In Search of Purpose-3
ఎంటర్ ది ఆర్జీవీ!!!
================
హైస్కూల్లో ఉన్నప్పుడు, మా ఊరి మసీదులో ఇమాం గారి స్పీచులు విని ఇస్లాం పై నమ్మకం పోయింది. అది పార్ట్-1 .
ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందామని THE HINDU పేపర్ చదివితే, దాని ద్వారా సమాజంలో జరుగుతున్నవి తెలుసుకుని చట్టం,న్యాయం వంటివాటిపై నమ్మకం పోయింది. అది పార్ట్-2 లో.
దేని మీదా నమ్మకం లేకపోతే కలిగేది అలజడీ,అశాంతే. నా పరిస్థితి అప్పట్లో అలాగే ఉండేది. ఓ బస్సు ప్రమాదంలోనో, రైలు ప్రమాదంలోనో ఎవరైనా మరణిస్తే వెంటనే కొన్ని లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తారు. ఆ మరణించిన వారిపై అందరూ సానుభూతి చూపిస్తారు. ఆ చనిపోయిన వారి కుటుంబసభ్యులు కూడా కొన్ని రోజులు ఏడుస్తారు, తర్వాత వారి టైం బాగోలేక అప్పుడు ఆ బస్సులో/రైల్లో ప్రయాణం చేశారు కాబట్టి ఇలా జరిగిందనుకుని, ఆ విషయాన్ని క్రమ,క్రమంగా మర్చిపోయి జీవితంలో మూవ్ ఆన్ అవుతారు. కానీ, తమ వారిని ఎలాంటి కారణంలేకుండా తమ ఊర్లోని ఇతర మతం వారు, ఎక్కడో ఏదో జరిగిందనే నెపంతో పట్టపగలు కత్తులు,శూలాలతో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పెట్టి చంపారు. ఆ చంపినవారిపై పోలీసుల కేసుల్లేవు. ఉన్నా కూడా, వారు బెయిల్ తెచ్చుకుని నిక్షేపంగా తిరుగుతున్నారు. దీనిని చూస్తూ ఆ కుటుంబ సభ్యులు ఎలా భరిస్తుంటారు? వారి మనసులో ఎలాంటి ఆవేశాలు, ఎలాంటి ఆలోచనలూ కలుగుతుంటాయి?
ట్రాఫిక్ జాం ల వల్ల రోజూ కొన్ని నిమిషాలు టైం వేస్ట్ అవుతుందని, రోడ్లపై గుంతలు పూడ్చడం లేదనీ, కొందరు లంచ్ టేబుల్ల దగ్గర, టప్పర్ వేర్ బాకుల్ని ఓపెన్ చేస్తూ తెగ ఆవేశపడిపోతుంటారు. అలాంటిది ఏ నేరం చేయకపోయినప్పటికీ తీవ్రవాదులనే ముద్రవేసి ఏళ్ళతరబడి జైల్లలో పడేయడం, ప్రమోషన్ల కోసం, రాజకీయ ప్రయోజనాలకోసం ఎన్ కౌంటర్లు చేయడం.. – వీటిని ఆ బాధితులు, వారి ఇంట్లోవారూ ఎలా భరిస్తుండాలి? వారికి ఇంకెంత ఆవేశం కలిగిఉండాలి?
చట్టం, న్యాయం లాంటివి లేనప్పుడు, మనుషులు తమకు తోచింది,నచ్చింది చేయడమే న్యాయమనుకుంటారు. ఓ బలమైన విలన్, డబ్బు అధికారం అండ చూసుకుని, అమాయకుడైన హీరో జీవితాన్ని,కుటుంబాన్నీ నాశనం చేసినప్పుడు, ఆ హీరో చట్ట వ్యతిరేకంగా ఆ విలన్ని, అతని అనుచర గణాన్ని తుదముట్టించి ప్రతీకారం తీర్చుకునే కథలు సినిమాలుగా తీస్తే, మన జనాలు ఎగబడి చూశారు. హీరోవైపు నుండి ఆలోచించి విలన్ని అసహ్యించుకున్నారు. అలాంటిది, నిజజీవితంలో ఇంతమంది అమాయకుల జీవితాలు నాశనం అవుతుంటే, దానిని ఖండించాల్సింది పోయి, మాకు ఆర్థికాభివృద్దీ, అచ్చే దిన్ లే ముఖ్యమని ఆ పీడకుని వైపే మొగ్గుచూపుతారా. పైగా ‘ఆ మతం హింసాత్మకమనీ,వాల్లందరూ చెడ్డోల్లనీ, మేము మాత్రం పరమ నీతివంతులం,సహనవంతులమనీ’ పొద్దునలేచినప్పటినుండి సోదికబుర్లు ఒకటి.
మనుషుల్లో ఇంత హిపోక్రసీ,డబుల్ స్టాండర్డ్ ఏమిటి? అసలు మనుషులు ఇలా, ఎలా ఉండగలుగుతారు? – ఈ ప్రశ్న నన్ను చాలాకాలం తొలిచేసింది.
And then.. Enter the – RAM GOPAL VARMA
రాంగోపాల్ వర్మ అప్పట్లో rgvzooming.in అని ఓ వెబ్ పోర్టల్ లో వ్యాసాలు రాసేవాడు. ఆ వ్యాసాల కింద భీకరమైన ఫిలసాఫికల్ చర్చలు కూడా జరిగేవి. ఆ వ్యాసాలే తర్వాత సాక్షి ఆదివారం పుస్తకంలోనూ, ‘నా ఇష్టం’ పుస్తకంలోనూ వచ్చాయి. యాక్సిడెంటల్ గానో, ఎవరైనా ఫార్వర్డ్ చేశారో గుర్తులేదు, మొత్తానికి ఆ వెబ్సైట్ నా కంటపడింది..
వర్మ చెప్పిన విషయాల్ని కొందరు రామూఇజం అని పిలుస్తున్నారు గానీ, నిజానికి అతను కొత్తగా ఏ ఇజాన్నీ/సిద్ధాంతాన్నీ చెప్పలేదు. అతను చెప్పిందల్లా – మనిషిలో కలిగే ప్రతి ఆవేశాన్ని ఆబ్జెక్టివ్ గా విశ్లేషించమనే. అట్లే, సమాజంలో మనం వినే,చూసే చాలా విషయాలు ఎక్కడో, ఎవరో ఒకరి మెదడులో పుట్టిన ఆలోచనలే. ఆ ఆలోచనల్ని పుట్టించింది కేవలం మనలాంటి మనిషే కాబట్టి, మనం వాటిని ఆటోమేటిక్ గా నమ్మేయాలనో,వాటికి కట్టుబడి ఉండాలనో రూలేంలేదు. – ఇదీ స్థూలంగా వర్మ చెప్పింది.
ఉదాహరణకు: “కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం, దాన ధర్మాలు చేయడం” – అనే ఓ అంశాన్ని తీసుకుందాం. ప్రపంచంలో 99.99% మంది ఇది మంచి పని, గొప్ప పని అనే చెప్తారు -ఆస్తికులు,నాస్తికులు,కమ్యూనిస్టులూ ఇంకా ఏ ఇస్టులు,ఇజాల్ని నమ్మేవారైనా సరే. ఇప్పుడు వర్మ దీనికి ఏమంటాడో చూద్దాం.
“కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఎందుకాదుకోవాలి? నేనాదుకోను.
దాన ధర్మాలు ఎందుకు చేయాలి? నేను ఒక్క పైసా కూడా ఎవరికీ ఇవ్వను. అసలు ఎందుకివ్వాలి?”
ఇప్పుడు ప్రపంచం మొత్తం కలిసి చర్చించుకున్నా, వర్మ సంధించిన ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వగలదు? మహా ఐతే వారు చెప్పగలిగేది – “నువ్వు కూడా ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది”. -అని
దానికి వర్మ సమాధానం – నాకు కష్టాలొస్తే వాటినుండి ఎలా బయటపడాలో నాకు తెలుసు. అంతగా బయటపడలేకపోతే నా చావు నేను చస్తా. అప్పుడెప్పుడో కష్టాలొస్తాయని ఇప్పటినుండే నేను దాన ధర్మాలు చేస్తూ కూర్చోవాలా. ఒకవేల నేను ఇప్పుడు దాన ధర్మాలు చేసి కూడా, నాకు కష్టాలొచ్చినప్పుడు ఏ ఒక్కరూ నాకు సహాయం చేయకుంటే? “అరెరే!! అనవసరంగా ఇంతమందికి సహాయం చేశానే” అని అప్పుడు ఏడ్వాల్సి ఉంటుంది. అదంత అవసరమా? నేనలాంటి పిచ్చిపనులు చేయను.
వర్మ రాతల్లో మరో ముఖ్యమైన అంశం – ఇండివిడ్యువాలిటీ. అంటే, మనిషి ఎప్పటికీ ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే పోతాడు తప్ప, ఓ గ్రూపునో, వర్గాన్నో వెంటేసుకుని రాడు. అసలు మనిషి పుట్టుకే ఓ యాక్సిడెంట్. ఓ ప్రత్యేక, కులంలోనో, మతంలోనో పుట్టాలనుకుని ప్లాన్ చేసుకుని ఎవరూ పుట్టరు. పుట్టినప్పుడు మనిషి అస్థితం ఓ కొత్త పలకలాగా ఖాలీగా ఉంటుంది. ఆ తర్వాత పెద్దయ్యే క్రమంలో, అతను పుట్టిన కుటుంబం,కులం,మతం,ప్రాంతం,భాష,దేశం లాంటి వివిధ ఐడెంటిటీలు, చుట్టూ ఉన్న సమాజం మరియు వ్యక్తుల ద్వారా , ఆ పలకపై రాయబడతాయి. చాలా మంది ఆ ఐడెంటిటిలను అప్రయత్నంగానే ఓన్ చేసుకుంటారు. కొందరు వాటి తరపున వకాల్తా పుచ్చుకుంటారు. కానీ, వర్మ లాంటి వారు మాత్రం, ఎప్పటికప్పుడు ఆ పలకని శుభ్రంగా కడిగేసి ఖాలీగా ఉంచేసుకుంటారు.
వర్మ రాసిన వివిధ వ్యాసాలు చదివాక నాగురించి నాకో క్లారిటీ వచ్చింది. మహిళలపై దాడులు/రేప్ లు ఒక్క గుజరాత్లోనే కాదు, అంతకు ముందు, ఆ తర్వాత కూడా దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగాయి. అట్లే ఫేక్ ఎంకౌటర్లు, తప్పుడు ఆరోపణలతో ఏళ్ళ తరబడి జైల్లలో పడేయడం.. లాంటివాటికి చాలామంది దళిత,ఆదివాసీ యువకులు కూడా బలవ్తూనే ఉన్నారు. కానీ, ఇవెప్పుడూ నన్ను పెద్దగా ఆకర్షించక పోవడానికి, నాలో ఆక్రోషం కలిగించక పోవడానికి కారణం – నేను అప్పటికే ఓన్ చెసుకుని ఉన్న ముస్లిం ఐడెండిటీ అని అర్థమైంది. అక్కడి బాధిత ముస్లింలతో నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను కాబట్టి వారికి జరిగిందే నాకూ,నావారికీ జరగొచ్చేమోననే ‘భయం’ నాలో అన్ని ఎమోషన్స్ ని కలిగించింది. అట్లే దేశంలోని మెజారిటీ హిందువులు గుజరాత్ మాంత్రికుడు కార్పోరేట్ మీడియా ప్రాపగాండా ఆధారంగా సాగించిన ‘హిందూ హృదయ సామ్రాట్ ‘ అనే ఇమేజ్ కి ఆకర్షింపబడి, కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీల పక్షమనీ, ఇతనైతే తమపక్షం వహిస్తాడని ఆశించారు. ఈ ‘ఆశ’ అనేది, ఇతరులపట్ల అందరికీ ఉండే జాలి,సానుభూతి వంటివాటిని డామినేట్ చేసింది. కొందరు దీనిని బాహాటంగానే ప్రకటించగా, మరికొందరు మొహమాటస్తులు -‘గుజరాత్ మోడల్ ‘ అనే ఓ అభూతకల్పనను సాకుగా చూపారు. ఇదంతా బేసిక్ హ్యూమన్ నేచర్ లో భాగంగా జర్గిందే తప్ప, ఎక్కడా,ఎవరినీ తప్పుపట్టడానికి లేదు. నేను ముస్లిం కుటుంబంలో కాకుండా, హిందూ కుటుంబంలో పుట్టి ఉంటే, నేను కూడా మిగతా అందర్లాగే గుజరాత్ సంఘటనల్ని పెద్దగా పట్టించుకోకుండా, అచ్చే దిన్ కావాలని నినదించి ఉండేవాడినేమో. ఈ రియలైజేషన్ తర్వాత, నాలో ఫ్రస్టేషన్, అసహనం లాంటివి చాలావరకూ తగ్గిపోయాయి. చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్లనిపించింది. THE HINDU వార్తలు ఇంతకు ముందులా నన్ను డిస్టర్బ్ చేయడం కూడా తగ్గిపోయింది.
అంతా బాగానే ఉంది కానీ, What is the purpose of life అనే ఒక్క ప్రశ్న మాత్రం మిగిలే ఉండింది. వర్మ దీనికి సమాధానాన్ని దాటవేస్తాడు. అసలు పర్పస్ అనేది ఉండాలని రూలేముందంటాడు. నచ్చినట్లు ఉండటమే అసలైన పర్పస్ అంటాడు. ఇది వినడానికి బాగానే ఉంది గానీ, ప్రాక్టికలా అయ్యేది కాదు.
ఇప్పుడు నువ్వో 3 గంటల పరీక్ష రాయడానికి ఎగ్జాం హాల్ కి వెళ్ళావ్. కొచెన్ పేపర్ పక్కన పెట్టి, హాయిగా నిద్రపోతున్నావ్. “నిద్రపోకుండా ఎగ్జాం రాయి, లేకుంటే ఫెయిల్ అవ్తావ్”- అని ఎగ్జామినర్ చెబితే – ఫెయిల్,పాస్ లాంటివేం లేవ్, ఇప్పుడు నాకు నచ్చిందే నేను చేస్తా, అంతగా ఐతే రిజల్ట్ వచ్చాక నా చావు నేను చస్తా అనేది – RGVవైఖరి. అతను చెప్పినట్లు నిజంగానే ఫెయిల్/పాస్ లాంటివేవీ లేకుంటే పర్లేదు. కానీ, అవి నిజంగానే ఉంటే..? అది HIGHLY RISKY SITUATION అవ్తుంది. వర్మకు ఆ రిస్క్ గిట్టుబాటు కావచ్చు, ఎందుకంటే అతను ఫుల్లుగా తనలైఫ్ ని ఎంజాయ్ చేశాడు కాబట్టి. మరి అటు-ఇటు కాకుండా, స్వర్గం-నరకం లాంటివి లేవు, కానీ నైతికత,మంచి-చెడులాంటివి ఉన్నాయని నమ్ముతూ గోడమీద పిల్లుల్లా జీవిస్తున్న వారే అసలైన పరాజితులు (LOOSERS ) .
సో.. చివరికి మిగిలింది ఒకటే ప్రశ్న. ఆర్జీవీ చెప్పినట్లు, కేవలం హార్మోన్లు చెప్పినట్లు చేసుకుంటూ పోవడమేనా… లేక వేరే ఏమైనా ఉందా..
And the search continues….
-మహమ్మద్ హనీఫ్.యస్.