అవును నేను జీహాద్ చేస్తున్నా!!!
=======================
అవును, నేను నిజంగానే జీహాద్ చేస్తున్నా. దీనిలో దాపరికం ఏం లేదు. గత కొన్ని సంవత్సరాల నుండీ చేస్తున్నా. “లా ఇలాహ ఇల్లల్లాహ్-మహమ్మదుర్ రసూలిల్లాహ్ ” -అని మనసుతో పలికినప్పటినుండీ జీహాద్ చేస్తూనే ఉన్నా. మనసుతో అని ఎందుకంటున్నానంటే, దీనిని పెదాలతో చిన్నప్పటినుండీ చెప్తూనే ఉన్నాను. కానీ అప్పుడు అదేంటో తెలీదు. అదేంటో శోధించి, సంఘర్షించి, మధనపడి తెలుసుకున్న తర్వాత, మొదటిసారిగా మనసుతో పలికాను. అప్పటినుండీ దానికి కట్టుబడి ఉండటానికి ప్రతి రోజూ, ప్రతి క్షణం జీహాద్ చేస్తూనే ఉన్నా. నా జీహాద్ పొద్దున 5 గంటలకు మొదలవ్తుంది. వెచ్చటి దుప్పట్లో, కమ్మటి నిద్రకు స్వస్తి చెప్పి ఫజర్ నమాజ్ చదవాలని మనసులోని అలారం గంట కొడుతుంటుంది. ‘మరేం పర్లేదు, అసలే రాత్రి పొద్దుపోయే దాకా ఆఫీస్ పని చేసి అలసి పోయి ఉన్నావ్, ఇంకొంచెం సేపు పడుకో’ – అని శరీరం మొరాయిస్తుంటుంది. అలా జీహాద్ తో నారోజు మొదలవుతుంది.
ఇలాగే రోజులో నాలుగు పూటలా.. ఆఫీస్, మీటింగ్ లు,డెడ్ లైన్లు, షాపింగ్ లు, ట్రాఫిక్ లు.. వీటన్నిటి మధ్య తీరిక తీసుకుని ఒక్క 5 నిమిషాలు సజ్దా చేయలేక పరుగులు పెట్టే నా శరీరానికి, ప్రవక్త యుద్ధ రంగంలో కూడా నమాజ్ వదలలేదనే విషయం గుర్తు చేసున్న మనసుకి సమాధానం చెప్పుకోలేక.. పూట,పూటకూ నాలో జీహాద్ జరుగుతూనే ఉంటుంది..
రోడ్డుపై ఓ అందమైన అమ్మాయి ఎదురుగా వస్తుంటే, “ఏ హె చూస్తే ఏం కాదులే” అని అటు లాక్కుని వెళ్ళే కళ్ళకు, ‘పరస్త్రీ ని తేరిపార చూడకుండా, కళ్ళను కిందికి దించుకోమనే’ – ఖురాన్ సూరా గుర్తు చేసే మనసుకి మధ్య ఓ నిరంతర జీహాద్.
ఆండ్రైడ్ మొబైల్ లో 4జి. స్పీడ్, విత్ ఫ్రీ అన్లిమిటెడ్ డౌన్లోడ్. అసలే చాలా రోజులైంది.. ఓ సారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసెయ్ అని టేంప్ట్ చేసే చేతి వేల్లకీ, ‘ అంతిమ దినం నాడు, నీ చెయ్యే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుందని’ హెచ్చరించిన ప్రవక్త మాటల్ని గుర్తు చేసే మెదడుకి మధ్య ఎడతెగని జీహాద్.
“సార్,మొత్తం డౌన్ పేమెంట్ తో చిన్న కార్ ఎందుకు తీసుకుంటున్నారు? మీ పే స్లిప్ ఇస్తే చాలు, మీకు లోన్ ఈజీగా సాంక్షన్ అవ్తుంది. ఇంటరెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ.ఓ సెడాన్ (వెనకాల డిక్కీ ఉన్న కారు) తీసుకుని, మిగిలిన డబ్బుల్ని వడ్డీకి తిప్పితే, ఆ వచ్చే వడ్డీ డబ్బుల్తో EMI పేచెయ్యొచ్చు. మీకు చాలా సేవ్ అవ్తుంది. ”
” 2BHK ఎందుకు సార్, WHY Don’t YOU go far 3BHK/విల్లా. మీ CIBILస్కోరు, మరియు కంపెనీ పేరు చూసి ఎంతైనా లోన్ దొరుకుతుంది. పైగా హోంలోన్ ఉంటే మీకు ప్రతి సంవత్సరం బోలెడంత ట్యాక్స్ ఆదా అవ్తుంది. ”
-ఇలాంటి ఆఫర్ లకూ, ” వడ్డీ తీసుకునేవాడు, వడ్డీ ఇచ్చే వాడు ఇద్దరూ ప్రవక్తతో యుద్ధానికి తలపడినంత పాపం చేసేవారే” – అని హెచ్చరించే ఖురాన్ వాక్యాలకూ మధ్య అరివీర భయంకర జీహాద్..
అన్నట్లు.. ఇంకో జీహాద్ కూడా ఉంది. అది ఆయుధం ధరించి చేసే జీహాద్. ఇది ఆత్మ సం రక్షణార్థం మాత్రమే చేయాలి. అది కూడా, వేరే ఏ ఇతర మార్గం లేనప్పుడే. ఇది చేస్తున్నప్పుడు, నిరాయుధులకు, స్త్రీలకు,పిల్లలకు,వృధ్ధులకు ఎలాంటి హానీ జరగకూడదు. దీనికి ఖురాన్/ప్రవక్త ఇన్ని ఆంక్షలు పెట్టారు. ఐనా ఈ జీహాద్ నాకు వర్తించదు. నేను చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నా రక్షణ బాధ్యతలు చూడటానికి, మా పోలీసులున్నారు. సరిహద్దుల్లో మా సైన్యం ఉంది. వీరికి నా వంతుగా, నా జీతంలో నుండి ప్రతి నెలా 30% ట్యాక్సులు కడుతున్నాను. ఏ యుద్ధమో,ఉపద్రవమో వచ్చి, అంతగా అవసరమైతే నేను కూడా ఆయుధం ధరించి మా సైన్యంతో పాటు పోరాడటానికి వెనుకాడను. ఎందుకంటే నా దేశ సమ్రక్షణార్థం అవసరమైనప్పుడు జీహాద్ చేయడం నా బాధ్యత కాబట్టి.
ఇలా.. రోజులో ఎన్ని జీహాద్లు చేస్తుంటానో లెక్కలేదు.. చాలా సార్లు గెలుస్తుంటా.. కొన్నిసార్లు ఓడిపోతుంటా.. కానీ జీహాద్ మాత్రం చేస్తూనే ఉంటా. అవును.. ఇది లవ్ జీహాదే.. నా లవ్ -మహమ్మద్(pbuh). ఆయన బాటలో, ఆయన స్పూర్తితో నడవాలనేదే నా జీహాద్.. జీహాద్ అంటే -సంఘర్షణ. చెడుపై గెలవడానికి నిరంతరం చేయాల్సిన సంఘర్షణ.
అవును నేను జీహాద్ చేస్తున్నా!!!
-మహమ్మద్ హనీఫ్.
12/2/2017