ప్రస్తుతం దేశంలో ఏ మూల చూసినా, పల్లె,పట్నం అనే తేడా లేకుండా, కరోనా మృతుల అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో ముస్లింలు అందరికంటే ముందు వరుసలో ఉంటున్నారు.చనిపోయిన వారి మతంతో సంబంధం లేకుండా, ఏ మతస్థులకు ఆ మత ఆచారమం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.కరోనా సోకుతుందేమోననే భయంతో, కడుపున పుట్టిన బిడ్డలు, సొంత తోబుట్టువులే శవం దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడుతున్న ప్రస్తుత పరిస్థుతుల్లో, ముస్లింలు తమకు ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ఆ పార్దీవదేహాలను గౌరవ మర్యాదలతో మోసి, స్మశానవాటికలకు తరలిస్తున్నారు.
చాలా సంధర్భాల్లో, మృతుని దగ్గరి బంధువులెవ్వరూ రాకపోవడంతో, వీరే తలకొరివి కూడా పెడుతున్నారు. ఇదంతా ఎలాంటి లాభాపేక్షగానీ, ప్రచారాపేక్షగానీ లేకుండానే చేస్తున్నారు. దీని గురించి మీడియాలో వచ్చే వార్తలు, జర్నలిస్టులు గానీ, దూరంగా ఉండి చూస్తున్నవారు గానీ వీడియోలు/ఫోటోలూ తీసినవే తప్ప, ముస్లింలు తమకు తాముగా ప్రచారం చేసుకున్నవి కావు. ఇలా మీడియాలో ప్రచారానికి నోచుకోకుండా, ముస్లింలద్వారా అంతిమ సంస్కారాలు చేయబడ్డ ముస్లిమేతర మృతుల సంఖ్య వేలల్లోనే ఉంది. గత సంవత్సరం ఇదే సమయంలో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని నిందలు మోపబడి, సామాజిక బహిష్కరణకు గురైన ముస్లిం సమాజం, సరిగ్గా సంవత్సరం తిరిగేసరి కల్లా అదే కరోనా మృతులపాలిట ఆపద్భాందవుల్లా మారిపోవడం ఓ ఆశ్చర్యకర, వింత పరిణామం.వారు చేస్తున్న ఈ మంచి పనులకు, ఫేస్ బుక్కులో ఓ లైక్ కొట్టో, ఓ ధమ్స్-అప్ ఎమోజీనో కొట్టి వదిలేయకుండా, వారిని ఎలాంటి ఐహికప్రయోజనం లేని,పైగా ఎంతో రిస్క్ తో కూడిన, ఈ పని చేయడానికి పురిగొల్పుతున్న విషయమేమిటనే దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.ఏ మతం ప్రత్యేకత దానికి ఉన్నట్లుగానే, ఇస్లాం ప్రత్యేకత -దానిలో థియరీకీ,ప్రాక్టిస్ కీ మధ్య పెద్దగా అంతరం లేకపోవడం. ఖురాన్, మహమ్మద్ ప్రవక్త బోధనల్లో(వీటిని హదీస్ లు అంటారు) నువ్వు ఇది కశ్చితంగా చేయి, ఇది ఎట్టిపరిస్థితుల్లో చేయకు, “దీనికి అనుమతి ఉంది, కానీ చేయకపోవడమే మంచిది”, “ఇది కంపల్సరీ కాదు, కానీ చేస్తే మంచిది” – ఇలా స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి. అట్లే, ఈ జీవితం మృత్యువుతో అంతమవదనీ, మరణానంతరం కూడా జీవితం ఉంటుందనీ, అదే శాశ్వతమైనదనీ, ఈ జీవితంలో చేసిన ప్రతి మంచిపనికీ ప్రతిఫలంతో పాటూ, ప్రతి చెడుపనికీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనీ అనేక పర్యాయాలు స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. మంచి చేయమని అన్ని మతాల్లాగే ఇస్లాం కూడా చెప్తుంది కానీ, అలా మంచి చేయడాన్ని ఎవరు గుర్తించినా,గుర్తించకున్నా సృష్టికర్త మాత్రం తప్పక గుర్తించడంతో పాటు, మరణానంతరం తగిన ప్రతిఫలం ఇస్తాడని కూడా ఖురాన్ హామీ ఇస్తుంది. చేసే మంచిని, సాధ్యమైనంత గోప్యంగా ఉంచడం వల్ల, ఎక్కువ పుణ్యం పొందే అవకాశం ఉందని ప్రవక్త చెప్పిన విషయం హదీసుల్లో నమోదు చేయబడి ఉంది. దీని కారణంగానే ముస్లింలు తాము చేసే చాలా మంచిపనుల్ని ఎవరితోనూ చెప్పుకోరు. సహజంగా మసీదులన్నీ, ముస్లింలు ఇచ్చే చందాలతోనే నిర్మించబడతాయి, కానీ ఏ మసీదులోకి వెళ్ళి చూసినా, ఆ మసీదు నిర్మాణానికి ఎవరు ఎంత చందాలిచ్చారనే విషయం ఎక్కడా రాయబడి ఉండదు, ఇచ్చింది ఎంతపెద్ద మొత్తమైనా సరే. అట్లే రమజాన్ నెలలో జకాత్ రూపంలో కొన్ని కోట్లకొద్దీ డబ్బు ధనవంతుల నుండీ పేదల చేతుల్లోకి సైలెంట్ గా, ఎలాంటి ప్రచారార్భాటాలూ లేకుండా మారిపోతుంది.”సృష్టికర్త మంచి చేయాలనుకుంటే-దానిని ఏ శక్తీ ఆపలేదు, అట్లే, సృష్టికర్త తాత్కాలికంగా కీడు చేయతలిస్తే దానిని ఏ శక్తీ నివారించలేదనేది” – ఇస్లాం సుస్పష్టంగా చెప్పే మరో కీలకమైన విషయం. పీపీఈ కిట్లు, సర్జికల్ గవున్లు లాంటివి అందుబాటులో లేకపోయినప్పటికీ, మాస్కులు, సానిటైజర్లు లాంటి కనీస సాధనాలతోనే, ముస్లిం యువకులు కరోనా మృతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారంటే, దానివెనకాల ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఇదే. “ఏదో ఓ సమయానికి మృత్యువు రావడం, అల్లా దగ్గరికి పయనమవడం తప్పక జరిగేదే. అది కరోనా కారణంగా జరగాలని అల్లా రాసిపెట్టి ఉంటే దానిని ఎలాగూ తప్పించలేం.. కానీ ఆ భయంతో, చనిపోయిన సాటి వ్యక్తిని అనాధ శవంలా వదిలేసి చూస్తూ ఉండటం కంటే,మన చేతుల్లో ఉన్నదేదో చేసేయడం బెటర్ ” – అనేది దీని వెనక ఉన్న థాట్ ప్రాసెస్. ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ప్రాధమిక అవగాహన లేని కారణంగా, ముస్లిం సమాజం అనేక సార్లు నిందలు,అపవాదులకు గురవ్వడం కూడా మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఉదాహరణకు, “మనం వారి పండగలకు పిలవగానే వెల్తాం, వారు బిర్యానీ పెట్టినా తింటాం, పాయసం ఇచ్చినా తాగుతాం. కానీ, మనం ప్రసాదం ఇస్తే మాత్రం వారు తినరు- ఇది మన మతాన్ని అవమానించడం కాదా” అని ముస్లింలను నిందించడం తరచుగా జరుగుతుంటుంది. “ఏదైనా మంచి జరగాలంటే అది సృష్టికర్త వల్లే సాధ్యమవుతుంది. ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి శక్తియుక్తుల్నీ సృష్టికర్త ఎవ్వరికీ దఖలు పరచలేదు, చివరికి మహమ్మద్ ప్రవక్తకు కూడా” – అనేది, ఇస్లామిక్ భక్తిభావనలో ఓ కీలకమైన అంశం. అందుకే, కష్టాలనుండీ తప్పించమనీ, కోర్కెల్ని తీర్చమనీ ముస్లింలు అల్లాను వేడుకుంటారు తప్ప, మహమ్మద్ ప్రవక్తను వేడుకోరు. “సృష్టికర్త ద్వారా తప్ప, వేరే ఎవరిద్వారానైనా (వ్యక్తులైనా, పదార్థాలైనా, ఆత్మలైనా) మంచి జరుగుతుందని భావించడం- “మనిషి తనకు తాను చేసుకునే అతిపెద్ద కీడు”- అని ఖురాన్ సుస్పష్టంగా ప్రకటించింది. దీని కారణంగానే ముస్లింలు, ‘ఇది తింటే మంచి జరుగుతుంది ‘- అనే భావనతో ఇచ్చే ప్రసాదాన్ని తినాలంటే భయపడతారు. ఇదే భావనతోనే, చాలా మంది ముస్లింలు కడప పెద్ద దర్గా, నెల్లూరు రొట్టెల పండగ వంటి వాటికి దూరంగా ఉంటారు. అలా వెళ్ళవద్దని ఇతర ముస్లింలను కూడా వారిస్తుంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, ముస్లింలు ఇతరులు ఇచ్చే ప్రసాదాన్ని తినకపోవడం వారి మతాచారంలో భాగంగానే తప్ప, ఇతర మతాల్ని అవమానించాలని కాదనే విషయం ఈజీగానే తెలిసిపోతుంది.ఇవేకాకుండా- నీముందు గ్లాసుతో నీళ్ళు తాగిన వ్యక్తి నలుపైనా-తెలుపైనా,రాజైనా-పేదైనా, నువ్వు కూడా అదే గ్లాసును పెదాలకు అతికించి తాగమని ఓ సంధర్భంలో ప్రవక్త చెప్పి ఉన్నారు. అట్లే, నీ దగ్గర ఎంత సంపదున్నా, తినే ప్లేట్ లో ఎలాంటి మెతుకుల్నీ వదిలేయరాదనీ, ఆహారాన్ని వృధా చేయకూడనీ కూడా ప్రవక్త చెప్పి ఉన్నారు. ముస్లింలు ఈ అంశాల్ని పాటిస్తున్న కొన్ని పాత వీడియోలను, గత సంవత్సరం సోషల్ మీడీయా, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో సర్క్యులేట్ చేసి, ముస్లింలను ఎంతగా బద్నాం చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. చివరికి తోపుడుబండ్లపై పండ్లు,కూరగాయలు అమ్మే ముస్లింల దగ్గర ఏమీ కొనకూడదని క్యాంపైన్లు కూడా నడిచాయంటే – ముస్లింల ఆచార వ్యవహారాలపై ప్రాధమిక అవగాహన లేకపోవడం వల్ల వారిని ఎంత ఈజీగా పరాయీకరణకు గురిచేయొచ్చో ఈ విషయాలు నిరూపించాయి. తమకు తెలియని విషయాలపట్ల, సహజంగా మనుషులకు ఓ రకమైన భయం ఉంటుంది – దీనినే గ్జెనోఫోబియా అంటారు. ఇస్లామోఫోబియాను తమ రాజకీయాలకోసం పెంచిపోషించేవారికి, ఇస్లాం గురించి మెజారిటీ ప్రజలకు ఉన్న ఈ గ్జెనోఫోబియా ఓ ఆయాచిత వరంలా పనిచేస్తుంది.మెజారిటీల మతం గురించి, టీవీలు,సినిమాలూ, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, రోజూ జరుగుతున్న దైనందిన సంఘటనల ద్వారా మైనారిటీలకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. కానీ, మైనారిటీల మత వ్యవహారాల గురించి, మెజారిటీలకు తెలిసే అవకాశం లేదు. తమ మతాన్ని సైలెంట్ గా కళ్ళు మూసుకుని ఆచరించడం మాత్రమే కాకుండా, తాము ఆచరిస్తున్న మతం, ఇతర మతస్థులకు ఎలా వ్యతిరేకంకాదో, వారికి అర్థమయ్యేలా వివరించడం కూడా మైనారిటీల బాధ్యత. అలా వివరించే ప్రయత్నాల్ని మత ప్రచారంగా, ఇతర మతాలపట్ల కుట్రలుగా భావించకుండా, వారు ఏ రకంగా మనకంటే ప్రత్యేకమో కనీస అవగాహనకలిగి ఉండటం మెజారిటీల బాధ్యత.కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ముస్లింల సేవానిరతికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుందని ప్రముఖ ప్రవచన కారులు శ్రీ.గరికపాటి నరసిమ్హా రావు గారు మాట్లాడుతున్న వీడియో, ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ముస్లింల సేవలను గుర్తించినందుకూ, దాని గురించి ఇతరులకు తెలిసేలా మాట్లాడినందుకూ ఆయనను అభినందించాలి. సమాజంలోని వివిధ వర్గాలమధ్య ఒకరిపై ఒకరికి ప్రాధమిక అవగాహన, గౌరవమన్ననలు, సోదరభావాలూ ఉన్నప్పుడే ఏ సమాజమైనా సుఖసౌఖ్యాలతో మనగలుగుతుంది, అభివృద్ధిపదంలో ముందడుగు వేయగలుగుతుంది. సమాజంలోని ప్రజలందరూ ఆ దిశగా కృషిచేయాలని ఆశిద్దాం.