GHMC ఎలెక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు రాత్రి అసదుద్దీన్ ఓవైసీ ప్రెస్‌మీట్ పెట్టాడు. దాదాపు గంటసేపు, జర్నలిస్టులడిగిన ప్రతి ప్రశ్నకూ ఓపికగా,వినయంగా… ‘సార్’,’మేడమ్’ అంటూ సమాధానాలిచ్చాడు. యం.ఐ.యం మీద వచ్చే ప్రతి అలెగేషన్ కీ లాజికల్ గా సమాధానమిచ్చాడు. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీచేసేదీ, కేరళ,అస్సాంలలో ఎందుకు పోటీ చేయందీ(అక్కడ ఆల్రెడీ ముస్లింలకు IUML,AUDF ల రూపంలో, తగినంత పొలిటికల్ రెప్రెసెంటేషన్ ఉంది కాబట్టి), పోటీ చేయడం వల్ల సాధించాలనుకుంటున్న లక్ష్యాల గురించీ, వాటి లిమిటేషన్ల గురించీ చిన్నపిల్లలకు చెప్పినట్లు ,వివరించి చెప్పాడు. నా వరకూ అతని సమాధానాలు కన్విన్సింగ్ గానే అనిపించాయి.
కాకపోతే, ఆ ఇంటర్వ్యూ మొత్తం హిందీలో ఉంది. మన తెలుగు మీడియా దానికి ఏ మాత్రం కవరేజ్ ఇచ్చిందో తెలీదు. పైగా, మెయిన్ స్ట్రీం మీడీయా స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే, ఆ ఇంటర్వ్యూ చప్పగా సాగింది. ఎలాంటి రెచ్చగొట్టే,మతాలమధ్య చిచ్చుపెట్టె స్టేంట్మెంట్లూ, తొడగొట్టే పంచ్ డైలాగులూ లేవు. కాబట్టి సహజంగానే మీడియాకు ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అంశం అనిపించకపోవచ్చు. పెద్ద ఓవైసీ స్పీచ్‌లు,ఇంటర్వ్యూలూ, ప్రెస్మీట్లన్నీ దాదాపు ఇలాగే ఉంటాయి. పార్లమెంట్ లో, ముస్లిం,దలిత,మైనారిటీ,రాజ్యాంగ వ్యతిరేక బిల్లుల్ని వ్యతిరేకించేటప్పుడు ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో, బయట అంత శాంతంగా ఉంటాడు.
పెద్ద ఓవైసీ కి భిన్నంగా చిన్న ఓవైసీ అక్బరుద్దీన్ వైఖరి ఉంటుంది. నాకు తెలిసి, ఇతను ఎప్పుడూ టీవీ ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లకు అటెండ్ అయింది లేదు. ముస్లిం క్రౌడ్ ముందు నిలబడి ఎమోషనల్ స్పీచ్‌లు మాత్రం బాగా దంచుతుంటాడు. ఆ ఎమోషన్లో అర్థం,పర్థం లేని చెత్తవాగుడు కూడా వాగుతుంటాడు.
ఉదాహరణకు – మొన్నటి GHMC ఎలెక్షన్ ర్యాలీలో, ఆంధ్రా ముఖ్యమంత్రులందరూ(YSR,CBN,KKR,KCR ల పేర్లు చెప్పి మరీ) తమ ముందు వంగి ఉంటారనీ, తాము ఎప్పుడు కావాలంటే అప్పుడు వారిని లేపగలం-కూర్చోబెట్టగలం అనీ, తాము పెద్ద తోపులం అనీ చెప్పుకొచ్చాడు. బీజేపీ దీనికి కౌంటర్ ఇచ్చే రెండు నిమిషాల వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసింది. బీజేపీ వార్డు కార్యకర్తలు, పోలింగ్ ముందు రోజు రాత్రి ఇల్లిల్లూ తిరిగి ఈ వీడియో ఇంటిల్లిపాదికీ తమ సెల్ ఫోనుల్లో వేసి చూపిస్తే చాలు, పొద్దున్నే నేరుగా పోలింగ్ బూత్ కి వెళ్ళి బీజేపీ కి ఓటు గుద్దేస్తారు. బ్యాక్ గ్రౌండ్ లో అదే జరుగుతున్నట్లుంది.
రియాలిటీ దీనికి క్వైట్ ఆపోజిట్ అనే విషయం అందరికీ తెలిసిందే.గతంలో ఇతనిచ్చిన ఇలాంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎత్తుకెళ్ళి నలబై రోజులు జైల్లో పడేశారు. చచ్చీ,చేడీ బెయిల్ మీద బయటపడ్డాడు. ఇతనికున్న 7 MLA సీట్లు,1 MP సీట్లతో ఏమీ పీకలేరనే విషయం అందరికీ తెలుసు. దేశంలో ఉన్న మొత్తం ముస్లింలందరూ వీరి పార్టీకే ఓట్లేసినా, ఇతర సెక్యులర్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప, ఇండిపెండెంట్ గా వీరికొచ్చే కొద్దిపాటి సీట్లతో ఎలాంటి ప్రయోజనమూ లేదనే విషయం కూడా తెలుసు. మరలాంటప్పుడు ఈ పిట్టలదొర,భట్రాజు ప్రేలాపనలు ఎందుకు?
మొన్న ఓ టీవీ ఇంటర్వ్యూలో, కేటీఆర్ ని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్, -అక్బరుద్దీన్ కేసీఆర్ ని తక్కువచేసి మాట్లాడుతున్న వీడియో ఒకటి ప్లే చేసి, దీనిపై మీ కామెంట్ ఏంటని అడిగాడు. కేటీఆర్ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉండి ఉంటే, అంతకంటే పెద్ద మాటతో అక్బరుద్దీన్ ని తిట్టి ఉండేవారు, కానీ కేటీఆర్ చాలా పరిణితి చూపించి, చేతల్లో ఏమీ చేయలేనివారే ఇలా వాగుతుంటారని, వాటిని తాను పట్టించుకోననీ తేలిగ్గా కొట్టిపారేశాడు.
అసలే ముస్లింలకు సంబంధించిన నెగెటివ్ వార్తలకు ఎక్కడలేని ప్రాముఖ్యం వస్తున్న ప్రస్తుత ఇస్లామోఫోబిక్ తరుణంలో, ముస్లింల రెప్రెజెంటేటివ్ గా చెప్పుకునే నాయకులు, ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. సాధ్యమైనంత ఎక్కువమందిని తమతో కలుపుకుని పోగలగలిగేలా ఉండాలి తప్ప, అక్బరుద్దీన్ లా పిచ్చి ప్రేలాపనలు చేయకూడదు. ఇలా మాట్లాడతాడనే, మొన్న ఏదో మీటింగ్‌లో అతన్ని మాట్లాడనివ్వకుండా, అక్కడి ముస్లింలే అడ్డుకున్నారు. అతను అర్థాంతరంగా స్పీచ్ ముగించుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఇతన్ని జైల్లో వేసినప్పుడు కూడా, పాతబసీ ముస్లింలు పెద్దగా ధర్నాలూ,ర్యాలీలతో నిరసన తెలిపిన దాఖలాలు లేవు. ఇతను అలా మాట్లాడటం తప్పనే భావన అందరికీ ఉంది కాబట్టి. మొత్తానికి, అక్బరుద్దీన్ నోరు అదుపులోపెట్టుకోకపోతే, అది ముస్లిం సమాజానికీ, ముస్లింలకు మద్దతు తెలుపుతున్న TRS లాంటి పార్టీలకు కూడా తీరని నష్టాన్ని కలిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.