పుట్టుక లాగే, చావు కూడా ఓ అనివార్యమైన లాంఛనం. Its Just a Procedure. కళ్ళముందు నుండీ ఓ తెర తొలగిపోయే ప్రక్రియ. అందుకే చావు వార్తలేవీ నన్ను పెద్దగా బాధించవు. కానీ, ఆ చావు ఎలా వచ్చింది, దానికి సంబంధించిన పరిణామాలు వివిధ ఆలోచనలను, ఆవేశాలను కలిగిస్తుంటాయి.
టెర్రరిస్ట్ దాడులు, బాంబు పేలుల్లు జరిగినప్పుడల్లా, ఇస్లాం,అల్లాహు అక్బర్, జీహాద్.. ఇవి కాకుంటే, ఇంకేవో అరబిక్ పదాలు వార్తల్లోకి రావడం, ఇస్లాం ని ఉద్దరించడం కోసం తామే ఇది చేశామని ప్రకటించడం, లేదా, మీడియా ఆ విధంగా డిక్లేర్ చేసేయడం ప్రతిసారీ జరిగేదే. అలాంటివి చూసినప్పుడల్లా, చాలా బాధ,ఆవేశం కలుగుతుంది. ఇస్లాం పేరు మీద చిమ్మే ప్రతి రక్తపు బొట్టూ, ఇస్లాం శాంతియుతమని నమ్మి,దానిని ఆచరించే కోట్లమంది ముస్లింలను బోనులో నిలబెట్టేదే.