మతం మారాము – కులం పోయింది

‘మతం మారినా కులం పోదని’ – కొందరు తీర్మానాలు చేస్తున్నారు. నా వ్యక్తిగత విషయమే తీసుకుంటే, మా పెద్దోల్లు చెప్పిందాన్ని బట్టి, మా జేజబ్బగానీ, వాళ్ళ నాన్నగానీ కలిమా చదివి ఇస్లాం స్వీకరించారని అర్థమవుతుంది. అంతకు ముందు వారి కులమేదో ఎగ్జాక్ట్ గా తెలీదు. వారి జీవన విధానాన్ని బట్టి, అగ్రకులాలతో అంటరానివారిగా తీర్మానించబడిన కులం వారని మాత్రం తెలుస్తుంది.

మేం నలుగురం అన్నతమ్ముల్లం, ఒక అక్క. మా అందరి పేర్లలో షేక్ అని ఉంటుంది. అది ఎలా వచ్చిందని మా నాన్నని అడిగితే -“ఏమోరా అందరూ అదే పెట్టుకుంటున్నారని అదే రాయించా” – అని సమాధానం ఇచ్చారు. పెద్దయ్యే క్రమంలో ఏనాడూ ఆ షేక్ కి ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉందని నాకనిపించలేదు. నేను, ఇంకో అన్న, అక్క- పెళ్ళి చేసుకున్నది సయ్యద్ అని Surname ఉన్నవారిని. ఇదసలు ఏమాత్రం చెప్పుకోదగ్గ విషయమని అప్పట్లో మాకు అనిపించలేదు. కేవలం, మా ఊర్లో, మా జిల్లాలో, మాకు తారసపడిన ముస్లింలు మాత్రమే ఇలా ఉన్నారా..? ఏమో తెలీదు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నేను ముస్లిం ని.దీనికి ముందు-వెనకా ఏమీ లేవు. “జస్ట్ ముస్లిం ని”.నేను ఏ ఇతర ముస్లిం కంటే ఎక్కువ కాదు, తక్కువా కాదు. నాకంటే గొప్ప ముస్లిం అంటూ ఎవడైనా ఉంటే – అతను నా కంటే ఎక్కువగా ఖురాన్ ని, ప్రవక్త బోధనల్నీ నమ్మి ఆచరించే వ్యక్తి అయ్యుంటాడు. అలాంటి వ్యక్తిని తప్ప, పుట్టుక ఆధారంగా ఏ ఇతర ముస్లిం నీ, నాకంటే గొప్పవానిగా నేను గుర్తించను. నాకంటే గొప్పోననే ఫీలింగ్ ఎదుటి వ్యక్తికి ఉంటే ఉండవచ్చుగాక, నేను మాత్రం డోంట్ కేర్. ***************పుట్టుక ఆధారంగా “ఎక్కువ తక్కువలు” చూసే ముస్లింలు ఉన్నారనేది కొందరు చేసే ఆర్గ్యుమెంటు. సరే, కాసేపు అది నిజమే అనుకుందాం. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీని గురించి ఏం చేద్దాం..?”ఈమాన్, ఉన్నత వ్యక్తిత్వం, చేసే మంచి పనుల ఆధారంగా తప్ప – మీలో మనిషి పుట్టుక, శరీర రంగు వంటి వాటి ఆధారంగా ఏ ఒక్కరో ఎక్కువ,తక్కువ కాదని” – మహమ్మద్ ప్రవక్త(స) కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఖురాన్ లో కూడా దీనికి అనేక రెఫరెన్సులు ఉన్నాయి.వీటి గురించి ప్రతిముస్లిమూ సీరియస్ గా ఆలోచించి, తెలుసుకుని, ఆచరించి , ఇతర ముస్లింలను సమానంగా చూసి, చూడమని ఒకరికొకరం చెప్పుకుని- సమానత్వం కోసం పాటుపడదామా – లేక, ఎవరో కొందరు మూర్ఖ ముస్లింలు చూపే వివక్షకు చట్టబద్ధత ఇవ్వమని పోరాడుదామా..? ఏం చేద్దామంటారు…?

-మహమ్మద్ హనీఫ్.
శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.