పాలిటిక్స్ #1 : ఇండియా ఇట్లెందుకుంది…?

సీన్ #1
ఐర్లాండ్ లో పని చేస్తున్నప్పుడు, ఓ సారి మా టీం మొత్తం పిక్ నిక్ కి వెళ్ళాము. మాతో పాటు టీంలో ఉన్న కొందరు ఐరిష్ దేశస్తులు కూడా వచ్చారు. అదొక రిమోట్ కొండ ప్రాంతం. అక్కడ టూర్లో ఉండగా , మన ఇండియన్ వ్యక్తి ఓ చాకోలెట్ తిని, ఆ చాకోలెట్ చుట్టిన రాపర్ పేపర్ రోడ్డు పక్క పడేసాడు. అది ఊరు బయట కాబట్టి, అక్కడ దగ్గర్లో డస్ట్ బిన్ లేవి లేవు కాబట్టీ, మా మిగతా ఇండియన్స్ ఎవరికీ అదసలు ఓ ఇష్యు లా అనిపించలేదు. కానీ, దానిని దూరం నుండి చూసిన ఓ ఐరిష్ దేశస్తుడు, మా దగ్గరికి వఛ్చి, ఆ రాపర్ పడేసిన వ్యక్తివైపు ఓ రకమైన చూపు కసి, ఆ రాపర్ పేపర్ ని తీసి, జేబులో పెట్టుకుని వెళ్ళాడు. బహుశా, డస్ట్ బిన్ కనబడే వరకూ జేబులో పెట్టుకుని తర్వాత దాన్లో పడేసాడనుకుంటా.


అంటే, మన దేశంలో వ్యక్తులకు కొన్ని సెంట్లు, గుంటలు , ఎకరాలు భూమి ఉంటుంది. అది మాత్రమే మనది. ఆ భూమిలో పక్కోడు అడుగు పెట్టకుండా చూసుకోవడమే మన లక్ష్యం . కానీ, యూరప్‌లో , దేశమంతా ఆ దేశస్తులదే. ఈ దేశం నాది అనే ఫిలింగ్ వారిలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ తేడా ఎందుకనే విషయం తర్వాత మాట్లాడుకుందాం.

సీన్#2
మరో సందర్భంలో, ఓ సారి, నేను మరో కొలీగ్ కి తోడుగా ఓ ఆప్టిసియన్ ( కళ్లద్దాలు షాపు) దగ్గరికి వెళ్ళాము. అక్కడున్న ఆవిడ వివిధ రేట్ల కల్లద్దాలు చూపించింది. ఆఫిస్ లో దొంగ బిల్లులు పెట్టడంలో ఎక్స్పర్ట్ ఐన ఆ కొలీగ్, నేను తక్కువ రేట్ వి తీసుకుంటాను, ఎక్కువ యూరోలు బిల్లులో వేసి ఇస్తావా అని క్యాజువల్ గా అడిగాడు. ఇతను ఏఁ అడుగుతున్నాడో అర్థం చేసుకోవడానికి ఆమెకు కాస్త టైం పట్టింది. అర్థమవ్వంగానే, ఆమె ఫెసులో ఒక్కసారి ఎక్స్ప్రెషన్లు మారిపోయాయి. ఇట్’స్ ఆ క్రైమ్ అండ్ నాట్ కరెక్ట్ , అని సీరియస్ గా చెప్పి, అద్దాలన్నీ లోపల పెట్టేసింది. మీకు అమ్మను, ఇక బయలు దేరండి అని చెప్పకనే చెప్పిందన్నట్లు.

అదో చిన్న షాపు . ఆమెకు కూడా రూల్స్ గురించి అంత పట్టింపు ఎందుకు. ఆ మాత్రం దానికే వఛ్చిన బేరం వదులుకుంటారా? అక్కడంతే.. ముందు రూల్స్.. తర్వాతే అన్నీ. ఎందుకనేది తర్వాత మాట్లాడుకుందాం.

సీన్ #3 :
స్టీఫెన్ కానర్ అని మా లైన్ మేనేజర్ ఒకాయన ఉండేవాడు. స్వీడన్ దేశస్తుడు. పార్కింగ్ ప్లేస్ లో, ఓ అందమైన తెల్ల పోరి తో సిగరెట్ తాగుతూ కబుర్లాడుకుంటుండటం కొన్ని సార్లు చూసాను. ఏదో , వేరే టీం అమ్మాయేమోలే అనుకున్నాను.
అక్కడ ఆఫీస్ టాయిలెట్లు క్లిన్ చేయడానికి ఓ థర్డ్ పార్టీ కంపెనీ వాళ్ళు వస్తుంటారు. వారికో ప్రత్యేక గది, తమ క్లినింగ్ సరంజామా పెట్టుకోవడానికి ఓ తోపుడు బండి లాంటిది ఉంటుంది. మగాళ్ల టాయిలెట్లు కేవలం మొగోల్లే కడగాలి, లేడీస్ టాయిలెట్లు లేడిసే కడగాలి లాంటి నియమాలు కూడా ఏమి ఉండవు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లవ్స్, ఫైర్ సర్వీస్ వారిలాగా యూనిఫారం వేసుకుని, తమ తోపుడు బండిని టాయ్‌లెట్ ముందు ఆపి, “క్లినింగ్ ఇన్ ప్రోగ్రెస్” అనే చిన్న బోర్డు ఒకటి అక్కడ పెడ్తారు. అంటే , కాసేపు ఆ టాయ్‌లెట్ కాకుండా, వేరేవి వాడుకోండని అర్థం. కాసేపు తర్వాత వారు తమ క్లినింగ్ పని చేసుకుని వెళ్ళిపోతారు.

కొన్నిరోజుల తర్వాత – మా మేనేజర్‌తో కబుర్లు చెప్పే అమ్మాయి, ఈ టాయ్‌లెట్ మెయింటెనెన్స్ అమ్మాయి ఒక్కటే అని తెలిసి, కాసింత ఆశ్చర్యమేసింది. ఇంకా తెలిసిన విషయాలేంటంటే – ఆమె అదేదో మాంచి మాడల్ కార్లో ఆఫీస్ కి వచ్ఛేది. మా మేనేజర్ , ఈవిడ యిద్దరూ నైబర్స్ కూడా .
దీనికంతటికి కారణం – అక్కడున్న మినిమమ్ వేజెస్ అనే కాన్స్పెట్. అంటే, చేసే పనితో సంబంధం లేకుండా , ఎలాంటి పనికైనా, పని చేయించుకునే వారు మినిమమ్ ఇంత జీతం ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది. ఎలాంటి కంపెనీ అయినా, చిన్న షాప్ అయినా ఈ నియమానికి కట్టుబడి జీతాలు చెలించాల్సి ఉంటుంది. ఆ మినిమమ్ వెజ్ అనేది – ఓ చిన్న కుటుంబం చక్కగా, సౌకర్యవంతంగా బతకడానికి నెలకు ఎంత కావాలో లెక్కగట్టి మరీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. బతకడానికి ఏదో ఓ పని చేయాలి తప్ప, పనుల్లో ఎక్కువ,తక్కువ లు ఉండవనే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది అక్కడ ఎలాగూ ఉంది. ఇదంతా ఎలా వచ్చిందో, మన దగ్గర ఎందుకు లేదో తర్వాత మాట్లాడుకుందాం.

సీన్#4
ఐర్లాండ్ లోను, యూరప్ లోని అనేక ప్రాంతాల్లోనూ, సైనికుల స్థూపాలు, యూనిఫామ్ తొడుక్కున్న వ్యక్తుల సింబాలిక్ విగ్రహాలు విరివిగా, అనేక కూడళ్లలో దర్శనమిస్తుంటాయి. క్యూరియాసిటీ కొద్దీ, అవి ఎవరివి, వాటి హిస్టరీ ఏంటి , వంటి విషయాల గురించి అక్కడి లోకల్స్ తో అడిగి తెలుసుకునేవాణ్ణి. అవన్నీ, తమ దేశం తరుపున వివిధ యుద్ధాల్లో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం పెట్టిన విగ్రహాలు. ఇన్ని విగ్రహాలు ఎందుకూ అంటే- అలా యుద్ధంలో పాల్గొని మరణించిన, లేక అవిటివారైన వారు దాదాపు ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరైనా ఉంటారట. ప్రతి వ్యక్తికీ, అతని తండ్రో, తాతో, ముత్తాతో ఎవరో ఒకరు అలా దేశం తరుపున యుద్ధం లో పాల్గొన్న అనుభవం ఉన్నవారు వుండే ఉంటారు.

ఈ నాలుగో విషయం తెలుసుకున్నాక, నాకు పై అన్ని విషయాల్లోని లాజిక్ , మన ఇండియాకి ఆ దేశాలకు ఉన్న ప్రధాన తేడా అర్థమైంది.

ఆయా దేశాల్లో , దేశమంటే – “మనుషులూ – ఆ మనుషులు స్వయంగా రాసుకున్న రూల్సూ” అని అర్థం. అంటే ప్రతిఒక్కరికి దేశం పట్ల హక్కు, బాధ్యత రెండూ సమపాళ్లలో ఉంటాయి. ఇది ఎలా వచ్చింది? నాల్గో పాయింట్లో చెప్పినట్లు -యుద్ధాల వల్ల. ప్రతి వ్యక్తికీ, తన తండ్రో, తాతో ఈ దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడాడు అని తెలిసాక, ఆ దేశంపై హక్కు, దాని వెనకాలే బాధ్యత ఆటోమెటికగ్గా వస్తాయి.

ఇక నా విషయానికే వస్తే.. గతంలో “నేను-మా జేజబ్బ – పాకిస్తాన్” అనే వ్యాసం లో రాసినట్లు, మా తాత ఓ దళిత వ్యవసాయ దినసరి కూలి. మా నాన్న ఓ చిన్న అటెండరు ఉద్యోగం. అక్షరాలు నేర్చుకున్నోళ్ళు, ఆయుధం తీసుకుని దేశం తరుపున యుద్ధం చేసినోళ్లెవరూ మా పూర్వీకుల్లో ఉండే అవకాశమే లేదు. ఎందుకలా? భయమా? కాదు. వారికా అర్హతే లేదుగా. అగ్రకులపోడి ఎదుట నిటారుగా నిలబడి మాట్లాడే అర్హతే లేని వ్యక్తి – ఇక గుర్రమెక్కి, ఆయుధం పట్టి యుద్ధం చేయడమా..

దేశంలోని ముప్పావు వంతు జనాభాది, కొన్ని వందలు,వేల సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి. జీవితకాలమంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డా, చివరికి వీరికి మిగిలింది ఓ పూరి గుడిసె. ఆ గుడిసె మాత్రమే వీరిది. అంతకు మించి, మిగతా దేశంతో, దేశ సంపదతో వీరికి ఎలాంటి సంబంధము లేదు. ఏ రాజు తరుపున వీరు పోరాడింది లేదు. చివరికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్రోద్యమంలో కూడా వీరి పాత్ర పెద్దగా లేదు. పూరి గుడిసె తప్ప, ఇంకేమి లేనోడి దగ్గరినుండి బ్రిటీషోడు దోచుకునేదేముంది.

1947 తర్వాత..?
పోనీ స్వాతంత్ర్యానంతరం ఈ పరిస్థితి మారిందా అంటే, అదీ లేదు. గరిష్ట భూపరిమితి, పేదలకు భూపంపిణీ వంటి చట్టాలన్నీ కామెడీగా మిగిలిపోయాయి. ఎందుకంటే, ఆ చట్టాల్ని తేవాల్సినోళ్లు, వాటిని అమలు చేయాల్సినోళ్లు… అందరూ అప్పటివరకూ ఆ సంపదను అనుభవిస్తున్నవారే.. తమ ఆధిపత్యానికి గండి కొట్టుకునే పనులు తామే చేయాలని ఆశించడం కూడా అత్యాశే కదా..

మొత్తానికి ప్రస్తుతము మన మైండ్ సెట్ ఎలా ఉందంటే – డబ్బు,అధికారం కేవలం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అయిఉన్నాయి. వాటిని భద్రంగా కాపాడు కోవడం, తమ తర్వాతి తరానికి అందివ్వడం వీరి లక్ష్యం. ఇవేవి లేని వర్గాలకు, ఎలాగోలా వాటిని సంపాదించుకోవడమే లక్ష్యం. ఇక్కడ చట్టం, కలెక్టివ్ ఇంట్రెస్ట్ వంటి పదాలు గ్రహాంతర వాసుల్లాంటివి. వాటి గురించి పుస్తకాల్లో చదవడమే తప్ప, ఎక్కడా కనిపించవు. ప్రభుత్వాఫీసు దగ్గరో, మీసేవ లోనో, బ్యాంకులోనో పది మంది క్యూలో నిరీక్షిస్తూ నిలబడి ఉంటారు. ఒకడెవడో పెద్ద మనిషి టిప్ టాప్ గా, కార్లో వఛ్చి నేరుగా మేనేజర్/పై అధికారి రూమ్‌లోకి వెళ్తాడు. క్యూలో నిల్చోకుండా తన పని కానిచ్చుఁకుని వెళ్ళిపోతాడు. క్యూలో ఉన్న పది మందికీ ఆ పెద్ద మనిషిని చూసి జలసీ. మన పరిష్టితి ఇలా లేకపాయెనే అని బాధ. చూసావా, బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే , అలా దర్జాగా బతకొచ్చు అని అతనో వీరునిగా చూస్తారు. ఆయనకేంలేరా.. కాలుమీద కాలేసుకుని సంపాదిస్తున్నాడు అనేది చాలా కామన్ గా వాడే మాట. అంటే, ఎంత తక్కువ పని చేసి, ఎక్కువ సౌఖ్యాలు అనుభవిస్తే అంత గ్రేట్ అన్న మాట. ఇదీ మన సామాజిక వ్యవస్థ. గత డెబ్భై ఏళ్లలో సాగిన పాలన మొత్తం – ఈ నిచ్ఛేన మెట్ల వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడదనేదే లక్ష్యంగా పనిచేసింది. రిజర్వేషన్లు కొంచెం ప్రభావం చూపడం మొదలవ్వగానే, 1990 ఆర్ధిక సంస్కరణలు వఛ్చి కంట్రోల్ మొత్తం ప్రభుత్వం చేతిలోనుండి, ప్రయివేట్ కి బదలాయించబడ్డాయి. ప్రయివేటు రంగంలో కావలసిన ప్రధాన వనరు – పెట్టుబడి. ఇది ఎవరిదగ్గరుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మొత్తం మీద – మనదేశం ఇట్లెందుకుంది అని – ఓ తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇలా తప్ప, ఇంకోలా ఉండే ఆస్కారమే లేదు.

– మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.