(దిప్రింట్ కి ,ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.)
కులం గురించి గత 14 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాను,
‘దలిత్ కెమెరా’ ఛానెల్ కోసం, దలితులకు సంబంధించిన అనేక అంశాలపై 8 ఏళ్ళపాటు వివిధ డాక్యుమెంటరీలు షూట్ చేశాను. ఈ మొత్తం ప్రయాణం ద్వారా ఒక్క అంశం మాత్రం తిరుగులేని నిజమని అర్థమైంది. అది – బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు, “కులాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం – హిందూఇజం ని వదిలేయడమే.”
ఆయన అడుగుజాడల్లోనే నడిచి, నేను కూడా జనవరి 30, 2020 తేదీన, కేరళ త్రిస్సూర్ జిల్లాలోని చారిత్రాత్మక ప్రాంతమైన కొడుంగల్లూర్ లో హిందూమతాన్ని వదిలేసి – ఇస్లాం స్వీకరించాను. భారతదేశంలో మొట్టమొదటి మసీదు కొడుంగల్లూర్ లోనే కట్టబడింది. ఇప్పుడు నేను ‘రాయీస్ మహమ్మద్’ ని.
ఈ తేదీ కూడా ప్రత్యేకమైనదే. జనవరి 30- భారత మొట్టమొదటి తీవ్రవాది నాధూరాం గాడ్సే, మోహన్ దాస్ కరంచంద్ గాంధీని చంపేసిన రోజు. హిందూ మతంలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడి తనువు చాలించిన మన ప్రియ సోదరుడు రోహిత్ వేముల పుట్టినరోజు కూడా ఈరోజే.
బంధ విముక్తుల్ని చేసే మతం:
బాల్యంలో, అయ్యప్ప భక్తుడిగా కొండుంగల్లూర్ కి ఆరు సార్లు వెళ్ళాను. CPI-ML కేరళ రాష్ట్ర కార్యదర్శి – నజ్మల్ బాబు, 2015 లో, ఇక్కడే ఇస్లాం స్వీకరించారు. “ఎవరైనా 15 నిమిషాల్లో కులాన్ని సమూలంగా నిర్మూలించి, ఆత్మ గౌరవంతో జీవించాలనుకుంటే, ఇస్లాం ఒక్కటే మార్గమని” – పెరియార్ చెప్పి ఉన్నారు. కుల బంధనాల నుండీ విముక్తి కావడానికి ఇస్లాం స్వీకరించవలసిందిగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి కూడా పెరియార్ సలహా ఇచ్చారు.
ఇన్నేల్ల నా పరిశోధనలో కూడా, ఈ దేశంలో కులాన్ని నిర్మూలించే శక్తి ఒక్క ఇస్లాం కే ఉందని అర్థమైంది.
కుల నిర్మూలనా ఉద్యమం – భారతదేశంలో అత్యంత ఎక్కువకాలం పాటు సాగిన, ఇంకా సాగుతున్న సామాజిక-సాంస్కృతిక ఉద్యమం. అంటరానివారిని, హిందూ సమాజంతో సమాన స్థాయిగల నాగరీకులుగా గుర్తించడం, తమని హిందూమతం ద్వారా కాకుండా, రాజ్యాంగం ద్వారా గుర్తించేలా చేయడం – ఈ ఉద్యమం యొక్క ప్రధాన డిమాండ్లు. ఈ రెండు లక్ష్యాలను ఇస్లాం ద్వారా అతి తక్కువ కాలంలోనే సాధించుకునే అవకాశం ఉన్నప్పటికీ, దలిత ఉద్యమం, దలిత సాహిత్యం ఆ మార్గంలో ఎందుకు ప్రయత్నించలేదనేది అర్థం కాని ప్రశ్న.
సమానత్వ పోరు:
కొడుంగల్లూర్ కి, CAA,NPR,NRC ల గురించి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. నరేంద్ర మోడీ యొక్క ఇండియాలో, ముస్లింలు తమ పౌరసత్వం కోసం పోరాడుతున్నారు. వారి పోరాటం దలితుల పోరాటం కంటే భిన్నమైంది. ముస్లింలు న్యాయం, పౌరసత్వం పోరాడుతున్నారు. దలితులు – కనీస ఆత్మాభిమానం కోసం, తమను కూడా సాటి మనుషులుగా, సమానంగా గుర్తించాలనే హక్కు కోసం పోరాడుతున్నారు. ఆ రకంగా చూస్తే దలితులు పరిస్థితే ఎక్కువ దయనీయమైంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే నేను ఇస్లాం స్వీకరించి, రవిచంద్రన్ గా ఉన్న నా హిందూ గుర్తింపును సమాధి చేశాను. నాకు నా హిందూ పేరుతో గుర్తింపబడాలని లేదు, ఎందుకంటే- కాస్తంత లోతుగా ఆలోచిస్తే, అన్ని హిందూ పేర్ల తోకలూ, ఏదో ఓ కులానికి సంబంధించినవే ఉంటాయి. అలాంటి తోకల్ని మహమ్మద్ రాయీస్ అనే పేరుకు అంటించడం నాకు ఇష్టం లేదు. నిజానికి రవిచంద్రన్ అనే పేరుతో సమస్యేమీ లేదు, ఎంతైనా అది నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెట్టుకున్న పేరు కదా. సమస్యంతా ఆ పేరుకు ముందు వచ్చే, నా తాత,తండ్రుల పారిశుధ్య వృత్తిని సూచించే ‘బాత్రన్ ‘ అనే ఇంటిపేరుతోనే. చెత్త ఏరుకునే పని చేస్తాడనే కారణంతో నా తండ్రి ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది కపటత్వానికి పరాకాష్ట. ముందుగా కొన్ని వర్గాల ప్రజల్ని, కొన్ని రకాలైన పనులు మాత్రమే చేసేలా కట్టడి చేయడం, తర్వాత అలాంటి పనులు చేస్తారనే సాకుతో వారిని నీచంగా చూడటం, మొత్తానికి కుల వ్యవస్థను దూషించకుండా , కింది కులాల్ని మాత్రమే దూషించడం – ఇదీ కులవ్యవస్థ పైశాచికరూపం..
అంటరాని కులాల్లో పేర్లు సింపుల్ గా, సాదాగా ఉంటాయి. మా బంధువులందరూ వారిపిల్లలకు ఇలాంటి పేర్లే పెట్టారు. కానీ, నా తల్లిదండ్రులు మాత్రం, నాకు సంస్కృత శబ్ధం వచ్చే పేరు పెట్టారు – రవిచంద్రన్ అని. పేరు ఎలా ఉన్నప్పటికీ – నేను వివక్ష నుండీ మాత్రం తప్పించుకోలేకపోయాను.
నా చదువు, నా సంపాదన ఇవేవీ నా గుర్తింపును మార్చలేకపోయాయి, ఎప్పటికీ మార్చలేవు కూడా. కానీ, అలా మార్చొచేమోననే ఓ అబద్దపు ఆశను దలిత ఉద్యమాలే కలిగిస్తుంటాయి.
మా నాన్న పారిశుద్య కార్మికుడిగా పనిచేశారు, అమ్మ ఓ ప్రభుత్వ స్కూల్లో స్వీపర్ గా పనిచేసేది. గత 15ఏళ్ళుగా, నా తల్లిదండ్రులు, అలాంటి కొన్ని వేల కుటుంబాల వారు- కేవలం తాము చేస్తున్న వృత్తిని బట్టి, ఎదుర్కోవాల్సి వస్తున్న భయంకర వివక్షకు వ్యతిరేకంగా పోరాడాను.
అగ్రకులాల వారి ఇళ్ళలోకి, స్కావెంజర్స్ నీ, స్వీపర్ లనూ అస్సలు రానివ్వరు. టాయ్ లెట్స్ కూడా, ఇంటికి దూరంగా ఉంటాయి. ఇండియాలోని సోషియాలజిస్టులూ, ఆంథ్రోపాల్జిస్టులూ భారత ఇళ్ళలోని కుల వ్యవస్థని స్టడీ చేయడంలో విఫలమయ్యారు. ఒకప్పుడు చాలా ఇళ్ళకు, కేవలం దలుతులు రావడం కోసమే వెనకవైపు ఓ చిన్న తలుపు లాంటిది ఉండేది. పల్లెల్లో, ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతుంది.
దీనికి విరుద్ధంగా, మసీదుల్లో టాయ్లెట్లు, మసీదు ప్రాంగణంలోనే ఉంటాయి. అక్కడ టాయ్లెట్లను అపవైత్రమైనవిగా పరిగణించరు. This is where I fell in love with Mosques. దలితులు ఇంకా, హిందూ మతాన్ని తమ భుజాలపై ఎందుకు మోస్తున్నారనేది అర్థం కాని విషయం.
మొత్తానికి దలితులు,ముస్లింలు పోరాటం చేయాల్సి ఉంది. ముస్లింల పోరాటం రాజ్యాంగపరమైంది. కానీ, దలితుల పోరాటం సాంఘికమైంది, కాబట్టి అది మరింత కష్టసాధ్యమైంది. తమ హిందూమతం కారణంగానే, తమను తక్కువగా చూస్తున్నారనే విషయం, చాలా మంది దలితులకి ఇప్పటికీ అర్థమవడంలేదు. ఈ కారణంగానే, తాముకూడా ఏదో ఓరోజు పౌరసత్వం కోల్పోయేపరిస్థితి వస్తుందనే విషయం కూడా వారికి అర్థమవడం లేదు.