‘ఫాల్స్ బైనరీ’ – అని ఇంగ్లీష్ లో ఓ పదం ఉంది. ఈ పదాన్ని అర్థం చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి.
‘బైనరీ’ అంటే రెండు అని అర్థం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే – ‘కేవలం రెండు మాత్రమే ‘ అని అర్థం వస్తుంది. జీరో నా-ఒకటా? అటా-ఇటా? అదా-ఇదా?అవునా-కాదా? కావలా-వద్దా? ఇవన్నీ బైనరీలు. ఈ రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోతగ్గది తప్ప, రెండూ కానీ, రెండింటి మధ్యలో కానీ, ఈ రెండూ కాకుండా మరోటి గానీ.. ఎంచుకోవడానికి ఉండదు.
‘ఫాల్స్ బైనరీ’ అంటే – సంబంధం లేని రెండు అంశాల్ని ఎదురెదురుగా నిలబెట్టి, వీటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకోమని తీర్మానించడం. సగంతెలివి/అతితెలివి/దొంగతెలివి రాజకీయాలు,ఆర్గుమెంట్లు చేసేవారు తరచుగా ఈ టెక్నిక్ ని ఆశ్రయిస్తుంటారు. దీనిని కొన్ని ఎగ్జాంపుల్స్ తో చూద్దాం.
1. ఇరాక్ వద్ద, మొత్తం మానవజాతిని మట్టుబెట్టే జనహనన రసాయనిక ఆయుధాలున్నాయని ఆరోపిస్తూ జార్జ్ బుష్ దాని మీద బాంబుల వర్షం కురిపించాడు. నీ ఆరోపణలో నిజం ఎంత, నీ దగ్గరున్న ఆధారాలేమిటి అని కొన్ని దేశాలు అతన్ని ప్రశ్నించాయి. దీనికి సమాధానం చెప్పకుండా- “మేము తీవ్రవాదంపై యుద్దం చేస్తున్నం. మీరు మా సైడా-వారి సైడా తేల్చుకోండని జార్జి బుష్ వారికి అల్టిమేటం జారీ చేశాడు” . “మా సైడా -వారి సైడా ” అనే ఈ ఫాల్స్ బైనరీని కొన్ని వారాల పాటు పదే,పదే చెప్పాడు. అమెరికన్ మీడియా కూడా దీనికి పెద్ద యెత్తున ప్రాచుర్యం కల్పించింది. దీనితో, తటస్థంగా ఉండే చాలా దేశాలు, తాము బుష్ ని విమర్శిస్తే ఎక్కడ అతని ఆపోజిట్ సైడుకి(తీవ్రవాదానికి) మద్దతిస్తున్నట్లవుతుందోననే భయంతో , ఏమీ మాట్లాడకుండా సైలెంటయి పోయాయి.
ఇక్కడ “మా సైడా – వారి సైడా” అనేది ఓ ఫాల్స్ బైనరీ.
2. ఢిల్లీ JNUలో, దేశానికి వ్యతిరేకంగా మీటింగ్లు,నినాదాలిచ్చారనే అభియోగంపై కణయ కుమార్ తదితరుల్ని సెడిషన్ (దేశ ద్రోహం) చట్టాల కింద అరెస్టు చేశారు. దీనికి సాక్ష్యాధారాలన్నట్లు కొన్ని వీడియోల్ని వదిలారు.
“ఆ వీడియోలు నకిలీవి కావని గ్యారెంటీ ఏంటి?, ఒక వేల అక్కడ మీటింగ్ పెట్టుకున్నది నిజమే అయినా, కొందరు విద్యార్థులు ఓ అంశం గురించి మీటింగ్ పెట్టుకుని చర్చించుకుంటే దాని వల్ల దేశానికి వచ్చే నష్టం ఏమిటీ, ఆ మాత్రం దానికి దేశ ద్రోహం లాంటి తీవ్రమైన అభియోగాలు మోపడమెందుకు”, అని కొందరు బుద్ధి జీవులు TVస్టూడియోల్లో ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా -“ఆ విద్యార్థులు యాంటీ నేషనల్స్ . ముందు మీరు నేషనలా-యాంటీనేషనలా చెప్పమని” వీరిని దబాయించింది. నేషనలా- యాంటీ నేషనలా అని నిలదీస్తే , నూటికి 99 మంది నేషనలే,నేషనలే అని తలూపుతారు. అదీ టెక్నిక్.
ఇక్కడ “నేషనలా – యాంటీ నేషనలా” అనేది ఫాల్స్ బైనరీ.
ఇలా.. కొందరు ఫాల్స్ బైనరీస్ తో పబ్బం గడుపుకునే టెక్నిక్, మన దైనందిన జీవితంలో చాలా సార్లు చూస్తుంటాం.
ఇలాంటిదే అత్యధికంగా వాడుకలో ఉన్న మరో ఫాల్స్ బైనరీ “మతమా-సైన్సా” అనేది.
-మతం ఆత్మ గురించి వివరిస్తుంది. కంటికి కనిపించని వాటిని వివరిస్తుంది. సృష్టికర్త గురించి వివరిస్తుంది.
-సైన్సు శరీరం గురించి వివరిస్తుంది. భౌతిక విషయాల్ని వివరిస్తుంది. సృషి గురించి వివరిస్తుంది.
ఈ రెండూ వేటికవే సపరేటు విషయాలు తప్ప, ఒకదానికొకటి వ్యతిరేకపదాలో, పర్యాయపదాలో కాదు. కానీ, కొందరు ప్రబుద్ధులు స్వార్థం తోనో, అవగాహనాలోపం తోనో, ఈ రెండింటినీ కలిపేసి మాట్లాడుతుండటం వల్ల మతమా-సైన్సా అనే ఓ ఫాల్స్ బైనరీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఇంతకూ ఖురాన్లో సైన్సు ఉందా?
——————————————
అవును.. ఖురాన్ లో ముమ్మాటికీ సైన్సు ఉంది!!!
!@#$%^&*####@@#$
సరే.సరే.. కూల్ డౌన్..
నేను చెప్పేది SIGNS-సైన్స్ గురించే తప్ప, SCIENCE-సైన్స్ గురించి కాదు.. హ.హా.
SIGNS-సైన్స్ అంటే – గుర్తులు/సంగ్ఞలు. దారిచూపే డైరెక్షన్స్ అన్నట్లు.(Sign Board లాంటిది. ) ఖురాన్ లో మనిషి మనుగడకు సంబంధించి వివిధ సంగ్ఞలుంటాయి. పెళ్ళి-విడాకులు, పిల్లలు, వ్యాపారం, సంపాదన, నమాజులు, ఉపవాసాలు, దాన-ధర్మాలు, అవసరమైనప్పుడు యుద్ధాలు.. ఇలా వివిధ దశల్లో, ఏమేమి చెయ్యొచ్చో, చేయకూడదో సూచనలూ,సలహాలూ ఉంటాయి. ఖురాన్ లో విషయం ఉందని నమ్మినోల్లు దానిని ఫాలో అవుతారు- నమ్మనోల్లు లైట్ తీసుకుంటారు. అంతే తప్ప, కెమిస్ట్రీ ల్యాబ్ మ్యాన్యువల్ బుక్ లాగా, ఏ రెండు ద్రవాలు కలిపితే ఏ కొత్త ద్రవం వస్తుంది, మార్స్ మీదికి వెళ్ళే గ్రహాంతర నౌకని ఎలా తయారు చేయాలి లాంటి SCIENCE సమాచారం ఉండదు.
కానీ, ఖురాన్లో విషయం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక్కోసారి SCIENCE కూడా సహాయం చేస్తుంది. ఉదాహరణకి , ఈ కింది వీడియోని చూడండి.
అదేవిధంగా, ఖురాన్లో చెప్పబడిన ఏదైనా ఓ వ్యాక్యం తప్పని సైన్సు ఆధారాలతో నిరూపించగలిగితే, అప్పుడు మొత్తం ఖురానే ఓ మానవుడి ద్వారా రాయబడిందని కూడా తీర్మానించొచ్చు. ఉదాహరణకు కొన్ని శతాభ్దాల క్రితం వరకూ కూడా, భూమి బల్లపరపుగా ఉందనీ, సూర్యుడు భూమి చుట్టూ గింగిరాలు కొడుతుందనీ మానవులందరూ నమ్మేవారు. ఆ అంశాలు గనక ఖురాన్లో యధాతధంగా చెప్పబడి ఉంటే, అప్పుడు మాడరన్ సైంటిఫిక్ ఆవిష్కరణల వల్ల ఖురాన్ మానవుడు రాసిన పుస్తకమే అని నిరూపించబడి ఉండేది. కానీ,అందులో అలాంటి వాక్యాలేమీ లేవు.
మొత్తానికి, సైన్సూ- మతమూ వ్యతిరేకమైనవి కావు. అఫ్కోర్స్, ఇది అన్ని మతాలకూ, అందరు భక్తులకూ , వర్తించకపోవచ్చు.
సృష్టిని శోధించాలనే, తెలుసుకోవాలనే క్యూరియాసిటీ , సృష్టి కర్త మనిషికి ఇచ్చిన ఓ ప్రధాన Instinct. అలాంటి ఇన్స్టింక్ట్ ని ఉపయోగించకూడదనో/తొక్కిపెట్టాలనో ప్రయత్నించేది ఎప్పటికీ, సృష్టికర్త యొక్క మతం, అభిమతం అవ్వబోదు.
సృష్టి లోని SCIENCEనీ, సృష్టికర్త యొక్క SIGNSనీ, అర్థం చేసుకొని, మనుగడ సాగించడంలోనే మనిషి జీవితానికి సార్థకత ఉంది.
-మహమ్మద్ హనీఫ్.