“ఇస్లాం సంక్షోభంలో ఉంది, దానిని సంస్కరించాల్సిన అవసరం ఉంది” – అని ఇటీవల ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మార్కోని ప్రకటించాడు. ఇస్లాం సంక్షోభంలో ఉందా..? ఏమో.. ఇప్పుడేమో గానీ, గతం లో కొన్ని సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొన్నమాట మాత్రం నిజం. నా దృష్టిలో ఇస్లాం ఎదుర్కొన్న సంక్షోభాలు కొన్ని- సంక్షోభం#1 : క్రీ.శ.622లో :===============
“ఆ రాల్లూ రప్పలకు ఎలాంటి మహిమలూ లేవు, వాటిని పూజించకండి. అంతమంది దేవుల్లు లేరు, ఉన్నది ఒక్కటే దైవం, దానికి రూపం లేదు. తప్పుడు పనులు,మోసాలూ చేయకండి” – ప్రవక్త చెప్పే ఇలాంటి మాటలు నచ్చక, ఆయన్ను అంతమొందించాలని మక్కాలోని ఖురైష్ ప్రముఖులందరూ డిసైడ్ చేసుకున్నారు. ఈ పని చేయడానికి, దేహధారుడ్యమున్న కొందరు యువకులతో, ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, అల్లాహ్ ఆఙానుసారం మహమ్మద్ ప్రవక్త(స), అనుచరుడు అబూ బకర్(ర) తో కలిసి, మక్కాకు 450 కి.మీ దూరంలో ఉన్న యత్రిబ్( అనంతరం ఇదే మదీనా గా ప్రస్తిద్ధి చెందింది) అనే ప్రాంతానికి పయణమయ్యారు. కానీ, యత్రిబ్ కెళ్ళే అన్ని దారుల్లో – ఖురైష్ లు మోహరించి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, “జబల్ థార్/సౌర్ ( Cave of Thaur ) అనే కొండ గుహలో ప్రవక్త(స), అబూ బకర్(ర) లు మూడు రోజులు తలదాచుకున్నారు. వారిని వెతుక్కుంటూ, ఖురైష్ లు ఆ కొండ చుట్టుపక్కల కూడా చాలా సార్లు కూంబింగ్ నిర్వచించారు, గానీ లోపలికి మాత్రం రాలేదు. వారు ప్రవక్తను అప్పుడే గుర్తించి ఉంటే, ఇస్లాం అప్పుడే అంతమై ఉండేది. కానీ, అలా జరగలేదు.
సంక్షోభం#2 -క్రీ.శ. 624లో :=============== ప్రవక్త ఎలాగోలా మదీనా చేరుకున్నారు, ఆయన అనుచరుల సంఖ్య ఓ మొస్తరుగా పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది కాబట్టి, వారికి ఆదిలోనే ఫుల్-స్టాప్ పెట్టాలని ఖురాష్ లు డిసైడ్ అయ్యారు. వెయ్యిమంది సైనికులతో మదీనపై దాడికి వచ్చారు. ప్రవక్త వైపు ఉన్నవారి సంఖ్య 300+. మదీనా పొలిమేరల్లోని బదర్ అనే ప్రాంతం లో రెండు వర్గాలూ తలపడ్డాయి. ముస్లింలు గెలిచే అవకాశం చాలా చాలా తక్కువ. కానీ, గెలిచారు. ఓడిపోయుంటే, ఇస్లాం అప్పుడే అంతమై ఉండేది. కానీ అలా జరగలేదు.
సంక్షోభం#3- క్రీ.శ. 628లో: ===============మదీనాలోని ముస్లింలకు, మరియు మక్కాలోని ఖురైష్ లకు మధ్య అప్పటికి మూడు యుద్ధాలు జరిగాయి.
1. బద్ర్ యుద్దం: దీనిలో ముస్లింలు తమ కన్నా 3 రెట్లు పెద్దదైన ఖురైష్ సైన్యాన్ని ఓడించి అఖండ విజయాన్ని సాధించారు.
2. ఉహుద్ యుద్దం: మొదట్లో దీనిలో కూడా ముస్లింలదే పైచేయిగా ఉండింది. కానీ, కొందరు విలుకాల్లు, తమకు కేటాయించిన స్థలాల నుండి పక్కకు వచ్చి, వారి వ్యూహం మొత్తం చెదిరిపోవడంతో, ముస్లింలు తీవ్ర నష్టాన్ని చవి చేశారు. సాక్షాత్తూ మహమ్మద్ ప్రవక్త కూడా ఈ యుద్ధంలో గాయపడ్డారు.
3. కందక యుద్దం: సుమారు పదివేల మంది ఖురైష్ సైన్యం మదీనాను చుట్టుముట్టారు. ఇది మదీనాలోని మొత్తం జనాభా కన్నా ఎక్కువ. కానీ, మహమ్మద్ ప్రవక్త అనుసరించిన ఓ తెలివైన వ్యూహం వల్ల ఖురైష్ సైనికులు మదీనాలోకి కాలు పెట్టలేక పోయారు. అది – మదీనా చుట్టూ కందకాలు తవ్వడం. దీని వల్ల వారు నెల రోజుల పాటు ప్రయత్నించినప్పటికీ, మదీనాలోకి ప్రవేశించడంలో సఫలీకృతం కాలేకపోయారు. చివరికి తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలు ఐపోవడం మరియు భీకరమైన ఎడారి తుపాన్ల వల్ల, యుద్ధాన్ని మధ్యలోనే విరమించి మక్కాకు తిరుగుప్రయాణమయ్యారు.పదివేల మంది సైన్యంతో వెళ్ళీ కూడా ముస్లింలను ఏమీ చేయలేకపోవడాన్ని ఖురైష్ లు చాలా అవమానంగా భావించారు. ముస్లింలను దెబ్బ కొట్టడానికి మరో అవకాశం కోసం పథకాలు రచించసాగారు.ఇలాంటి పరిస్థితుల్లో, ఒకానొక రోజు – “మనందరం మక్కా కు వెళ్ళబోతున్నాం, యుద్ధం చేయడానికి కాదు, యాత్రికులుగా”. అని మహమ్మద్ ప్రవక్త ప్రకటించారు. ఈ ప్రకటన ప్రవక్త అనుచరులను మొదట అయోమయానికి గురిచేసింది. యాత్రికులుగా వెళ్ళడమంటే, జంతువుల్ని బలి ఇవ్వడానికి అవసరమయ్యే కొన్ని చిన్నపాటి కత్తుల్ని తప్ప, ఏ ఇతర ఆయుధాల్ని ధరించి వెళ్ళకూడదు. మరో వైపు తమను చావుదెబ్బ కొట్టడానికి ఖురైష్ లు అవకాశం కోసం కాచుక్కూర్చుని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుధాలు లేకుండా మక్కాలోకి అడుగుపెట్టడమంటే, అది ఆత్మహత్యా సదృశ్యమే. అయినప్పటికీ, ప్రవక్త మీద ఉన్న నమ్మకం, ప్రవక్తకు అందే దైవ సందేశం మీద ఉన్న అచంచల విశ్వాసం కారణంగా 1400 మంది ముస్లింలు మక్కా యాత్రకి బయలు దేరారు.కాబా ప్రశస్తికి, అక్కడి వాణిజ్యానికి యాత్రికులే కీలకం కాబట్టి, దాని సమ్రక్షకులుగా ఉంటున్న ఖురైష్ తెగవారు మరియు ఇతర మక్కా ప్రజలు కొన్ని నియమాలకు చాలా నిష్టగా కట్టుబడిఉండేవారు. అవి – కాబాను సందర్శించడానికి వచ్చే ఏ ఒక్క యాత్రికునికీ హాని తలపెట్టరాదు. ఏ ఒక్క యాత్రికునికీ కాబా చుట్టూ ప్రదక్షీనాలు చేయడంలో ఆటంకం కలిగించరాదు. కానీ, వీరు మహమ్మద్ ప్రవక్త(స), మరియు ఆయన అనుచరుల విషయంలో కూడా ఈ నియమానికి కట్టుబడి ఉంటారని ఎలాంటి గ్యారెంటీ లేదు.ముస్లిం యాత్రికులు మక్కా పొలిమేరల్లోని హుదేబియా అనే ప్రాంతానికి చేరి, తాము యుద్ధం కోరుకోవడం లేదనీ, కేవలం కాబాను సందర్శించడానికి యాత్రికులుగా మాత్రమే వచ్చామనీ, కావున తమను ఇతర యాత్రికుల్లాగానే మక్కాలోకి అనుమతించాలని ఖురైష్ పెద్దలకు కబురు పంపారు. 200 మంది ఖురైష్ ల సైన్యం హుదేబియాకి వచ్చి ముస్లింల దగ్గర, కాబా దగ్గర బలి ఇవ్వడానికి తెచ్చుకున్న జంతువులు, తప్ప ఏ ఇతర యుద్ధసామాగ్రీ లేదని నిర్ధారించుకుని వెళ్ళారు. కానీ, ఇప్పుడు వీరిని మక్కాలోకి అనుమతించడమా, లేదా అనే అంశం వారిని గందరగోళంలో పడేసింది. అనుమతిస్తే, తాము చంపాలనుకుంటున్న వారు తమ కళ్ళ ముందే దర్జాగా మక్కాలో విహరించి వెళ్ళినా ఏమీ చేయలేని దద్దమలని ఇతర తెగల ముందు చులకన ఐపోతామేమోననే భయం. మరో వైపు వీరిపై దాడిచేస్తే, నిరాయుధులైన, యాత్రికుల్ని చంపితే దాని వల్ల మక్కా చుట్టుపక్కల ఉన్న ఇతర తటస్థ తెగలన్నీ తమకు వ్యతిరేకంగా మారిపోతాయేమోననే భయం ఒక వైపు.. దీనితో ఏమి చేయాలో తెలియక వారు తలలు పట్టుకుని కూర్చున్నారు.మరో వైపు ఖురైష్ లతో చర్చలు జరపడానికి మహమ్మద్ ప్రవక్త ముస్లింల రాయబారిగా పంపిన ఉత్మాన్ (ప్రవక్త అనంతరం ఈయన 3వ ఖలీఫాగా నియమించబడ్డారు), కొన్ని రోజుల వరకూ తిరిగి రాకపోవడంతో, ఖురైష్ లు ఆయనను చంపేసి ఉంటారనే వదంతులు వ్యాపించాయి. అదేగనక జరిగితే, ఖురైష్ లు యుద్ధానికి తెరలేపినట్లేననీ, తమ దగ్గరున్న కొద్దిపాటి ఆయుధాల్తోనే ఉమర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామనీ ప్రవక్త అనుచరులు శపధం చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ఖురైష్ లు ఉత్మాన్ తో పాటు, తమ తెగ పెద్ద అయిన సుహైల్-ఇబ్న్-అమర్ ని సంధి చర్చలకు పంపారు. దీని ప్రకారం, ఖురైష్ లు ప్రతిపాదించిన అంశాలు-
1. ముస్లింలను యాత్రకు అనుమతిస్తారు. కానీ అది ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం. అంటే, ఇప్పుడు మాత్రం, హుదేబియా నుండి వెనుతిరిగి మళ్ళీ తరువాతి సంవత్సరం రావాల్సి ఉంటుంది.
2. మక్కానుండి ఎవరైనా ఇస్లాం స్వీకరించి మదీనాకు వస్తే, వారిని తిరిగి మక్కావారికి అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ, మదీనానుండి ఎవరైనా, ఇస్లాం వదిలి మక్కాకు వస్తే వారిని తిరిగి మదీనాకు పంపబడదు.
3.పదేళ్ళ పాటు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం నిషిద్దం.
4. మక్కావారు, మదీనా వారు స్వేచ్చగా వాణిజ్య కార్యకలాపాలు సాగించుకోవచ్చు. ఇతర తెగలు మక్కా,మదీనాలలో తమకు నచ్చిన వారితో చేతులు కలపవచ్చు. ఈ అంశాలు పూర్తి ఏకపక్షంగా, ఖురైష్ లకు అనుకూలంగా, ముస్లింలకు ప్రతికూలంగా ఉన్నాయని చూసిన వారికి ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. మరీ ముఖ్యంగా, ఈ ఒప్పంద పత్రానికి టైటిల్గా ప్రవక్త మేనల్లుడు అలీ(ర.అ) గారు,” ఖురైష్ పెద్దలకు మరియు దైవ ప్రవక్త అయిన మహమ్మద్ కు మధ్య ఒప్పందం” – అని పెడితే, తాము మహమ్మద్ ని దైవ ప్రవక్తగా ఒప్పుకోము కాబట్టి, ఆ పదాన్ని తీసేయాలని ఖురైష్ పెద్దలు పేచీ పెట్టారు. తాను ఆ పని చేయనని అలీ(ర.అ) గారు కూడా పట్టు బడితే, చివరికి ప్రవక్తే ఆ పత్రాన్ని తీసుకుని, ‘దేవుని ప్రవక్త ‘ అనే పదాల్ని కొట్టివేశారు. ఈ మొత్తం పరిణామాల్నిచూసి ముస్లింలు ఆవేశంతో రగిలిపోయారు. ఇంత దూరం వచ్చి కాబా దగ్గరకు వెళ్ళకుండా వెనుతిరగడమంటే, అది ఘోర అవమానంగా భావించారు. మరీ ముఖ్యంగా, పైన చెప్పిన 2వ అంశం వారికి చాలా కఠినంగా అనిపించింది. కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖురైష్ వారితో రక్తపాత ఘర్షణని నివారించడమే ముఖ్యమనుకున్న ప్రవక్త, ఈ నియమాలన్నిటికీ ఒప్పుకున్నారు. తాము వెంట తెచ్చుకున్న జంతువుల్ని అక్కడే బలి ఇచ్చి వెనుతిరగవలసిందిగా తన అనుచరుల్ని ఆదేశించారు. కానీ, మామూలుగా ఐతే ప్రవక్త నోటి నుండీ ఒక్క ఆదేశం రాగానే, దానిని చేయడానికి పోటీపడే అనుచరులకు, ఈ అంశంలో మాత్రం ప్రవక్త నిర్ణయం మింగుడుపడలేదు.దీనితో, ప్రవక్త చెప్పాక కూడా ఏ ఒక్కరూ కదలకుండా అలాగే కూర్చున్నారు. ఉమర్-అల్-ఖత్తాబ్ ( ప్రవక్త తర్వాత 2వ ఖలీఫా) ఐతే, “అసలు మీరు ఇంతకీ నిజంగానే ప్రవక్తేనా, మనం నిజమైన మార్గంలోనే వెల్తున్నామా?” అని ప్రవక్తని నిలదీసి అడిగారు. దీనికి సమాధానంగా ప్రవక్త గారు, “నాకు దేవుడి నుండీ అందిన సూచనలమేరకే నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఇంతకు మించి ఎక్కువగా నేనేదీ నిరూపించలేను” – అని చెప్పారు. అనుచరుల ఈ వైఖరికి తీవ్రంగా నొచ్చుకున్న ప్రవక్త, చివరికి తానే స్వయంగా కత్తి చేతబట్టి, తాను వెంట తెచ్చుకున్న ఒంటె ని బలి ఇచ్చారు. ఇది చూసి చలించిన ముస్లింలు, అందరూ లేచి ప్రవక్తకు మద్దతుగా నినాదాలిచ్చారు. వారు కూడా, తమ తమ ఒంటెల్ని బలి ఇచ్చారు. ఇక్కడి నుండీ ప్రవక్త అనుచరులు భారమైన మనసుతో వెనుతిరిగారు కానీ, ఈ హుదేబియా సంధి ఇస్లామిక్ చరిత్రలో ఎంత కీలక ఘట్టమనేది కొద్ది రోజుల్లోనే నిరూపితమైంది. మక్కా వారితో వర్తక,వాణిజ్యాలు పెరగడం వల్ల, ముస్లింలు తమ మతాన్ని స్వేచ్చగా ఆచరిస్తూ, ఇతరులకు దాని గురించి చెప్పడం చాలా సులువైపోయింది. దీనితో అసంఖ్యాకంగా మక్కా మరియు దాని చుట్టుపక్కల ఉన్న తెగల ప్రజలు ఇస్లాంలోకి మారిపోయారు. అంతకు ముందు 17 ఏళ్ళనుండీ ఎంతమంది ఇస్లాం లోకి మారారో, హుదేబియా సంధి తర్వాత, కేవలం 2 సంవత్సరాల్లోనే దానికి రెట్టింపు సంఖ్యలో ముస్లింలుగా మారారు. ఇలా మక్కా చుట్టు పక్కల గల తెగలన్నీ, ఒకదానితర్వాత ఒకటిగా ముస్లింలుగా మారిపోవడంతో, అంతిమంగా ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే మక్కా ముస్లింలకు లొంగిపోయింది. ఆ రకంగా, ఇస్లాం ఎదుర్కొన్న మరో సంక్షోభం శాశ్వతంగా, ఎలాంటి రక్తపాతం లేకుండా, ముగిసింది.
సంక్షోభం#4 : క్రీ.శ. 1250 : ముస్లింలపై మంగోలుల దాడి ==========================చరిత్రలో, ఇస్లాం కి అత్యంత నష్టం కలిగించిన వ్యక్తి మంగోల్ రాజు చెంగిజ్ ఖాన్.ఎవరీ చెంగిజ్ ఖాన్?పేరు చూసి చాలా మంది ఇతన్ని ముస్లిం అనుకుంటారు. కానీ, ఇతను ముస్లిం కాదు. అప్పటికి ఖాన్ లకు, ఇంకా ఇస్లాం పరిచయం అవ్వలేదు. ఇతను మొదట్లో, సంచార జీవనం సాగించే అనేక మంగోల్ తెగల్లో, ఓ చిన్న తెగనాయకుడు. కానీ, ప్రపంచాన్ని జయించడమే లక్ష్యంగా అనేక తెగల్ని ఒక్కటి చేసి, మంగోల్ తెగలన్నిటికీ తిరుగులేని నాయకుడయ్యాడు. ఇక అప్పటినుండీ ఒక రాజ్యం తర్వాత, ఇంకో రాజ్యంపై దండెత్తుతూ, అన్నిటినీ అప్రతిహతంగా జయించుకుంటూ వెళ్ళాడు. చైనా మొత్తం, ఆసియా, యూరప్ లలో చాలా భాగం ఇతని ఆధీనంలోకి వచ్చాయి. ఇతర రాజులకూ, మంగోల్ రాజులకూ ఉన్న ప్రధాన వ్యత్యాసం – మంగోలులు జయించిన ఏ రాజ్యాన్ని అయినా సరే, పూర్తిగా నేలమట్టం చేయంది వదలరు. అక్కడ నాగరికత నామరూపాల్లేకుండా చేయడం, విలువైన వస్తువుల్ని, బంగారాన్నీ దోచుకోవడం, పురుషులందర్నీ నిర్దాక్షిణ్యంగా చంపేయడం, అందమైన పడుచు యువతుల్ని ఎత్తుకెల్లడం.. ఇదే వారికి తెలిసింది తప్ప, ఓ చోట స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం, పరిపాలన సాగించడం పట్ల వారికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.క్వారజ్మియన్ సామ్రాజ్యం1220లో, చెంగిజ్ ఖాన్ చైనాను జయించేనాటికి, ప్రస్తుత ఇరాన్,ఆఫ్ఘనిస్తాన్,తుర్కెమిస్తాన్ ప్రాంతాలు క్వారజ్మియన్ ముస్లిం రాజుల పాలనలో ఉన్నాయి. ఆ ప్రాంతాల ఐశ్వర్యం, సంపదల గురించి విన్న చెంగీజ్ ఖాన్, మొదటివిడతగా వారితో వ్యాపార సంబంధాలు నెరపాలని, ఓ వర్తక బృందాన్ని ఆ రాజు – అల్లా ఉద్దీన్ మొహమ్మద్ తో చర్చలకు పంపాడు. ఆ బృందంలో గూఢాచారులు ఉన్నారని అణుమానించిన అల్లా ఉద్దీన్ మొహమ్మద్ ఆ వర్తకుల్ని చంపేశాడు. ఇది విని కోపంతో రగిలిపోయిన చెంగీజ్ ఖాన్, లక్ష మంది సైన్యంతో క్వారిజ్మియన్ సామ్రాజ్యంపైకి దండెత్తి, ఆ రాజ్యంలోని మసీదులు, మదరసాలూ, నిర్మాణాలన్నిటినీ పూర్తిగా నేలమట్టం చేశాడు.మంగోలులు అక్కడి ప్రధాన నగరాలైన సమర్ఖండ్, బుఖారా, ఉర్గెంచ్ లను నామరూపాలు లేకుండా చేశారు. అక్కడి నిర్వాసితుల్లోని పురుషులందర్నీ చంపేయడానికి మంగోలులు చాలా శ్రమపడాల్సి వచ్చిందని చరిత్రకారులు రాసిఉన్నారు. ఒక్కో మంగోల్ సైనికునికీ, రోజుకు కనీసం 24 మంది పురుషుల్ని చంపాలనేది టార్గేట్ గా పెట్టారట. ఇది ప్రపంచ చరిత్రలో జరిగిన అత్యంత పాశవిక దండయాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది. కొన్ని అంచనాల ప్రకారం కనీసం 10 లక్షలమంది చంపబడ్డారు. ఈ రకంగా క్వారజ్మియన్ రాజ్యాన్ని నేలమట్టం చేశాక, ఇక మంగోలుల తదుపరి లక్ష్యం ఇరాక్, జెరూసలేం, మక్కా,మదీనాలు.ఇంతలో, చైనాలో తలెత్తిన కొన్ని తిరుగుబాట్లను అణచివేయడానికి, చెంగీజ్ ఖాన్ చైనాకు పయనమయ్యాడు. 1227లో అక్కడే చనిపోయాడు. చెంగీజ్ ఖాన్ మరణానంతరం అతని రాజ్యం నాలుగు భాగాలుగా విడగొట్టబడి, నలుగురు మనవల్లకు పంచబడింది.1. బెర్కే ఖాన్ ( ప్రస్తుత రష్యా, ఉక్రెయిన్ ప్రాంతం)2. హులగూ ఖాన్ ( క్వారజ్మియన్ ప్రాంతం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ )3. ముబారక్ షా ఖాన్ ( కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజ్కిస్తాన్, మధ్య రష్యా ప్రాంతం)4. కుబ్లై ఖాన్ ( చైనా, మంగోలియా ప్రాంతం)తన తాత అసంపూర్ణంగా వదిలేసిన ముస్లిం రాజ్యాల జైత్రయాత్రను పూర్తిచేయాలనే లక్ష్యంతో హులగూ ఖాన్ 1258లో, అప్పటి ప్రపంచంలోని మేటి రాజ్యాల్లో ఒకటైన అబ్బాసిద్ రాజ్యంపైకి దండెత్తాడు. దాని రాజధాని బాగ్దాద్ ని కూకటి వేల్లతో పెకిలించాడు. అనేక లైబ్రరీలను, మద్రసాలనూ తగలబెట్టాడు. వాటిలోని లక్షలాది పుస్తకాల్ని టైగ్రిస్ నదిలో పడెస్తే, ఆపుస్తకాల సిరా నీటిలో కరిగి, నది నీరు మొత్తం కొన్ని వారాల పాటు నల్లగా మారిపోయిందని చరిత్రకారులు రాశారు. హులగూ ఖాన్ చేసిన మరో దారుణం – అప్పటి ఇస్లాం ఖలీఫా అయిన అల్ ముస్తాసిం నే చంపేశాడు. ఐదు నుండీ పది లక్షల మందివరకూ ఈ దాడిలో చనిపోయారు. ఆ శవాల దుర్గంధం భరించలేక హులగూ ఖాన్ కొన్నాల్లు రాజ్యం వదిలి దూరంగా వెల్లిపోయాడట.సాక్ష్యాత్తూ ఖలీఫానే చంపబడ్డాక, ఇస్లాం లో ఇంక మిగిలింది మక్కా,మదీనాలే.కానీ, దానికి కొద్ది సంవత్సరాలముందే, అంటే 1252లో, చరిత్రలో ఎప్పుడూ జరగని ఓ అద్భుతం జరిగింది.సహజంగా గెలిచిన రాజ్యాల/రాజుల మతం-సంస్కృతి వర్థిల్లుతుంది. ఓడిన వారి మతం-సంస్కృతి నశిస్తుంది/కనుమరుగవుతుంది. కానీ, మొదటిసారి దీనికి విరుద్ధంగా జరిగింది.చెంగిజ్ ఖాన్ వారసుల్లో ఒకడైన బెర్కే ఖాన్, తన రాజ్యంగుండా ప్రయాణిస్తున్న కొందరు వర్తకుల్ని అటకాయించాడు. వారు ఎక్కడినుండీ వస్తున్నారని ప్రశ్నించగా, సమ్ర్ఖండ్ నుండీ అని వారు జవాబిచ్చారు. తన తాత నామరూపాల్లేకుండా చేసిన నగరంలో ఇంకా జనసంచారం ఉందని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. అల్లా దయతో తాము బతికి బయటపడ్డామని చెప్పడంతో, ఈ అల్లా ఎవరూ అని బెర్కే ఖాన్ ప్రశ్నించాడు. ఆ రకంగా వారితో ఇస్లాం గురించి కొన్ని రోజులపాటు చర్చించిన మీదట బెర్కే ఖాన్ ఇస్లాం మతం స్వీకరించాడు. ఓ బలవంతుడైన రాజు, తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతికే బలహీన ప్రజల మతాన్ని తనదిగా చేసుకున్నాడు.1258లో తన సోదరుడు హులగూ ఖాన్, బాగ్దాద్ పై చేసిన దాడి, అతను చేసిన దారుణాలూ, బెర్కే ఖాన్ ని తీవ్రంగా కలచివేశాయి. హులగూ ఖాన్ తదుపరి జెరూసలేం, మక్కా, మదీనా లపై దాడిచేసే అవకాశం ఉందని భావించిన బెర్కే ఖాన్, ఈజిప్ట్ ని పాలించే మరో ముస్లిం రాజవంశం అయిన -ముంలూక్ లతో చేతులు కలిపి, తన సొంత సోదరుడైన హులగూపైకే యుద్ధానికిదిగి, అతన్ని నిలువరించాడు. హులగూ తర్వాత రాజైన ఘజన్ ఖాన్ ఇస్లాం స్వీకరించడంతో వీరి వైరం ముగిసింది.తన సోదరుడి ద్వారా ఇస్లాం గురించి తెలుసుకున్న, మధ్య రష్యా పాలకుడు- ముబారక్ షా కూడా ఇస్లాం స్వీకరించాడు. ఆ రకంగా చెంగింజ్ ఖాన్ మరణించిన మూడు దశాబ్ధాల్లోనే, తన నలుగురు వారసుల్లో,ముగ్గురు ఇస్లాం లోకి మారిపోయారు. వీరి తర్వాతి తరాలవారే మొఘల్ పాలకులుగా ఇండియాలోకి అడుగుపెట్టారు.మొత్తానికి మగోలుల రూపంలో ఇస్లాం ఎదుర్కొన్న ఓ పెద్ద సంక్షోభం, అదే మంగోలులు ముస్లింలు గా మారడంతో సమసిపోయింది. ****************వీటితో పోల్చితే, ఇప్పుడు ముస్లింలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని సంక్షోభం అనొచ్చో,లేదో ఎవరికివారు నిర్ణయించుకోవచ్చు. “They plan, and Allah plans. Surely, Allah is the Best of planners.” -Quran 8:30శుక్రవారం.ఇన్