స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్

“నీ స్టేషన్ కి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ననుకున్నావా” – అని పోకిరి సినిమాలో ఓ డైలాగ్ ఉంది.కొత్త కానిస్టేబుల్ ఏదేదో చేసేయాలనే తాపత్రయంలో,ఎమోషన్లో ఉంటాడు. కానీ, ఓ ముదురు సీఐ చేతిలో బలైపోతాడు. ఫేస్ బుక్కులో, హిజాబ్ ప్రయోజనాల్ని వివరించే కొందరు ముస్లిం పురుషుల్ని చూస్తుంటే- నాకు ఆ కొత్త కానిస్టేబులే గుర్తొస్తుంటాడు. ఇస్లాం ను పాజిటివ్ గా చూపించాలనే ఎమోషన్లో వీరు చేసే ఇల్లాజికల్ వాదనల్నే, నాస్తికులు,హేతువాదులు ఇస్లాం కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుంటారు.

ముస్లింలు రంజాన్ లో ఉపవాసం ఎందుకుంటారు- అని అడిగితే, దానికి సమాధానం ఏం చెప్పాలి? ఖురాన్,ప్రవక్త బోధనల్లో(హదీసుల్లో) రంజాన్ నెలలో ఉపవాసం ఉండమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి – అనేది సమాధానం. ఈ సమాధానం ఇవ్వకుండా – ఉపవాసం ఉంటే షుగర్,బీపీ కంట్రోల్ లో ఉంటాయి. ఒబెసిటీ రాకుండా ఉంటుంది, ఈజీగా వెయిట్ లాస్ చేసుకోవచ్చు, ఆటోఫజీ వల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయి – ఇవి కాదు సమాధానం. ఈ ప్రయోజనాలు ఉండొచ్చు,ఉండకపోవచ్చు.. “ఉపవాసం వల్ల ఆర్యోగ్యానికి ప్రమాదకరం”- అని రేపు సైంటిఫిక్ గా ప్రూవ్ అయినా, ముస్లింలు ఉపవాసం మాత్రం వదలరు- ఎందుకంటే, ఖురాన్,హదీసుల్లో అలా చేయమని ఉంది కాబట్టి. అదే వారికి బెంచ్ మార్క్.

ఐదు పూటలా నమాజ్ ఎందుకంటే – ఖురాన్,హదీసుల్లో అలా చేయమని ఉంది కాబట్టి. అంతే తప్ప, శరీరానికి ఎక్సైజ్ కోసమో, కీళ్ళనొప్పులు రాకుండా ఉంటాయనో, కాన్సంట్రేషన్ కోసమో కాదు. వడ్డీకి ఎందుకు అప్పులు ఇవ్వరన్నా, ఆల్కహాల్ ఎందుకు ముట్టుకోరన్నా- అన్నిటికీ ఇదే సమాధానం.

ముస్లిం మహిళలు – హిజాబ్/బురఖా/నికాబ్ ఎందుకు ధరిస్తారన్నా ఇదే సమాధానం. “ఖురాన్/హదీసుల్లో వేషధారణకు సంబంధించి వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి, దానికి తగ్గట్లు వారు బట్టలు ధరిస్తారనేది సమాధానం. అంతే తప్ప, పురుషుల చూపులనుండి తప్పించుకోవచ్చనో, పురుషులకు కామ కోరికలు కలగకుండా ఉండాలనో, రక్షణకోసమో.. ఇవన్నీ కాదు.

ఇంకొందరు ముస్లిం పురుషులు – బంగారం బయటుంటే దొంగలెత్తుకెళ్తారు కాబట్టి భద్రంగా దాచుకోవాలనీ, చాక్లెట్ కి రాపర్ చుట్టకుండా ఉంటే దాని మీద ఈగలు వాల్తాయనీ – ఈ టైపు సిల్లీ లాజిక్స్ ని ఫేసుబుక్కులో, వాట్సప్పుల్లో తెగ షేర్ చేస్తుంటారు. నాస్తికులు,హేతువాదులు,ఫెమినిస్టులు – హిజాబ్ పై నెగెటివ్ అభిప్రాయం కలిగి ఉండటానికి కారణమే – అది ఉమెన్ ని వస్తువుల్లాగా భావించి, ఆబ్జెక్టిఫై చేస్తుందని. ఈ కొత్త కానిస్టేబుల్లు చెప్పే లాజిక్ లు ఎగ్జాక్ట్ గా ఆ ఆబ్జెక్టిఫికేషన్ వాదనను బలపరిచేవిగా ఉంటాయి.

ఇంకొందరైతే మరీ దారుణంగా ఉన్నారు. ఒక టూపీస్ బికినీ ధరించిన ఎవరో మోడల్ అమ్మాయి, హిజాబ్ ధరించిన అమ్మాయిల ఫోటోల్ని పక్కపక్కనే పెట్టి, “వీరిలో ఎవరి వేషధారణ గొప్పగా ఉందోచెప్పండి” అని ఓటింగ్ పెడుతున్నారు. అరే భాయ్, ఖురాన్లో స్త్రీల హిజాబ్ వాక్యం కంటే ముందు, “పరస్త్రీలని తేరిపార చూడకుండా చూపుల్ని దించుకోమనే” వాక్యం వస్తుంది. అలాంటప్పుడు, ఆ అర్థనగ్న అమ్మాయి ఫోటొని ఎలా షేర్ చేస్తున్నావ్?

కంగనా రనౌత్ హిజాబ్ కి వ్యతిరేకంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందని, ఆమె ఎక్స్పోజింగ్ ఫోటోలను షేర్లు చేస్తున్నారు. ఆమెను ఏవేవో పేర్లతో తిడుతున్నారు. ఇది ఇస్లాం కాదు భాయ్. ఇస్లాం అంటే ఓ స్టాండర్డ్. ఓ బెంచ్ మార్క్.

“నువ్వు న్యాయంగా ఉంటేనే- నేనూ న్యాయంగా ఉంటా”, “నువ్వు పద్దతిగా ఉంటేనే- నేను పద్దతిగా ఉంటా” – ఇలాంటి స్టాండర్డ్లు వేరే ఎవరికైనా వర్తిస్తాయేమోగానీ – మహమ్మద్ ప్రవక్త(స) స్టాండర్డ్ మాత్రం ఇది కాదు.
“నువ్వు నాతో ఎలా వ్యవహరించినా, నేను మాత్రం నీతో న్యాయంగానే,పద్దతిగానే,హూందాగానే వ్యవహరిస్తా”- అనేది ప్రవక్త స్టాండర్డ్.
ముస్లిం లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ స్టాండర్డ్ ని అతిక్రమించకూడదు, అది ఇస్లాం ని డిఫెండ్ చేయడానికైనా సరే.

Leave a Reply

Your email address will not be published.