జయతేవ సత్యమే!!

In search of PURPOSE#2
జయతేవ సత్యమే!!
=================

మీరెప్పుడైనా గొడ్డలితో దుంగల్ని విరగ్గొట్టారా?
ముందుగా విరగ్గొట్టాల్సిన పాయింట్ని గుర్తుంచుకుని, ఆ పాయింట్ కి కాస్త అటు పక్క ఓ దెబ్బ,ఇటు పక్క ఓ దెబ్బ, ఇలా చాలా సార్లు రిపీట్ చేయాలి. అలా కాకుండా, అన్ని దెబ్బల మొత్తం శక్తిని ఒకేసారి ఆ పాయింట్ పై నేరుగా అప్లై చేస్తే అది విరగదు. పైగా ఎగిరి ముఖానికి తగుల్తుంది. మన మైండ్ లో చిన్నప్పటినుండీ పాతుకుపోయిన ఒపీనియన్స్ కూడా అలాగే స్టెప్ బై స్టెప్ మెదడులోకి దింపబడతాయి. . ఓ పక్కనుండీ “సత్యమేవ జయతే, అబద్ధం ఆడరాదు, చట్టం అందరికీ సమానమే, మంచోల్లకు మంచే జరుగుతుంది, ఇతరులకు కీడు కలిగించరాదు “ – లాంటి ఎంప్టీ స్లోగన్స్ (శుష్క నినాదాలు), మరో పక్కనుండీ – “ సైన్సు చాలా గొప్పది, సైన్సే గొప్పది, మన కళ్ళకు కనపడేవాటినే నమ్మాలి, కనబడని వాటిని నమ్మడం మూఢనమ్మకం “- వంటి మత వ్యతిరేక భావనలను క్రమ,క్రమంగా బుర్రల్లోకి ఇంకేలా చేయబడుతుంది. అలా ఓ పాయింట్ దగ్గర కొట్టీ, కొట్టీ బాగ గాటు పడి ఉన్న సమయంలో, దానికి దూరంలో మరో చోట విరచాలంటే మళ్ళీ, ఇదే ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి, లేకుంటే, పైన చెప్పినట్లు, అది ఎగిరి ఎక్కడోచోట తగుల్తుంది. అలా, నేను స్కూల్లో టీచర్లు, సినిమాలు కలిగించే ఞాన బోధకు అప్పటికే కాస్త సింక్ అయి ఉండటం వల్ల, మా ఊరి మసీదులోని ఇమాం గారు స్వర్గం-నరకాల గురించి చెప్పాలని చూసిన కౌంటర్ న్యారేటివ్ నా మైండ్ లోకి దిగలేదు. అది పార్ట్-1 లో చూశాం.

సీన్ కట్ చేస్తే, ఎంసెట్ లో ర్యాంకు వచ్చింది, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అప్పటి వరకూ మనం 24 క్యారట్ తెలుగు మీడియం. ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ పుస్తకం లో తప్ప, మిగతావన్నీ తెలుగులో చదివి బాగా అలవాటై ఉన్న కళ్ళకు, అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో చదవాలంటే ఏ మూలో కొంచెం భయం కలిగింది. ఇంగ్లీష్ లో వీకేం కాదు గానీ, ఇక మనకు ఫ్యూచర్లో కూడు పెట్టేది ఇంగ్లీషే కాబట్టి దానిమీద ఫుల్లుగా కమాండ్ తెచ్చుకోవాలని డిసైడ్ ఐపోయాను.

“ఇంగ్లీష్ బాగా రావాలంటే రోజూ THE HINDU పేపర్ చదవాలి.”
ఈ మాట అప్పటికే చాలా మంది, చాలా సార్లు చెప్పి ఉన్నారు. సో, హిందూ తో అలా అనుబంధం మొదలైంది, ఇంకా కొనసాగుతూనే ఉంది.

వెనకటికో సంగీతం మాష్టారు, తన శిష్యులకు స్వరాలు బాగా పలకాలని, ఊరి చెరువులో మెడవరకూ ముంచి, రోజూ సంగీత సాధన చేయించేవాడంట. సంవత్సరం తిరిగే సరికి శిష్యులకి సంగీతం అంతగా అబ్బలేదట కానీ, ఈత పోటీల్లో మాత్రం ఫస్టు ప్రైజు సాధించారట.

నా పరిస్థితి సరిగ్గా అలాగే తయారైంది. ఇంగ్లీషు నేర్చుకుందామని హిందూ పేపర్ చదవితే, దాని ద్వారా సమాజంలో జరిగేవి తెలుసుకుని బుర్ర హీటెక్కిపోయేది. హిందూ పేపర్ గురించి తెలియని వారికి బ్రీఫ్ గా చెప్పాలంటే – దేశంలో జర్నలిస్టిక్ విలువల్ని గత 150 ఏళ్ళుగా నిష్ఠగా ఫాలో అవ్తున్న జాతీయ పత్రిక ఏది అంటే, దాదాపు అందరూ ఠక్కున దాని పేరే చెప్తారు. కొందరు దానిని కాంగ్రెస్/లెఫ్ట్ అనుకూల పత్రిక అని నిందిస్తారు గానీ, కాంగ్రెస్ పార్టీ ని అత్యధికంగా అప్రదిష్ట పాలు చేసిన బోఫోర్స్ స్కాం తో పాటు అనేక ఇతర స్కాముల్ని ఆ పత్రికే వెలికితీసిందనే నిజాన్ని వీరు కన్వీనియంట్ గా మర్చిపోతుంటారు.
2002- దేశ రాజకీయాల్ని జాగ్రత్తగా గమనిస్తున్న వారికెవరికైనా, ఈ నంబర్ చూడగానే, ఆ సంవత్సరం జరిగిన గొధ్రా రైలు దహనం, అనంతరం మైనారిటీల పై జరిగిన నరమేధం గుర్తొస్తాయి. మన తెలుగు మీడియాకు, మరియు ఇతర అన్ని రీజనల్ మీడియాలకు సంబంధించినంత వరకూ, అక్కడ ఓ రైల్లో కొందరు హిందువుల్ని ముస్లింలు చంపేశారు, దానికి ప్రతిచర్యగా కొందరు ముస్లింలను హిందువులు చంపేశారు, అంతే. చాప్టర్ క్లోజ్.

కానీ, హిందూ పత్రిక దీని గురించి చాలా విషయాలు రాసింది. మొత్తంగా గుజారాత్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏ ఏ వ్యవస్థని ఎలా నీరు కార్చబడుతుందీ, రాజ్యాంగం,మానవ హక్కులు, పరిపాలన అనేపదాల్ని అపహాస్యం పాలు చేసే సంఘటనలు ఎలా బాహాటంగా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు డిటైల్డ్ గా అందిస్తుండేది. తెలుగు మీడియాలో ఇవి మచ్చుకైనా కనిపించేవి కాదు. ఎప్పుడైనా కనిపించినా, అవి ఏ మూలో.. ఒకటి, అరా. అంతకు మించి పెద్దగా వచ్చేవి కావు.
అప్పట్లో గుజరాత్ లో జరిగిన కొన్ని సంఘటనలు .

1. బెస్ట్ బేకరీ హత్యలు : బెస్ట్ బేకరీ పేరుతో ఓ ముస్లిం కుటుంబం, బేకరీ షాపును నడిపేది. గ్రౌండ్ ఫ్లోర్ బేకరీకి కేటాయించి, మొదటి అంతస్తులో వారు నివాసం ఉండేవారు. గోధ్రా రైలు దహనం జరిగిన మరుసటి రోజు, అల్లరి మూకలు బెస్ట్ బేకరిపై దాడి చేశారు. ముందుగా బేకరీలోని వస్తువులన్నీ దోచుకుని, తర్వాత ఆ ఇంటికి నిప్పంటించారు. ఆ ఇంట్లోని 11 మంది కుటుంబ సభ్యులు మరియు బేకరీలో పని చేసే 3 హిందువులు సజీవ దహనం చేయబడ్డారు. జహీరా షేక్ అనే ఒక్క మహిళ మాత్రం ప్రాణాలతో బతికింది.

2. బిల్కిస్ బానో కేసు : గోధ్రా రైలు దహనం అనంతరం, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న బిల్కిస్ బానో కుటుంబం మరియు బంధువులు, తాము ఉంటున్న ప్రాంతం సురక్షితం కాదనుకుని, ఓ ట్రక్కులో మరో ఊరికి బయలు దేరారు. బిల్కిస్ బానో అప్పుడు 5 నెలల గర్భవతి. వారి ట్రక్కును వెంబడించి పట్టుకున్న అల్లరి మూకలు, పురుషులందరినీ చంపేశారు, మహిళలందరినీ రేప్ చేసి చంపేశారు. బిల్కిస్ బానోను కూడా రేప్ చేసి, ఆమె చనిపోయిందనుకుని వదిలేశారు. తన 2 ఏళ్ళ కూతురితో సహా, మొత్తం 17 మంది చంపబడ్డారు.

3. నరోదా పాటియా కేసు : నగరంలో అల్లర్లు జరుగుతున్నాయనీ, మాజీ ఎం.పీ. గారి ఇంట్లో ఐతే తమకు రక్షణ ఉంటుందనీ ఆ కాలనీలోని ముస్లింలందరూ ఏహ్సాన్ జాఫ్రీ గారి ఇంటికి వచ్చారు. అల్లరి మూకలు ఆ ఇంటిపై దాడి చేసి ఆ మాజీ ఎం.పీ తో సహా మొత్తం 97 మందిని చంపేశారు. మహిళల్ని గ్యాంగ్ రేప్ చేసి చంపారు.

4. అవధూత్ నగర్ కేసు : దాడులకు భయపడి, ముస్లింలు ఇల్లు ఖాలీ చేసి, పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. తరువాత, ఇంట్లోనుండి తినడానికి ఏమైనా సరుకులు, బట్టలు తెచ్చుకుందామని, పోలీసుల రక్షణలో కొందరు యువకులు తమ ఇళ్ళకు వెళ్ళారు. పోలీసుల ముందే ఇద్దరు యువకుల్ని అల్లరి మూకలు నరికి చంపారు.

5. ఎరాల్ కేస్ : పారిపోతున్న ఓ కుటుంబాన్ని వెంబడించి పట్టుకుని 5 మంది పురుషుల్ని చంపేశారు, 2 మహిళల్ని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు.
ఇవి మీడియా హైలేట్ చేసిన కొన్ని కేసులు మాత్రమే. మీడియా దృష్టికి రాని ఇలాంటి కేసులు అనేకం జరిగాయి. అధికారిక లెక్కల ప్రకారమే 1000 మందికి పైగా చంపబడ్డారు. చాలా సంఘటనల్లో పోలీసులు అల్లరి మూకల పక్షం వహించారు. కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. సాక్ష్యాల్ని రూపుమాపడంలో దగ్గరుండి సహకరించారు. క్రిమినల్ కేసుల్లో విచారణ ఎప్పుడూ కింది కోర్టుల్లోనే మొదలవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న కేసుల్లో, పోలీసులు,నిందితులు, బాధితుల పక్షం వహించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. వీరందరూ కుమ్మక్కు కావడంతో, కింది కోర్టుల్లో నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. (తరువాత మీడియా గగ్గోలు పెట్టడంతో, కొన్ని కేసుల్ని ముంబై కి బదలాయించారు. అక్కడ నేరం నిరూపించబడి, కొందరికి శిక్షలు పడ్డాయి. చాలా కేసుల్లో ఇప్పటికీ విచారణలు సాగుతున్నాయి. )

మైనారిటీ యువకుల ఫేక్ ఎంకౌంటర్లు :
===================================
ఎన్ కౌంటర్ – ఓ చట్ట వ్యతిరేక చర్య చేసేవ్యక్తిని/వ్యక్తుల్ని పట్టుకునే క్రమంలో ఆ వ్యక్తులు పోలీసులపై దాడులకు పాల్పడితే, పోలీసులు ప్రతి దాడులకు దిగడం.
ఫేక్ ఎంకౌంటర్ – నేరం చేశాడనే ఆరోపన మోపబడ్డ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతను పోలీసులపై దాడులకు పాల్పడే అవకాశం ఏ మాత్రం లేదు. అయినప్పటికీ పోలీసులతన్ని కాల్చి చంపి, తమపై దాడులకు పాల్పడితే, ఆత్మ రక్షణార్థం కాల్చామనీ, ఆ కాల్పుల్లో అతను చనిపోయాడనీ చెప్పడం, తరువాత ఈ వీరోచిత ఘణకార్యానికి ప్రతిగా, ప్రమోషన్లు, సత్కారాలూ పొందడం.
మన దేశంలో జనాల బ్రైన్లు ఎంతగా F**KED UP ( తెలుగులో ఇంత చక్కగా సరిపోయే, డీసెంట్ పదం తెలీదు) అయ్యాయంటే, ఎన్ కౌంటర్ అనగానే, అది రియలా, ఫేకా అనే దానితో సంబంధం లేకుండా ఆ చనిపోయిన వ్యక్తి చెడ్డోడనీ, చంపిన పోలీసాఫీసర్లు మహా ధైర్యవంతులనీ ఆటోమ్యాటిక్ గా జనం భావిస్తున్నారు. “ఫలానా ట్రాఫిక్ పోలీస్ నన్ను అన్యాయంగా తిట్టాడు, నా దగ్గర లంచం డిమాండ్ చేశాడు “- అని ఓ పోస్టు రాయగానే, వందలాది మంది, అవును మన పోలీసులింతే, వారు అవినీతిపరులు,కౄరులు అంటూ వారిని తిడుతూ, ఆ పోస్టుని అందరూ షేర్లు చేసి దానిని వైరల్ చేస్తారు. అలాంటిది, ‘మా పిల్లోన్ని ఇంట్లోనుండి ఎత్తుకెల్లి అన్యాయంగా ఎన్ కౌంటర్ చేశారని నెత్తీ,నోరూ బాదుకున్నా వినేవారు ఉండరు. దీనికి ప్రధాన కారణం – ఫేక్ ఎన్ కౌంటర్ లలో చనిపోయేది ముఖ్యంగా ముస్లింలు,దలితులు,ఆదివాసీలు ఇంకా బీద బిక్కీ జనాలే కాబట్టి.

గుజరాత్లో ఇలాంటి ఎన్ కౌంటర్లు 2002-2006 మధ్య 21 జరిగాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారీ, పోలీసులు, తాము టెర్రరిస్టులని మట్టుపెట్టామని, ఓ కట్టుకథని అల్లి మీడియా ముందు జబ్బలు చరుచుకోవడం, మెయిన్ స్ట్రీం మీడియా అదే కట్టు కథని చెప్పింది చెప్పినట్లుగా ప్రాపగేట్ చేయడం. ఇది ప్రతిసారీ జరిగింది. THE HINDU, తెహెల్కా లాంటి పత్రికలు మాత్రం దీవి వెనకున్న అనేక అణుమానాల్ని, చంపబడ్డ వారు అమాయకులని వాదించే కుటుంబ సభ్యుల ఆవేదనల్నీ కూడా ప్రచురించేవి. (తదనంతర కాలంలో వీటిలో చాలా ఎన్ కౌంటర్లు నకిలీవేననీ, చంపబడ్డ వారు అమాయకులేతప్ప టెర్రరిస్టులు కాదనీ, కోర్టుల్లో కూడా నిర్ధారణ అయ్యింది. కొందరు ఉన్నత స్థాయి పోలీసులు అరెస్టు కూడా చేయబడ్డారు. కానీ, 2014 మే నుండి పరిస్థితి తారుమారైంది. CBI ఒక్కో పోలీసధికారికీ క్లీన్ చిట్ ఇవ్వడం మొదలుపెట్టడంతో , వీరందరూ జైల్ల నుండీ రిలీజ్ అయి, మల్లీ ఇప్పుడు ఉద్యోగం వెలగబెడుతున్నారు. కొందరికి ప్రమోషన్లు కూడా లభించాయి. )

హరేన్ పాండ్యను ఎవరు చంపారు?
=============================
హరేన్ పాండ్యా – గుజరాత్ మాజీ హోం మంత్రి. 2002లో మోడీ క్యాబినేట్లో మంత్రి. గోధ్రా రైలు దహనం జరిగిన రోజు రాత్రి మోడి నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగిందనీ, దానిలో మరో 3 రోజులు ఏం జరిగినా పట్టించుకోకుండా చూసీ, చూడనట్లు వదిలేయాలని పోలీసు అధికారులకు చెప్పారని హరేన్ పాండ్యా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ( IPS అధికారి సంజీవ్ భట్, దీనిని దృవీకరించారు, తాను కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నట్లు చెప్పారు). 2003లో ఈయన హత్య చేయబడ్డారు. కేసు CBIకి అప్పగించారు. అప్పట్లో కేంద్రంలో NDA ఉండింది. CBI 12 మంది ముస్లిం యువకుల్ని పట్టుకుని, వారే ఈ హత్య చేశారని ప్రకటించింది. POTA కోర్టు కూడా వీరిని దోషులుగా నిర్ధారించి ఒక్కొక్కరికి పదేళ్ళ జైలు శీక్షల్ని విధించింది. అనంతరం వారు హైకోర్టులో అప్లై చేసుకుంటే, హై కోర్టు CBIని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, ఆ 12 మందికీ హత్యతో సంబంధం లేదని తీర్పునిచ్చింది. కానీ, అప్పటికే ఆ యువకులందరూ ఏ మాత్రం బెయిలు కూడా దొరక్కుండా సుమారు 6,7 సంవత్సరాలు జైల్లో గడిపారు.

ఇప్పుడు రెండు ప్రశ్నలు :
1. అసలు హరేన్ పాండ్యాను ఎవరు, ఎందుకు చంపారు? వారికి శిక్షలు లేనట్లేనా?
2. తప్పు చేయకపోయినా, ఆ 12 మంది యువకులు జైల్లో కోల్పోయిన జీవితాన్ని ఎవరు తిరిగి ఇప్పించగలరు, దానికి బాధ్యుల్ని శిక్షించేది ఎవరు?

ఇంతకీ గోధ్రాలో రైలు కు ఏమైంది?
==================================

గోధ్రాలో రైలు దహనం జరిగిన కొన్ని గంటల్లోనే , ఇది ముస్లింలపనేనని, BJP ప్రముఖ నాయకులు, మరియూ మీడియా డిక్లేర్ చేసేశాయి. అనంతరం ఏమయ్యిందో అందరికీ తెలిసిందే. అనేక సంవత్సరాల పరిశోధన అనంతరం, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)- ట్రైన్ కాల్చింది వీరే -అని ఓ 100 మందిని, వీరి నాయకుడు, మాస్టర్ మైండ్ -మౌల్వి సయీద్ ఉమర్ అని కోర్టుకు చెప్పారు. 2011 లో కింది కోర్టు తీర్పు వచ్చింది.ఆ కింది కోర్టు, మౌలి సయీద్ ఉమర్ ని నిర్దోషిగా వదిలేసింది. SIT చెప్పిన ఇతర నిందితుల్లోనుండి కొందరికి మరణ శిక్షలు, మరియు పదేసి సంవత్సరాలు విధైంచబడ్డాయి. అంటే, మాస్టర్ మైండ్ ఎవరో తెలీదు, ఎవరు ప్లాన్ వేశారో, నిప్పు ఎవరు పెట్టారో తెలీదు – కానీ కొందరికి మాత్రం శిక్షలు పడ్డాయన్నట్లు. దీనిని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో వారి ఇష్టం. అనంతరం గుజరాత్ హైకోర్టు కూడా – మాష్టర్ మైండ్ గా SIT ప్రొజెక్ట్ చేసిన మౌల్వి సయీద్ ఉమర్ ని నిర్దోషిగా ప్రకటించింది. కింది కోర్టు విధించిన శిక్షల్ని తగ్గించి , మరణ శిక్షల్ని – యావజ్జీవిత శిక్షలుగా మార్చింది.

సరే, ఇప్పుడు అసలు విషయం చూడండి.

Forensic Studies Laboratory at Gandhinagar, Gujarat వారి రిపోర్టు ప్రకారం, “అక్కడ దొరికిన ఆధారాల్ని బట్టి – ఆ రైలు పెట్టెలోపల, సీట్ నంబర్ 72 దగ్గర నిలబడి పెటోలును ట్రైన్లో జల్లి లోపలినుండే నిప్పుపెట్టారు తప్ప, మంటలు బయటి నుండీ వచ్చే అవకాశం లేదు. ” ఇదీ ఫోరెన్సిక్ వారు ఇచ్చిన రిపోర్టు.

ఇంతకీ అసలు ఏమైంది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? గుజరాత్ని గత 20ఏళ్ళుగా పాలిస్తున్నది ఎవరు? అక్కడేం జరిగిందో తెలీకుండానే కొన్ని వేల మంది జనం కిరాతకంగా చంపబడ్డారు. కొన్ని లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఇది ఎవరి వైఫల్యం.
2014లో దేశం నెత్తిన పెట్టుకున్న గుజరాత్ మోడల్ వెనుక ఇన్ని సమాధానం లేని ప్రశ్నలున్నాయి. ‘సత్యమేవ జయతే’ మీద అప్పటికీ ఏ చిన్న ఆశో మిగిలిఉండటం వల్ల, సత్యం గెలుస్తొందేమోనని 2002 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలప్పుడూ ఎదురు చూశాను, తర్వాత 2007 లో, మళ్ళీ 2012లో ప్రతిసారీ సత్యం అభాసుపాలవుతూనే ఉంది. అయినా అసలు సత్యం అనేది ఒకటుంటే కదా? ఉండేదంతా కేవలం మీడియా మ్యానేజ్మెంట్. మీడియాను దువ్వడం బాగా వచ్చి ఉండి, జనాన్ని ఎవరు ఎక్కువ వెర్రిబాగోల్లను చేస్తే వారే గెలిచినట్లు. ఆ గెలిచినోళ్ళు చెప్పేదే సత్యం.

వీటి గురించి చాలామందికి తెలిసే ఉండవచ్చు. చాలామంది ఈ వార్తల్ని చదివే ఉండవచ్చు. కానీ, ఆ తర్వాత వారు రొటీన్ గా స్పోర్ట్స్ పేజీకి, ఆ తర్వాత సినిమా పేజీకి వెల్లి ఆ తర్వాత పేపర్ మడిచి పెట్టి ఆ విషయాల్ని మర్చిపోయి ఉండవచ్చు. కానీ, నన్ను మాత్రం ఈ ప్రశ్నలు/సందేహాలు చాలా కాలం పాటు వెంటాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే, అక్కడ చంపబడింది నాలాంటి వారే. కేవలం నా లాంటి పేర్లు కల వారే. వారు అల్లాను,స్వర్గం-నరకాల్ని నమ్మే వారా కాదా అని చూడలేదు. కేవలం ముస్లిం పేరు. అది ఉంటే చాలు. 4 నెలల పసివాడైనా చావుకు అర్హుడే, 9 నెలల గర్భవతి ఐనా సరే ముస్లిం మహిళైతే చాలు, రేపుకు, చావుకు అర్హురాలే. పోలీసులు చూస్తూ కూడా ఏమీ చేయరు.మిలిట్రీ పక్కనే ఉన్నా కూడా వారికి ఆర్డర్స్ రావు. చట్టం గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఇక నేను చిన్నప్పటి నుండీ వింటూ పెరిగిన ‘సత్యమేవ జయతే’ , ‘మానవులందరూ సమానమే’, ‘చట్టం అందరికీ సమానమే, మంచోల్లకు మంచే జరుగుతుంది, ఇతరులకు కీడు కలిగించరాదు’ లాంటి వాక్యాలకు అర్థం ఏముంది?

The Search Continues..

Leave a Reply

Your email address will not be published.