రియల్ ఛాంపియన్ – ఖబీబ్ నర్మగొమదెవ్!!!

“ఈ రోజు నేను ఛాంపియన్ ని. రేపు ఇంకొకరు కావొచ్చు. ఎల్లుండి మరొకరు. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. మన కంటి చూపు, మన వినికిడి ఙానం, మన ప్రతిభ,సామర్థ్యం అన్నీ సృష్టికర్త పరీక్షలో భాగంగా మనకు ప్రసాదించబడినవే. ఈ విజయాలూ,పతకాలూ,బిరుదులూ,టైటిల్లూ ఇవేవీ నాకు ముఖ్యం కాదు. సృష్టికర్తతో నా రిలేషన్ ఎలా ఉందనేదే నాకు అత్యంతముఖ్యమైంది. దీని తర్వాతే వేరే ఏదైనా” – ఈ మాటలన్నది ఎవరో అనామకుడు కాదు. MMA ( మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) లో, 28 మ్యాచులు ఆడి, ఏ ఒక్కదానిలోనూ ఓడిపోకుండా, 28 మ్యాచులూ గెలిచిన అన్‌డిఫీటబుల్ వరల్డ్ ఛాంపియన్ – ఖబీబ్ నర్మగొమదెవ్. (MMA బాక్సింగ్ లాంటిదే కానీ, బాక్సింగ్ కంటే చాలా కష్టమైంది,ప్రమాదకరమైంది.

బాక్సింగ్ లో కేవలం పంచెస్ మాత్రమే ఉంటాయి. కానీ MMA లో ఎలాగైనా సరే, అప్పోనెంట్ ని ఓడించడమే ముఖ్యం. దీనిలో కిక్ లు, రెస్లింగ్ లో లాగా నేలపై పడేసి పూర్తి కంట్రోల్ లోకి తెచ్చుకోవడం వంటివన్నీ ఉంటాయి.) రష్యాకు చెందిన ఖబీబ్ – ప్రస్తుతం రష్యన్లలోకెల్లా అత్యంత ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీ కూడా. కానీ, అతని బిహేవియర్ లో గానీ, మాటతీరులోగానీ, ఎక్కడా అతనొక వరల్డ్ ఛాంపియన్ ననే గర్వం గానీ,నెగెటివ్ యాటిట్యూడ్ గానీ కనిపించవు. ‘డౌన్ టు ఎర్త్’ అనే పదానికి పర్యాయపదంలా ఉంటాడు. మ్యాచ్ గెలిచాక షాంపెన్ పొంగించడం చాలా ఆటల్లో సర్వసాధారణం. కానీ, ఖబీబ్ మాత్రం నేరుగా తన రూమ్ కి వెళ్ళి నమాజ్ లో లీనమవుతాడు. ప్రత్యర్థులపై నోరు జారడం గానీ, వారిని కించపరచడం గానీ, తక్కువచేసి మాట్లాడటం గానీ చేయడు .ఖబీబ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి మ్యాచ్ అనంతరం, మ్యాచ్ రెఫరీ ఖబీబ్ చేతిని గాల్లోకి ఎత్తి, అతన్ని విజేతగా డిక్లేర్ చేస్తూన్నప్పుడు, ఖబీబ్ తన మరో చేతి చూపుడు వేలుని ఆకాశం వైపు చూపిస్తూ, అసలైన చాంపియన్ పైవాడేననే అర్థం వచ్చే గెస్చర్ చూపించడం , MMA మ్యాచ్ లు చూసేవారందందరికీ తెలిసే ఉంటుంది. టొనీ ఫెర్గ్యూసన్ అనే ప్రత్యర్ధి, ఖబీబ్ అంతు తేలుస్తానని, నిమిషాల్లోనే అతన్ని మట్టికరిపిస్తాననీ ప్రగల్బాలు పలికితే, ‘సరే మ్యాచ్ లో చూద్దాంలే’ అని సింపుల్ గా జవాబిచ్చాడు. ఖబీబ్ నుండీ ఎలాగైనా సరే ప్రవొకేటివ్ స్టేట్మెంట్ చెప్పించాలని కంకణం కట్టుకున్న జర్నలిస్టులు – టోనీకి మానసిక సంతులనం లేదనీ, అతని వ్యక్తిగత జీవితంలో కలుగుతున్న ఒడిదుడుకుల వల్ల అతని ఎమోషన్స్ కంట్రోల్ లో ఉండటంలేదనీ ఇటీవల వార్తలొచ్చాయి- దీని గురించి మీరేమంటారని ఖబీబ్ని ప్రశించారు. దీనికి ఖబీబ్ ఇచ్చిన సమాధానానికి జర్నలిస్టుల మైండు బ్లాంక్ అయ్యింది. “టోనీ నా అప్పోనెంట్. అతన్ని వ్యక్తిగతంగా తక్కువచేసి మాట్లాడటం పద్దతి కాదు. పర్సనల్ లైఫ్ లో సమస్యలు రావడం అనేది కామన్ విషయం. ఎవరి జీవితంలో సమస్యలు లేవు? అతను నిజంగానే సమస్యల్లో ఉంటే, దానికి మనం ఏ సాయం చేయగలమో చూడాలి. అంతే తప్ప, వాటి గురించి చీప్ కామెంట్లు చేయడం పద్దతి కాదు” – ఇదీ ఖబీబ్ ఇచ్చిన సమాధానం. ఇక ప్రీవియస్ MMA ఛాంపియన్, ఐర్ల్యాండ్ కి చెందిన కానర్ మెక్ గ్రెరొర్- ఖబీబ్ తో మ్యాచ్ కి ముందు, ఖబీబ్ ని రెచ్చగొట్టడానికి కానర్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఇస్లాం నీ, ఖబీబ్ కుటుంబాన్నీ రోజుకోరకంగా తిట్టేవాడు. ఖబీబ్ ప్రయాణిస్తున్న బస్సుపై కుర్చీ విసిరేసి ఇద్దరు ప్రయాణీకుల్ని గాయపర్చాడు. ఐనా ఏ ఒక్కరోజూ రెస్పాండ్ అవ్వని ఖబీబ్, ఆ మొత్తం కోపాన్ని మ్యాచ్ లో చూపించాడు. నాలుగురౌండ్లలో అతన్ని చిత్తుగా ఓడించి, చాంపియన్ టైటిల్ ని సొంతం చేసుకున్నాడు. రష్యాలోని డాగెస్తాన్ అనే మారుమూల పర్వత ప్రాంతం నుండీ వచ్చిన ఖబీబ్, తన తండ్రి శిక్షణలో చిన్నప్పటినుండీ చాలా కఠోరమైన ప్రాక్టీస్ చేయడం అతని విజయాల్లో కీలకంగా మారింది. తొమ్మిదేళ్ళవయసప్పుడు, తన పెంపుడు ఎలుగుబంటితో కుస్తీ ప్రాక్టీస్ చేశాడు. ఆ వీడియోలు యూటూబ్ లో ఉన్నాయి. ఖబీబ్ చాంపియన్ టైటిల్ గెలిచాక, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఖబీబ్ ని కలిశాడు. పుతిన్ కు కూడా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది కాబట్టి, తాను ఖబీబ్ మ్యాచుల్ని ఆసక్తిగా చూస్తుంటాననీ, ఖబీబ్ అప్రోచ్,టెక్నిక్ తనకు చాలా ఇష్టమనీ మెచ్చుకున్నాడు.వెల్త్,మెటీరియలిజం, సెలెబ్రిటీ కల్చర్ జనాల మనసుల్ని రూల్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో, వీటన్నిటినీ సాధించి కూడా, వీటినేమాత్రం లెక్కచేయకుండా, తామరాకుపై నీటిబొట్టులా జీవిస్తున్న ఖబీబ్, అందరికీ ఆదర్శం.శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.