ప్రవక్త నడిచిన నేల!!

ప్రవక్త నడిచిన నేల!!

Some facts are more stranger than fiction – అని ఓ ఫ్రెంచ్ కొటేషన్ ఉంది.

ఈ పోస్ట్ చదివాక, ఇదంతా నిజమేనా అని ఎవరైనా ఆశ్చర్యపోతే, వారికి దీనిని గుర్తుచేయడం మినహా చేయగలిగిందేమీ లేదు.

2016 -అక్టోబర్ నెల.

ఇంట్లో ఎవరో యూట్యూబ్ లో నాత్(ప్రవక్త,ఇస్లాం ల గురించిన గీతాలు) లు పెట్టి వెళ్ళిపోయారు. అవి ఒకదానితర్వాత ఒకటి వస్తూనే వున్నాయి. నాకు వాటి మీద స్పెషల్ ఇంట్రస్ట్ ఏమీ లేదు. కాబట్టి, నాపాటికి నేనేదో సోఫాలో కూర్చుని ఆఫీస్ పని చేసుకుంటున్నా. ఆ పాటల మధ్యలో సడెన్ గా, ఓ వాయిస్ బాగా పరిచయమైనదిగా అనిపించి టీవీ వైపు చూశాను. ఆతిఫ్ అస్లం, శుక్రవారం నమాజుకెళ్ళే కుర్రాడిలా,చక్కగా జుబ్బా,పైజామా వేసుకుని, కళ్ళు మూసుకుని తాద్యత్మికంగా, తన్మయత్వంతో ఏదో పాడుతున్నాడు. ఆతిఫ్ అస్లం ఇలాంటి పాటలు కూడా పాడుతాడా, అని ఆశ్చర్యమేసింది. అప్పటివరకూ నాకు, అతను భగ్న ప్రేమికుడి పాటలు, విశాద గీతాలు బాగా పాడతాడనే తెసులు. అతను పాడే విధానం, ఆ గెటప్ చూశాక, ఆ పాడే పాటకి అర్థమేంటొ కనుక్కోవాలనే ఆసక్తి కలిగింది. జాగ్రత్తగా వింటే – జన్నత్, మదీనా, గరీబ్ లాంటి కొన్ని పదాలు తప్ప, ఆ శుద్ధమైన ఉర్దూ పాట దేనిగురించో, దాని అర్థమేంటో అస్సలు అర్థం కాలేదు.ఇదేదో ఫ్లాప్ పాటయ్యుంటుందిలెమ్మని దానిని ఇగ్నోర్ చేసేంతలో, ఆపాట వ్యూవర్ కౌంట్ చూసి, డబుల్ ఆశ్చర్యమేసింది. అది కోటికి దగ్గరలో ఉంది. ఇంత ఫేమస్ పాటకి అర్థమేంటో కనుక్కోవాలని గూగుల్ లో సెర్చ్ కొట్టాను.

దాని మీనింగ్ ఇలా ఉంది.

కిస్మత్ మె మెరీ చైన్ సే జీనా లిఖ్దే , డూబేన కభీ మేరా సఫీనా లిఖ్దే
( నాకు ప్రశాంత జీవితం రాయి, నా నావ ఎప్పటికీ మునిగిపోకుండా రాయి)

జన్నత్ భి గవారాహె మగర్ మేరే లియే, ఏ కాతిబే తక్దీర్, మదీనా లిఖ్దే
(స్వర్గం కూడా ఓకే గానీ, ఓ తలరాతలు రాసేవాడా, నా బతుకులో మదీనా రాయి)

రెండో వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. – స్వర్గం ఇస్తే నేనేమీ వద్దనను గానీ, కానీ మదీనా మాత్రం వెళ్ళేలా చూడు.

అస్సలు ఏమైనా భావ వ్యక్తీకరణా? మక్కా, మదీనాలకు వెళ్ళాలనేది ప్రతి ముస్లింకీ ఉండే కల. దానిని, ఇక ఇంతకంటే గొప్పగా ఎవ్వరూ చెప్పలేరేమో.

ఈ పాట మొత్తం మక్కా, మదీనా ల గురించి, అక్కడికి వెళ్ళాలనే తీవ్రమైన వాంఛ గురించీ ఉంటుంది.

“ఆవో మదీనా చలే, ఇసీ మహీనా చలే..” – పాట మొత్తం ఈ కోరస్ వినిపిస్తుంటుంది. అర్థం తెలుసుకుని ఈ పాట మళ్ళీ యూటూబ్ లో వేశాను. ఈ సారి, ఆ పాట నన్ను మైకం లా కమ్మేసింది. ఐపోగానే, మళ్ళీ రిపీట్, మళ్ళీ రిపీట్.. ఇలా ఎన్నిసార్లు విన్నానొ లెక్కలేదు. “ఆవో మదీనా చలే” కొన్ని రోజుల వరకూ, ఇదే చెవుల్లో మారుమోగింది.

ఇది జరిగిన రెండు వారాల తర్వాత, ఊరి నుండీ మా అమ్మ ఫోన్ చేసింది. “బేటా , వచ్చే నెలలో, రాజంపేట అత్తయ్య ఉంది కదా, ఆమెను ఆమె కొడుకు రహీముల్లా మక్కాకు తీసుకెల్తున్నాడంట, మనం కూడా వారితో వెల్తే, నాక్కొంచెం తోడుగా కూడా ఉంటుంది. నువ్వేమైనా ప్రయత్నిస్తావా” – మా అమ్మ ప్రాధేయపడుతూ అడిగింది.

ఇలా మా అమ్మ చాలా సార్లు అడిగింది గానీ, “ఇప్పుడు సెలవు దొరకదు, తర్వాత చూద్దాం లేమ్మా”, అని దాటవేస్తూవస్తునాను. ఏదో మాటవరసకు చెప్పాను గానీ, నిజానికి నాకైతే వెళ్ళగలననే నమ్మకం లేదు. నా ప్రైవేట్ జాబ్ లో, రెండు,మూడు రోజుల లీవ్ ఇవ్వడానికి పెద్ద త్యాగం చేసినట్లు, మ్యానేజర్లు ఫీలవుతుంటారు. అలాంటిది మూడు,నాలుగు వారాలు లీవ్ ఎప్పటికి ఇవ్వాలి? అసలు ఐటీ జాబ్ లో చేరినప్పటి నుండీ, నేనూ తీసుకున్న అతి పెద్ద లీవ్ పెళ్ళికే, అది కూడా ఎంతగానో బతిమలాడితే రెండు వారాలు. సో, ఈ జాబ్ లో ఉన్నంతరకూ నేను వెల్లడం అయ్యే పని కాదని అప్పటికే ఫిక్స్ అయిఉన్నాను.

కానీ, మా అమ్మ ఈ సారి అడిగేటప్పటికి , ఎందుకో నాక్కూడా వెల్తే బాగుంటుందనిపించింది. మా మ్యనేజర్ ని ఓ మాట అడిగిచూడాలనిపించింది. ఎలా అడగాలా అని ఆలోచిస్తూనే ఆఫీస్ కి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి మా మ్యానేజర్ నాకోసం ఎదురుచూస్తున్నాడు. “వచ్చావా, నీకోసమే చూస్తున్నా, పద “ అంటూ మీటింగ్ రూం లోకి తీసుకెల్లాడు.

మీటింగ్ రూం లోకి వెళ్ళగానే- “ఓ బ్యాడ్ న్యూస్ హనీఫ్, మనం చేసున్న ప్రాజెక్ట్, క్లైంట్ మరో కంపెనీకి ఇచ్చేశాడు. వాల్లు బాగా అగ్రెసివ్ గా కోట్ చేశారంట. మొత్తం ఓ 3 వారాల్లో హ్యండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. మరేం పర్లేదు, మనకు కొత్తగా వచ్చే ప్రాజెక్ట్లు బోలెడన్ని పైప్లైన్ లో ఉన్నాయి. సో, మన ఉద్యోగాలకొచ్చిన ఢోకా ఏం లేదు, నువ్వేమీ కంగారు పడకు”. మ్యానేజర్ చక,చకా చెప్పుకుంటూ వెల్తున్నాడు. నాకు మాత్రం, ‘ఆవో మదీనా చలే’, వాక్యం గుర్తొచ్చి మనసులో ఏదో తెలీని హాయిగా అనిపించింది. మూడు వారాల్లో, కరెంట్ ప్రాజెక్ట్ మొత్తం హ్యాండోవర్ చేయాలి. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ దొరికేవరకూ ఖాలీనే. సో, ఆ టైంలో లీవ్స్ ఈజీగా ఇస్తారు. ఇంతకంటే బెటర్ అపార్చునిటీ ఇంకోటి ఉండదు.

మ్యానేజర్ ని అదే అడిగాను. “నాకు ఇమ్మీడియట్ గా ప్రాజెక్ట్ వద్దు. ఈ హ్యాండ్ ఓవర్ తర్వాత, ఓ నెలరోజులపాటు లీవ్ కావాలి, మా అమ్మతో పాటు మక్కా-మదీనాలకి వెళ్ళాలి” – స్థిరంగా చెప్పాను.

సరే, దీని తర్వాత,నీపై డిపెండెన్సీ ఏమీ ఉండదు కాబట్టి, వెళ్ళొచ్చు – అని మ్యానేజర్ చెప్పాడు. వెంటనే బయటికి వచ్చి, అమ్మీకి ఫోన్ చేశాను. “అమ్మా.. మనం కూడా వెల్దాం.. ఇన్షాల్లా” – అని. హైదరాబాద్ లో ఓ ఉమ్రా టూర్ ఆపరేటర్ తో మాట్లాడు కోవడం, విసా స్టాంపింగ్, టికెట్స్ బుకింగ్.. అన్నీ చక,చకా జరిగిపోయాయి.

సీన్ కట్ చేస్తే – “మనం మరికొద్ది క్షణాల్లో జెద్దా విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వబోతున్నామని” – పైలెట్ అనౌన్స్ చేయగానే, మనసులో ఓ చిన్నపాటి అలజడి – ప్రవక్త నడిచిన నేలపై కాలుమోపబోతున్నానని.

జెద్దా నుండీ మక్కాకు బస్సులో ప్రయాణం. మక్కా దగ్గరయ్యే కొద్దీ, నా అలజడి కూడా క్రమంగా పెరుగుతూ పోయింది. 1400 సం, క్రితం ఈ ప్రాంతం ఎలా ఉండేదో, ఆ దూరంగా కనిపించే కొండలు,గుట్టలు ప్రవక్తను చూసి ఉంటాయేమో.. ప్రవక్త చూపుకు నోచుకున్న, ఆ కొండ గుట్టలది, ఎంత అదృష్టమో అనిపించింది. ఇక గ్రాండ్ మాస్క్ లోకి ఎంటరై- నల్ల రాతి గృహం వైపుకు వెల్తున్న కొద్దీ, నా ఆలోచనలు- రచయిత్రి లెజ్లీ హ్యాజిల్టన్ ప్రవక్తపై రాసిన ‘ The First Muslim‘ పుస్తకంలోని – మక్కా విజేత చాప్టర్ తో నిండిపోయాయి.

ఈ రోజుల్లో, మనం ఉపాధి కోసం, మెరుగైన జీవితం కోసం, ఓ చోటినుండీ, మరో చోటుకు వలస వెల్లడం మామూలే. కానీ, 1400 సంవత్సరాల క్రితం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ఓ వ్యక్తి, తన అనుచరులతో కలిసి, తన స్వంత ఊరు, తన స్వంత తెగ, తన బంధువులు, రక్త సంబంధీకులు అందరినీ వదిలి వలస వెల్లాల్చి వచ్చింది. సిద్ధాంతమా – సొంత ఊరా, అనేది తేల్చుకోవల్సిన తరుణంలో ఆయన సిద్ధాంతం కోసం సొంత ఊరిని వదిలేసి, ఖాలీ చేతులతో కాందిశికుడిగా మారిపోయారు.

ఆ సిద్ధాంతం – మనుషులందరూ ఒక్కటే ననీ, శరీర రంగూ, పుట్టిన తెగ/ప్రాంతం, ఆస్తిపాస్తులు వీటి ఆధారంగా ఒకరు గొప్ప, ఇంకొకరు తక్కువ ఎప్పటికీ అవ్వరని చెప్పింది.

ఆ సిద్ధాంతం – సృష్టికర్త ఒక్కరేననీ, ముగ్గురో, మూడులక్షలో ఉండరనీ, ఒక్కో తెగకూ, ఒక్కో ప్రాంతానికి ఒక్కో దేవుడు ఉండరనీ, ఆ దేవుడు పుట్టించిన మనిషే మళ్ళీ ఓ బొమ్మను తయారు చేసి, దానినే దేవుడిగా భావించడం అర్థరహితమనీ చెప్పింది.

ఆ సిద్ధాంతం – మనిషి స్వతహాగా పాపి కాదనీ, దేవుడు ప్రతి మనిషినీ పవిత్రుడిగా, సర్వ స్వతంత్రుడిగానే పుట్టిస్తాడనీ, ఎదుగుతున్న క్రమంలో,ఇతరుల్ని గుడ్డిగా అనుకరించే వారూ, బుద్ధిని ఉపయోగించని వారే సృష్టికర్త తిరస్కారానికి గురవుతారనీ చెప్పింది.

ఆ సిద్ధాంతం – స్త్రీకి మాతృత్వం శాపం కాదనీ, స్త్రీ పురుషునికి ఏ అంశంలోనూ తక్కువ కాదనీ, పురుషుల లాగానే, స్త్రీ కూడా అంతిమ దినం నాడు ఆమె చేసిన పాపపుణ్యాల ఫలితం అనుభవిస్తుందనీ, ఆ రకంగా ఓ స్త్రీ గురించి తీర్పు చెప్పే అధికారం సృష్టికర్తకే తప్ప, వేరే ఏ పురుషుడూ ఆమెకు యజమాని కాదనీ చెప్తుంది.

ఈ సిద్ధాంతం చెప్పినందుకే అప్పటి మక్కావాసులు, ప్రవక్తపై కత్తిగట్టారు. వీరి బారినుండీ ప్రాణాలు కాపాడుకోవడానికి, తన అనుచరుల ప్రాణాలు కాపాడటానికి, ఆయన సొంత ఊరు వదిలి, ఉత్త చేతులతో కాందిశీకుడిగా మారిపోయాల్సి వచ్చింది. అది ఎంత భాధాకరమో మనం ఊహించొచ్చు. కానీ, అలా వెళ్ళిపోయినాయన సరిగ్గా పదేల్లు తిరక్కుండా మళ్ళీ విజేతలా, మక్కా లో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన్ను అడ్డుకునే సాహసం ఎవరూ చేయలేదు. ఇదంతా ఆయన ఎలాంటీ రక్తపాతం లేకుండానే సాధించారు. దానికోసం ఎన్నో కష్టాలను, అవమానాలను సహించారు. హుబేదియా సంధీ… ఆ పరిణామాలన్నీ కల్లముందు కదలాడుతుండగా.. నేను కాబా ఎదుట నిలబడ్డాను. అప్రయత్నంగానే కళ్ళనుండీ నీరు నాన్-స్టాప్ గా కారిపోసాగింది. అంతకు ముందు, అబ్బా చనిపోయినప్పుడు మాత్రమే అలా జరిగింది. అది బాధో, ఆనందమో తెలీదు. ప్రవక్త ముందు వరుసలో ఉన్నట్టు, నేను ఆయన వెనకాల ఉన్నట్టు అనిపించి, మక్కా వైపు సజ్దా చేశాను. ఆ తర్వాత, ప్రవక్త చేసి చూపినట్లు, కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ, సఫా-మర్వాల మధ్య 7 సార్లు తిరగడంతో మా ఉమ్రా పూర్తైంది. మా అమ్మ నడవలేదు కాబట్టి, హైదరాబాద్ కోఠీలో నుండే ఓ వీల్ చైర్ ని కూడా కొనుక్కుని వెళ్ళాము. ఈ మొత్తం తతంగం పూర్తికావడానికి 4,5 గంటలు పట్టింది. ఈ ఐదు గంటలు నాన్ స్టాప్ గా, మా అమ్మీ వీల్ చైర్ ని నెట్టుకుంటూనే తిరిగాను, కాళ్ళకి ఎలాంటి చెప్పులూ లేకుండా. మధ్యలో ఎక్కడా విశ్రాంతి కూడా తీసుకోలేదు. హోటల్ రూం కి వెళ్ళేటప్పటికి తెల్లవారు ఝామున ఐదు అయ్యింది. అన్ని గంటలపాటు నాన్ స్టాప్ గా వీల్ చైర్ నెట్టుకుంటూ నడిచాను కాబట్టి, మరుసటి రోజు ఒల్లునొప్పులు రావడం గ్యారంటీ అనుకున్నాను. అసలు మరుసటి రోజు పూర్తిగా మంచానికే పరిమితమైపోతానేమో నని కూడా అనుకున్నాను. కానీ, పొద్దున 8 కల్లా మెలుకవ వచ్చేసింది. బాడీ కి కనీసం ఇసుమంత కూడా, క్రితం రాత్రి అన్నిగంటలు నడిచాననే ఫీలింగ్ అస్సలు మాటవరసకు కూడా లేదు. అది ఆ నేల మహత్యమో,గాలి మహత్యమో, లేక, నేను తాగిన జం -జం నీటి మహత్యమో తెలీదు.

మరుసటి రోజు ప్రవక్త జీవితంతో ముడిపడిన హీరా పర్వతం, ఆయన చివరి హజ్ ప్రసంగం చేసిన ప్రాంతం వంటివి చూడటానికి వెళ్ళాము. బస్సులో పాకిస్తానీ గైడ్ చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. “మా డబ్బుతో, మా తెలివితో, మా ప్రతిభతో మేమిక్కడము వచ్చామని మీరనుకుంటున్నారేమో.. అలాంటి భ్రమలేమీ పెట్టుకోకండి. మీ కంటే బాగా డబ్బున్నోల్లూ, మీ కంటే బాగా తెలివైనోల్లు, మీ కంటే ఆరోగ్యంగా ఉన్నోల్లు కొన్ని లక్షల మంది, ఇక్కడకి రావాలనుకుని కూడా రాలేరు. వెల్దాం,వెల్దాం, వచ్చే నెల వెల్దాం, వచ్చే సంవత్సరం వెల్దాం అనుకుంటూనే , పరలోకానికి వెళ్ళిపోయేవారు కోకొల్లలు. ఇక్కడికి రావాలంటే అల్లా అనుగ్రహం ఉండాలి. రాసి పెట్టి ఉండాలి. “

నాకు మళ్ళీ ఆతిఫ్ అస్లం గుర్తొచ్చాడు.

“కిస్మత్ మె మెరీ చైన్ సే జీనా లిఖ్దే , డూబేన కభీ మేరా సఫీనా లిఖ్దే,
జన్నత్ భి గవారాహె మగర్ మేరే లియే, ఏ కాతిబే తక్దీర్, మదీనా లిఖ్దే..”

Note : గత 1400 సంవత్సరాలుగా, మక్కా-మదీనాలు చాలా, చాలా మారిపోయాయి. చివరికి ఇప్పుడున్న కాబా గృహం, మదీనాలో ప్రవక్త సమాధిపై ఉన్న అనేక గోడలు – అన్నీ చాలా సార్లు పున్ర్నిర్మింపబడ్డాయి. పై, పై కళ్ళకు కనబడే దానిని బట్టి చూస్తే, ఇప్పుడు అక్కడ ప్రవక్త జీవితంతో ప్రత్యక్ష అనుబంధం ఉన్నవి, కాబా గోడలో ఉన్న నల్ల రాయి, జం-జం నీరు, సఫా-మర్వా కొండలు తప్ప మరేమీ లేవు. మిగతావన్నీ ఆధునిక సాంకేతిక పరిగ్ఞానం తో కట్టించిన ఇంజినీరింగ్ అద్భుతాలే. ఇలాంటి ఇంజినీరింగ్ స్కిల్స్ చూడాలంటే ఏ నాగార్జున సాగర్ డ్యాం కో, దుబాయ్ కో వెల్లోచ్చు. కాబా దగ్గరకు వెల్లినవారు చాలా మంది, దాని వెనకాల ఉన్న సౌదీ క్లాక్ టవర్ ని నోరెల్లబెట్టి చూడటం, దానితో సెల్ఫీ లు దిగడం చూస్తే, ఈ విషయం అర్థమవుతుంది. (అబ్రాజ్ టవర్స్ – ఇది 2004 లో, అక్కడ అప్పటికే ఉన్న 18 వ శతాబ్ధం నాటి అట్టోమన్ నిర్మాణాల్ని భూస్థాపితం చేసి, వాటి శిధిలాలపై ఇది కట్టారు. టర్కీ సాంస్కృతిక చిహ్నాల్ని మక్కా నుండీ సమూలంగా తుడిచేయాలనే సౌదీ పాలకులు ఈ పనికి పూనుకున్నారు. ) కానీ, మక్కా మదీనాల్ని, మనస్పూర్తిగా ఆస్వాదించాలంటే – ప్రవక్త జీవితంపై కనీస అవగాహన ఉండాలి. ఆయన ద్వారా మానవాలికి ఇవ్వబడిన ఇస్లాం,ఖురాన్ బోధనల ఔన్నత్యం గురించి తెలిసుండాలి. ఉమ్రా, హజ్ లకు వెళ్ళేవారు, వెళ్ళే ముందు ఇవన్నీ తెలుసుకుని వెళ్ళగలరని మనవి.

ఈద్ ముబారక్!!
-శుక్రవారం.ఇన్. www.shukravaram.in

10 Replies to “ప్రవక్త నడిచిన నేల!!”

    1. Assalam alaikum Bhai.
      I too miss some of the friends like you on FB. But, in order to manage time, I have to refrain from using it.

Leave a Reply to Sameena Cancel reply

Your email address will not be published.