ఖుదాఫీజ్ – అలి బనాత్!!

ఖుదాఫీజ్ – అలి బనాత్!!
===================

అలీ బనాత్ – ఆస్ట్రేలియాలోని, సిడ్నీ లో స్థిరపడిన పాలస్తీనా దంపతులకు జన్మించాడు.

20 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికే రెండు కంపెనీల్ని స్థాపించి కోటీశ్వరుడయ్యాడు. సొంతంగా తన తల్లిందండుల ఇంటి పక్కనే ఓ అధునాతన సౌకర్యాలతో ఓ పెద్ద భవంతిని నిర్మించుకున్నాడు.

అతను వాడే కారు ఖరీదు – ఫేరారీ – 4 కోట్లు.

ఖరీదైన ఇంటర్నేషనల్ బూట్లు, చలవ కల్లజోల్లు( కూలింగ్ కల్లద్దాలు) కలెక్ట్ చేయడం అతని హాబీ. ఇంటినిండా అవే ఉండేవి. కొత్తగా పెళ్ళి కూడా చేసుకున్నాడు. జీవితం సాఫీగా గడిచిపోతున్న సమయంలో – ఓ రోజు నోట్లో ఏదో కణతలాంటిది ఉన్నట్లు అనిపించడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. బయాప్సీ, ఇంకా ఇతర టెస్ట్లు చేసిన డాక్టర్లు -దానిని స్టేజ్ 4 నోటి క్యాన్సర్ గా అభివర్ణించారు. మహా అంటే ఏడు నెలలు బతుకుతావని తేల్చేశారు.

అప్పుడు మీకు ఏమనిపించింది- అతనిచ్చిన అనేక ఇంటర్యూల్లో అతన్ని అనేక సార్లు అడిగిన ప్రశ్న.

“ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రజియూం”( అల్లా నుండి వచ్చాము – మల్లీ అల్లా చెంతకే వెల్తాము”)- నాకు నేను ఇది చెప్పుకున్నాను – ప్రతి ఇంటర్వ్యూ లోనూ అతనిచ్చిన సమాధానం ఇది.

ఇక ఆ తర్వాత, అధునాతన వైద్యం కోసం అతని రక్త నమూనాల్ని జెర్మనీ,అమెరికా,యూకే లాంటి అనేక చోట్లకు పంపారు. అందరి నుండీ ఒకటే సమాధానం -“చాలా లేటైపోయింది”

ఇక ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే లాభం లేదని అతనికి అర్థమైంది. తన కారు,విలువైన వస్తువులు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో ఆఫ్రికాకు పయనమయ్యాడు. అక్కడి గ్రామాల్లో, స్కూల్లు, ఆస్పత్రులు, మసీదులు, అనాధ శరణాలయాలు కట్టించడం మొదలు పెట్టాడు.

అక్కడి పేదల పరిస్థితుల్ని మార్చడానికి తన మొత్తం ఆస్తికూడా చాలదని అర్థమై, తన పరిస్తితిని,తను చేసున్న పనుల్ని వివరిస్తూ యూటూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అది కొన్ని రోజుల వ్యవధిలోనే, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది. వాటితోపాటే విరాళాలు వెల్లువెత్తాయి. ఆ విరాళాలతో ఇతని కార్యక్రమాలు యుద్దప్రాతిపదికన విస్తరించాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా ఇతనితో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చాయి. అనేక గ్రామాలలో రక్షిత తాగునీటి వసతులు, స్కూల్లు, ఆసుపత్రులు వందల సంఖ్యలో నిర్మించడం జరిగింది.

కేవలం ఏడు నెలలే అనుకున్నది – మూడేల్ల వరకూ బతికాడు. ఓ వైపు జబ్బుతో బాధపడుతూనే, ఆఫ్రికాలో అన్ని ఊర్లకూ వెళ్ళి పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేవాడు. ఎందుకిలా అంటే – “నన్ను నమ్మి చాలా మంది విరాళాలు ఇచ్చారు – దానిలో ప్రతిపైసా వినియోగమవ్వాలి, ఎలాంటి వృధాఖర్చులూ ఉండకూడదు, అందుకే ప్రతి పనీ దగ్గరుండి నేనే చూసుకున్నా” ననేవాడు.

మొత్తానికి తన మూడేల్ల ప్రయాణం – మొన్నటి మంగళవారంతో ( మే 30) ముగిసింది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అతన్ని సిడ్నీలో ఖననం చేశారు.

అన్నట్లు – అత్యంత పాపులర్ అయి, అతన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యూటూబ్ వీడియోకి అతను పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా-” గిఫ్ట్ ఆఫ్ క్యాన్సర్”

ఎందుకు ఆ టైటిల్? క్యాన్సర్ గిఫ్ట్ ఏమిటి? అని అడిగిన ప్రశ్నలకు అతనిచ్చిన సమాధానం.

“జీవితమంతా కార్లు,బంగళాలు,సంపాదన, సక్సెస్ అంటూ పరిగెడుతుంటాం. చివరికి ఏదో ఒక రోజు – ‘నీ సమయం ఐపోయింది, ఇంక వచ్చేయమనే’ సృష్టికర్త పిలుపు వినబడగానే అప్పటి వరకూ మనం సంపాదించిన ఆస్తులు,వస్తువులూ ఎందుకూ పనికిరానివని మనకు అర్థమవుతుంది. కానీ, అప్పుడు చాలామంది చేయగలేది ఏమీ ఉండదు. కానీ, నా విషయం అలా కాదు. నాకు సృష్టికర్త 7 నెలలు గడువు ఇచ్చాడు. ఇది గిఫ్ట్ కాక మరేమిటి? ”

వెల్ డన్ అలీ బనాత్. – అల్లా హఫీజ్.

ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రజియూం

www.shukravaram.in

4 Replies to “ఖుదాఫీజ్ – అలి బనాత్!!”

  1. Allah rabbul izzath mere paigambar aap nabi -a-kareem muhammad mustafa swallallahu alaihi wasallam ke tufile may aap ko jannath may ala se ala darza atha farmaye ameen ya rabbul alameen

Leave a Reply to Fareed shaikh Cancel reply

Your email address will not be published.