పవిత్రమైన ఉద్యోగం!!
================
మా వూరి నుండి ప్రతి సంవత్సరం రెండు సార్లు, మే/జూన్ – నవంబర్/డిసెంబర్ నెలల్లో, పదో క్లాసు పాసైన మా వూరి తురక్కోట,సాకలోల్ల వీధి, కుమ్మరోల్ల వీధి,మంగలోల్ల వీధి, బెత్స వీధి, బలిజ కోట మొ,, వీధుల పిల్లకాయలందరూ – తలా ఇంతని వేసుకుని, బ్యాచ్ బ్యాచ్ లుగా టాటా సుమోలు, కమాండర్ జీపులు బాడుగకు మాట్లాడుకుని, మా వూరికి 50 కి.మీ దూరంలో ఉన్న గిద్దలూరుకు, ఆర్మీ సెలెక్షన్స్ కి వెళ్ళి వస్తుంటారు. కొందరు సెలెక్ట్ కూడా అవుతుంటారు. అవ్వని వారు, నెక్స్ట్ సెలెక్షన్స్ కి వెల్తారు. ఇలా ఇంటర్ జాయిన్ అయి కూడా, ప్యారలల్ గా, ఏజ్ బార్ అయ్యేవరకూ సెలెక్షన్ కి ట్రై చేస్తూనే ఉంటారు.
వీల్లందరూ పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారే. అన్నట్లు, ఎందుకు ఆర్మీ సెలెక్షన్ కి అన్నిసార్లు ట్రై చేస్తుంటారు. దేశ సేవో, ప్రాణత్యాగం చేయాలనో, పవిత్రమైన కార్యమనో కాదు. పొట్ట కూటి కోసం. ఆర్థికంగా చితికిపోయి ఉన్న తల్లిదండ్రులకు భారం కాకుండా సొంత కాల్లపై నిలబడటం కోసం. సెలెక్ట్ కానోల్లలో, కొందరు గల్ఫ్ కి, కొందరు ఏవో,చిన్న చితకా పనులు,భూమున్నోల్లు వ్యవసాయం, వ్యాపారాల్లో స్థిరపడ్తారు.
గల్ఫ్ కెళ్ళి దారుణమైన కష్టాల్ని అనుభవించి, అప్పులపాలై వెనక్కి వచ్చినోల్లు, అక్కడే చనిపోయి కుటుంబ సభ్యుల చివరిచూపుకు కూడా నోచుకోకుండా అక్కడే ఖననం కాబడినవాల్లు, వ్యవసాయం లో నష్టాలొచ్చి ఆత్మహత్యలు చేసుకున్నోల్లు, ఉర్లో చీటీపాటలేసి, రికవరీ చేసుకోలేక, సిటీకి కట్టుబట్టల్తో పారిపోయి, గుమాస్తాలుగా, సెక్యూరిటీ గార్డులుగా మిగిలిపోయినోల్లు, TTC, BeD లు చేసి, ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాక, ప్రైవేట్ స్కూల్లలో 5,6 వేలకు గొడ్డు చాకిరీ చేస్తున్నవాల్లు… ఈ లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తరగదు. వీల్లందరూ ఏదో సమయంలో , ఆర్మీ సెలక్షన్ కి అటెంప్ట్ చేసిన వాల్లే . వీరి అదృష్టం బాగా లేకనో, శరీరంలో సత్తువ లేకనో, పాపం సెలెక్ట్ అవ్వలేక పోయారు.
**********
సెలెక్ట్ అయి, తీవ్రవాద దాడుల్లో, అది కూడా కేవలం, కాశ్మీర్ బార్డర్లో చనిపోయినప్పుడు మాత్రమే వారిపై కురిసే టన్నులకొద్దీ సానుభూతి, ఆ మిగతా బడుగుజీవులపై, ఛిద్రమైన వారి జీవితాలపై ఎందుకుండదు? ఆర్మిలో సెలెక్ట్ కాకపోవడం వారి నేరం కాదు కదా. ఇలాంటి వారిని ఆదుకొమ్మనీ, వారి కుటుంబాలకు ఆసరాగా ఉండమని ఎందుకు ప్రభుత్వాల్ని నిలదీయరు?
**********
తీవ్రవాదుల దాడులు జరిగినప్పుడు, చేయాల్సింది క్యాండిల్ లైట్ మార్చులో, ఎమోషనల్ మెలో డ్రామాలో, ప్రొఫిల్ పిక్కులు మార్చుడో కాదు. సెక్యూరిటీ బ్రీచ్(లోపం) ఎక్కడ జరిగిందో సైటిఫిక్ పద్ధతిలో విచారణ జరగాలి. అది నివారింపతగిన దుర్ఘటన ఐతే, నిర్లక్ష్యానికి బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలి. సైనికులకు ప్రపంచంలో కెల్లా అందుబాటులో ఉన్న, అధునాతన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బ్ల్యాస్ట్ ప్రూఫ్ వాహనాలూ ఉండాలి. సైనికులకు ఇవేవీ సమకూర్చలేనప్పుడు, ఇన్ని లక్షల కోట్ల రక్షణ వ్యయం ఏమైపోతుందని ప్రభుత్వాల్ని నిలదీయాలి.
ఇవేవీ చేయకుండా, కేండిల్ లైట్ మార్చ్ లు, ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తర ప్రగల్బాలు, ఆ ట్రాజేడీలపై బాలీవుడ్ సినిమాలు.. అవి చూసి ఇక్కడ జనాలకు దేశభక్తి పొంగిపొర్లడాలు.. అంతా పరమ రొటీన్, బేకార్ వ్యవహారం. టి.వీ ఛానల్ల టీఆర్పీలకు, ప్రభుత్వం జవాబుదారీ తనం నుండి తప్పించుకోవడానికీ తప్ప ఎందుకూ పనికిరాదు.
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in