సమాచార విప్లవం – రాజకీయ సవాల్లు!!

సమాచార విప్లవం – రాజకీయ సవాల్లు!!
============================
రేడియో అంటే ప్రస్తుత తరానికి పెద్దగా ఉపయోగకరమైన వస్తువేం కాదనిపించొచ్చు గానీ, 1895లో, మార్కోనీ దానిని కనుగొన్నప్పుడు ఆ కాలానికి అదోక గొప్ప విప్లవాత్మక ఆవిష్కరణే. అప్పటివరకూ సమాచారం ఓ చోటునుండీ మరో చోటుకి వెల్లాలంటే, ఎవరో ఒకరు వ్యక్తిగతంగానైనా వెళ్ళి చెప్పాలి, లేదా ఉత్తరాలు, వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో, ఓ వ్యక్తి మాటల్ని అప్పటికప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని లక్షలాది మంది ఒకేసారి వినగలగడం సమాచార ప్రసార వ్యవస్థలో ఓ తిరుగులేని మలుపనే చెప్పవచ్చు.

ఇలాంటి ఓ ఆవిష్కరణ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందనే అందరూ ఆశించి ఉంటారు తప్ప, దీనితో ప్రజలకో ఉపద్రవం రాబోతుందని ఎవరూ ఊహించి ఉండరు. రేడియోను ఉపయోగించి అలాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి – అడాల్ఫ్ హిట్లర్.

మొదటి ప్రపంచ యుద్దంలో ఎదురైన ఓటమి, మరియు ద్రవ్యోల్బనం వల్ల అతలాకులమై ఉన్న జర్మనీ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతాననే హామీ ద్వారా 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రాగానే అతను చేసిన మొదటి పని – ప్రజలకు ఏ విషయం తెలియాలి, ఏది తెలియకూడదు అనే అంశాన్ని నియంత్రించడం కోసం ‘ప్రాపగాండా మినిస్ట్రీ ‘ అనే ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, జోసెఫ్ గోబెల్స్ అనే తన మిత్రున్ని దానికి మంత్రిగా నియమించాడు. అప్పటి వరకూ ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్ర్యంగా నడుస్తున్న రేడియో బ్రాడ్ కాస్టింగ్ విభాగాన్ని గోబెల్స్ పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాడు.

అప్పట్లో రేడియో ధరలు చాలా అధికంగా ఉండటంతో, అది కేవలం కొంతమంది సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండేది. దీనిని అధిగమించడానికి, ప్రభుత్వం రేడియో తయారీ కంపెనీలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. సీమన్స్ లాంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టి యుద్దప్రాతిపదికన చవక రేడియోలను ఉత్పత్తి చేసింది. ఈ చర్యలన్నింటివల్లా, కొన్ని సంవత్సరాల్లోనే దాదాపు 80% మంది జర్మన్ల గృహాల్లోకి రేడియో ప్రవేశించేలా చేసింది. కూడల్లలో, రోడ్లపై, కాలేజీల్లో, ఆఫీసుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వం రేడియోలను అమర్చి వాటికి లౌడ్ స్పీకర్లను జతచేసి పెట్టేది. ఈ రేడియో ద్వారా, తన మన్ కీ బాత్ ని హిట్లర్ ప్రజలతో తరచుగా పంచుకుంటుండేవాడు. గోబెల్స్ ప్రాపగాండా మొత్తం 3 అంశాల చుట్టూనే ఉండేది. అవి – హిట్లర్ ఎంత సూపర్ మ్యానో, నాజీల ఆర్య జాతి ఎంత ఉన్నతమైనదో చెప్పడం, యూదుల్ని దుష్టులుగా, నాజీలకు శత్రువులుగా ముద్రవేసి, వారిని ఎంతగా అణగదొక్కినా తప్పేం లేదు అనే అభిప్రాయం కలిగించడం. ఈ ప్రాపగండా ఏస్థాయిలో విజయవంతమైందంటే, హిట్లర్ సేనలు సుమారు 30లక్షలంది యూదుల్ని కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చంపేస్తున్నా, సగటు జర్మన్లకు అదేమంత పెద్ద విషయం అనిపించలేదు. తమ ఆర్య జాతికి నిజంగానే ప్రపంచాన్ని ఏలే అన్ని అర్హతలూ ఉన్నాయనీ, తమ మిలిటరీ అన్ని దేశాలను ఓడించబోతుందని హిట్లర్ మరణించే చివరి రోజు వరకూ కూడా జర్మన్లు నమ్ముతుండేవారు.

ఓ అబద్దాన్ని పదే,పదే చెప్తే, చివరికి జనం అది నిజమనే నమ్ముతారు. అనే అంశాన్ని హిట్లర్ ప్రాక్టికల్ గా చేసి చూపాడు.

ఇప్పుడు 2014 కు రండి.
ప్రాపగాండా మంత్రిత్వ శాఖ కాదు గానీ, ఐటీ సెల్ అని అలాంటిదే ఓ విభాగం ఉంది. దాని కింద సూపర్ 150 అని, ఓ 150 మంది పైస్థాయి ఉద్యోగులు ఉంటారు. మొన్నా మధ్య దేశ ప్రధాని వీరందరితో సమావేశమై, వీరి సేవల్ని ప్రత్యేకంగా కొనియాడారు.
వీరిలో ప్రతి ఒక్కరి కిందా కొన్ని టీములు, దేశవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వీరు చేసేపని ఎలా ఉంటుందనేది కొన్ని ఉదాహరణలతో చూద్దాం.

ఉదాహరణ#1.
ముస్లిం పురుషులు మసీదుల్లో నమాజు చేసుకుంటారు. ఒక్కోసారి మసీదు ఫుల్లుగా నిండిపోయినప్పుడు, మసీదు బయట, రోడ్దుమీద కూడా నమాజు చేసుకుంటుంటారు. ఇదంతా మహా అంటే 15,20 నిమిషాల కంటే ఎక్కువపట్టదు. ఇలా మసీదు నిండిపోవడం అనేది శుక్రవారం మద్యాహ్నం పూటగానీ, లేక రంజాన్,బక్రీద్ పండగలప్పుడు మాత్రమే జరుగుతుంటుంది. దీనిని ముస్లిమేతరులు చాలా సార్లు చూసినా,ఒక్కోసారి వారికి కొంత అసౌకర్యం కలిగినా, అది కేవలం కొన్ని నిమిషాలే కాబట్టి దానిని గురించి పెద్దగా పట్టించుకోరు, దానినో సమస్యగా గుర్తించరు. కానీ, ఇటీవల హర్యానాలో ఇలా శుక్రవారం పూట, మసీదు వెలుపల, ఆరుబయట నమాజు చేసేవారిపై దాడులు చేయడం మొదలైంది. ఇలా ఆరుబయట నమాజ్ చేయడం అనేది కొన్ని వందల ఏళ్ళుగా జరుగుతున్నప్పటికీ ఏనాడూ ఎవరికీ సమస్య కానిది, ఇప్పటికిప్పుడు కొత్తగా ఎందుకు సమస్యగా మారుతుందనేది ఆలోచించాల్సిన విషయం. కానీ, అక్కడ ఉండేది బీజేపీ ప్రభుత్వం. దానికి ఇలా నమాజు చేసేవారిపై జరిగిన దాడి కంటే, బయట నమాజు చదవడమే అసలు సమస్యగా కనిపిస్తుంది. అందుకే, “నమాజు కేవలం మసీదులో మాత్రమే చేయాలి తప్ప, ఆరుబయట కాదు” అని – సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే చెప్పాడు. ఇక అక్కడే మన ఐ.టీ సెల్ పని మొదలవుతుంది.
అది ఫేస్ బుక్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఓ నిలిచి ఉన్న రైలు, ఆ రైలు ముందు, పట్టాలపై నమాజు చేస్తున్న కొందరు ముస్లింల ఫోటో. దాని కింద ఇలా రాసి ఉంది – “ఈ ఫోటో తమిల్నాడు కు చెందినది. ముస్లింలు ఇలా రైలును ఆపేసి అది వెళ్ళే పట్టాలపై నమాజు చేయడంతో, ఆ రైల్లో నీట్ ఎగ్జాం రాయడానికి కేరళ వెల్తున్న తమిల్ నాడు విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో, పరీక్ష రాయలేక పోయారు”. ఈ ఫోటోను ఫేస్ బుక్, ట్విట్టర్ లలో కొన్ని నిమిషాల వ్యవధిలో వేల మంది షేర్ చేశారు. వాట్స్ అప్ మెసేజీల ద్వారా ఎన్ని లక్షలమందికి చేరి ఉంటుందనేలెక్కలు లేవు.
నిజానికి అది తమిల్ నాడులో తీసిన ఫోటో కాదు. నీట్ ఎగ్జాం రోజు తీసింది అసలే కాదు. అది 2017లో న్యూ డిల్లీలో రంజాన్ సంధర్భంగా తీసిన ఫోటో.

ఉదాహరణ#2.
కాశ్మీర్ లోని కథువాలో జరిగిన 8 ఏళ్ళ బాలిక హత్యాచారం దేశంలోని ప్రజలందరినీ తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా, నిందితులకి మద్దతుగా బీజేపీ మంత్రులు ర్యాలీలో పాల్గొనడం ఆ పార్టీ మద్దతుదారుల్ని సైతం నిరాశపర్చింది. ఇక్కడే ఐ.టీ. సెల్ మళ్ళీ రంగంలోకి దిగింది. అసలక్కడ రేప్ జరగలేదనీ, ఒక వేల జరిగినా అది బర్మా నుండి వచ్చిన వారు చేశారనీ, అక్కడి ముస్లింలే చేశారనీ ఇలా రకరకాల కట్టు కథల్ని ప్రసారం చేసింది. వారి మద్దతు దారుల ద్వారా ఇవన్నీ కొన్ని వేల సార్లు రీ-పోస్ట్ చేయబడ్డాయి. ఇది జరిగిన తర్వాతి వారమే ఉత్తరప్రదేశ్ లో ఓ మదరసాలో గ్యాంగ్ రేప్ జరిగిందనీ, ఆ మదరసా ఇమామే ఇది చేశాడనీ వందలకొద్దీ పోస్ట్లు, కధనాలు వెలువడ్డాయి. చివరికి మెయిన్ స్ట్రీం మీడియా కూడా దీనిని రిపోర్ట్ చేసింది. నిజానికి అక్కడ జరిగింది, ఓ బాలిక, తన ఇష్టాను సారమే, ఓ బాలునితో కలిసి మదరసాలోకి వెళ్ళింది. వారు కాసేపు ఏకాంతంగా గడిపి మళ్ళీ బయటికి వెళ్ళీపోయారు. ఇదంతా అక్కడి సీసీటీవీ ల్లో క్లియర్ గా రికార్డ్ అయింది. కాశ్మీర్ లో జరిగిన రేప్ నీ, అక్కడి బీజేపీ మంత్రుల పాత్రనీ తక్కువ చేయడానికి ఐ.టీ సెల్ యూపీ లో మదరసాలో రేప్ వదంతుల్ని వ్యాపింపచేసింది.

ఉదాహరణ#3.
డిల్లీ జెయన్యూ విద్యార్థి కణయ కుమార్ 11 సార్లు పిహెచ్.డీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడనీ, ఈ రకంగా ప్రభుత్వ సొమ్ము ఇలాంటి విద్యార్థులవల్ల దుబారా ఐపోతుందనీ ఐ.టీ సెల్ వారు ఓ పోస్టు రాసి పడేశారు. ఎప్పట్లాగే కొన్ని వేలమంది దీనిని షేర్ చేశారు. అలా షేర్ చేసిన వారిలో బీ.జే.పీ ప్రముఖనాయకులు కూడా ఉన్నారు.
కానీ, నిజానికి పీహేచ్.డీ లో అధ్యయనం, తర్వాత పేపర్ సబ్మిషన్ మాత్రమే ఉంటుంది తప్ప, ఎలాంటి పరీక్షలూ ఉండవు. కానీ, నిజా నిజాలు ఎవరిక్కావాలి.

ఇలాంటి ఉదాహరణలు వందల కొద్దీ ఉన్నాయి. ఈ రకంగా, బీజేపీ కి అనుకూలంగా కథనాలను వండి వార్చడం. బీజేపీ వ్యతిరేకులపై అసత్యాలూ, పుకార్లు పుట్టించి వారి జీవితం దుర్భరం చేయడం. ఇవే ప్రధాన లక్ష్యాలుగా ఐ.టీ సెల్ పని చేస్తుంది.

టెక్నాలజీ ఎంత గొప్పదైనా, దానిని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే ప్రభుద్దులు ఎప్పటికీ ఉంటారని, అప్పటి ప్రాపగాండా మినిస్ట్రీ, ఇప్పటి ఐ.టీ సెల్ నిరూపిస్తున్నాయి.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.