఆపేయాలని, 1971 లో అప్పటి టర్కీ అధ్యక్షుడు క్యావ్డెట్ సునే ఆమెకు అల్టిమేటం జారీ చేశాడు. దానికి ఆమె – “నువ్వు తప్పు చేస్తున్నావ్. ముందు అల్లాకు క్షమాణలు చెప్పి, సరైన దారిలో నడువు” అని బదులిచ్చింది. ఈ ధిక్కారం కారణంగా ఆమెను పోలీసులు అరెస్టు చేసి, 8 నెలల జైలు శిక్ష విధించారు. ఆమె జైల్లో ఉండగా, ఆమెకు టర్కీ మహిళల్లో క్రమంగా మరింత మద్ధతు పెరిగి, హెడ్ స్క్రాఫ్ ధరించిన మహిళలు వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ఫలితంగా ఆమె శిక్షను రెండు నెలలు తగ్గించి క్షమాబిక్ష పెడుతున్నట్లు అధ్యక్షుడు ప్రకటించాడు. కానీ, ఆమె ఆ క్షమాబిక్షను తిరస్కరించి జైలు శిక్షను పూర్తిచేసింది. విడుదలైన తరువాత ఆమె మరింత యాక్టివ్ గా రచనలు,ప్రసంగాలూ చేయడం మొదలు పెట్టింది.

ఆమె రాసిన అనేక కథలు,నవలలు బెస్ట్ సెల్లర్స్ గా నిలిచాయి. క్రాస్ రోడ్స్ అనే నవల – సినిమాగానూ, అనంతరం టీ.వీ ధారావాహికగా కూడా అత్యంత పాపులర్ అయింది. ఇస్లాం సంస్కృతిని టర్కీ నుండీ చెరిపేయాలని కంకణం కట్టుకున్న టర్కీ పాలకుల ప్రయత్నాలను ఒంటిచేత్తో ఎదుర్కొన్న సులె యెక్సెల్ సెన్లర్, నిన్న ఇస్తాంబుల్ లో కన్ను మూసింది.

“హెడ్స్క్రాఫ్ ఉద్యమంతో, తన రచనలతో,టర్కీ యువతకు మార్గనిర్దేశం చేసిన సులె యెక్సెల్ సెన్లర్ పై , అల్లా కరుణ చూపుగాక – అని టర్కీ అధ్యక్షుడు సంతాప సందేశంలో పేర్కొన్నాడు.

ఆమీన్.

Leave a Reply

Your email address will not be published.