ఇస్లామిక్ స్కేల్: నాస్తికులు = పావలా ముస్లింలు; అనిశ్చిత హేతువాదులు = అర్థ ముస్లింలు!!

ఇస్లామిక్ స్కేల్: నాస్తికులు = పావలా ముస్లింలు; అనిశ్చిత హేతువాదులు = అర్థ ముస్లింలు!!
============================

పావలా ముస్లింలు, అర్థ ముస్లింలు..? ఏంటిదంతా..?

-సింపుల్. ఇస్లాం ని పూర్తిగా నమ్మేవారు పూర్తి ముస్లింలు, సగమే నమ్మేవారు సగం ముస్లింలు. 25% నమ్మేవారు పావలా ముస్లింలు. హ..హా ఇంతే.

అసలు ముస్లిం అంటే ఎవరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే – ” లా ఇలాహ ఇల్లల్లాహ్ – మహమ్మద్ రసూలిల్లా ” అని నమ్మేవారిని ముస్లింలు అంటారు.

దీనిలో సగం – లా ఇలాహ – ఇల్లల్లాహ్.

ఈ సగం లో సగం – లా ఇలాహ.

ఇలాహ అంటే – దైవం/దైవత్వం/పూజింపదగింది.. ( Worth to be worshiped) అని అర్థం వస్తుంది. ల అంటే – లేదు/కాదు అని. తెలుగులో నకారం లాంటిది.

లా ఇలాహ – అంటే – పూజింప తగినదేదీ లేదు అని. అంటే ప్రజలు సాధారణంగా పూజింపతగినదిగా భావించేవేవీ దైవాలు కావని ఇస్లాం అన్నిటినీ కొట్టివేస్తుంది. సూర్యుడు,చంద్రుడు, నక్షత్రాలు, రాజులూ, బంగారమూ,నదులూ, పర్వతాలు, పులులూ, ఒంటెలూ,గాడిదలూ, రాజులు, రాణులూ,తల్లులూ, తండ్రులు,తాతలూ.. లేక ఏ ఇతర మానవులూ.. ఇవేవీ పూజింపతగినవి కావనీ, వీటికి/వీరికెవరికీ దైవత్వం లేదనీ, ఇస్లాం ప్రకటిస్తుంది. సరిగ్గా, నాస్తికులూ, హేతువాదులూ కూడా ఇదే చెప్తారు. కాబట్టి హేతువాదులు, నాస్తికులూ అందరూ ఈ పావలా ముస్లిం కేటగిరీలోకే వస్తారు.

ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కి వెల్దాం.

(లా ఇలాహ..) – ఇల్లల్లాహ్.

ఇల్ల + అల్లాహ్ = But + Allaah.

అంటే, మొదటి 25%లో , పూజింపతగినవేవీ లేవు అని ప్రకటిస్తూనే, తర్వాతి 25% లో , ఒక్క అల్లా తప్ప అని వస్తుంది.

ఇక్కడ ఎవరికైనా – ఈ అల్లాహ్ అంటే ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవ్తుంది. అవ్వాలి కూడా.

సహజంగా, దేవుల్లనీ, మతాల్ని నమ్మే ఆస్తికులందరూ తమ తమ దేవుల్లుగా ఒక్కోవర్గం ఒక్కో బొమ్మనో,విగ్రహాన్నో కలిగి ఉండటంతో, ముస్లింల అల్లా కూడా, అలాంటి వాడే నేమోనని, ఆయనకు కూడా ఏదో ఓ రూపం ఉండే ఉంటుందని చాలా మంది అనుకుంటారు.

కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

“అల్లా అంటే ఏంటో ముస్లింలకు కూడా పూర్తిగా తెలీదు.”

అవును పైన మీరు చదివిన వాక్యం నిజమే- అల్లా అంటే ఏంటో, ఆయన/ఆమె/అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు.

ఇక్కడ భాష తో వచ్చిన చిక్కేంటంటే- నేను ‘ఆయన ‘ అనగానే – నేను మగాడి గురించి మాట్లాడుతున్నానని,

‘ఆమె ‘ అనగానే ఓ మహిళ గురించి మాట్లాడుతున్నాననీ,

‘అది ‘ అనగానే ఓ ప్రాణి గురించో, వస్తువు గురించో మాట్లాడుతున్నానీ వినేవారికి చెప్పకనే, చెప్పినట్లు అర్థం వస్తుంది. ఇదే సమస్య దాదాపు అన్ని భాషల్లోనూ ఉంది. ఉదాహరణకు ఇంగ్లీష్ లో – He/She/It అనే వాటిని వాడటాన్ని బట్టి, దాని గురించి ఓ అంచనాకు రావడం జరుగుతుంది.

కానీ, అల్లా ఇవేవీ కావు. అరబిక్ భాషలో అల్లా అనేది ఓ ప్రత్యేక పదం. అల్లా అంటే -దైవం అనే అర్థం వస్తుంది తప్ప, అది మగాడా,మహిళా,ప్రాణా, ఏక వచనమా, బహువచనమా, గతమా, వర్తమానమా.. వంటి క్లూస్ ఏవీ ఇవ్వదు.. (ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే – అరబిక్ మాతృ భాషగా కల అరేబియా ఖండంలోని క్రైస్తవులు కూడా, తమ దేవున్ని(తండ్రిని) అల్లా అనే పిలుచుకుంటారు.)

అల్లా గురించి పూర్తిగా తెలీదని ఎందుకంటున్నానంటే – అల్లాను ఏ ముస్లిం కూడా తన కళ్ళతో చూడలేదు. చివరికి ప్రవక్త కూడా చూడలేదు. తాను చూశానని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే, అల్లా అవతరింపచేశాడని ముస్లింలు భావించే ఖురాన్ గ్రంధంలో, ‘అల్లా అంటే ఇదీ’ అని వర్ణించే కొన్ని వాక్యాలు, ‘ఇది కాదు’ అని వర్ణించే కొన్ని వాక్యాలూ ఉన్నాయి. కేవలం అవి మాత్రమే ముస్లింలకు తెలుసు. వాటికి అదనంగా వేరే ఏమీ,ఎవరికీ తెలీదు.

ఉదాహరణకు – సూరా ఇఖ్లాస్ అని అల్లాను వర్ణించే ఒక సూరా ఉంది.

దాని అర్థం – ” He/She/It is Allah, the One and Only!
Allah, the Eternal, Absolute;
He/She/It beget not, nor is He/She/It begotten.
And there is none like unto Him/Her/It

ఈ సూరా, అల్లా ఎవరో క్లియర్ గా చెప్పదు కానీ, ఎవరు పూజింప తగినది కాదో స్పష్టంగా చెప్తుంది.

ఉదాహరణకి – జకీర్ నాయక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అతనికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతనికి, ఈ ముస్లింల అభిమానం మొత్తం తలకెక్కి, నేనే దేవున్ని-నన్ను పూజించండి అని ప్రకటించాడనుకోండి, అప్పుడు ఈ సూరా ముస్లింలకు పనికొస్తుంది. ఈ సూరా ప్రకారం – అల్లా ఎవరికీ పుట్టలేదు, అల్లా ఎవరికీ జన్మనివ్వలేదు. కానీ, జకీర్ నాయక్ ఎవరికి పుట్టారో, వారి పేరెంట్స్ గురించి అందరికీ తెలుసు, ఆయన పిల్లల గురించీ తెలుసు. సో అతను పూజింపతగిన వ్యక్తి కాదు. కాబట్టి ఆయన వీరాభిమానులు సైతం, అతన్ని పిచ్చోడిగా ప్రకటిస్తారు తప్ప, ఆయన్ని పూజించడమో, వరాలిమ్మని వేడుకోవడమో ఎన్నటికీ జరగదు.

అందుకే, ఇస్లాం లో ఆసారం బాబాలు, దేరా బాబాలు ఉండరు. ఏవరో ఒకరిద్దరు, చిన్నా చితకా తాబీజ్ గాల్లు ఉన్నా, వారి అనుచరగణం కొన్ని వందలకు మించదు.

ఇప్పుడు అల్లా గురించి ఖురాన్ లో ఇచ్చిన ఇతర సమాచారం గురించి బ్రీఫ్ గా చూద్దాం.

అల్లా ని ఖాలిఖ్ గా ఖురాన్ వర్ణిస్తుంది. అంటే సృష్టికర్త అని అర్థం. అంటే, ఈ సమస్త జీవరాశుల్ని,మానవున్ని, భూమ్యాకాశాలను సృష్టించిన వాడు అని.

ఇప్పుడు మల్లీ పావలా ముస్లింల దగ్గరికొద్దాం. నాస్తికులు/హేతువాదులు అనబడే ఈ పావలా ముస్లింల ప్రకారం, సృష్టికర్త అంటూ ఎవరూ లేరు. మరలాంటప్పుడు ఈ మనిషి, జీవులు,విశ్వం ఎక్కడి నుండి వచ్చాయి? దానికి వీరు జీవ పరిణామం అని ఏదో చెప్తారు. అసలు జీవి ఎక్కడి నుండి వచ్చిందని అడిగితే, బిగ్ బ్యాంగ్ అంటారు. మరి అదెక్కడ్నుండి – బ్లాక్ హోల్ అంటారు. అది – గాడ్ పార్టికల్ అని ఏదో ఉందంట.సొరంగాలు తవ్వి దాని గురించి ఏదో పరిశొధనలు చేస్తున్నారంట. ఏదో చేసి అదింకో XYZ నుంచి వచ్చిందని చెప్పొచ్చు. మరి ఆ XYZ ఎక్కడినుండి వచ్చింది, అనే ప్రశ్న ఉండనే ఉంది. సో, మొత్తానికి, ఆస్తికులు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు అనే ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పలేరో, అలాగే – నాస్తికులు కూడా -‘అదెక్కడినుండి వచ్చింది ‘ అనే ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం చెప్పలేరు.” ఈ చిన్న పాయింట్ ని అర్థం చేసుకుని, ఈ రెండూ ప్రశ్నల్నీ పక్కన పెట్టి, ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.

బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించీ చించీ..”మొత్తానికి ఏదో ఉందిరా బై”- అని కొందరు తీర్మానిస్తారు.

అబ్బే అలాంటిదేం లేదు.. కేవలం బూడిద తప్ప.. అని మరికొందరు తీర్మానిస్తారు. కనీసం ఆ బూడిదైనా ఉంది కదా, అది కూడా ఎక్కడో ఓ చోటనుండీ రావడమో, ఎవరో ఏదో చేస్తే తయారు కావడమో అయ్యి ఉండాలి కదా.. అదేంటనేది పాయింటు..

‘తెలియని దానిని X అనుకొనుము ‘ – అనే చిన్నప్పటి మేథమ్యాటిక్స్ సాల్వ్ చేసే టెక్నిక్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా దానిని ఫాలో అవుదాం.

“There is no god worth to be worshiped, But ____X___ ”

ఇప్పుడు ఆ పైనున్న డ్యాష్ లో సృష్టికర్తో, God Particle’s డ్యాడో, ఎదో ఒకటి.. మొత్తానికి అది X అనుకుందాం.

సృష్టి – సృష్టి కర్త వేరు వేరనీ,
పుట్టింప బడినదీ – పుట్టించే వాడు వేరు వేరనీ,

పూజిస్తే, గీజిస్తే సృష్టికర్తను, పుట్టించే వాడినీ(He/she/it) (అంటే -Xని) పూజించాలి తప్ప , సృష్టినీ,పుట్టింపబడిన వారినీ కాదనీ నమ్మేవారందరూ సగం ముస్లింలు.

ఇప్పుడో చిన్న విరామం!!

**************
చైనా రాజధాని బీజింగ్ లో ‘హెవెన్ టెంపుల్ ‘ అని ఓ ప్రముఖ పర్యాటక కేంద్రం ఉంది. ఇది 14 వ శతాబ్దంలో చైనాని పాలించిన మింగ్ రాజుల కాలంలో నిర్మించబడింది.దీని వాస్తు శైలి చతురస్రాలూ, మరియు వృత్తాల ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు దీని చుట్టూ రెండు కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. బయటిది చతురస్రాకారంగా, లోపలిది వృత్తాకారంగా ఉంటుంది. స్వర్గం వృత్తాకారంగా ఉంది, భూమి చతురస్రాకారంగా ఉంది అనే అంశం ఆధారంగా దీని మొత్తం నిర్మాణం జరిగింది. దీనిలోని వివిధ నిర్మాణాలన్నిటికీ, మొదట ఎత్తైన చతురస్రాకార బేస్ మెంట్, దానిపైన వృత్తాకార ఎలెవేషన్ ఉంటుంది. ఇక్కడి నుండీ పూజిస్తే స్వర్గంలోని దేవతలు నేరుగా వింటారనుకుని, చైనా రాజులు ప్రతి సంవత్సరం పంటలు బాగా పండాలనీ, తమకు కూడా స్వర్గ ప్రాప్తి కలగాలనీ ప్రతియేడూ ఇక్కడి కొచ్చి మొక్కుకునే వారంట.ఈ ఆచారం కొన్ని వందల సంవత్సరాలపాటు కొనసాగిందట. ఇదంతా, అక్కడి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వారు పెట్టిన బోర్డ్ లోనే ఉంది. ప్రస్తుతం అక్కడికొచ్చిన పర్యాటకులందరూ అది చదివేసి, ఓరి అమాయకుల్లారా, భూమి చతురస్రాకారంగా ఉందనుకున్నారా, పాపం.. అని వారి మీద సానుభూతి కురిపించేసి , ఆ పాత గోడల పక్కన నిలబడి ఫోటోలూ, సెల్ఫీలు దిగుతుంటారు తప్ప, స్వర్గం కోసం అక్కడ సీరియస్ గా ప్రార్థనలు చేస్తున్నట్లు ఎవరూ కనిపించలేదు.
***********************

మళ్ళీ చర్చలోకి స్వాగతం!!!

పైన మాట్లాడుకున్నట్లు, ఆ X అంటే ఇదీ, అనే చాలా సిద్ధాంతాలు, నమ్మకాలు వివిధ సమాజాల్లో వివిధ రకాలుగా చెలామణీలో ఉంటూ వస్తున్నాయి. మానవ మేధస్సు పెరిగే క్రమంలో, సృష్టి గురించి మనిషి పరి~గ్నానం పెరుగుతున్న కొద్దీ, ఆ X గురించి వాడుకలో ఉన్న అనేక సిద్ధాంతాలు కనుమరుగైపోతాయి. కొన్ని సిద్ధాంతాలని, కొన్ని ప్రాంతాల ప్రజలు కొన్ని తరాల పాటు నమ్మి,ఆచరించి ఉండొచ్చు. కొన్ని సిద్ధాంతాలు నిత్యం తమ రూపు మార్చుకుంటూనే మాది అత్యంత పురాతనమైన సిద్ధాంతం అని కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు.

ఇలాంటి అనేక సిద్ధాంతాలలో ఇస్లాం కూడా ఒకటి. ఈ సిద్ధాంతాన్ని చెప్పింది మహమ్మద్ అనే ఓ వ్యక్తి. ఈయన 570 – 632 మధ్య, అరేబియా ఖండంలో జీవించారు. ప్రకృతి/సృష్టి,చరిత్ర, మనిషి శరీరం, చావు,పుట్టుకలు,మంచి-చెడు,స్త్రీ-పురుషుల సంబంధాలూ,పరిపాలన వంటి అనేక అంశాల గురించి, ఈయన చాలా విషయాలు చెప్పి ఉన్నారు. అవన్నీ ఖురాన్ గ్రంధం రూపంలో నిక్షిప్తం అయి ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ఆయన ఆచరణలో చేసి చూపారు. ఆయన చేసినవీ, చెప్పినవీ ఏవీ, తన సొంత మేధస్సు ఆధారంగా కాదనీ, తనకు సృష్టికర్తనుండీ వచ్చిన సందేశం/ఆదేశం మేరకే తాను నడుచుకున్నాననీ ఆయన ప్రకటించారు. తన కంటే ముందు వచ్చిన, జీసస్, మోసెస్, అబ్రహాం వంటి వారిలాగే తాను కూడా కేవలం సృష్టికర్త ఎంచుకున్న ఓ మెసెంజర్ తప్ప, తనకు ఎలాంటి ప్రత్యేకతా లేదనీ, తనకు ఎలాంటి ప్రత్యేక శక్తులూ లేవనీ ఆయన స్పష్టంగా పదే,పదే చెప్పారు.
***********************
“ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం”- అనే ప్రావెర్బ్ మనం తరచూ వింటుంటాం. మహమ్మద్ ప్రవక్త జీవితం గురించి గత 1400 సంవత్సరాలుగా వచ్చినన్ని పుస్తకాలు,విశ్లేషణలు ఈ భూమిమీది మరే ఇతర మానవుడి గురించీ వచ్చి ఉండవు. ఆయన జీవితానికి సంబంధించిన ప్రతీ చిన్న విషయం కూడా గ్రంధస్తం చేయబడి ఉంది.ఇక, ఆయన ప్రవచించిన సిద్దాంతం ఖురాన్ రూపంలో, చిన్న అక్షరం కూడా మార్పు చెందకుండా యధాతధంగా ఉంది.

ప్రస్తుతం ప్రంచంలో అత్యధిక Surnameలలో ఉన్న పేరు ఆయనదే – ముహమ్మద్ అని. అట్లే, అత్యధిక మంది అత్యంత ఎక్కువగా ప్రేమించే మనుషుల్లో కూడా, ఆయనే అగ్రగణ్యుడిగా ఉంటారు. ( కేవలం ప్రేమించే మాత్రమే, పూజించే కాదు. ఎందుకంటే – ఏ ఒక్క ముస్లిం కూడా, పొరపాటున కూడా ఆయనను పూజించడు).
ఆయన గురించి సగమే తెలుసుకుని ఆయన్ని విపరీతంగా ద్వేషించేవారికి కూడా లెక్కలేదు. ఉదాహరణకు – ఆయన 13 మందిని పెళ్ళి చేసుకున్నారు కాబట్టి ఆయన్ని స్త్రీలోలుడిగా కొందరు చిత్రిస్తుంటారు. ఎక్కువ మంది స్త్రీల పొందు కోసం తపించే వారిని స్త్రీలోలుడనటం సమంజసంగానే అనిపించొచ్చు. కానీ, మహమ్మద్ ప్రవక్త పాతికేళ్ళ వయసులో, తనకంటే వయసులో 15 సంవత్సరాలు పెద్ద, మరియు అప్పటికే పెళ్ళై విధవరాలైన ఖదీజాను మొదటి వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత పాతికేళ్ళ అన్యోన్య దాంపత్యంలో, ఖదీజా మరణించేంతవరకూ ఆయన రెండో పెళ్ళి చేసుకోలేదనే విషయం వీరికి తెలీదు. తెలిసినా తెలీనట్లు నటిస్తారు. ఆ తర్వాత ఆయన చేసుకున్న ప్రతి వివాహం వెనకా ముఖ్యంగా తెగల మధ్య బంధుత్వాలను కలుపుకొని యుద్ధాలను నివారించడం లాంటి సామాజిక ప్రయోజనాలే ఉన్నాయనే విషయం వీరి చెవికెక్కదు.

ఆయన హింసను ప్రేరేపించారని కొందరు విమర్శిస్తుంటారు. కానీ, ఆయన జీవితం మొత్తం తరచి చూస్తే, హింసను చిట్ట చివరి అంశంగా, గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే వాడారనీ, హింసను, యుద్ధాలను నివారించడానికి శాయశక్తులా ప్రయత్నించారని అనేక ముస్లిమేతర చారిత్రక పరిశోధకులే తీర్మాణించారు.

ఇవన్నీ , ఒక ఎత్తైతే, ఆయన ప్రవచించిన ఖురాన్ మరో ఎత్తు. పర్వతాలు,సముద్రాలు,భూమీ, ఆకాశం, నక్షత్రాలు,గర్భస్థపిండాలు లాంటి అనేక అంశాల గురించి 1400 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి కొన్ని కామెంట్లు చేసి, వీటిలో ఏ ఒక్కటి తప్పని తేలినా, ఈ పుస్తకం మొత్తం సృష్టికర్త నుండీ రాలేదని నిరూపించబడినట్లే, చేతనైనోల్లు ఎవరైనా అలా ప్రూవ్ చేయండి అని సవాలు విసిరారు. ఈ 1400 సంవత్సరాలుగా కనుగొనబడిన ఆవిష్కరణలేవీ, ఖురాన్లోని ఏ ఒక్క వాక్యమూ తప్పని నిరూపించలేకపోయింది.

ఇక ఆయన మనిషి ఎలా ఉండాలని చెప్పాడనేది మరో ముఖ్యమైన అంశం. మనుషుల్లో వివిధ, స్థాయీబేధాలు ఉంటాయనో, తన అరబ్ జాతి ఉన్నత స్థాయి కాబట్టి, మిగతా మానవ జాతులందరూ ఓ అరబ్ వ్యక్తిని తమ ఇమాం గా పెట్టుకుని, ఆ అరేబియన్ కి అన్నీ సమర్పించేసుకోవాలనో ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిందీ, ఆచరించి చూపిందీ ఒక్కటే – మనుషులందరూ సమానమే. ఏ ఒక్క మనిషికీ , మరో మనిషి పై ఆధిక్యత లేదు. ప్రతి మనిషీ, తాను చేసే ప్రతి పనికీ మరణానంతరం జవాబు చెప్పాల్సి ఉంటుందనే విషయం గుర్తెరిగి బాధ్యతతో మెలగండి.

తాను చెప్పిన దానిని నమ్మిన వారు నిష్టగా ఇస్లాం ని ఆచరించమని ఆయన చెప్పారే తప్ప, నమ్మని ముస్లిమేతరులని బలవంత పెట్టో,ప్రలోభపెట్టో ముస్లింలుగా మార్చమని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. నమ్మకం అనేది సొంత ఆలోచనలతోనే వస్తుంది తప్ప, బలవంతం ద్వారా వచ్చేది కాదని ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నారు. అయినా ఇస్లాం ఖడ్గం ద్వారా వ్యాపించిందని కొందరు అడ్డగోలు వాదనలు వాదనలు చేస్తుంటారు. ప్రస్తుతం, ఈ భూమిమీద అత్యధిక ముస్లింలున్న దేశం ఇండోనేసియా. ఇక్కడ దాదాపు 20 కోట్ల పైబడే ముస్లింలు నివస్తిస్తున్నారు. కానీ, ఇండోనేషియాపైకి ఏ ముస్లిం రాజూ కత్తి పట్టుకుని యుద్ధానికి వెల్లలేదు. అది ఏనాడు ముస్లిం రాజుల ఏలుబడిలో లేదు. మరి అంత మంది ఎలా ముస్లింలుగా మారారు. బుర్రున్న ఇస్లామోఫోబ్ లు దీని గురించి ఆలోచించండి.

ఇస్లామోఫోబ్ లకు ఎప్పటికీ మింగుడు పడని మరో అంశం- మంగోలుల ఇస్లామీకరణ. తొలితరం మంగోల్ రాజులు ముస్లింలు కారు. పైగా వీరు అప్పటి ఇస్లామిక్ అగ్రరాజ్యలుగా వెలుగొందుతున్న ఇరాన్,సిరియా లపై దాడి చేసి వాటిని నేల మట్టం చేశారు. కొన్ని లక్షలమంది ముస్లింలను చంపేసి, మసీదులను, మదరసాలను కూల్చేశారు. సాక్షాత్తూ ముస్లింల మత నాయకుడైన ఖలీఫానే చంపేశారు. కానీ, తరువాతి తరం మంగోల్ రాజులు ఇస్లాం పట్ల ఆకర్షితులై ముస్లింలుగా మారారు. ఇది ఎలా సాధ్యం. రాజునూ-పేదనూ, గెలిచిన వారిని-ఓడిన వారినీ, ఉన్నోన్నీ-లేనోన్నీ అందరినీ ఆకర్షించే శక్తి ఇస్లాం కు ఉంది.

ఇవన్నీ చదివి,తెలుసుకుని – మానవ మాత్రుడెవరూ తన సొంత మేధస్సు ఆధారంగా ఇదంతా చేయలేడు/చెప్పలేడు అని నిర్ధారించుకుని, మహమ్మదుర్ రసూలిల్లా( మాహమ్మద్ దేవుని ప్రవక్తే ) అని నమ్మేవారు 100% ముస్లింలు.

-మహమ్మద్ హనీఫ్.
2/9/2018.

One Reply to “ఇస్లామిక్ స్కేల్: నాస్తికులు = పావలా ముస్లింలు; అనిశ్చిత హేతువాదులు = అర్థ ముస్లింలు!!”

Leave a Reply

Your email address will not be published.