ఒకదానికొకటీ ఏమాత్రం సంబంధం లేని ఈ మూడు దేశాల చరిత్రల్ని గమనిస్తే, కొన్ని విషయాలు అర్థమవుతాయి..
1.స్పెయిన్:
చాలా మందికి దీనిగురించి తెలిసిన విషయాలు-
ఇది యూరప్‌లోని ఓ దేశం.
మిగతా యూరప్ దేశాల్లాగే ఇక్కడి ప్రజల్లో దాదాపు అందరూ క్రిష్టియన్లే.
మాడ్రిడ్, బార్సిలోనాలు ప్రముఖ నగరాలు.
ఆ దేశంలో ఫుట్‌బాల్ అంటే బాగా క్రేజ్.
ఇప్పుడు చాలా మందికి దీనిగురించి తెలీని విషయం –
ఈ దేశానికి పాతపేరు(పక్కనే ఉన్న పోర్చుగల్ తో కలిపి) – అల్-ఆండలుస్.
ఇదేంటి, అరబిక్ పేరులా ఉంది అనుకుంటున్నారా.. అదంతే మరి. మరో అసలు,సిసలు విషయం – స్పెయిన్ ఒకప్పుడు ముస్లిం రాజుల పాలనలో ఉండింది. అక్కడ ముస్లిం రాజులపాలన పదేల్లో,పాతికేల్లో కాదు – అక్షరాలా 8 శతాబ్ధాలు, అంటే 8 వందల సంవత్సరాల పాటు సాగింది.
కార్డొబా కేంద్రంగా సాగిన ముస్లిం రాజుల పాలనలో, ఆండలూస్ యూరప్ కే కాకుండా, మొత్తం ప్రపంచంలోనే సుసంపన్న రాజ్యంగా వెలుగొందింది. శాస్త్ర,సాంకేతిక రంగాల్లో మిగతా అన్ని రాజ్యాలకూ తలమానికంగా ఉండేది. మరీ ముఖ్యంగా, క్రిష్టియన్, యూదు, ముస్లింలు – ఎలాంటి ఘర్షణలూ లేకుండా కలిసిమెలసి జీవించారు. ఆండలూస్ పాలకులు ముస్లిమేతరులపై ఎలాంటి కక్ష్యసాధింపులు, అణచివేతలూ లేకుండా, పూర్తి మతసహన పద్దతుల్ని పాటించారు. ఆండలూసియా రోజులు తమపాలిట స్వర్ణయుగంగా అనేకమంది యూదు చరిత్రకారులే అభివర్ణిస్తుంటారు.
1492లో క్రిష్టియన్ రాజులు దీనిని ఆక్రమించుకోవడంతో, ఆండలుస్ లో ముస్లిం రాజులపాలనకు తెరపడింది. ముస్లిం రాజుల పరమత సహనానికి పూర్తివిరుద్ధంగా, క్రిష్టియన్ రాజులు ముస్లింలు,యూదులపై చేసిన అణచివేత ఏస్థాయిలో ఉందంటే – సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత, అంటే 1590 నాటికి, అక్కడ ఒక్క ముస్లింగానీ, యూదు గానీ మిగల్లేదు.
క్రిష్టియన్ రాజులు ముస్లింలు,యూదులకు 3 ఆప్షన్లు ఇచ్చారు.
1.రాజ్యం విడిచి వెళ్ళిపోవడం.
2.క్రైస్తవ మతంలోకి మారడం.
3.చావు, డెత్.
కేవలం వందేళ్ళలోనే అనేక మసీదులు,సినగాగ్లూ చర్చ్ లుగా మారిపోయాయి.
గ్రేట్ మస్జిద్ ఆఫ్ గ్రనేడా స్థానంలో, ఇప్పటికీ ఓ చర్చ్ నడుస్తుంది.
క్రైస్తవ రాజులు ఇన్ని దారుణాలకు ఒడిగట్టినా – ఏసుక్రీస్తు అణచివేతను బోధించారనో, బైబిల్ హింసను ప్రోత్సహిస్తుందనో ఏ ముస్లిం కూడా, కనీసం మాటవరుసకు కూడా అనడు.( బైబిల్లో కొన్ని హింసకు సంబంధించిన వాక్యాలు ఉన్నప్పటికీ). ఎందుకంటే – ప్రతి ముస్లిమూ ఏసుక్రీస్తును కూడా సృష్టికర్త పంపిన ప్రవక్తగా నమ్ముతారు,మహమ్మద్ ప్రవక్తతో సమానంగా ఏస్తుక్రీస్తు ప్రవక్తను కూడా ప్రేమిస్తారు,గౌరవిస్తారు కాబట్టి. అట్లే, ఏసుక్రీస్తు పేరు చెప్పి కొందరు చేసిన చెడ్డపనుల్ని ఏసుక్రీస్తుకి ఆపాదించడం మతిలేని పని అని వారికి తెలుసుకాబట్టి. )
2.ఇండోనేసియా :
దీనిగురించి చాలా మందికి తెలిసిన విషయాలు –
ఇది ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్న దేశం.
22 కోట్ల మంది ముస్లింలు ఇక్కడ నివసిస్తున్నారు.
దీని రాజధాని – జకార్తా.
ఇక్కడ జనాభాలో ముస్లింలు సుమారు 87%, ఇతర మతస్థులు – 13%.
ఇప్పుడు దీని గురించి చాలామందికి తెలియని విషయం-
అక్కడ అంత మంది ముస్లింలు ఎలా ఉన్నారు?
ఇస్లామోఫోబులు, హాఫ్ నాలెడ్జీ మేధావులూ రొటీన్ గా చెప్పేమాట – “ఓ చేత్తో కత్తి, మరో చేత్తో ఖురాన్ పట్టుకుని దండయాత్రలు చేసిన ముస్లిం రాజుల వల్ల ఇస్లాం వ్యాప్తి చెందింది” – అని.
కానీ, ఇండోనేసియా మీదికి ఏనాడూ , ఏ ముస్లిం రాజూ దండెత్తలేదు. అరేబియా, మరియు ఇతర ముస్లిం రాజ్యాలతో వర్తక,వాణిజ్యాలకై చేసే రాకపోకలు, మరియూ సూఫీ మత గురువుల బోధనల వల్లే అక్కడ ఇస్లాం వ్యాప్తి చెందింది. అంత పెద్ద జనాభా, వాలెంటరీగా, స్వచ్చందంగా ఇస్లాంకి ఆకర్షింపబడి ముస్లింలుగా మారిన సంగతి తమ కళ్ళముందే కనిపిస్తున్నా, ఇస్లాం హింసతోనే వ్యాప్తి చెందిందని వాగడం హాఫ్ నాలెడ్జీ మేధావుల పైత్యానికి నిదర్శనం.
3.ఇండియా:
భారత ఉపఖండంలో ముస్లిం రాజుల పాలన అనేక వందల సంవత్సరాలపాటు సాగింది. ఏవో కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్ప, ముస్లిం రాజులు పరమత సహనాన్నే పాటించారు. ముస్లిమేతరుల మత విషయాల్లో జోక్యం చేసుకోలేదు. సతీసహగమనం, అస్ప్రృశ్యత, అంటరానితనం వంటి దురాచారాల్ని నిర్మూలించే ప్రయత్నమేమీ చేయకపోవడం దీనికి నిదర్శనం. ప్రలోభపెట్టో, భయపెట్టో ఇతరుల్ని ముస్లింలుగా మార్చేపనికి పూనుకోలేదు, కాబట్టే అన్ని వందల ఏళ్ళ రాజ్యాధికారం తర్వాత కూడా ప్రస్తుతం ఇండియాలో ముస్లింలు కేవలం 15% ఉన్నారు.( దేశ విభజనకు ముందు 25%).
ఈ మూడు అంశాలూ చారిత్రక వాస్తవాలు. మెయిన్ స్ట్రీం మీడియా, రొటీన్ గా చదివే హిస్టరీ పుస్తకాలూ వీటిగురించి చెప్పనంతమాత్రాన నిజాలు, నిజాలు కాకపోవు.
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in