ముస్లిం నాయకత్వం#2: ఓవైసీ కేస్ స్టడీ!!
==========================
మొదటి భాగం క్లుప్తంగా – ” మనుషుల మధ్య సమానత్వాన్ని ఇస్లాం థియరీలో చెప్పడమే కాకుండా, అడుగడుగునా ఆచరణలోనూ చేసి చూపిస్తుంది. ఎంతపెద్ద తోపుమానవుడైనా, మసీదు బయట బిచ్చం అడుక్కునే వ్యక్తి,మసీదులోపలికి వచ్చి, నమాజులో తన పక్కన నిలబడితే అతనిని ప్రశ్నించడానికి గానీ, పొమ్మని చెప్పడానికి గానీ ఆస్కారమే లేదు. “అల్లా మాత్రమే గొప్పవాడు(అల్లా హు అక్బర్), ఇంకెవరూ గొప్పోల్లు కాదు”, అని ఇద్దరూ కలిసి ఒకేవిధంగా,ఒకేసారి, ఒకే దిక్కుకు తిరిగి నమాజు చేస్తారు. తర్వాత,ఆ తోపుమానవుడు తన కారెక్కి ఇంటికెల్లిపోతాడు. ఆ వ్యక్తి మసీదు బయట తన తువ్వాలునో, కర్చీఫ్ నో పరుచుకుని ‘అల్లా పేరు మీద సహాయం చేయండి ‘ అని అడుగుతూ నిల్చుంటాడు. ఇదంతా ఎగ్జాగ్గరేషనో(పెంచి చెప్పడం), నావల్టీగానో ఇతరులకు అనిపించవచ్చు గానీ, రోజూ నమాజుకు వెళ్ళే ముస్లింలకు మాత్రం ఇది తరచుగా, అతి సహజంగా జరిగే విషయమే. అలాంటి కరడుగట్టిన సమానత్వం నుండీ, ఓ వ్యక్తిని నాయకునిగా ఇతర ముస్లింలు గుర్తించాలంటే, అతను నిష్ఠగా మతాన్ని ఆచరిస్తూనే, ఇహ లోకపు విషయాలలోనూ మంచి పట్టున్న వ్యక్తి అని ముస్లింలు నమ్మాలి. కానీ అలాంటి మతాన్ని నమ్మి ఆచరించే ముస్లిం ని, ముస్లిమేతర సమాజం ‘మంచి వ్యక్తి ‘ గా గుర్తించదు. ముస్లిమేతరుల దృష్టిలో మంచి ముస్లిం అంటే – గెడ్డం, టోపీ ఉండకూడదు. మతాన్ని సీరియస్ గా తీసుకోకూడదు. వీలైతే, అబ్దుల్ కలాం గారిలా అప్పుడప్పుడూ సంస్కృత శ్లోకాలు వల్లెవేస్తూ ఉండాలి.”
మంచి ముస్లిం విషయంలో, ముస్లిం లకూ, ముస్లిమేతరులకూ ఉన్న ఈ అండర్స్టాండింగ్ గ్యాప్, ముస్లిం సమాజంలో నాయకుల్ని ఎదగనీయకుండా, ఓ ప్రధాన అడ్డంకిలా ఉంది.
దీనిని యం.ఐ.యం – అసదుద్దీన్ ఓవైసీ కేస్ స్టడీ ద్వారా చూద్దాం.
అసదుద్దీన్ ఓవైసీ అనగానే చాలా మందికి ఏం గుర్తుకు వస్తుంది?
“మత పిచ్చి”
“ఆవేశంగా, రెచ్చగొట్టే స్పీచులిస్తాడు”
“ముస్లిం లు కూడా మతపిచ్చితో, ఇతనికే ఓట్లేస్తారు”
ఇవే దాదాపు చాలా మందికి గుర్తొస్తాయి.
కానీ, ఆయన గురించి చాలా మందికి తెలియని ఈ కింది విషయాలు చూడండి.
లోక్ సభ ఎం.పీ ల సగటు హాజరు శాతం 80%. తెలంగాణా ఎం.పీల సగటు హాజరు శాతం – 70%. కానీ, అసదుద్దీన్ ఓవైసీ సగటు హాజరు శాతం – 84%.
డిబేట్స్ లో క్రియాశీలకంగా పాల్గొనే సగటు జాతీయ శాతం – 63.6%
తెలంగాణా ఎం.పీలకు ఇది కేవలం – 36.6%
అసదుద్దీన్ విషయంలో ఇది – 57%
పార్లమెంట్లో ఓ ఎం.పీ సగటున అడిగే ప్రశ్నలు – 267
సగటు తెలంగాణా ఎం.పీ అడిగే ప్రశ్నలు – 281.
అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నలు – 683.
ఓ ఎం.పీ పనితీరుకు ఇంతకంటే కొలమానం ఏముంటుంది? ఈ అంశాల ఆధారంగానే, ఆయనకు 2014 సంవత్సరానికి గానూ, సన్సద్ రత్న అవార్డును ప్రకటించారు.
ఈ డాటా మొత్తం – http://www.prsindia.org అనే వెబ్సైట్లో భారత పార్లమెంటు అధికారిక రికార్డుల్లోనిదే. అణుమానమున్నోల్లు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దీనిలో ఆయన అడిగిన అన్ని ప్రశ్నల లిస్టు కూడా ఉంది. ఆ ప్రశ్నలన్నీ కేవలం ముస్లిం లకు సంబంధించినవి కావు. దలితులు,గిరిజనులు,ఆదివాసీలు, ప్రజా సంక్షేమం,విద్య,వైద్యం, సైన్స్-టెక్నాలజీ, విదేశీ వ్యవహారాలూ – ఇలా అన్ని అంశాల గురించీ ఆయన అనేక ప్రశ్నలు, చర్చలు, సూచనలూ చేసిఉన్నారు.
ఇక ఇప్పుడు ఆయన పార్టీ గురించి చూద్దాం.
యం.ఐ.యం. హెడ్ క్వార్టర్ నాంపల్లి దగ్గర్లోని, దారుస్సలాం అనే ప్రాంతంలో ఉంది.
అది నిత్యం వివిధ పనులపై అక్కడికి వచ్చేవారితో కిక్కిరిసి ఉంటుంది. వారిలో ముస్లిమేతరులు కూడా చాలామంది ఉంటారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు లేని రోజుల్లో, యం.ఐ.యం MLA లు, ఓవైసీ సోదరులూ ఆఫీస్ వరండాలో వరుసగా కుర్చీ లేసుకుని కూర్చుని ఉంటారు. ఏ నియోజకవర్గం ప్రజలు డైరెక్టుగా ఆ ఎం.యల్.ఏ దగ్గరకెల్లి తన సమస్యను చెప్పుకోవచ్చు. సదరు యం.ఎల్.ఏ. స్పాట్ లో దానికి కావల్సిన పని చేసిపెడతాడు. ఏవైనా ప్రభుత్వాసుల్లో పనులకి సంబంధించిన సమస్యలు ఉంటే, ఆ సంబంధిత అధికారికి అక్కడికక్కడే ఫోన్ చేసి మాట్లాడుతారు. ఇక్కడ కులం,మతం వివక్ష ఏ మాత్రం ఉండదు. ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏవైనా పెద్ద విషయాలు, ముఖ్యమంత్రి ఆఫీస్ కి సంబంధించినవైతే అసదుద్దీన్ ఓవైసీ దగ్గరికి పంపిస్తారు. వ్యక్తిగత ఆర్థిక సమస్యలో వచ్చే బీదా బిక్కీ జనాల కోసం చెక్ బుక్ పక్కనే రెడీగా పెట్టుకుని ఉంటారు. అక్కడ పని చేసే ఆఫీస్ బేరర్స్ లో అనేకమంది ముస్లిమేతరులు కూడా ఉన్నారు. ఇదంతా స్వయంగా నా కళ్ళతో చూసింది. అణుమానమున్నోల్లు ఎవరైనా దారుస్సలాం కి వెళ్ళిరండి.
ఆరోగ్య సమస్యలతో వచ్చేవారిని ఓవైసీ హాస్పిటల్ కి పంపిస్తుంటారు. అక్కడ ఖరీదైన వైద్యం, టెస్టులు, మందులు అన్నీ చాలా చవక ధరలకే చేస్తుంటారని విన్నాను.
మాలేగావ్, మక్కా మసీద్ బాంబు పేలుల్ల తర్వాత, పోలీసులు అనేక మంది పాతబస్తీ యువకుల్ని తీసుకెళ్ళి జైల్లలో పడేశారు. తెలుగు/జాతీయ మీడియా యధాలాపంగా వారందరినీ టెర్రరిస్టులని డిక్లేర్ చేసింది. ఆ అరెస్టుల గురించి రాష్ట్రంలోని ఏ పార్టీగానీ, నాయకుడుగానీ నోరెత్తి మాట్లాడలేదు. ఒక్క ఓవైసీ మాత్రం, సరైన ప్రాధమిక సాక్ష్యాధారాలు లేనప్పటికీ అడ్డగోలుగా అరెస్టులు చేసున్నారని వాపోయాడు.యం.ఐ.యం. పార్టీ ఆ యువకుల కుటుంబాలకు అండగా ఉండి వారికి కావలసిన న్యాయ సహాయం కల్పించింది. చివరికి ఆ నిందితులందరూ నిర్దోషులేనని కోర్టులు తేల్చాయి.
ఇంత యాక్టివ్గా, ఇంత క్రియాశీలంగా, జనాలకు అందుబాటులో ఉన్న నాయకునికీ/పార్టీకి, ఎవరు మాత్రం ఓటువేయకుండా ఉంటారు. అందుకే ఆయన అన్నిసార్లు నిరాటంకంగా గెలుస్తున్నారు. ఇవేమీ తెలీని వారు ఆయన కేవలం ముస్లిం కావడం వల్లే, పాతబస్తీ ముస్లింలు, మత పిచ్చితో, ఆయనకే ఓటు వేస్తున్నారని బల్లగుద్ది వాదిస్తుంటారు.
ఓవైసీ – మీడియా
భారత మీడియా ద్వారా అత్యధిక ప్రశ్నల్ని ఎదుర్కొని, వాటికి సమాధానం చెప్పిన నాయకుడు ఎవరు?
దీనికి సమాధానం నిస్సందేహంగా – అసదుద్దీన్ ఓవైసీ. యూటూబ్ లో ఓ సారి అసదుద్దీన్ ఓవైసీ ఇంటర్యూ అని కొట్టి చూడండి. వందల కొద్దీ లింకులు, గంటల కొద్దీ ఫూటేజ్ లూ వస్తాయి. దేశంలోని దాదాపు అన్ని హిందీ/ఇంగ్లీషు మీడియా చానల్లు ఆయన్ను గంటల పాటు, పోలీస్ ఇంటరాగేషన్ లాగా ఇంటర్వ్యూ చేశాయి. ఒక్కోసారి ముగ్గురు జర్నలిస్టులు, ఒక్కోసారి పది,ఇరవై మంది మూకుమ్మడిగా ఆయన్ను అడిగిందే అడగడం, ఏ మాత్రం ఆధారాలు లేకుండా అడ్డగోలు నిందలేసి దీనికి ఏం సమాధానం చెప్తారని నిందించడం, ఇది దాదాపు ప్రతి ఇంటర్వ్యూ లోనూ రిపీట్ అయ్యేదే. ఆయన ప్రతి ప్రశ్నకూ ఓపికగా సమాధానం ఇస్తూనే ఉంటాడు. అయినా ఈ మీడియా అవే ప్రశ్నల్ని తిప్పి,తిప్పి అడుగుతుంటారు. ఓవైసీని ప్రశ్నలడిగే కసి,కాఠిన్యంలో కనీసం పదోవంతు కాంగ్రెస్,బీజేపీ,ఆర్ యెస్ యెస్ నాయకులపై చూపించి అడిగిఉంటే, దేశం ఇప్పటికంటే ఎంతో మెరుగ్గా ఉండిఉండేది.
రెచ్చగొట్టే స్పీచులు – శాంతిభద్రతలు
“రెండు నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే” – అంటూ అక్కరుద్దీన్ ఓవైసీ చేసిన ప్రసంగం ముమ్మాటికీ తప్పే. ఆ ప్రసంగంలో ముందూ,వెనకా ఏముంది? అది ముస్లిమేతరులందర్నీ ఉద్దేశించిందా,లేక, ముస్లింలను తమ శత్రువులుగా భావించేవారిని ఉద్దేశ్యించిందా.. ఇవన్నీ న్యాయస్థానం డిసైడ్ చేయాల్సి ఉంది. కానీ, ఆ ప్రసంగానికి అతను ఇప్పటికే సుమారు 40 రోజులు జైల్లో ఉన్నాడు. కేవలం మైనారిటీలపై రెచ్చగొట్టే ప్రసంగాలతోనే నాయకులుగా ఎదిగినవారూ,ఎదుగుతున్న వారూ కొన్ని వందలమంది ఉన్న దేశంలో, ఓ యం.ఎల్.ఏ తన ప్రసంగానికి నలభై రోజులు జైల్లో గడపడం అనేది ఓ వింతల్లో కెల్లా వింత.
ఇక్కడ చెప్పుకోవలసిన విషయాలు – ఆ ప్రసంగానికి ముందుగానీ, తర్వాత గానీ అక్బరుద్దీన్ ఓవైసీ అలాంటి ప్రసంగాలు ఇవ్వలేదు. తెలంగాణా ఉద్యమం తారా స్థాయిలో ఉన్నప్పుడు కూడా, “హైదరాబాద్ దేశం మొత్తానికి చెందింది, సెట్లర్ అనే పదాన్ని నిషేధించాలి” అని అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.యం.ఐ.యం పార్టీ గత 10-15 ఏళ్ళ కాలంలో అది కనీసం ఒక్కసారైనా, స్ట్రైకులు, బందులకు పిలుపు నిచ్చింది లేదు. దేశంలో కొన్ని సంఘాలూ, సేనలూ మెయింటైంట్ చేస్తున్నట్లు, అదేమీ కర్రసాములూ, ఆయుధ ట్రైనింగులూ ఇస్తూ ప్రైవేట్ ఆర్మీని, అల్లరిమూక వానరసేనల్ని మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి, అక్బరుద్దీన్ ఓవైసీ పొరబాటునో,గ్రహపాటునో, ఆవేశంలోనో చెప్పిన ఓ మాటను పట్టుకుని, బీజేపీ,ఆర్ యెస్ యెస్ లను విమర్శించినప్పుడల్లా, యం.ఐ.యం ని కూడా విమర్శించి, ఆ విధంగా తమ తటస్థతను నిరూపించుకోవాలనే తాపత్రయం కొందరు నాస్తికులూ, సోకాల్డ్ సెక్యులరిస్టుల్లో కనిపిస్తుంటుంది. వీరి న్యూట్రల్ తాపత్రయం అంతిమంగా లాభం చేకూర్చేది బీజేపీకే.
యం.ఐ.యం కేవలం ముస్లింల పార్టీయా?
యం.ఐ.యం ప్రతి ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లిమేతరులకు కూడా టికెట్లు ఇస్తుంటుంది. యం.ఐ.యం ఎప్పుడూ ముస్లింల పక్షమే ఎందుకు వహిస్తుందని విమర్శించే మీడియాకు ఇది ఎప్పుడూ వార్తగా అనిపించదు. ఔరంగాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో యం.ఐ.యం తరుపున గెలిచిన ముస్లిమేతర కార్పోరేటర్ల సంఖ్య, కాంగ్రెస్ తరుపున గెలిచిన సభ్యుల సంఖ్య కంటే ఎక్కువే. గత పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనేక ముస్లిమేతరులు యం.ఐ.యం తరుపున పోటీచేశారు.
ఈ అంశాలన్నీ కళ్ళముందే కనిపిస్తున్నా, యం.ఐ.యం, ఓవైసీ ల పేరెత్తగానే, వారో అల్లరి మూక అనీ, మతోన్మాదులనీ, వారికి ఓట్లెసే వారందరూ కేవలం మతం చూసే ఓట్లేశారనీ దేశంలోని మెజారిటీ ప్రజలకు ఎందుకు అనిపిస్తుంది? మీడియాకు వారంటే ఎందుకంత కసి?
“అవును నేను ఖురాన్ ని గుండెల్లో నింపుకుని – భారత రాజ్యాంగానికి అణుగునంగా, అత్మాభిమానం, ఆత్మ విశ్వాసంతో తలెత్తుకుని బతికే ముస్లిం నే” – అని చెప్పేవారంటే బీజేపీ,ఆర్ ఎస్ ఎస్ లకు కడుపు మంట,కంపరం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఆర్ ఎస్ ఎస్ స్థాయిలో కాకపోయినప్పటికీ, ఇదే రకమైన కడుపు మంట, కంపరం మరో వర్గానికి కూడా ఉంది, అది దేశంలోని నాస్తిక, సో కాల్డ్ సెక్యులర్ వర్గం. మతాలన్నీ, తమ అస్తిత్వాన్నీ,రూపాన్ని కోల్పోయి కేవలం పండగ సెలవులుగా మిగిలిపోయిన ప్రస్తుత మార్కెట్ యుగంలో, ముస్లింలు ఇంకా మతాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటారో వీరికి అర్థం కాదు. వీరికి అర్థమయ్యేలా చెప్పడంలో, ఇస్లామిక్ స్పూర్తిని ఆచరించి చూపడంలో ముస్లింలు విఫలమయ్యారని చెప్పడం మరింత సముచితంగా ఉంటుంది.
మొత్తానికి ఈ దేశంలో ముస్లింలు బతికి బట్టకట్టాలంటే, వారు పోరాడాల్సింది కేవలం బీజేపీ,ఆర్ ఎస్ ఎస్ ల ప్రత్యక్ష భౌతిక దాడులతోనే కాదు. ఇస్లామోఫోబులు, కంఫ్యూజ్డ్(Confused) సెక్యులరిస్టుల మానసిక దాడులతో కూడా.ఎందుకంటే, తటస్థతని నిరూపించుకునే క్రమంలోనో, లేక నాస్తికత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలోనో వీరు చేసే మతిలేని విశ్లేషనలు, మతాన్ని సీరియస్ గా తీసుకునే ముస్లింలందరూ మత మౌఢ్యులే అనే ఇంప్రెషన్ని, సగటు ముస్లిమేతరుల్లో కలిగేలా చేస్తాయి.
మొదటిదాన్ని ఓటు హక్కు ద్వారా, కలిసొచ్చే వర్గాలతో సంఘటితమై రాజ్యాధికారాన్ని పొంది ఎదుర్కోవాలి. రెండోదాన్ని ఇస్లాం స్పూర్తిని, ప్రవక్త బోధనల్ని అర్థం చేసుకుని, ఆచరించి, ఉన్నతంగా జీవించి చూపి ఎదుర్కోవాలి. ఇదంతా చెప్పినంత ఈజీ కాదు. కానీ, ఉన్న మార్గం ఇదొక్కటే. ఇది కాక, మిగిలిన ఏకైక మార్గం ఘర్ వాపసీనే. మూతికి ముంత ముడ్డికి తాటాకే.
Note: యం.ఐ.యం అస్సలు కరప్షన్ లేని ఉత్తమ పార్టీ అనో, అది పాతబస్తీని లండన్ లాగా మార్చేసిందనో రాయలేదు. అది సగటు ముస్లింలనుండీ లంచాలు ఆశించకుండా, వారికి అందుబాటులో ఉండే పార్టీ కాబట్టే ముస్లింలు దానికి ఓట్లేస్తారనేది పాయింటు. రాయందాన్ని చదవకుండా రాసినంతమేరకే చదువుకోవాలని మనవి.
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in.