ముస్లింల హక్కుల్ని కాపాడాలనే లక్షంతో, 1906 లో ఓ పార్టీ స్థాపించబడింది. దానిపేరు ఆల్ ఇండియా ముస్లిం లీగ్. 1947 దేశ విభజన తర్వాత- పాకిస్తాన్లో, పాకిస్తాన్ ముస్లిం లీగ్ గానూ, ఇండియాలో – ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ గానూ ఈ పార్టీ విడిపోయింది. బంగ్లాదేశ్ విడిపోయాక, అక్కడి శాఖ అవామీ లీగ్ గా మారిపోయింది.
1948లో మద్రాస్ లో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏర్పాటు నుండీ మొదలుకుని,ఇప్పటివరకూ ప్రతిసారీ, పార్లమెంటులో కనీసం ఒక్కరైనా ఆపార్టీ ఎం.పీ ఉంటున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ పార్టీ ప్రాబల్యం ఉంది. కేరళలో 1978లో, ఈ పార్టీ తరపున మహమ్మద్ కోయా అనే ఆయన ముఖ్యమంత్రిగా కూడా కొన్నాల్లు పనిచేశారు. 2004-2014 మధ్య ఈ పార్టీ యూపీయే లో భాగస్వామ్యులుగా ఉండి, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా నిర్వహించారు.
కుటుంబ పార్టీ కాదు:
ప్రస్తుతం దేశంలో రెండే రకాల పార్టీలు కనిపిస్తాయి.
- వ్యక్తి/కుటుంబ పార్టీలు – కాంగ్రెస్, టీడీపీ, వై.సీ.పీ, ఎస్.పీ, బి.ఎస్.పీ, టీ.ఎం.సీ, ఎన్.సీ.పీ,డీ.యం.కే మొదలైనవన్నీ వ్యక్తి/కుటుంబ ఆధారిత పార్టీలు. ఆయా వ్యక్తులు,కుటుంబాలే ఈ పార్టీలకు కీలకం. ముఖ్యమైన నిర్ణయాలన్నీ వీరే తీసుకుంటారు. యం.ఐ.యం పార్టీ కూడా ఈ కోవలోకే వస్తుంది.
- సిద్ధాంత/భావజాల ఆధారిత పార్టీలు. – సీపీఐ,సీపీయం, బీజేపీ మాత్రమే ఈ కోవలోకి వస్తాయి. ఆ సిద్ధాంతం మంచిదా, చెడ్డదా అనేవిషయాన్ని పక్కనపెడితే, ఈ పార్టీల వెనక ఓ నిర్దిషమైన భావజాలం మాత్రం ఉంటుంది. అదే ఈ పార్టీలను నడిపిస్తుంది.
- IUML ఈ రెండు కేటగిరీలలో దేనికీ చెందదు. ఇది ఏ ఒక్క కుటుంబానికో,వ్యక్తికో చెందిన పార్టీ కాదు. ఈ పార్టీకంటూ ప్రత్యేకంగా ఎలాంటి సిద్ధాంత భావజాలమూ లేదు. అయినా, ఓ ముస్లిం వ్యక్తికి ఖురాన్,ప్రవక్త బోధనలే శిరోధార్యం. ఓ పార్టీ నాయకుడైనా, సాధారణ కార్యకర్తైనా, వ్యక్తిగతంగా వారి హోదాల్లో ఎలాంటి తేడా ఉండదు. బహుశా, ఈ ప్రాధమిక సూత్రం కారణంగానే IUML మనుగడ సాగిస్తున్నట్లుంది. వివిధ స్థాయిల్లో నాయకుల్ని, కింది స్థాయి నాయకులు పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకుంటారు.
ఈ పార్టీ కేవలం ముస్లింల సంక్షేమం కోసమే కాకుండా, అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణ, ఆ పార్టీ అమలు చేస్తున్న బైతు రహ్మ ( దయా నిలయం ) స్కీం లో కనిపిస్తుంది.
2011 లో, ఉండటానికి ఇళ్ళు లేని 20 మంది కడుపేద వారికి, కుల మతాలతో సంబంధం లేకుండా, పార్టీ తరుపున ఇల్లు కట్టివ్వాలని నిర్ణయించి, దీనికి విరాలాలు ఇవ్వమని కార్యకర్తలని, ప్రజలని అబ్యర్థించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీలు దీనికి స్పందించి, ధారాలంగా విరాళాలిచ్చారు. అవసరమైన దానికన్నా ఎక్కువ నిధులు పోగవ్వడంతో, ఈ స్కీం ని కేరళలోని మరింత మంది పేదలకు విస్తరించారు. ఈ పధకం పేరు – బైతు రహ్మ. ( అరబిక్ లో బైత్ – అంటే ఇల్లు, రహ్మ అంటే – జాలి/దయ/కరుణ) ఇప్పటి వరకూ నాలుగు వేలపైనే ఇళ్ళను నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని, ముజఫర్ నగర్ మత ఘర్షణల్లో ఆస్తి,ప్రాణ నష్టాలకు గురైన వారికి కూడా 200 ఇళ్ళను కట్టించి ఇచ్చారు. మన రాష్ట్రంలో, కులవివక్షకు బలైన దలిత విద్యార్థి రోహిత్ వేముల తల్లిగారికి కూడా, గుంటూరు జిల్లాలోని వారి స్వగ్రామంలో ఇల్లు కట్టివ్వడానికి ఈ పార్టీ ముందుకొచ్చింది. దూర పాంతాల నుండీ రోగులు వచ్చే వెల్లూర్ ఆస్పత్రి, బెంగులూర్ లోని నిమ్హాన్స్ ఆస్పత్రి వంటి పెద్దాసుపత్రుల ప్రాంగణాల్లో, రోగుల వెంట వచ్చేవారు, ఉచితంగా బస చేయడానికి, ఈ పార్టీ ఆధ్వర్యంలో అనేక రూములు కట్టిస్తున్నారు. జార్ఖండ్ లోని అనేక గిరిజన ప్రాంతాల్లో, ఉచితంగా అనేక బోర్లను కూడా ఈ పార్టీ తవ్వించి ఇచ్చింది.
ఆంద్రప్రదేశ్ లో కూడా ఈ పార్టీ మనుగడలో ఉంది. షేక్ బషీర్ అహ్మద్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ IUML అధ్యకుడిగా ఉన్నారు. వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ, ముస్లింల గొంతును ప్రభావవంతంగా వినిపిస్తున్నారు.