రవీష్ కుమార్ స్వర్గానికి వెళ్తారా, లేదా?

ఇటీవల జకీర్ నాయక్ ని, ఈ ప్రశ్న అడిగారు. ఆయన ఏదో సమాధానం చెప్పారు. దానిని చాలా మంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు.

ఈ ప్రశ్నకు నాకు తోచిన సమాధానం ఇది.

********* ప్రశ్నవేయగానే ఠంచనుగా సమాధానం కోసం వెతుక్కోకుండా, కొన్ని సార్లు ప్రశ్ననే ప్రశ్నించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు, అమీర్ ఖాన్ కి ఒలింపిక్ పతకం వస్తుందా,రాదా అని అడిగితే ఎలా వుంటుంది?

ఉసేన్ బోల్ట్ కి అస్కార్ అవార్డు వస్తుందా,రాదా అని అడిగితే ఎలా ఉంటుంది?

వీటికి ఎవరైనా ఇచ్చే సమాధానం-> “అసలు వాల్లకి అలాంటి లక్ష్యాలే లేనప్పుడు, వారు దానికోసం ప్రయత్నమే చేయనప్పుడు, వారికి అవన్నీ వస్తాయా రావా అనే ఆలోచనే అసంబద్ధమైనది.”

రవీష్ కుమార్ స్వర్గానికి వెల్తారా, లేదా అనే ప్రశ్న ముస్లింలని అడగడం కూడా అలాంటిదే.

అసలు ఇలాంటి ప్రశ్న అడగడం వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్ ని ఓ సారి పరిశీలిద్దాం.

మతాలన్నీ మంచే చేయమని చెప్పాయి కాబట్టి, రవీష్ కుమార్ చాలా గొప్ప మంచి చేశారనే ఇంప్రెషన్ జనాల్లో ఉంది కాబట్టీ, ఆ మతాలు ప్రామిస్ చేసిన స్వర్గం ఈయనకు కూడా ఆటోమేటిక్ గా వచ్చేయాలనీ, అలా రావని చెప్పిన మతం, తన సిద్ధాంతాల్ని తానే కాంట్రడిక్ట్ చేసినట్లుగా ప్రూవ్ చేయొచ్చనే ఆలోచనతో కొందరు ఈ ప్రశ్నను అడుగుతారు.

ఇదే ప్రశ్న మహాత్మా గాంధీ స్వర్గానికి వెల్తారా లేదా అని కూడా అడగొచ్చు. మరో అడుగు ముందుకేసి, అండమాన్లోని సెంటెనలీస్ తెగవారు స్వర్గానికి వెల్తారా,లేదా అని కూడా అడగొచ్చు.

ఇంతకీ మహాత్మా గాంధీ మంచే చేశారా?

ఈ ప్రశ్న నన్ను హైస్కూల్లోనో,జూనియర్ కాలేజ్ లోనో ఉన్నప్పుడు అడిగిఉంటే, అవునని బల్ల గుద్ది వాదించి ఉండేవాడిని. కానీ, పూణా ఒప్పందం,అంబేద్కర్ తో విబేధాలూ, తిలక్ లాంటి వారికి మద్దతునివ్వడాలు – ఇవన్నీ తెలిసింతర్వాత, గాంధీ నమ్మిన/చేసిన మంచి గురించి చాలా అణుమానాలు కలిగాయి. అంచేత, గాంధీ మంచోడా-చెడ్డోడా అనే విషయం మీద నా అభిప్రాయం 50-50

పీవీ నరసిమ్హారావ్ మంచి చేశాడా, చెడు చేశాడా?

వైయస్సార్ మంచి చేశాడా,చెడు చేశాడా? ఇలాంటి వాటన్నిటికీ సమాధానం, “మంచి” కి ఎవరికి వారు ఇచ్చుకునే డెఫినిషన్ ని బట్టి ఉంటుంది.

ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం.

రోడ్డు మీద ఓ గుడ్డి వ్యక్తి, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ముష్ఠి అడుక్కుంటూన్నాడు.

ఒకటో వ్యక్తి అతనికి 1000/- రూపాయలిచ్చాడు.

రెండో వ్యక్తి 10/- ఇచ్చాడు.

మూడో వ్యక్తి ఏమీ ఇవ్వకుండా, అతన్ని చూస్తూ సైలెంటు గా వెళ్ళిపోయాడు.

నాలుగో వ్యక్తి, ఏమీ ఇవ్వకుండా, అతని నల్ల కళ్ళద్దాల్ని లాక్కుని, అక్కడి నుండీ వెళ్ళగొట్టాడు.

ఇదంతా రోడ్డుకు కాస్త దూరంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.

ఇప్పుడు ఆ కెమెరా రికార్డింగ్ చూస్తున్నవారి దృష్టిలో గొప్పోడు ఎవరు, మంచోడు ఎవరు, చెడ్డోడు ఎవరు, అనే విషయం ఈజీగానే ఊహించొచ్చు.

ఇప్పుడు కొంత అదనపు సమాచారం –

మొదటి వ్యక్తి, వెయ్యి రూపాయలు ఇస్తున్న సీన్ ని, తన మిత్రునికి చెప్పి సెల్ ఫోన్ లో రికార్డ్ చేయించాడు. దానిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి, అందరి చేతా దాణకర్ణుడనే పేరు పొందాడు. ఈ వీడియోని సాక్ష్యంగా చూపి, మరో పదివేలు విరాళాలు రాబట్టాడు.

పది రూపాయలు ఇచ్చిన రెండో వ్యక్తి మాత్రం – రోజూ కూలీకి వెళ్ళి 100 రూపాయలు సంపాదిస్తాడు. దాన్లోనే 10 రూపాయలు తీసి ఇచ్చాడు.

ఇప్పుడు ఎవరు గొప్పని మీకు అనిపిస్తుంది ?

ఇక అసలు విషయం – ఆ ముష్ఠి అడుక్కునే వ్యక్తి అసలు అంధుడే కాదు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని జనాల్ని మోసం చేస్తున్నాడు. వచ్చిన డబ్బుతో తాగి, రోజూ భార్యా పిల్లల్ని తంతున్నాడు. ఈ విషయం తెలుసు కాబట్టే మూడో వ్యక్తి ఏ సహాయం చేయకుండా వెళ్ళాడు. ఈ విషయం తెలిసిన నాలుగో వ్యక్తి, మరో అడుగు ముందుకేసి, అతని చేతిలో ఎవ్వరూ మోసపోకూడదని, అతని అద్దాల్ని లాక్కుని, అక్కడి నుండీ వెళ్ళగొట్టాడు.

ఇదంతా తెలిశాక, మీకు ఇప్పుడు ఎవరు గొప్ప అనిపిస్తుంది?

మొత్తానికి ఇక్కడ చెప్పే పాయింట్ ఏమంటే – మనిషి యొక్క నాలెడ్జ్ లిమిటెడ్ మాత్రమే. ఆ లిమిటెడ్ నాలెడ్జ్ ఆధారంగా నే తన కళ్ళముందు జరిగే అన్ని విషయాల్నీ విశ్లేషిస్తుంటాడు. అన్ని విషయాల్నీ జడ్జ్ చేస్తుంటాడు. ఆ లిమిటెడ్ నాలెడ్జే కరెక్ట్ అని కానీ, అదే మొత్తం నాలెడ్జ్ అని కానీ, చెప్పడానికి లేదు.

సెంటనలీస్ స్వర్గానికి వెల్తారా, వెళ్ళరా?

అండమాన్ దీవుల్లోని సెంటనలీస్ తెగ వ్యక్తుల గురించి కొన్ని విషయాలు మనకు తెలుసు.చాలా విషయాలు తెలీదు. తెలిసినదాన్ని బట్టి, వారు అబ్దుల్లా, అహ్మద్, షరీఫ్ వంటి పేర్లు పెట్టుకునే, హిజాబ్ ధరించే ముస్లింలు మాత్రం కాదు. ముస్లింలు కాదు కాబట్టి – జడ్జిమెంట్ డే రోజున అల్లా వారందరినీ ఆటోమేటిక్ గా నరకంలో పడేస్తాడని ఎవరైనా అంటే – అది తప్పుడు విశ్లేషణే అవుతుంది. ఎందుకంటే – “నీకు, నీ సొంత వారికీ ఎంత కష్టం-నష్టం కలిగించేదైనా సరే, ఎల్లప్పుడూ న్యాయం వైపునే నిలబడమని, ఖురాన్ లో అల్లా నే స్పష్టంగా చెప్పి ఉన్నాడు. (ఖురాన్ 4:135). ఇలాంటి వాక్యాలు ఖురాన్లో చాలా కనిపిస్తాయి. అలాంటప్పుడు అల్లా అంతిమదినం నాడు, కేవలం సర్టిఫికేట్లో ముస్లిం అని ఉన్నోల్లందరినీ స్వర్గంలోనూ, ముస్లిమేతరులందర్నీ నరకంలోనూ పడేస్తారనే ఆలోచనే హాస్యాస్పదమైంది.

రవీష్ కుమారే కాదు. ప్రతి వ్యక్తి జీవితమూ యూనిక్, దానికదే ప్రత్యేకం.నాకు అర్థమైనంత మేరకు, ఓ వ్యక్తికి అందుబాటులో ఉన్న వనరులు, అతనికి అందుబాటులో ఉన్న ఆప్షన్స్ ఆధారంగానే అతనిని జడ్జ్ చేయడం జరుగుతుంది.

ఉదాహరణకు – సెంటెనలీస్ తెగలోని ఓ వ్యక్తి, ఓ కొయ్య బొమ్మను దేవునిగా భావించుకుని దానికి మహిమలున్నాయనే నమ్మకంతో పూజలూ-పురస్కారాలూ చేస్తున్నాడనుకుందాం. ఓ రోజు పెద్ద వరదొచ్చి, ఆ కొయ్యబొమ్మ వరద నీటిలో కొట్టుకునిపోతే, దానికి మహిమలేవీ లేవని అతనికి నిర్ధారణ ఐపోవాలి. కానీ, అతను అప్పటికి కూడా రియలైజ్ అవ్వకుండా, మరో చెక్కను అదే రూపంలో బొమ్మగా మలీచి, దానికీ మళ్ళీ ఫ్రెష్ గా పూజలు చేస్తున్నాడనుకుందాం. కొన్నాల్లకు సడెన్ గా ఓ పాము కరచో,పులి కి చిక్కో, చావు అతనికి ఎదురుగా వచ్చినిలబడినప్పుడు, ఆ చెక్క బొమ్మ తనకు ఎలాంటి సహాయమూ చేయలేదనే విషయం తనకు అప్పుడు క్లియర్ గా అర్థమవ్తుంది. తన జీవితకాలం మొత్తం ‘ఫాల్స్ గాడ్’ ని పూజించినందుకు తనని తాను తిట్టుకుంటాడు. మరొక్క అవకాశం ఇవ్వమని, నిజ సృష్టికర్తను బ్రతిమలాడుకుంటాడు. కానీ, అప్పటికే ఓ అవకాశం కోల్పోయాననే విషయం అతన్ని అత్యంత ఎక్కువగా బాధిస్తుంది.

ఓ చిన్న ల్యాండ్ బిట్ కొనాలా,వద్దా అని ఆలోచించి, వద్దనుకున్నాక దాని రేట్ అమాంతం పెరిగిపోతే, అవకాశం కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో చాలా మందికి అనుభవంలో ఉండే ఉంటుంది. అలాంటిది, చావు ఎదురుగా వచ్చి నిలిచింతర్వాత, ఓ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నామనే బాధ ఏ రేంజ్ లో ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. అది నరకానికి శాంపిల్. ఇలాంటి నరకానికి మమ్మల్ని అన్యాయంగా ఎందుకు గురిచేశావని సృష్టికర్తని ఎవరూ నిందించలేరు. అలాగే కేవలం కొన్ని కుటుంబాల్లో పుట్టినందుకో, సర్టిఫికేట్స్ లలో ఓ పర్టికులర్ మతమని రాసుకున్నందుకో, మెకానికల్ గా, గుడ్డిగా కొన్ని భౌతిక ఆచారాల్ని పాటించినందుకో తమకు ప్రత్యేక రాయిలేవీ ఇవ్వబడవనేవిషయం కూడా చాలా మందికి అర్థమవుతుంది.

మొత్తానికి ఎవరిజీవితంలో ఏం జరుగుతుందో, ఎవరు ఎలాంటి ఆప్షన్స్ మధ్య దేనిని ఎంచుకుని, దేనిని రెజెక్ట్ చేస్తున్నారో వారికి మాత్రమే తెలుసు. కేవలం పైకి కనబడే కొన్ని విషయాల్ని బట్టి ఎవరిజీవితాల గురించీ ఎలాంటి అంచనాలకూ రాలేము. అసలు అలాంటి ప్రయత్నమే ఓ వృధా ప్రయాస. మనం ఏ లాజిక్ లూ, సూత్రీకరణలద్వారా ఎలాంటి కన్‌క్లూజన్లకొచ్చాం, మనకు అందుబాటులో ఉన్న సమయాన్నీ, వనరుల్నీ ఎలా వినియోగం చేస్తున్నమనేదే ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవలసింది.

Leave a Reply

Your email address will not be published.