పురుషుల్ని తీవ్రంగా అణగదొక్కిన మతం!!!

పురుషుల్ని తీవ్రంగా అణగదొక్కిన మతం!!!
=========================

“మతాలన్నీ మహిళల్ని అణగదొక్కాయి. ఇస్లాం ఐతే మరీనూ” – ఈ మాట ఫెమినిస్టులూ ఉరఫ్ స్త్రీ జనోద్ధారకులందరూ ఏకగ్రీవంగా తీర్మానించేయడమే కాక, కనీసం వారానికోసారైనా రిమైండర్ పెట్టుకుని మరీ దీనిని స్మరించుకుంటుంటారు. సరే, దీని సంగతి తర్వాత చూద్దాం.

మహిళల సంగతి ఏమోగానీ, పురుషుల్ని అత్యధికంగా అణగదొక్కిన మతం మాత్రం -ఇస్లామే. ఇది 100% ఫ్యాక్టు. అదెలాగంటే..

ముందసలు అణగదొక్కడం అంటే ఏంటో చూద్దాం.

అణగదొక్కడం అంటే – ఓ వ్యక్తి స్వేచ్చను హరించివేసి దానికి పరిమితులు విధించడం.
ఓ వ్యక్తికి ఓ పని చేయాలని అనిపించి, అది చేయడానికి కావలసిన అన్ని అవకాశాలూ తన వద్ద ఉండి, అతను దానిని చేయగలిగే స్థితిలో ఉండి కూడా, అతను ఆ పని చేయకుండా నిరోధించడాన్ని అణగదొక్కడం అంటారు.
ఓ వ్యక్తి ముందు పది ఆప్షన్స్ ఉంటే, వాటన్నిటినీ తీసేసి, అతనికి ఒకటే ఆప్షన్ ఇచ్చి, ‘నువ్వు ఇది మాత్రమే చేయ్’ అని కమాండ్ చేయడం -అణగదొక్కడం.

ఇస్లాం పైన చెప్పినవన్నీ చేస్తుంది.

మచ్చుకు కొన్ని ఉదాహరణలు.

1. ఇస్లాం రాకకు పూర్వం, పురుషులకి కేవలం ఇంతమంది భార్యలుమాత్రమే ఉండాలనే నియమం ఏమీలేదు. దొరికినోనికి దొరికినంతమంది అన్నట్లు. కానీ ఇస్లాం నలుగురికంటే ఎక్కువ భార్యల్ని కలిగి ఉండరాదని నియమం విధించింది. నిజానికి, ‘ఒక్క భార్యనే కలిగి ఉండటం మీకు మంచిది’ – అని సుస్పష్టంగా ప్రకటించింది. ఒకరికంటే ఎక్కువమంది ఉంటే, వారందరితో సమానంగా,న్యాయంగా వ్యవహరించాలనీ, వారిలో ఏ ఒక్కరినో ఎక్కువ ప్రేమగా చూసుకుని మరొకర్ని నిర్లక్ష్యం చేస్తే నేరం చేసినట్లేననీ డిక్లేర్ చేసింది.

2. “పరస్త్రీ ఎదురుగా వస్తే చూపు దించుకోమని/చూపుని పక్కకు తప్పించమని” ఇస్లాం పురుషుల్ని ఆదేశించింది. అంటే రోడ్డు పక్కన పెట్టిన భారీ జాకీ(లో దుస్తుల కంపెనీ) హోర్డింగ్ పై, 2 పీస్ బికినీలో టెంప్టింగ్ గా నిలబడి ఉన్న మాడల్ వైపుకూడా తదేకంగా చూడకూడదన్నమాట. ఇదన్యాయం కాదా? అరే – ఇద్దరు అడల్ట్స్ పరస్పర అంగీకారంతో ఏం చేసుకున్నా అది నేరం కాదని సాక్షాత్తూ సుప్రీం కోర్టే తీర్పు చెప్పింది. ఆ హోర్డింగ్లో ఉన్న అమ్మాయి లక్షలకు లక్షలు తీసుకుని అలా పొట్టి బట్టలు ధరించి నిలబడింది. జీహెచ్ యంసీ సాక్షాత్తూ పన్ను కట్టించుకుని మరీ ఆ హోర్డింగ్ కి అనుమతి ఇచ్చింది. అలాంటప్పుడు నేను దానిని ఆస్వాదిస్తే తప్పేముంది?
కానీ ఇస్లాం ప్రకారం అది ముమ్మాటికీ తప్పే. నికా నామా రాయించుకుని, అమ్మాయితో ‘కుబూల్ హై’ అనిపించుకుని ఆమె పూర్తి బాధ్యతల్ని నేను భరిస్తానని నలుగురు సాక్షుల ముందు ప్రమాణం చేస్తే తప్ప, ఓ స్త్రీ అందాన్ని అస్వాదించే హక్కు పురుషునికి రాదు. అలా ‘నికా’ చేసుకున్న భార్య(లు) తప్ప, ప్రపంచంలోని మిగతా స్త్రీలందరూ ఆ పురుషునికి నిషిద్ధం. “ఆమె స్వచ్చందంగానే వచ్చింది, నాకు కళ్ళున్నాయి కాబట్టి నేను చూస్తా” -ఇలాంటి అతి తెలివి లాజిక్కులేవీ ఇస్లాం లో పని చేయవు.

3. ప్రభుత్వం లిక్కర్ షాపులకు లక్కీ డ్రా నిర్వహిస్తుంది. ముందుగా టోకెన్ అమౌంట్ కొంత ఇచ్చి నంబర్ బుక్ చేసుకోవాలి. మన సుడి బాగుండి, లక్కీ డ్రాలో మన నంబర్ గానీ సెలెక్ట్ అయిందా, ఇక జాక్పాట్ కొట్టినట్టే.మనకు వచ్చిన లైసెన్స్ ని మనం వేరే వారికి సబ్ లీజ్ కిచ్చినా, ఈజీగా కాలుమీద కాలేసుకుని లక్షలు సంపాదించొచ్చు. పైగా, ఇదంతా పక్కా లీగల్. కానీ, ఇస్లాం మాత్రం ఇలా ఆల్కహాల్ ఆధారంగా చేసే సంపాదన అత్యంత పాపపు సొమ్ముగా డిక్లేర్ చేసింది. ఇదేందిరా బై ?. ప్రభుత్వమే దగ్గరుండి ఈ తతంగం నడిపిస్తున్నప్పుడు మధ్యలో ఈ ‘పాపం’ లొల్లేంది?

4. ఇక వడ్డీ వ్యాపారం. నీ దగ్గర ఓ పది లక్షలున్నాయి. ఎదుటోడికి ఏదో అవసరం వచ్చింది. వాడి ఆస్తిపాస్తులేవో షూరిటీగా పెట్టుకుని తక్కువలో తక్కువ రెండు రూపాయల వడ్డీకి ఇస్తే, సంవత్సరం తిరిగే సరికల్లా 10 లక్షలు కాస్తా, 12 లక్షలవుతాయి. వాడి కర్మ కాలి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేకపోతే వాడి ఆస్తుపాస్తులు నీవవుతాయి. ఇది డబ్బు సంపాదించే అత్యంత సులువైన మార్గం. పైగా పక్కా లీగల్ కూడా. కానీ, ఇస్లాం ఇలాంటి వడ్డీ జోలికి వెల్లొద్దని, వెల్తే తాట తీస్తాననీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఇది అణగదొక్కడం కాక మరేంటి?

ఈ రకంగా ఇస్లాం పురుషుల్ని అణగదొక్కే అంశాలు లెక్కలేనన్ని ఉన్నాయి.

కానీ, ‘ఇస్లాం మమ్మల్ని అణగదొక్కేస్తుంది బాబోయ్’ అని ఏ ముస్లిం పురుషుడు కూడా ఎప్పుడూ అనడు. తమను అణచివేయాలనే లక్ష్యంతో ఎవరో పనిగట్టుకుని తమపై మతాన్ని రుద్దారని కంప్లైంట్ చేయరు. ఎందుకు? వై?

ఎందుకంటే – దానినే ఫ్రీ విల్ అంటారు. తెలుగులో – స్వచ్చంద ఎంపిక అంటారు.
ఇస్లాం అంటే – Attaining Peace by submitting your WILL to the Creator. ఖురాన్ దైవగ్రంధం అనీ, మహమ్మద్ గారు దైవ ప్రవక్త అనీ నమ్మి, ఖురాన్ ఆధారంగా జీవిస్తే, జీవితానికి సార్థకత చేకూరుతుందనీ మనస్పూర్తిగా నమ్మి, స్వచ్చందంగా దానిని ఆచరించడం. ఆ ఆచరణ ద్వారా శాంతి సౌఖ్యాలను అనుభవించడం. ఒకసారి ఆ నమ్మకం కుదిరాక , పైన చెప్పిన నియమాలేవీ అణగదొక్కడంలా అనిపించవు. వాటిని ఆచరించడం ఏమాత్రం కష్టసాధ్యంగా అనిపించదు. గత 14 శతాబ్ధాలనుండీ కొన్ని వందల కోట్లమంది ముస్లింలు ఆ నియమాల ఆధారంగా జీవించారు, ఇప్పటికీ జీవిస్తున్నారు.

ఇప్పుడు ఫెమినిస్టులూ, ఉరఫ్ స్త్రీ జనోద్ధారకుల ఆరోపణల గురించి చూద్దాం.

ముందుగా వీరిని అడగాల్సిన ప్రశ్న. “స్త్రీల సమానత్వం గురించీ, హక్కుల గురించీ ఓ తెగ స్పీచులు దంచుతుంటారు కదా , ఇంతకూ స్త్రీలకు కూడా ఫ్రీ విల్ (స్వచ్చంద ఎంపిక) అనేది ఒకటుందని మీరు నమ్ముతారా లేదా?”- అని. పైకి ఒప్పుకోరు గానీ, లోలోపల వీరంత స్త్రీ ద్వేషులు ఇంకెవరూ ఉండరు. ‘స్త్రీలకు ఫ్రీవిల్ ఏమిటి? వారికి అన్ని తెలివితేటలు ఎక్కడ ఏడ్చి చచ్చాయి’- అనేది వీరి నిశ్చితాభిప్రాయంలా ఉంటుంది. అందుకే, ఇస్లాం ని ఆచరించే ఓ మహిళ కనపడగానే, ‘ఆమెను అణగదొక్కేస్తున్నారు బాబోయ్’ అని వీరిలో సానుభూతి తన్నుకొచ్చేస్తుంది. ఓ మహిళ మోడలింగ్, సినిమాలు లాంటి వృత్తిని ఎంచుకుని అర్థనగ్నంగా బట్టలుధరిస్తే ఆమెకు ఫ్రీ విల్ ఉండి, ఆమె ఉద్దరించబడినట్లు, ఆమె పూర్తిగా బట్టలు కప్పుకుంటే మాత్రం, ఆమె మతం పేరుతో అణగదొక్క బడినట్లు వీరు జడ్జిమెంట్లు ఇచ్చేస్తుంటారు.

“స్త్రీలు పురుషులకంటే తక్కువ” అనేది ఎంత మతిలేని వాదనో,
“స్త్రీలు పురుషులతో సమానం” అనేది కూడా అంతే మతిలేని వాదన.

స్త్రీ-పురుషుల మధ్య కొన్ని అంశాల్లో సారూప్యతలుంటాయి. కొన్ని అంశాల్లో తేడాలుంటాయి. ఇవన్నీ స్త్రీ-పురుషుల్ని పుట్టించిన సృష్టికర్తకు తప్ప ఇంకెవరికి తెలుసు. అందుకే, ఖురాన్ దైవ గ్రంధం అని నమ్మిన స్త్రీ,పురుషులు దాని ప్రకారం జీవిస్తారు. అంతే తప్ప, ‘మమ్మల్ని ఎవరో అణగదొక్కుతున్నారు మొర్రో’ అని శోకాలు పెట్టరు. ఎందుకంటే, సృష్టికర్త, స్త్రీ, పురుషుల్లో ఏ ఒక్కరి పక్షమో వహించకుండా, ఇద్దరికీ తగ్గట్లు నియమాల్ని రూపొందించాడని, వాటిని పాటించేవారికి, దగ్గరగా చూసేవారికీ తెలుసు కాబట్టి. ఇవేవీ తెలీకుండా, మిడి,మిడి గ్ఞానంతో, తమ అగ్ఞానాన్నే మేధావితనంగా భావించేవారు ఏవేవో జడ్జిమెంట్లు ఇస్తుంటారు.
అలా వారి జడ్జిమెంట్లు ఇచ్చే హక్కును పూర్తిగా గౌరవిస్తూనే, కాస్తంత ఇస్లాం గురించి తెలుసుకుని జడ్జిమెంట్లు ఇస్తే మరింత అర్థవంతంగా ఉంటుందని ఓ చిన్న మనవి.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

One Reply to “పురుషుల్ని తీవ్రంగా అణగదొక్కిన మతం!!!”

Leave a Reply

Your email address will not be published.