హదీస్ కలెక్షన్ ఎప్పుడు, ఎలా జరిగింది..?

ఖురాన్ – మహమ్మద్ ప్రవక్త(pbh) కు దేవదూత ద్వారా వచ్చిన దైవసందేశం. ఇది అరబిక్ పోయెట్రీ రూపంలో ఉంటుంది. దేవదూతనుండి సందేశం రాగానే, ప్రవక్త అనుచరుల్ని సమావేశపరిచి ఆ వాక్యాల్ని చదివి వినిపించేవారు. అప్పటి అరబిక్ సమాజం మెమరీ బేస్డ్ సమాజం కావడంతో, వచ్చిన వాక్యాలు వచ్చినట్లు వారు కంఠతా పట్టేసేవారు. తరువాత వాటినే నమాజులో కూడా ఉచ్చరించేవారు. ఫలితంగా, ప్రవక్త జీవిత కాలంలోనే చాలా మంది ప్రవక్త అనుచరులకు ఖురాన్ మొత్తం కంఠతా వచ్చేసింది.

ప్రవక్త మరణించిన అనంతరం, 12 సంవత్సరాల తర్వాత మూడవ ఖలీఫా ఉత్మాన్(ఉస్మాన్) కాలంలో, ఖురాన్ ని పుస్తక రూపంలో కూర్చడం జరిగింది. అప్పటికి ప్రవక్తతో అత్యంత సన్నిహితంగా మెలగిన ప్రధాన అనుచరులు చాలామంది జీవించి ఉండటంతో, వారి సమక్షంలో, అందరి అంగీకారంతో ఈ పని జరిగింది. కాబట్టి ఖురాన్ పుస్తక కూర్పులో ఎలాంటి విబేధాలూ,వివాదాలూ లేవు.

ముస్లింలకు ఖురాన్ వాక్యాలే కాకుండా, ప్రవక్త నోటినుండీ వచ్చిన ప్రతి మాటా, ఆయన చేసిన ప్రతి సూచనా శిరోధార్యమే. కానీ, “ప్రవక్త ఎప్పుడు,ఎవరితో, ఏం చెప్పారు” – అనే విషయాలు గ్రంధస్తం కావడానికి కొంచెం ఎక్కువ సమయమే పట్టింది.

అలా హదీస్ విషయాల్ని(ప్రవక్త జీవితంతో సంబంధం ఉన్న విషయాలు) గ్రంధస్తం చేసిన వారిలో మొదటి వ్యక్తి – ఇమామ్ బుఖారీ.

ఈయన క్రీ.శ.810-870 మధ్య జీవించారు. అసలు పేరు మహమ్మద్. ప్రస్తుత ఉజ్బెకిస్తాన్ రాజధాని బుఖారా లో జన్మించడంతో, ఆయన పేరు ఇమామ్ బుఖారీగా స్థిరపడిపోయింది.

ప్రస్తుతం మహమ్మద్ ప్రవక్త యొక్క ఏదైనా కొటేషన్ ని కోట్ చేయాలంటే, ఇమామ్ బుఖారీ రాసిన పుస్తకంలోని హదీస్ నంబర్ ని కోట్ చేస్తే సరిపోతుంది.
కానీ, హదీస్ గ్రంధస్థం కాకముందు, ఇది అంత సింపుల్ గా కాకుండా, “చైన్ ఆఫ్ న్యారేషన్” ఆధారంగా ప్రాచుర్యంలో ఉండేది. అంటే, ప్రవక్త ఓ విషయం చెప్పారని గుడ్డిగా చెప్పడం కాకుండా, ఆ విషయం ప్రవక్త ఎవరికి చెప్పారు, అది విన్న ఇతర సహచరులు ఎవరు, ఆ విన్నవారు దానిని ఎవరికి చెరవేశారు – ఇలా మొత్తం నాలుగైదు తరాలలో, ఈ చైన్లోని వ్యక్తులందరి పేర్లూ చెప్పాల్సి వచ్చేది.

ఇమాం బుఖారీ ప్రత్యేకత – ఫోటోగ్రఫిక్ మెమరీ:

పదిహేనేళ్ళవయసొచ్చేప్పటికే ఇమామ్ బుఖారీ గారు, బుఖారా నగరంలోని ప్రముఖ ఇస్లామిక్ గురువులందరి దగ్గరా శిష్యరికం చేసి వేలకొద్దీ హదీసుల్ని తన మనసులో నిక్షిప్తం చేసుకున్నారు. ప్రతి గురువూ, తన గురువు->ఆయన గురువు-> ఆ గురువు గురువు-> ఇలా మహమ్మద్ ప్రవక్త వరకూ మధ్యలో ఉన్న అందరి పేర్లు కలిపి చెప్తుండటంతో, ఆ మొత్తం ట్రీ స్ట్రక్చర్ అబూ బుఖారీ గారి మైండ్లో ఫిక్స్ ఐపోయింది.

అలా ఒకానొక రోజు క్లాస్ మధ్యలో, ఓ మౌలానా చెప్పిన చైన్ ఆఫ్ న్యారేషన్ లోని ఓ పేరు, తాను ఇంతకు ముందు విన్న ఏ న్యారేషన్లోనూ ఎక్కడా వినలేదనీ, తన అంచనా ప్రకారం – ఆ వ్యక్తి ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉండే అవకాశం లేదనీ భుఖారీగారు తన గురువుతో వాదనకు దిగారు. మొదట్లో తాను చెప్పిందే నిజమని పట్టుబట్టినప్పటికీ, చివరికి బుఖారీ చెప్పేదాన్లో సత్యముందనీ, తానే ఎక్కడో పొరబడ్డాననీ ఆ మౌలానా గారు ఒప్పుకోవాల్సి వచ్చింది.

ప్రవక్త చనిపోయి అప్పటికే దాదాపు 200 సంవత్సరాలు గడచిపోయిఉండటంతో, హదీసుల్లో కొన్ని కల్పిత విషయాలు, అసత్యాలు చలామణీలోకి వస్తున్న విషయాన్ని ఇమాం బుఖారీ పసిగట్టారు. దీనిని ఎలాగైనా అరికట్టడమే తన జీవితాశయంగా ఆయన డిక్లేర్ చేసుకున్నారు. అనంతరం మక్కాకు హజ్ యాత్రకు వెళ్ళి అరేబియాలోని వేలాది ఇస్లామిక్ స్కాలర్స్ కలిసి, తమకు తెలిసిన హదీసుల్ని, వాటి చైన్ ఆఫ్ న్యారేషన్స్ ని వివరించమని అడిగేవారు. ఇలా మొత్తం 16 సంవత్సరాలు హదీసుల్ని సేకరిస్తూ గడిపారు. మొత్తం ఆరు లక్షల హదీసుల్ని సేకరించారు. అనంతరం మదీనా చేరుకుని, తాను సేకరించిన హదీసుల్ని, చైన్ ఆఫ్ న్యారేషన్స్ ని జల్లెడపట్టే బృహత్కార్యానికి పూనుకున్నారు.

చైన్ ఆఫ్ న్యారేషన్స్ ఎంత బలంగా(విశ్వసనీయంగా ) గా ఉంది, ఒక అంశాన్ని ధృవీకరించే మల్టిపుల్ న్యారేషన్స్ ఎన్ని ఉన్నాయి.. వంటి అంశాల ఆధారంగా సహి( అత్యంత విశ్వసనీయమైనది), హసన్ ( చాలా వరకూ నమ్మొచ్చు) దైఫ్( కొంతవరకూ నమ్మొచ్చు), మావూద్(నిజమయ్యే అవకాశం తక్కువ) ఇలా వివిధ కేటగరీలుగా విభజించి, హదీసు గ్రంధాల్లో నిక్షిప్తం చేశారు.

ఇమాం బుఖారీ గారి మరో ప్రత్యేకత ఏమంటే – ఆయన కేవలం చైన్ ఆఫ్ న్యారేషన్ సేకరణ మీదనే దృష్టిపెట్టకుండా, ఆ చైన్ లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క గుణగణాలు, వారి జీవన విధానం ఎలా ఉండేది అనే విషయాలపై కూడా దృష్టి సారించారు. వారిలో ఎవరైనా చెడు అలవాట్లు ఉన్నవారు గానీ, ఉదాహరణకు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎగవేయడం, అబద్ధం చెప్పడం లాంటి అలవాట్లు ఉన్నాయని తెలిస్తే వారికి సంబంధించిన హదీసులన్నీ అంతగా విశ్వసనీయత లేనివిగానే పరిగణించారు.

ఈ విధంగా, హదీసు కలెక్షన్ ని పూర్తి శాస్త్రీయపద్దతిలో ఓ కొలిక్కి తీసుకురావడానికి ఇమామ్ బుఖారీ గారు తన జీవితాన్ని ధారపోశారు.
ఇమాం బుఖారీ కృషితో స్పూర్తిపొందిన ఆయన శిష్యులు ముగ్గురు – ఇమామ్ ముస్లిం, ఇమామ్ అబు దావూద్, ఇమామ్ తిర్మిది లు కూడా గురువు బాటలోనే పయనించి వారు కూడా మరికొన్ని హదీసులు సేకరించారు. వీరు నలుగురు ఇంకో ఇద్దరు సేకరించిన హదీసులు – ఈ మొత్తం ఆరు హదీసులు, ప్రవక్త బోధనలకు సంబంధించి ప్రస్తుతం ప్రామాణిక గ్రంధాలుగా ఉన్నాయి.

ఇమామ్ బుఖారీ గారికి, మరియు హదీసు సేకరణలో పాలుపంచుకున్న అందరు స్కాలర్స్ యొక్క సేవలకు అల్లా తగిన ప్రతిఫలం ప్రసాదించుగాక. ఆమీన్.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

9 Replies to “హదీస్ కలెక్షన్ ఎప్పుడు, ఎలా జరిగింది..?”

  1. అమీన్.. సింపుల్ గా రాసారు…
    అల్లాహ్ మీ పనిని స్వీకరించు గాక అమీన్.

  2. సూటిగా చక్కగా క్లుప్తంగా వివరించారు. మీకు నా ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.