మసీదు కుర్చీ!!!

మసీదు కుర్చీ!!
=============

కుర్చీ మీద కూర్చున్నోడు గొప్ప, దాని పక్కన నిలుచున్నోడి కంటే, దాని వెనకాల నేలపై కూర్చున్నోడి కంటే.
అందుకే కుర్చీకి డిమాండ్. ప్రతి వ్యక్తికీ ఎలాగోలా చేసి కుర్చీమీద కూర్చోడమే టార్గెట్.
కుర్చీ పెద్దరికానికి ప్రతీక, హోదాకి ప్రతీక, అధికారానికి ప్రతీక, డబ్బూ-దర్పానికి ప్రతీక, సౌకర్యానికి ప్రతీక. పది మంది జనాలుండి, కేవలం రెండో-మూడో కుర్చీలుంటే, ఇక ఆ కుర్చీలకుండే డిమాండ్ చూడాలి. వాటికోసం అడ్వాన్స్ రిజర్వేషన్లు, రెకమెండేషన్లు,పోటీలు, గొడవలు, అలకలూ, ‘నేనేంటో-నా లెవలేంటో తెలుసా ‘ టైపు డైలాగులు… ఇదంతా హ్యూమన్ టెండేన్సీ, మానవ నైజం.

కానీ ఈ మానవ నైజం ఒక్కచోట మాత్రం, రోజుకు ఐదు పూటలా ఓడిపోతుంటుంది. అది -మసీదు కుర్చీ దగ్గర.
ప్రపంచంలోని, ఏ మసీదులో కెళ్ళి చూసినా, కింద కూర్చోడానికి చాపలు,కార్పెట్లు పరచి ఉంటాయి. అట్లే, ప్రతి మసీదులోనూ, అక్కడక్కడా, కొన్ని కుర్చీలు, టేబుల్లూ కూడా ఉంటాయి. మసీదులో, కుర్చీపై కూర్చునే కంటే, కింద కూర్చోడమే పెద్ద భాగ్యం. దానికి ఒకే ఒక కారణం – అది ప్రవక్త చెప్పిన, చేసి చూపిన సాంప్రదాయం.

మహా సామ్రాజ్యాలనేలిన చక్రవర్తులు,రాజులు, ప్రధానులు, సైన్యాధ్యక్షులూ.. వీరి హోదాలన్నీ బయటే, ఒక్కసారి మసీదులోకి అడుగుపెడితే, వారి స్థానం పది మందితో కలిసి నేలపైనే. మరి ఆ కుర్చీలు ఎవరి కోసం? అవి అభాగ్యుల కోసం. కింద కూర్చోవడానికి శరీరం అనుకూలించని అభాగ్యులకోసం. వృధ్యాప్యం కారణంగానో, అనారోగ్యం కారణంగానో, ప్రమాదాల కారణంగానో, శరీరం కిందకు వంగి, నేలపై సాష్టాంగపడి సజ్దా చేసి, మళ్ళీ దానికదే లేచినిలబడే భాగ్యం లేని అభాగ్యుల కోసమే ఆ కుర్చీలు.

ఆ కుర్చీల్లో ‘వీరు మాత్రమే కూర్చోవాలనే’ నియమం ఏమీ లేదు. ఎవరైనా ఠీవిగా,దర్జాగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని నమాజు చేయొచ్చు. ‘నీకు వైకల్యం ఏమీ లేదుకదా, మరి కుర్చీ మీద ఎందుకు కూర్చున్నావ్’? – అని ఎవరూ నిలదీసి అడగరు. ఎందుకంటే, ఆ కుర్చీలకు అస్సలు డీమాండ్ ఉండదు కాబట్టి. అక్కడ ప్రవక్త సాంప్రదాయాన్ని పాటించి నేలపై,కూర్చోడమే భాగ్యం. కుర్చీకోసం , ఆ భాగ్యాన్ని ఎవరైనా వదులుకుంటారేమోననే ఊహ కూడా ఎవరికీ రాదు. అదీ 1400 వందల సంవత్సరాల నుండీ చెక్కుచెదరకుండా ఉన్న సాంప్రదాయం. మహా ప్రవక్త చేసి చూపిన సాంప్రదాయం.

కానీ, కొందరు దురదృష్టవంతులకు ఆ సౌభాగ్యం అర్థం కాదు. యుక్త వయసు మొత్తం రంగుల ప్రపంచపు కలల మాయలో పడి, మసీదు గుమ్మం కూడా ఎక్కరు. తీరా, జీవితపు అవసాన దశలో, మరణం దగ్గరవుతుందని తెలిసినప్పుడు, రంగుల ప్రపంచపు రంగులన్నీ వెలిసిపోయినప్పుడు, అప్పుడు మసీదులోకి అడుగుపెడతారు. అడుగైతే పెడతారు కానీ, ప్రవక్త చూపినట్లు , నేలపై సజ్దా చేసి, నిటారుగా లేచి నిలబడటం లోని భాగ్యాన్ని మాత్రం పాపం మిస్సవుతారు. అలాంటి వారిని కుర్చీ వెక్కిరిస్తూ పలకరిస్తుంది. ;బయట ఈ కుర్చీ కోసమే జీవితం మొత్తం ధారబోశావ్ కదా, నీకు ఇప్పుడు ఇదే గతి’, అని ఆ కుర్చీ వెటకారం చేస్తుంది. అందుకే..దోస్తో.. త్వరపడండి.. సమయం మించిపోలేదు.. సజ్దా చేయండి.

www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.