సత్యాన్వేషి షాహిద్.

సత్యాన్వేషి షాహిద్.

=============

ఓ మనిషి జీవిత సాఫల్యాన్ని కొలవడానికి ప్రామానికం ఏమిటి? అతనుకూడబెట్టిన డబ్బా? అనుభవించిన హోదా,అధికారమా? అతనుపొందిన బిరుదులూ,సన్మానాలా? లేక, జీవించిన మొత్తం సంవత్సరాలా? కొంత మంది వీటిలో ఏదో ఒకటి తమ జీవిత లక్ష్యంగా బతికేస్తుంటారు. మతగ్రంధాలు, ప్రవక్తల ప్రవచనాల ఆధారంగాచూస్తే, సత్యాన్నికనుగొని దానిని నిష్టగా ఆచరించడంలోనే నిజమైనజీవిత సాఫల్యం ఉందనే విషయంబోధపడుతుంది. కానీ,అసలు సత్యం అంటే ఏమిటి? చాలా మంది, తమ తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు నమ్మేదీ, ఆచరించేదే సత్యమని ఫిక్సైపోతారు. కానీ,కొందరితో మాత్రం సత్యం దోబూచులాడుతుంది. తనేమిటో కనుగొనమని రెచ్చగొడుతుంది. కొందరిని వెంబడిస్తుంది. చివరికి కొందరికి పట్టుబడుతుంది. అలాంటి ఓవ్యక్తే షాహిద్ ఆజ్మీ.


14 సం. వయసు వరకూ షాహిద్ జీవితం అందరుపిల్లల్లాగే సాదాసీదాగా గడిచింది. కానీ,1992లో బాబ్రీమసీదువిధ్వంసం అనంతరం,ముంబైలోచెలరేగిన అల్లర్లు షాహిద్ కి ,సత్యంపై మొదటిసారి ఆలోచనలు కలిగించాయి. ఆ అల్లర్లలో ,ఆస్తి, ప్రాణ నష్టం కలిగిన వారిలోనూ, మరియు పోలీసుకాల్పుల్లో మరణించినవారిలోనూ ముస్లిమ్ లే అధికంగా ఉండటాన్ని దగ్గరగాచూసిన షాహిద్, ఈ వ్యవస్థ సత్యాన్ని కాపాడుతుందనే నమ్మకం కోల్పోయాడు. దానితో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి అడుగుపెట్టి, ఓ తీవ్రవాద సంస్థలో జాయిన్ అయ్యాడు. అమాయకుల్ని పొట్టనపెట్టుకోవడం తప్ప ఆ తీవ్రవాదులకి సత్యమనేదొకటుందనే విషయంకూడా తెలీదని గ్రహించిన షాహిద్, వారినుండి పారిపోయి తిరిగి ఇంటికి వచ్చేశాడు. 1994 లో, శివసేనఅధినేత బాల్ ధాకరేని, ఇతర ప్రముఖుల్ని చంపటానికి పథకం రచించాడనే అభియోగం మీద పోలీసులు అతన్ని టాడా చట్టంకింద అరెస్టు చేశారు. 5సం. తీహార్ జైలులో గడిపిన అనంతరం , సుప్రీం కోర్టు నిర్దోషిగా తీర్పుచెప్పటం తో విడుదలై బయటకు వచ్చాడు. తీహార్ లో ఉన్నప్పుడే దూరవిద్య ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. బయటికి వచ్చాక లా కోర్సు పూర్తిచేసి సత్యాన్నికాపాడే లాయర్ గా ప్రాక్టీసు ప్రారంభించాడు. తనలాగే అక్రమ కేసుల్లో అరెస్టుచేయబడి జైల్లలో మగ్గుతున్న అమాయకుల తరపున వాదించడం మొదలుపెట్టాడు. వీరిలోచాలామంది నిరుపేదలు కావడంతో, ఏమాత్రం ఫీజు ఆశించకుండానే వారికేసులు వాదించి,వారిని నిర్దోషులుగా విడుదల చేయించేవాడు. 2008 ముంబై దాడుల కుట్రదారునిగా పోలీసులు అరెస్టుచేసిన ఫాహిమ్ అన్సరీ తరపున వాదించేటప్పుడు, తీవ్రవాదుల తరపున వాదిస్తున్నందుకు తగినమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అతనికి అనేక బెదిరింపు కాల్స్ వస్తుండేవి. కానీ, తాను వాదించేది తీవ్రవాదులుగా ముద్రవేయబడ్డ అమాయకుల తరపునేతప్ప, తీవ్రవాదుల తరపున కాదనీ, సత్యాన్ని కాపాడే ఈ ప్రయత్నం లో తన ప్రాణం పోయినా లెక్కచేయననీ షాహిద్ తన సన్నిహితులతో చెప్తుండేవాడు. అన్నట్లుగానే, నలుగురు దుండగులు ఫిబ్రవరి 11, 2010న షాహిద్ ఆఫీసులోకి చొరబడి అతడిని తుపాకితో కాల్చి చంపారు. ఆ దుండగులు ఎవరనే విషయం ఇప్పటికీ తేలలేదు. అనంతరం ఫాహిమ్ అన్సరీ ని కూడా భారత సుప్రీం కోర్టు, నిర్దోషిగా విడుదల చేసింది.
షాహిద్ న్యాయవాదిగా పనిచేసిన 7సం.లలో 17 మందిని నిర్దోషులుగా విడుదల చేయించాడు. అనేక తీవ్రవాద కేసుల్లో , పోటా లాంటి కఠినతర చట్టాన్ని, పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా అమాయకులపై ప్రయోగిస్తున్నారనే విషయం షాహిద్ వాదించిన కేసులద్వారా అందరికీ తెలిసింది. ఇది అంతిమంగా ఆ చట్టాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడానికి దోహదం చేసింది. కేవలం తీవ్రవాద సంబంధ కేసులే కాకుండా, మహారాష్ట్ర లోని మిథీ నది సుందరీకరన వల్ల నిర్వాసుతులైన వారి తరపున, ముంబై నగరం లో , ఇల్లు కోల్పోయిన మురికి వాడల ప్రజల తరపున కూడా షాహిద్ పోరాడాడు. జీవితం లో ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొని, ఇన్ని అద్బుత విజయాల్ని సాధించిన షాహిద్ ఆజ్మీ వయసు మరణించేనాటికి కేవలం 32 సంవత్సరాలు. షాహిద్ చిన్నవయసులోనే మరణించినప్పటికీ, సత్యం తరుపున పోరాడేలా ఎంతోమందికి స్పూర్తినిచ్చాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..
( ఫిబ్రవరి 11 , షాహిద్ ఆజ్మీ వర్థంతి సంధర్భంగా)
-మహమ్మద్ హనీఫ్.యస్.టి.

Leave a Reply

Your email address will not be published.