కథలాంటి నిజం; విక్టోరియా – అబ్దుల్ కరీం.

కథలాంటి నిజం; విక్టోరియా – అబ్దుల్ కరీం.
============================
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి రాణి, ఈ ప్రపంచంలోని ముప్పావు వంతు భూభాగాన్ని తన కనుసన్నలతో శాసించిన సామ్రాజ్యాధినేత – బ్రిటీష్ రాణి విక్టోరియా.
అలాంటి రాణికి సేవకునిగా, ఆంతరంగకునిగా, గురువుగా, మిత్రుడిగా, సన్నిహితుడిగా,ఓ కొడుకుగా పదేల్లు బ్రిటన్ రాణి కోటలో చక్రం తిప్పిన భారతీయుడు – అబ్దుల్ కరీం.

అది 1890 సంవత్సరం.
ఇండియాలోని బ్రిటీష్ అధికారులు, తమ రాణికి చిన్న కానుకగా, షాజహాన్ కాలం నాటి ఓ నాణేన్ని పంపాలనుకున్నారు. దానిని రాణికి అందివ్వడానికి ఇద్దరు భారతీయ నౌకర్లను షిప్పులో London పంపారు. వారిలో ఒకతని పేరు- అబ్దుల్ కరీం. ఆగ్రా జైలులో ఖైదీల వివరాలు నమోదు చేసే పని చేసేవాడు. అప్పటికే ఉర్దూ,అరబిక్ భాషలపై మాంచి పట్టు ఉంది. ఖురాన్ మొత్తం బట్టీపట్టేసి ఉన్నాడు. (అలా బట్టీ పట్టిన వారిని- హఫీజ్ అంటారు.) బ్రిటీష్ వారితో రోజూ మాట్లాడుతుండటం వల్ల ఇంగ్లీష్ కూడా నేర్చేసుకున్నాడు. ఇన్ని భాషలు వచ్చి ఉండటం వల్లనే బహుశా అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు.

ఆ విక్టోరియా మహారాణి కోట శత్రుదుర్భేద్యం. కొన్ని వందల మంది పనివారు. ఆ పనివారికి కూడా పనివారు. అక్కడ ప్రోటోకాల్ కి విరుద్ధంగా చిన్న ఈగ కూడా వాలడానికి లేదు. అలాంటి వాతావరణంలో, అబ్దుల్ కరీం కి అప్పజెప్పిన పని, ఓ పల్లెంలో నాణేన్ని పెట్టుకుని నడుచుకుంటూ రాణి టేబుల్ దగ్గరికి వెళ్ళి, ఆమెవైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా, వంచిన తల ఎత్తకుండా, ఆ నాణేన్ని టేబుల్పై పెట్టి, అలాగే నడుచుకుంటూ రావాలి- అంతే.

ఆరోజు ఏం జరిగిందో ఎగ్జాట్గా ఎక్కడా నమోదు కాలేదు. లేదా, నమోదైన అన్ని ఆధారాల్ని చెరిపేశారు. మొత్తానికి విక్టోరియా రాణి అబ్దుల్ కరీం ని తన కోటలోనే మరి కొన్ని రోజులు ఉండమని చెప్పింది. తరువాత అతనికి అందులోనే ఉద్యోగమిచ్చింది- తన పర్సనల్ సెక్రటరీగా.

******************

భర్త చనిపోయి, కృతిమ మర్యాదలు,అస్తమానమూ యుద్ధాలూ, కుట్రలూ, కుతంత్రాలతో జీవితంపై విరక్తి కలిగి ఉన్న 50 సంవత్సరాల విక్టోరియాకి అబ్దుల్ కరీం రూపంలో గొప్ప ఊరట దొరికింది. ఇండియా,ఇస్లాం, మొఘల్స్, షాజహాన్, తాజ్ మహల్, ఉర్దూ ఘజల్స్.. ఇలా కరీం చెప్పే సంగతుల్ని ఆమె గంటలు గంటలు వింటూ ఉండేది.

విక్టోరియా- అబ్దుల్ మధ్య అణుబంధం క్రమంగా పెరిగుతూపోయింది. రాణికి, అబ్దుల్ తర్వాతే ఇంకేమైనా అనే వరకూ వెల్లింది పరిస్థితి. అబ్దుల్ రాణి గదిలోకి నేరుగా వెల్లేవాడు. రాణి అతని దగ్గర ఉర్దూ భాష చదవడం, రాయడం కూడా నేర్చేసుకుంది. అతన్ని మున్షీగా(టీచర్ ) నియమించుకుంది.

****************

అత్యంత కఠినమైన ప్రోటోకాల్ నియామాలున్న రాణి కోటలో, ఓ మామూలు నౌకర్, అందునా ఓ భారతీయుడు. రాణికి అంత సమీపంగా వెల్లడం, రాణి కుటుంబ సభ్యులకి, ఇతర అధికారులకీ కంటగింపుగా మారింది. అతన్ని కోటలోకి రానివ్వడం మంచిది కాదని ఆమెకు హితవు పలికారు. కానీ, విక్టోరియా ఇవేవీ లెక్కపెట్టలేదు.
చివరికి అతను కోటలో ఉంటే, తాము విధులని బహిష్కరిస్తామని అందరూ కలిసి అల్టిమేటం ఇచ్చారు. దీనిని రాణి తీవ్రంగా పరిగనించింది. ఎవరికి చేతనైంది వారిని చేసుకోమంది. కరీం ఓ సాధారణ వ్యక్తి అనేదే వారి అభ్యంతరమైతే, దానికి విరుగుడుగా అతనికి నైట్ హుడ్ ఇస్తానని ప్రకటించింది. ( నైట్ హుడ్ అంటే, బ్రిటన్ రాజ్యంలో అతిపెద్ద స్థాయి. బ్రిటన్ తరుపున యుద్ధాలు చేసి, అనేక రాజ్యాలు ఆక్రమించిన వారికి మాత్రమే అది ఇస్తారు)

దీనితో రాణి కుటుంబ సభ్యులు, కోటలోని ఉద్యోగులు అందరూ దారికి వచ్చారు. ఈ విధంగా 1891 నుండి 1901 వరకూ, పదేళ్ళ పాటు బ్రిటన్ కోటలో అబ్దుల్ కరీం ప్రాభవం వెలిగిపోయింది. వీరి అణుబంధం చివరికి 1901 లో రాణి మరణంతో ముగిసింది. రాణి చనిపోయి, ఆమె కొడుకు రాజుగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం అతను చేసిన మొదటి పని, కరీం ఇంటిపై దాడి చేసి, అతనికి విక్టోరియా ఇచ్చిన బహుమతులు, విలువైన వస్తువులు, ఆమె రాసిన అనేక లేఖలు మొత్తం కాల్చిపడేశారు. వీరిద్దరి గురించిన ఏ సమాచారమూ బ్రిటన్ అధికారిక పత్రాల్లో ఎక్కడా లేకుండా మొత్తం చెరిపేయడమో, తిరిగి రాయడమో చేశారు. కరీం ని కట్టుబట్టలతో ఇండియాకు పంపించేశారు. ఇండియాకు వచ్చిన కరీం 1909లో ఆగ్రాలో చనిపోయాడు.

2010లో బ్రిటన్ మ్యూజియంలో పనిచేసే ఓ ఉద్యోగి చేసిన పరిశోధన ఫలితంగా ఈ మొత్తం ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా ఇప్పటికే అనేక డాక్యుమెంటరీలు, Victoria & Abdul అనే హాలీవుడ్ మూవీ కూడా తీశారు.
కొన్ని డాక్యుమెంటరీలు యూటూబ్ లో కూడా ఉన్నాయి. ఆసక్తి ఉన్నోల్లు చూడొచ్చు.
(Below is the actual photo of Abdul Kareem and Queen Victoria)

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.