ప్రవక్తకు అవమానం – వివిధ స్పందనలు

మా పాత టీమ్‌లో ఒకడుండేవాడు. అతన్ని ఒక్కమాటలో “టెక్నికల్ తోపు” అనొచ్చు. మిగతా వాళ్ళు సాల్వ్ చేయలేమని చేతులెత్తేసిన కాంప్లికేటెడ్ ఇష్యూస్ ని కూడా, అతను ఓ గంట లో సాల్వ్ చేయగలడు, అంత మేధావి. ‘360 డిగ్రీ అనాలిసిస్’ అనే పదానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అతను.

నేను బుక్ రాశానని వేరే ఫ్రెండ్ వల్ల తెలిసిందంట, దాని గురించి మాట్లాడటానికి మొన్నోసారి కాల్ చేశాడు. బుక్ రాసినందుకు కంగ్రాక్ట్స్ చెప్పి, వేరే కుశల ప్రశ్నలయ్యాక, “ఇంతకీ బుక్ దేనిగురించి” అని అడిగాడు.

కంప్యూటర్ కోడ్ తప్ప బయటి ప్రపంచం తెలీని అమాయకుడు – ఇతనికి సీరియస్ విషయాలు చెప్పి కన్‌ఫ్యూజ్ చేయడం ఎందుకులెమ్మని- “నాస్తికత్వం-వ్యక్తివాదం-ఇస్లాం.. ఇలా ఏవో సీరియస్ ఫిలసాఫికల్ మ్యాటర్స్ లెండి, మీకు అవి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు”- అన్నాను.

దానికతను, “లేదు,లేదు నాకు అవంటే చాలా ఇంట్రెస్ట్. నేను సద్గురు జగ్గీవాసుదేవ్ స్పీచెస్ అన్నీ ఫాలో అవుతుంటా. అవన్నీ ఎక్సలెంట్ గా ఉంటాయి. మీరెప్పుడూ వినలేదా..?” – అన్నాడు.
“తెలుసు.. ఇషా ఫౌండేషన్ ఆయనదే కదా” – అన్నాను.
అవును. ఆయన జీనియస్, లెజెండ్.. అని తన్మయత్వంతో ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ పోయాడు.
ఒక నిమిషం వినగానే, ఇక ఉండబట్టలేక, “ఆయనకు పెళ్ళైందా” అని అడిగాను.
“హ్హ్మ్.. ఆయన యోగి కదా, పెళ్ళి అవలేదనుకుంటా, యోగులు పెళ్ళి చేసుకోరు” -అన్నాడు.

ఆయన భార్య అనుమానాస్పదంగా చనిపోయిన విషయం ఇతనికి తెలుసోలేదో కనుక్కుందామని అడిగితే, అసలు పెళ్ళేకాలేదనే భ్రమలో ఉన్నాడు. ఇక ఇతనితో ఈ విషయం గురించి మాట్లాడటం వేస్ట్ అనిపించి, సైలెంట్ గా అతను చెప్పింది విని లైట్ తీసుకున్నాను.
ఏదో ఓ విషయంలో జీనియస్ గా, Skillful గా ఉన్నోల్లు, ఇతర విషయాల్లో అమాయకులుగా, మూర్ఖులుగా ఉండటం అనే ఫెనామినా రోజూ చూస్తూనే ఉండటం వల్ల, అతను నాకేమీ వింతగా అనిపించలేదు.

ఇప్పుడు అతని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే – మనకళ్ళముందే తిరుగుతూ, వీఐపీ గా చెలామనీ అయ్యే ఓ వ్యక్తికి సంబంధించిన రెండు దశాబ్ధాల క్రితం నాటి అన్-కంఫర్టబుల్ ట్రూత్స్, సోషల్ మీడియా ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లోనే చాలా మందికి తెలియవు. తెలియకుండా మ్యానేజ్ చేశారు. ఇంకో ఒకటి,రెండు తరాల తర్వాత అలాంటి విషయాలు పర్మనెంట్ గా భూస్థాపితం అవుతాయి.

అంతెందుకు, చక్కగా ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకుని, కొన్నాల్లు కాపురం కూడా చేసి, తరువాత చెప్పా,పెట్టకుండా ఇళ్ళొదిలిపారిపోయిన ఓ ప్రభుద్దుడు, దేశానికి సేవచేయడం కోసం అసలు పెళ్ళే చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసిన మహా నాయకుడుగా ఇప్పుడు చలామనీ అవుతున్నాడు.

రాయలసీమలో, తన సొంత ఆశ్రమంలోనే ఎంక్వైరీ అధికారులు శవాలుగా మారిన ఓ బాబా పేరు ఇప్పుడు ఏకంగా ఓ జిల్లాకే పెట్టేసారు. ఆయన వేయించిన పైప్లైన్ లు మాత్రమే అన్నిచోట్లా హైలైట్ అవుతాయి తప్ప, ఈ అక్రమాల గురించి జనం దాదాపుగా మర్చిపోయారు.

ఇవన్నీ ప్రస్తుతం మనం స్వయంగా చూస్తున్న కఠిన వాస్తవాలు. తమ నాయకులకు సంబంధించిన అన్‌కంఫర్టబుల్ నిజాల్ని అనుచరులు కాలక్రమంలో భూస్తాపితం చేస్తారనేది చరిత్ర చెప్పిన సత్యం.

మహమ్మద్ ప్రవక్త విషయమే తీసుకుంటే – ఆయన నిన్నో,మొన్నో, నిన్నటి తరంలోనో, మొన్నటి తరంలోనో జీవించిన వ్యక్తి కాదు. అక్షరాలా 1450 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి. కానీ, ఈ భూమిపై ఏ ఇతర వ్యక్తికీ లేనంతగా ఆయన గురించిన అనేక విషయాలు, ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలు హదీసు గ్రంధాల్లో రికార్డ్ చేయబడి ఉన్నాయి. బుఖారీ, ముస్లిం, అబు దావూద్, తిర్మిది, నసాయి,ఇబ్న్ మాజా.. అనే ఆరుగురు చరిత్రకారులు ప్రవక్తకు జీవితానికి సంబంధించిన విషయాల్ని విడివిడిగా రికార్డ్(గ్రంధస్థం) చేశారు.

కానీ, ఈ రికార్డ్ చేయడం అనే ప్రక్రియ ప్రవక్త జీవితకాలంలో జరిగింది కాదు. ఆయన మరణించిన 150-250 సంవత్సరాల మధ్య ఈ ప్రక్రియ జరిగింది. “ప్రవక్త చెప్పగా, ఫలానా వ్యక్తి విని, ఆయన ద్వారా ఫలానా వ్యక్తి విని, ఆయన ద్వారా నేను రికార్డ్ చేయడం జరిగింది”- అని గానీ, లేకపోతే, “ప్రవక్తకు సన్నిహతమైన ఫలానా వ్యక్తి ఫలానా విషయాన్ని, ఫలానా వ్యక్తికి చెప్తే, ఆయన ద్వారా ఫలానా వ్యక్తికి, ఆయన ద్వారా నాకు తెలిసింది” .. ఇలా జరిగింది హదీసు పుస్తకాల సేకరణ.

అబూ బుఖారీ అనే ఆయన, కేవలం ప్రవక్తకు సంబంధించిన విషయసేకరణ మాత్రమే కాకుండా, ఆ మధ్యలో ఉన్న, ఫలానా,ఫలానా వ్యక్తులు ఎవరు, వారి నడవడిక,జీవన విధానం ఎలా ఉండింది, వారు నమ్మదగిన వ్యక్తులా,కాదా, ఒక వ్యక్తి ప్రవక్త ఫలానా విషయం చెప్పారని చెప్తే, దానిని నిర్ధారించే వేరే వ్యక్తులు ఎవరెవరున్నారు- ఇలాంటి అంశాలన్నిటినీ జాగ్రత్తగా పరిశొధించి, చైన్ ఆఫ్ న్యారేషన్ లోని ప్రతి లింక్ నీ అనలైజ్ చేసి, ఆ వివరాల్ని గ్రంధస్థం చేశారు. ఈ వివరాల ఆధారంగా, ఆయన సేకరించిన సమాచారం నుండీ, “ఇది నిజమే అయ్యే అవకాశం ఎక్కువుంది”, “ఇది నిజమే అయ్యుండే అవకాశం తక్కువుంది”, అంటూ వివిధ రకాలుగా వర్గీకరించారు. దీని వల్ల ఆయన సేకరణలను ప్రామాణికమైనవిగా చాలా మంది భావిస్తున్నారు.

మొత్తానికి ప్రవక్త కాలానికీ, ఈ సేకరణ కాలానికి ఉన్న టైమ్ గ్యాప్ కారణంగా తేదీల విషయంలో కొన్నిసార్లు కాన్‌ఫ్లిక్టింగ్ వెర్షన్స్ రికార్డ్ చేయబడటం జరిగింది. పైన చెప్పిన ఆరుగురు చరిత్ర కారులమధ్యే కాకుండా, ఒక్కోసారి వారు స్వయంగా రికార్డ్ చేసిన విషయాల్లోనే కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్న విషయం కూడా గమనించొచ్చు.

**********

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే- మహమ్మద్ ప్రవక్తను పొగిడేవారికి, ఆయనను విమర్శించేవారికీ ఇద్దరికీ ఇప్పుడు హదీసు గ్రంధాలే ప్రామాణికం. జనరల్ గా ఓ వ్యక్తికి సంబంధించిన నెగెటివ్ విషయాల్ని అతని ప్రత్యర్థులో,తటస్థులో రికార్డ్/ప్రాపగేట్ చేస్తారు. కానీ, మహమ్మద్ ప్రవక్త డైహార్డ్ అనుచరులు రికార్డ్ చేసిన విషయాల్నే ఆయనకు వ్యతిరేకంగా ఉపయోగించడం అనేది – ఓ వింత ధోరణి. కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే, ఈ ధోరణి ఎందుకు, ఎలా పెచ్చరిల్లుతోందనే విషయం అర్థమవుతుంది.

ప్రవక్తపై వచ్చే విమర్శలు, వివిధ కాలాల్లో మారుతూ ఉండటం మరో ఆసక్తికర అంశం. ఉదాహరణకు, ప్రవక్త కాలంలో ఆయనను చంపాలని ప్రయత్నించిన, ఆయన మక్కా నుండీ మదీనాకు వలసపోవడానికి కారణమైన ఖురైష్ లు ప్రవక్తను మంత్రగాడనీ, సాతాను తరుపున మాట్లాడుతున్నాడనీ విమర్శించారు తప్ప, ఆయనను స్త్రీలోలుడనిగానీ, చిన్నపిల్లను పెళ్ళిచేసుకున్నాడని గానీ పొరబాటున కూడా అన్నట్లు ఎక్కడా లేదు. ఎందుకంటే, అది ఆ రోజుల్లో అందరూ చేసే, అతి సాధారణ విషయమే కాబట్టి.

అట్లే,13-16 శతాబ్ధాల మధ్య జరిగిన క్రూసేడుల తర్వాత, క్రైస్తవ చరిత్రకారులు ప్రవక్తను యుద్ధపిపాసిగా, మదీనాలోని యూదుల్ని హత్య/రాజ్యబహిష్కారం చేయించిన హింసాత్మక వ్యక్తిగా విమర్శించారు. కానీ, అంతకు ముందెప్పుడూ ప్రవక్తపై ఈ విమర్శలేదు. ఎందుకంటే, దానికి ముందు తరాల క్రైస్తవ విశ్లేషకులు, ప్రవక్తను కేవలం తమపై యుద్ధానికి వచ్చేవారితో ఆత్మరక్షణార్థం తలపడిన వ్యక్తిగానే చూశారు కాబట్టి. అప్పటివరకూ క్రైస్తవ చరిత్రకారులు ప్రవక్తపై చేసిన ప్రధాన ఆరోపణ, -ఆయన బైబిల్ లోని వాక్యాలు, చారిత్రక సంగతులు కాపీ కొట్టి వాటినే ఖురాన్ గా చెప్పారనేది మాత్రమే. అట్లే, మదీనాలోని యూదుల హత్య/రాజ్యబహిష్కరణ కూడా, మదీనా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి శత్రుసైన్యాలతో తెరవెనుక ఒప్పందం చేసుకున్నందుకు పడిన శిక్షగానే చూశారు తప్ప, పనిగట్టుకుని చేసిన అణచివేత చర్యగా దానిని చూడలేదు. క్రైస్తవ-ముస్లిం రాజ్యాల మధ్య జరిగిన క్రూసేడులు మొత్తం దృష్టికోణాన్నే మార్చేశాయి.

హదీసు గ్రంధాల్లో ఆయేషా(ర.అ) గారి వయసు విషయంలో ఉన్న అస్పష్టతను, ప్రవక్తపై ఓ జుగుప్సాకర విమర్శగా మార్చవచ్చనే విషయం 19 వ శతాబ్ధం వరకూ ఎవ్వరికీ తట్టలేనేదు. ఎందుకంటే, అప్పటివరకూ ప్రతి దేశం,ప్రతి సంస్కృతిలోనూ అది అత్యంత మామూలు విషయం కాబట్టి. కానీ, ఆధునిక విద్యావ్యవస్థ కారణంగా పెరిగిన యువతీ,యువకుల వివాహవయస్సు, మరియు ప్రతి దేశమూ తయారు చేసుకున్న ‘కనీస వివాహ వయస్సు’ వంటి చట్టాల కారణంగా, తక్కువ వయసున్న బాలికను ఎక్కువ వయసులో ఉన్న ప్రవక్త పెళ్ళి చేసుకోవడం అనే ‘మందుగుండు ముడి సరుకును, ఇస్లామోఫోబిక్ అజెండాలో భాగంగా జనంలోకి వదిలారు. Well-Known ఇస్లామోఫోబులే కాకుండా, తమనుతాము తటస్థులుగా పిలుచుకునే సో కాల్డ్ లిబరల్ మేధావులు కూడా ఈ ప్రాపగాండాకు సింక్ అయ్యారనేవిషయం వారిరాతల్తో తెలుస్తూనే ఉంటుంది.

ప్రవక్త సెక్సువల్ కోరికలు,పర్వర్షన్స్ కారణంగానే అన్ని పెళ్ళిల్లు చేసుకున్నారా,కాదా అనే విషయం నిర్ధారించుకోవడం, ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఏ మాత్రం కష్టసాధ్యమైన విషయం కాదు. 25 ఏళ్ళ వయసులో, తనకంటే చాలా ఎక్కువ వయసున్న(సుమారు 40సంవత్సరాలు. ఆమె వయస్సు అంత ఎక్కువ ఉండకపోవచ్చనీ, 30-35 మధ్య ఉండొచ్చనే వాదన కూడా ఉంది) , అప్పటికే ఇద్దరు భర్తలు మరణించి ఉన్న ఓ విధవరాలిని(ఖదీజా(ర.అ)) పెళ్ళి చేసుకుని, వృద్ధాప్యం కారణంగా ఆమె మరణించేవరకూ మరో మహిళను పెళ్ళి చేసుకోకుండా, ఆమెతో అత్యంత అన్యోన్యంగా జీవించిన వ్యక్తిపై ఇలాంటి అపవాదు వేయడం దారుణం.

ఖదీజా గారి మరణానంతరం ప్రవక్త చేసుకున్న వివాహాల్లో ఆయేషా(ర.అ) గారు తప్ప, మిగతా అందరూ విధవలూ,విడాకులు తీసుకుని ఉన్నవారే. ప్రవక్త మిగతా భార్యలతో పోల్చితే, ఆయేషా(ర.అ) గారి వయస్సు తక్కువే కానీ,అలాగని మరీ ఆరో,తొమ్మిదో కాదనీ, 10-14 మధ్య ఉండొచ్చని, వయసు ఎంతున్నా,అప్పటి సాంప్రదాయం ప్రకారం ఆమె మెచ్యూరిటీకి రాకముందు వివాహ ఒప్పందం, మెచ్యూరిటీ తరువాత, యాక్చువల్ వివాహం జరిగిందని కొన్ని వాదనలూ…. పెళ్ళి నాటికి ఆమె వయసు 19సం, అని కొన్ని వాదనలూ ఉన్నాయి. ప్రతివాదనకూ ప్రూఫులుగా హదీసు వాక్యాలూ,ఇంటర్ప్రెటేషన్లూ ఉన్నాయి. నిజానిజాలు అల్లాహ్ కే ఎరుక.

ఇస్లామోఫోబులు ఇప్పుడు కోట్ చేస్తున్న హదీసుల్లోనే, మహమ్మద్ ప్రవక్త మహోన్నత వ్యక్తిత్వాన్ని క్రిస్టల్ క్లియర్ గా నిరూపించే దృష్టాంతాలు కోకొల్లల్లుగా ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే ఆసక్తీ,ఓపికా,తీరికా లేకుండా, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, ఈ ఒక్క అంశం ఆధారంగా ప్రవక్త వ్యక్తిత్వం గురించి జడ్జిమెంట్లు ఇచ్చే “లో-లైఫ్” బతుకులపై సానుభూతి చూపడం తప్ప, ఎవరేం చేయగలరు.
*******

“ప్రవక్త గురించి బీజేపీ అధికార ప్రతినిధి ఏం వాగుతుందో చూడండి”- అని, పదిరోజుల క్రితం ఒక ఫేస్ బుక్ మిత్రుడు ఆ వీడియోను షేర్ చేశాడు. దానిని ఓ ఐదు సెకన్లు చూశాను. దాన్లో, “ఛే సాల్, ఛే సాల్ కి బచ్చి” అని ఆమె ఏదో అంటుంది, ఆ తర్వాత ఆమె ఏం చెప్పి ఉంటుందో నాకు అర్థమైంది. ఈ విమర్శ ఎప్పటినుండో ఉన్నదే కాబట్టి, నాకేమీ బాధ,కోపం కలగలేదు. పైగా, ఆ చెప్పే ఆమె బీజేపీ అధికార ప్రతినిధి కాబట్టి, ఆశ్చర్యం కూడా కలగలేదు. వారినుండీ మంచి కామెంట్లు ఎక్స్ పెక్ట్ చేసేవారు ఎవరైనా ఉన్నారా? మొత్తానికి, ఐదు సెకన్లు ఆ వీడియో చూసి దానిని ఇగ్నోర్ చేశాను తప్ప, దాని గురించి ఇంకొక్క సెకన్ ఆలోచించడం కూడా వేస్ట్ అనిపించింది. ప్రవక్తకు అవమానం జరిగిందని నాకు 1% కూడా అనిపించలేదు. ఎందుకంటే, ఆయన అల్లాహ్ ఎంచుకున్న ప్రవక్త. తుచ్చ మానవ మాత్రులు ఎవ్వరూ ఆయన గౌరవానికి వీసమెత్తుకూడా భంగం కలిగించలేరనేది నా నిశ్చితాభిప్రాయం.

కానీ, ఓ వారం రోజుల తర్వాత, ఆవిడ వ్యాఖ్యలు అరబిక్ ట్రాన్స్ లేషన్ తో గల్ఫ్ కంట్రీల టీవీ చానెల్లలో ప్రసారం కావడం, అక్కడి ప్రజలు,ప్రభుత్వాలూ భారత ప్రభుత్వ, భారత ఉత్పత్తులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనను ప్రకటించడం మాత్రం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. బహుశా, ఇండియా నుండీ వస్తున్న ముస్లిం వ్యతిరేక వార్తల్ని చూసీ,చూసీ విసిగిపోయి ఉన్నవారికి, ఈ వార్త Last nail in coffin లా పనిచేసినట్లుంది. నాలాగే, బీజేపీ పై లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న భారతీయ ముస్లింలెవ్వరూ ఆ వ్యాఖ్యల్ని మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.

బీజేపీవారికి, సాటి భారతీయులు, భారత చట్టాలపై ఏమాత్రం గౌరవం లేకపోయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మంటగలిసిపోతున్న భారత బ్రాండ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అయినా, తమ పార్టీలోని ‘నోటి అతిసార వ్యాధిగ్రస్తుల్ని’ అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ముస్లింలు నుపుర్ శర్మ పై దూషనలూ, అసభ్య కామెంట్లు చేయకుండా, ప్రవక్త సాంప్రదాయం ప్రకారం హూందాగా వ్యవహరిస్తూ, క్షమాగుణాన్నీ, సంయమనాన్నీ ఆచరణలో చూపాల్సిన అవసరం ఉంది.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.