ఇస్లాం, ఎందుకిలా..?

ఇస్లాం, ఎందుకిలా..?
———————
1. ఇస్లాం ఇప్పుడు అన్ని వైపులనుండి విమర్శల్ని ఎదుర్కొంటుంది
2. అది ఒకరకంగా మంచిదే, ఇస్లాం ఏ విషయాన్ని ఐనా గుడ్డిగా నమ్మకుండా, విమర్శనాత్మకంగా విశ్లేషించమంటుంది. “తమ బుద్ధిని,తెలివితేటల్ని ఉపయోగించని వారే, సృష్ఠికర్త యొక్క అత్యంత తిరస్కారానికి గురౌతారు” -ఖురాన్ 8:22 .
3. ఇస్లాం ని రెండు రకాలుగా విశ్లేషించవచ్చు. 1. ఖురాన్ లోని వాక్యాల ఆధారంగా 2. ఖురాన్ని అనుసరిస్తున్న వారి నడవడిక ఆధారంగా. అంటే, ముస్లింలు చేస్తున్న పనుల ఆధారంగా.


4. ఖురాన్ వాక్యాల ఆధారంగా విశ్లేషించడం సులువైన పద్దతి. ఎందుకంటే, 14 శతాబ్దాల క్రితం అవతరించినప్పటికీ, దానిలో ఎలాంటి మార్పు చేర్పులూ లేవు. పాత ఎడిషనా, కొత్త ఎడిషనా, ఏది అసలు, ఏది కాదు వంటి తికమక అంశాలు ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క ఖురాన్ ఎడిషన్ ఉంది. చివరికి, బద్ధ శత్రువుల్లా కనిపించే సున్నీ, షియాలు కూడా ఒకే ఖురాన్ చదువుతారు తప్ప, వేరు వేరు కాదు.
5. ఖురాన్ సమస్త మానవులకై అవతరింపబడిన యూజర్ గైడ్ లాంటిది. దానిలో మనిషి గురించి చాలా విషయాలు ఉంటాయి. మనిషికి తిండి కావాలి కాబట్టి ఏవి తినొచ్చో, ఏవి తినకూడదో ఉంటుంది. మనిషికి శారీరక అవసరాలు ఉంటాయి కాబట్టి, వాటిని ఎలా తీర్చుకోవచ్చో, స్త్రీ,పురుషులు ఎలా ఒక్కటవ్వచ్చో, ఎలా సఖ్యతతో మెలగొచ్చో ఉంటుంది. వారికి పిల్లలుంటారు కాబట్టి, సంతానం గురించి, తల్లిదండ్రుల గురించి ఉంటుంది. వ్యాపారం, పన్నులు, సామాజిక పరిపాలన వంటి అంశాల ప్రస్తావన ఉంటుంది.
6. కానీ, మనిషికి దురాశ,స్వార్థం, అసూయ, ద్వేషం లాంటి అవలక్షణాలు కూడా ఉంటాయి. వీటిని సాధ్యమైనంత అదుపులో ఉంచుకోమని ఖురాన్ ఆదేశిస్తుంది. లేకపోతే మరణానంతరం దానికి తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని హెచ్చరిస్తుంది. కానీ, ఎదుటి వ్యక్తి(ముస్లిమైనా, ముస్లిమేతరుడైనా) ఈ సూక్తుల్ని నమ్మక తన స్వార్థ ప్రయోజనాల కోసం అరాచకాన్ని సృష్టిస్తుంటే,చచ్చేదాకా చూస్తూ ఊరుకోమని ఖురాన్ అహింసా సూక్తులు వల్లించదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తెగించి పోరాడమంటుంది.
7. మహమ్మద్ ప్రవక్త జీవితంలో జరిగిన సంఘటనల్ని, ఆయన ప్రత్యర్థులు కలిగించిన ఆటంకాల్ని, వాటికి ప్రతిగా ఖురాన్లో దైవవాణి, వివిధ సంధర్భాల్లో మహమ్మద్ ప్రవక్తకి వినిపించిన ఆదేశాల్ని పరిశీలించిన వారికెవరికైనా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. అది – ఇస్లాం హింసను ఓ చిట్ట చివరి అస్త్రంగా వినియోగించమని చెప్పిందే తప్ప, ఎక్కడా దానిని ప్రోత్రహించలేదు. పైగా, యుద్దం, హింస లాంటి అంశాలకన్నా శాంతి, సహనం, క్షమాగుణం వంటివి మానవుడు పెంపొందిచుకోవలసిన ఉత్తమ లక్షణాలనీ, అల్లాకు ఇవే ప్రీతిపాత్రమైనవనీ, పదే, పదే చెప్తుంది.
8. కానీ, ఖురాన్లోని వాక్యాల్ని కూడా చాలా మంది విమర్శిస్తుంటారు. రుజువుల కింద వివిధ వాక్యాల నంబర్లను కూడా ఇస్తుంటారు. ఈ వాక్యాలు రెండు రకాలుగా ఉంటాయి. 1. హింసకు సంబంధించినవి. 2. స్త్రీ,పురుషుల మధ్య వివక్ష చూపేవి.
9. తెలిసో, తెలియకో ఈ విమర్శకులు చేసే పొరబాటు ఏమిటంటే, వీరు ఆ వాక్యానికి ముందున్న వాక్యాల్ని గానీ, వాటి తరవాత ఉన్న వాక్యాల్ని గానీ చాలా సౌకర్యవంతంగా వదిలేస్తుంటారు. ఈ మొత్తం వాక్యాల్ని కలిపి చదివితే, ఇస్లాం హింసకు ఎలా చిట్ట చివరి ప్రాధాన్యం ఇచ్చిందో తెలుసుకోవడం కష్టం కాదు.
10. ఇక స్త్రీ, పురుషుల గురించి ముఖ్యంగా తెలుసుకోవలసిన అంశం, ఇస్లాం ప్రకారం స్త్రీ,పురుషులు సరూపాలే గానీ, సమానాలు కాదు.( ఐడెంటికల్, బట్ నాట్ ఈక్వల్). అలా అని, వీరిలో ఏ ఒక్కరో ఎక్కువనో, మరొకరు తక్కువనో ఖురాన్ ప్రకటించదు. కొన్ని అంశాల్లో కొందరికి ఆధిక్యత ఇవ్వబడిన మాట వాస్తవం. స్త్రీ,పురుషుల సమానత్వమనే భావన గడచిన ఒకటి, రెండు శతాభాల్లో, పాశ్చాత్య సమాజాల్లో పురుడు పోసుకున్న భావన. మరో ఒకటి రెండు, శతాబ్ధాల తర్వాత ఇది ఎలాంటి రూపాన్ని సంతరించుకోబోతుందో ఊహించడం కష్టం. కానీ, ఇస్లాం మహిళలకు 14 శతాబ్దాలక్రితం కల్పించిన హక్కులు, మిగతా సమాజాలు అందుకోవడానికి ఎన్ని తరాలు పట్టిందనే విషయం మనకు తెలిసిందే. కాబట్టి, మిగతా సమాజాలు మహిళల్ని తెగ ఉద్దరిస్తున్నాయనీ, ఇస్లాం వారిని అణగదొక్కుతుందనీ చెప్పేవారితో,వెయిట్ అండ్ సీ, అని చెప్పటం మినహా. వాదించడానికి పెద్దగా ఏం లేదు.
11. ఇక ఇస్లాం ని విశ్లేషించే రెండో పద్దతి గురించి తెలుసుకుందాం. అది -ముస్లింలు. ఖురాన్ దైవగ్రంధమని నమ్మి,దానిని ఆచరించే వారిని ముస్లింలు అంటారు. ఇలాంటి ముస్లింలు ప్రస్తుతం భూమిమీద సుమారు 160 కోట్లమంది, దాదాపు 110 దేశాల్లో నివసిస్తున్నారు. ఈ 160 కోట్ల మందిలో కనీసం 50% లేక ఆపైన ఉన్నవారిలో కామన్ గా ఉన్న లక్షణాల్ని మొత్తం 160కోట్ల మందికీ ఆపాదించవచ్చు. అలా కాకుండా, ఒక్క శాతమో, రెండు శాతమో వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారు చేసే పనుల్ని మొత్తం 160 కోట్ల మందికి ఆపాదించడం అవివేకమే తప్ప, సంభావ్యతా,గణిత సూత్రాల ఆధారంగా కూడా సరైనది కాదు.
12. ఆ లెక్కన చూసినప్పుడు, ప్రస్తుతం పాశ్చాత్య మీడియా గొంతు చించుకుంటున్న ‘ఇస్లామిక్ టెర్రరిజం ‘ తో, ఇస్లాం కి ఏవిధమైన సంబంధం లేదని సులువుగానే అర్థమవుతుంది. ‘ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులందరూ ముస్లింలే ‘ అని కొందరు విపరీత వాదనలు చేస్తుంటారు. ఇలాంటి వారిని, అసలు టెర్రరిజానికి వారిచ్చే నిర్వచనం ఏమిటని నిలదీయవలసి ఉంటుంది. ఎల్.టీ.టీ.ఇ, ఉల్ఫా, మవోయిజం, నాజీయిజం, రెండు ప్రపంచ యుద్ధాలూ, క్రూసేడులు, హీరోషిమా,నాగసాకి, లిబియా, ఇరాక్.. వీటిలో పారిన రక్తాన్ని, ఏ మతం అకౌంట్లో వేస్తారని అడగవలసి ఉంటుంది. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామ రాజు.. వీరు మనకి దేశభక్తులు. కానీ, బ్రిటీష్ వారు వీరిని టెర్రరిస్టులు గానే చూస్తారు. అట్లే, రష్యాతో తలపడుతున్నంత కాలం దేశభక్తులుగా వెలుగొందిన తాలిబాన్లు, అమెరికాతో విరోధం పెట్టుకోగానే టెర్రరిష్టులుగా ఎలా మారిపోయారో మనకు తెలిసిందే. తమ దేశాన్ని అన్యాయంగా ఆక్రమిస్తున్న ఇజ్రాయెల్ తో తలపడే పాలస్తీనియన్లను, ఇజ్రాయెల్,దాని మిత్ర దేశాలు టెర్రరిస్టులుగా పిలిచినా వారిని మాతృభూమి కోసం పోరాడే యోధులుగా గురించేవారి సంఖ్యా తక్కువేం కాదు.
13. చమురు సంపద కోసం, అధికారం కోసం వివిధ దుష్టశక్తులు సాగిస్తున్న నీచ రాజకీయాన్ని అర్థం చేసుకోకుండా, ప్రపంచ మీడీయా ఓ మతాన్ని బోనులో నిలబెట్టి, దానిని అప్రదిష్ఠపాలు చేయాలని చూడటం శోచనీయం. సత్యం పరిఢవిల్లు గాక. ఆమీన్.
-మహమ్మద్ హనీఫ్.యస్.టి.

Leave a Reply

Your email address will not be published.