వ్యక్తిత్వ వికాసం…?

ఇంజినీరింగ్ విద్యార్థులకి ఓరియంటేషన్ సెమినార్ ఇవ్వమని ఓ ఇన్విటేషన్ వచ్చింది. రవాణా,వసతి సౌకర్యాలూ వంటివన్నీ వారే సమకూరుస్తామని చెప్పారు. పన్లో పనిగా, ఓ శాలువా షీల్డూ,గీల్డూ.. లాంటివి కూడా ఇస్తారని అక్కడ HOD గా పనిచేసే నా ఫ్రెండు టెంప్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆఫర్ బాగానే ఉంది కానీ, నేను తేల్చుకోలేక పోయిన విషయం – అక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్స్ కి ఏం చెప్పాలి? Orientation towards what..? అని.

1.బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోండి అని చెబ్దామంటే – నా అనుభవం ప్రకారం -‘ఆ మార్కులు నాలుక గీసుకోను కూడా పనికి రావు. నాకు బి.టెక్ లో వచ్చిన మార్కులు జస్ట్ ఫర్స్ట్ క్లాస్. ఎగ్జాంస్ కి ముందు రోజు తప్ప, మిగతా రోజుల్లో బి.టెక్ పుస్తకం పట్టింది లేదు. కానీ, చాలా మంది టాపర్ల కంటే కూడా నాకు చాలా ముందే MNCలో జాబ్ వచ్చింది.2.పోనీ ప్రాక్టికల్ నాలెడ్జీ పెంచుకోండి అని చెబ్దామంటే- ఆ ప్రాక్టికల్ నాలెడ్జీ రేపొద్దున్న జాబ్ సెర్చ్ లో పనికొస్తుందన్న గ్యారెంటీ లేదు. ఉదాహరణకి – ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లాంటి వివిధ బ్రాంచ్ లలో మంచి ప్రాక్టికల్ నాలెడ్జీతో బి.టెక్ లు చదివిన వారు కూడా, చివరికి ల్యాండ్ అయింది తమకు అంతగా పరిచయం లేని IT ఫీల్డ్ లోనే. తమ కోర్ బ్రాంచ్ లో వారి నాలెడ్జ్ అంతా కూడా అడవి కాచిన వెన్నెలే అయింది.3.అసలు ఇవన్నీ కాకుండా, సత్యం, అహింసల గురించి చెప్పి – మీరందరూ కూడా పెద్దోళ్ళయ్యాక గాంధీగారిలా మంచోల్లూ,గొప్పోల్లవ్వాలని చెప్దామంటే – “ఇప్పుడు గాంధీ, హీరోనా, విలనా అని ఓ పబ్లిక్ పోల్ పెడితే మెజారిటీ రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఊహించడం కూడా కష్టమే.” అంటే, మంచి, చెడు అనే విషయాలకి మనుషులు ఇచ్చుకునే నిర్వచనాలు ఎంత ఈజీగా మారిపోతాయో మనకు కళ్ళ ముందే కనిపిస్తుంది. 4.పోనీ, ఇవన్నీ కాకుండా – జీవితంలో, ఏం సాధించినా, సాధించకున్నా.. ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉండాలిరా అబ్బాయిలూ అని వేదాంతం చెబ్దామంటే – అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే వారిని మన పాడు సమాజం తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అంటే అస్తమానం నవ్వుతూ ఉండే శాల్తీలు మనకు తారసపడేది అక్కడే కదా..5.పోనీ, బాగా పుస్తకాలు చదివి, మస్తుగా నాలెడ్జీ/విగ్ఞానం పెంచుకోండయ్యా అని చెబుదామంటే.. మా బాల్య స్నేహితులు గుర్తొచ్చి ఆగిపోతున్నా. నేను ఆఫ్రికన్ నీగ్రోలగురించీ, హిట్లర్ ఆకృత్యాల గురించీ, ప్రపంచ యుద్ధాలు, అంపశయ్యలు, అసమర్థుని జీవిత చరిత్రలూ లాంటివన్నీ చదివేసి మైండ్ ఖరాబు చేసుకుంటుంటే, ఇంటర్ ఫెయిల్ అయిన మా బాల్య స్నేహితులు చాలా మంది బిజినెస్సులోకి, రియల్ ఎస్టేట్ లోకీ దిగి ఒక్కొక్కడు ఊర్లో 3,4 నాలుగు బంగ్లాలు కట్టిపడేసి ఉన్నారు. వీల్లెవరూ వారి ఖాతా పుస్తకాలు తప్ప, మరో పుస్తకాన్ని టచ్ చేసి కూడా ఉండరు. ఇక నువ్వు అన్నేసి పుస్తకాలు చదివి ఏం పొడిచావని ఆ పిల్లల్లో ఎవరైనా నిలదీసి అడిగితే ఏం చెప్పేది..?సో.. ఈ రకంగా.. Orientation towards what అనే అంశం తేలని కారణంగా ఆ ఆఫర్ ని చాన్నాల్ల నుండీ హోల్డ్ లో పెడుతూవస్తున్నా.. *************స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడమేది తర్వాత సంగతి. ఇలాంటి స్పీచ్ ల ద్వారా డబ్బు/శాలువాలూ సంపాదించాలనే మోటివేషన్ ఎవరికైనా కలిగిందంటే, పైన చెప్పిన ఐదు అంశాల గురించి గానీ, వేరే ఏదైనా అంశం గురించి గానీ, ఓ నాలుగు పిట్టకధలూ,పొడుపుకధలూ సిద్ధం చేసుకుని ఆ రంగం లోకి దూకే ఆప్షన్ మాత్రం ఎవరికైనా ఓపెన్ గానే ఉంది.

Leave a Reply

Your email address will not be published.