శోకాలు పెట్టొద్దు!!!

“కనపడినోళ్ళందరికీ నీ బాధలు చెప్పుకుని శోకాలు పెట్టకు. సగం మంది పట్టించుకోరు. మిగతా సగం లోలోపల ఆనందిస్తారు. నీ బాధలపట్ల కన్సర్న్ ఉన్న ఒకరిద్దరికి నీవు అదేపనిగా చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుసుకుంటారు.” -ఇది వ్యక్తిగత స్థాయిలోనే కాక, ఓ సమూహంగా ముస్లిం సమాజం మొత్తానికి వర్తిస్తుంది.

బాబ్రీ మసీదు కూల్చేశారని దేశంలో రెగ్యులర్ గా నమాజ్ చదివే ముస్లిం ఎవరూ ఒక్కపూట కూడా నమాజ్ మానేసి ఉండడు. నిజానికి ఆ రోజు కూలిపోయింది మసీదు కాదు. ఈ దేశ రాజ్యాంగం, సుప్రీంకోర్టు పరువు,విశ్వనీయత, ఇవీ కూలిపోయింది. ఇప్పుడు బోనులో నిలబడి తనను కాపాడమని విలపిస్తున్నది కూడా భారత రాజ్యాంగమే తప్ప హిజాబీ అమ్మాయిలు కాదు.

ఇస్లాం ఇటుకలతో కట్టిన మసీదు గోడలపైనో, హిజాబ్,జుబ్బాపైజామాలాంటి వస్త్రాలపైనో ఆధారపడి మనుగడ సాగించే మతం కాదు. సామ్రాజ్యాధినేతలకు కూడా అణుకువను, కట్టు బానిసలకు కూడా కొండంత ఆశను ఇవ్వగల డ్రైవింగ్ ఫోర్స్ ఇస్లాం.

జీవితంలో ఒక్కసారైనా మక్కా కి హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం ప్రాధమిక సూత్రాలలో ఒకటి. కానీ, ఇది అందరికీ వర్తించదు. వెళ్ళదగిన ఆర్థిక స్థోమత,ఆరోగ్యం ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. “నీదగ్గర ఎన్ని పైసలుంటే నీకు హజ్ చేయాల్సినంత ఆర్థిక స్థోమత ఉన్నట్లు” – అనే విషయం మతపెద్దలో,ప్రభుత్వమో,ఇతరులో ఫిక్స్ చేసి చెప్పేది కాదు. అల్లాహ్ ఆగ్ఞను శిరసావహించాలనే అంతర్గత తపన, నీ దైనందిన వ్యక్తిగత జీవితంలో నీకున్న బాధ్యతలు,కంపల్షన్స్ ల మధ్య జరిగే డెలికేట్ కాన్‌ఫ్లిక్ట్ లో, ఏవైపు మొగ్గాలనేది ఎవరికి వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయమే.

హిజాబ్ అంశం కూడా ఇలాంటిదే. ప్రస్తుతానికి ఇది క్లాస్ రూం గోడలకే పరిమితం గానీ, ముందు ముందు ఇది మరింత తీవ్రతరమయ్యే సూచనలు క్లియర్ గానే కనిపిస్తున్నాయి. ముస్లిం మహిళల తలపై నుండీ ఓ వస్త్రాన్ని తొలగించడమే తమ ప్రధాన ధ్యేయంగా దేశంలోని అల్లరిమూకలూ, ఈదేశ న్యాయ,చట్ట,ప్రభుత్వ వ్యవస్థలన్నీ డిసైడ్ చేసుకుంటే, అప్పుడు ముస్లిం మహిళల ముందు ఉన్న ఆప్షన్లేమిటన్నది ఆ మహిళలు,ఇంటి పెద్దలు కలిసి కూర్చుని చర్చించుకోవాల్సి ఉంది.

ఇస్లాం మొదటినుండీ స్త్రీకి వివిధ మార్గాలద్వారా ఆస్తివచ్చేలా ఆస్తిహక్కును, ఆ ఆస్తిని తన ఇష్టం వచ్చినట్లు వాడుకునే ఆర్థిక స్వేచ్చనూ ఇచ్చింది. కానీ, ఇస్లాం ని సెలెక్టివ్గా తమకు అనుకూలమైన చోటమాత్రమే వాడే ముస్లిం పురుషులవల్ల, మరియూ, మారిన ఆర్థిక,సామాజిక వ్యవస్థల వల్లా ప్రస్తుతం స్త్రీ,పురుషులు ఇద్దరూ బయటికి వెళ్ళి డబ్బు సంపాదించాల్సి వస్తుంది. ముస్లిం మహిళలపై అడుగడుగునా దాడులు, నిఘాలు పెరిగిపోతున్న ప్రస్తుత విద్వేష వాతావరణంలో, ముస్లిం కుటుంబాలు సమస్యను మహిళల పాయింటాఫ్ వ్యూ నుండీ ఆలోచించి అర్థం చేసుకోవాల్సి ఉంది. ముస్లిం మహిళల హక్కులకు భంగం కలగకుండా, అదే సమయంలో బయట ఉన్న విద్వేషవాతావరణంలో వారి భద్రతకు ముప్పువాటిల్లకుండా.. అన్ని అంశాల్నీ బేరీజు వేసుకుని జాగ్రత్తగా అడుగులువేయాల్సి ఉంది.

ఒక సమూహంగా ముస్లిం సముదాయం ఏం చేయొచ్చు..?
2023 లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఎప్పట్లానే, హిందూ-ముస్లిం అంశం ఎంతగా వార్తల్లో నానితే బీజేపీ గెలుపు అంతగా నల్లేరుపై నడక అవుతుంది. ముస్లింలు ఈ కీలక అంశాన్ని మనసులో ఉంచుకుని ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. విషయం ఎలాగూ కోర్టులకెక్కింది కాబట్టి, రాజ్యాంగం లో ఏం రాసుందో, కోర్టులు దానికి ఎన్ని భాష్యాలూ,వక్రభాష్యాలూ ఇచ్చుకుంటాయనే విషయం వాటికే వదిలేస్తే మంచిది. ధర్నాలూ,బందులూ చేస్తే కోర్టుల్లో అనుకూలతీర్పులు వస్తాయనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు.

తన ముందున్న వివిధ ఆప్షన్లలో నుండీ, అల్లాహ్ ఆదేశానికీ, ప్రవక్త సూచనకూ దగ్గరగా ఉందనుకున్న దానిని ఫాలో అవడమే ఓ విశ్వాసి చేయాల్సిన పని. తన పౌరులలో కొందరి నుండీ కొన్ని ఆప్షన్లను తీసేయాలని ప్రభుత్వమూ, అలాంటి ప్రభుత్వానికి వంతపాడటమే రాజ్యాంగం ప్రకారం సరైనదని కోర్టులూ తీర్మానిస్తే తీర్మానించుకోనీయండి.

“అగ్గి రాజుకుంటే కొంపలన్నీ అంటుకుంటాయి – నా ఒక్క కొంపే కాదు అధికారంలో ఈ రోజు ఉన్నోడు -రేపు ఉండడు.
ఇక్కడ ఉన్నవన్నీ అద్దె కొంపలే- శాశ్వతం అంటూ ఏదీ లేదు”
– రాహత్ ఇందూరీ గారి ఉర్దూ కవిత.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.