రక్షకున్ని సంరక్షించే రక్షకులు !!!

రక్షకున్ని సంరక్షించే రక్షకులు !!!
===========================

“ఇది ఇలాగే కొనసాగితే, భవిషత్తులో మన మతం అంతరించిపోతుంది.”
“మా మతానికి అన్యాయం జరిగితే సహించం.”
“మా దేవునికోసం ప్రాణాలైనా అర్పిస్తాం.”

ఇలా దేవున్ని/మతాన్ని రక్షించే బృహత్కార్యాన్ని తమ భుజాలపై మోస్తున్నామని భావించే భక్తాగ్రేసులకు కొదువలేదు.

కానీ, ఖురాన్ లో చెప్పబడిన దానిప్రకారం సృష్టికర్త, అల్-ముహేమిన్. అంటే, అన్నింటినీ/అందర్నీ రక్షించేవాడు/కాపాడేవాడు అని అర్థం. సృష్టికర్తకు గల మరో పేరు – అస్-సమద్. అంటే- Absolute Self-sufficient. ఏ ఒక్కరి సహాయం,ఆసరా అవసరం లేనివాడు అని.

అందర్నీ రక్షించే సృష్టికర్త తనను తాను కాపాడుకోలేడా? పైగా, ఇంత పెద్ద సృష్టిని,విశ్వాంతరాలను సృష్టించి, ఇన్ని వేల సంవత్సరాల నుండీ వీటిని సమ్రక్షిస్తున్న దైవాన్ని, మహా అయితే ఓ 100 ఏళ్ళు ఈ భూమిపై నివసించి, అనంతరం ఎముకల అస్తిపంజరంగా మిగిలే పోయే ఓ మానవుడు రక్షించడమా? ఇది వినడానికే చాలా వింతగా, కామెడిగా లేదూ.

మనిషిని పుట్టించిన దేవుడు వేరు. మనిషి పుట్టించిన దేవుడు వేరు. దేవున్ని/మతాన్ని రక్షిస్తామని చెప్పేవారు, మనిషి పుట్టించిన దేవుడి గురించి మాట్లాడే వారై ఉంటారు. లేక, అసలు దైవత్వం అనే భావనని ఏ మాత్రం అర్థం చేసుకోలేని మూర్ఖ భక్తులైనా అయ్యుంటారు.

ఇలాంటి వారే, కేరళలో ముగ్గురు అమ్మాయిలు బురఖా ధరించి ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారని వారిపై విరుచుకుపడతారు. జహీర్ ఖాన్ హిందూ అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడనీ, బొట్టు పెట్టుకున్నాడనీ, గుడికి వెళ్ళాడనీ, దాని ద్వారా తమ మతానికి అన్యాయం జరిగిందనీ గింజుకుంటుంటారు. సానియా మీర్జా గౌనూ, ఇర్ఫాన్ పఠాన్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన తలపై ముసుగులేని వాళ్ళావిడ ఫోటోలు.. ఇవన్నీ వీరి దేవున్ని ప్రమాదంలో పడేసేవే. పాపం.. ఇలా ప్రతిదీ వీరిని అశాంతికి గురిచేస్తుంది.

నిజానికి ఇస్లాం ని సరిగ్గా అర్థం చేసుకుంటే అది మనిషి పుట్టించిన దేవుని మతం కాకుండా, మనిషిని పుట్టించిన దేవుడిమతమనే విషయం ఈజీగానే తెలిసిపోతుంది. ఎలాగంటే – దేవుడు Self-sufficient, కాబట్టి ఆ దేవున్ని ఆరాధించే మనిషి కూడా ఆ పనిని self-sufficient గా చేయగలగాలి. ఉదాహరణకు.. రేపు తెల్లారే సరికల్లా ఈ భూమిమీద ఉన్న అన్ని మసీదులూ కూల్చబడి నేలమట్టమయ్యాయనుకోండి. అట్లే , ఈ భూమిమీద ఉన్న అన్ని ఖురాన్ ప్రతులు ఒక్క అక్షరం కూడా మిగల్చకుండా కాల్చేయబడ్డాయనుకుందాం. అప్పుడెలా? అప్పుడు అల్లా పరిస్తితి ఏంటి? అప్పుడు ఇస్లాం మనుగడ ఉంటుందా?
ఇవేగనక జరిగితే, దాని వల్ల ఇస్లాం పై ఇసుమంత కూడా ప్రభావం ఉండదు.

ఎలాగంటే – నేను పొద్దున లేచి నమాజ్ చదవాలంటే నాకు కావలసింది 3 అడుగుల నేల. నేను ఒక్కన్నే ఉంటే, ఒంటరిగానే నమాజ్ చేసుకుంటా( దానికి కావలసిన సూరాలు దాదాపు ప్రతి ముస్లిం కీ కంఠతా వచ్చే ఉంటాయి). నాతో పాటు ఇద్దరు, లేదా అంతకు మించి ఎక్కువ మంది నమాజ్ చదివేవారు ఉంటే, అందరం కలిసి ఒక్కసారే నమాజ్ చేస్తాం. మాలో ఎవరో ఒకరు ముందుంటారు,( అది ర్యాండంగా ఎవరైనా కావచ్చు,నేనైనా కావచ్చు) మిగతావారు ఆయనని అనుకరిస్తారు. దట్సాల్.. 5 నిమిషాల్లో ఈ నమాజ్ పూర్తవుతుంది. మా అపార్ట్మెంట్ సెల్లార్లో చేసే ఈ నమాజ్ కి, చార్మినార్ దగ్గరున్న వందల సంవత్సరాల చరిత్రగల మక్కా మస్జిద్ లో చేసే నమాజ్ కి పుణ్యం విషయంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు.
అట్లే ఖురాన్ విషయానికి వస్తే , ఇప్పుడున్న అన్ని ఖురాన్ ప్రతులూ ఒక్క నిమిషంలో మాయమైపోయినా, దానిని మొదటి అక్షరం నుండీ చివరి అక్షరం వరకూ, పొల్లుపోకుండా తమ మనో ఫలకంపై ముద్రించుకున్న ముస్లింలు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఓ ఆఫ్రికన్ ముస్లిం,ఓ అమెరికన్, ఓ అరబ్, ఓ చైనీయుడు… వీరందరూ కలిసి కూర్చుని ఏకగ్రీవంగా ఓ అరగంటలో ఓ ఖురాన్ ప్రతిని రాసి ఇవ్వగలరు.

ఇన్ని ప్రత్యేకతలు గల ఇస్లాం, నిత్యం ఏదో ఓ విమర్శను ఎదుర్కొంటుండటం వెనుక అనేక రాజకీయ కుట్రలతో పాటు, ముస్లింలమని చెప్పుకుంటూ కూడా, ఇస్లాం ని సరిగా అర్థం చేసుకోలేని కొందరు ముస్లింల మూర్ఖత్వం ఓ కారణం. అమ్మాయిల డ్యాన్సు, ఓ సినిమా, ఓ కార్టున్ మనల్ని అశాంతికి గురిచేస్తున్నప్పుడు, మనం పాటించేది శాంతియుతమతమని ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం ఉండదు. కాబట్టి – My Dear Brothers and Sisters – Just CHILL..
Assalam Alaikum.. Peace be upon you.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.