ప్రవక్త జీవితంలో కీలక ఘట్టం – హుదేబియా సంధి

మహమ్మద్ ప్రవక్త క్రీ.శ.570 లో మక్కాలో జన్మించారు. అప్పటికే మక్కా, అరేబియా మొత్తానికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుండేది. అక్కడి నల్ల రాతి గృహం(కాబా) మహమ్మద్ ప్రవక్త నిర్మించింది కాదు. ఇస్లాం,క్రైస్తవ,యూదుమతాలు మూడింటిలోనూ ప్రస్తావించబడిన అబ్రహాం, ఏకేశ్వరోపాసన కోసం కాబా గృహాన్ని మొదటిసారిగా నిర్మించారు. కానీ, అబ్రహాం ప్రవక్త తదనంతరం అరబ్బులు ఆ కాబా గ్రృహాన్ని వివిధ విగ్రహాలతో నింపేశారు. ఒక్కో తెగ, ఒక్కో ఆకారాన్ని తమ దైవంగా ప్రకటించి, ఆ ప్రతిమల్ని కాబాలో ప్రతిష్ఠించారు. వీరు ప్రతి సంవత్సరమూ తమ తమ విగ్రహాల్ని సందర్శించడానికి, మరియూ కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అక్కడికి వస్తుండటంతో, మొత్తం అరేబియా ఖండానికే కాబా ఓ ప్రముఖ వాణిజ్యకేంద్రంగా భాసిల్లేది.

ఈ కాబాకు సం రక్షకులుగా ఖురైష్ తెగవారు ఉండేవారు. మహమ్మద్ ప్రవక్త ఈ తెగలోనే జన్మించారు. నలభై సంవత్సరాల వయసులో, ఆయనకు దైవ దూతనుండి ఖురాన్ సందేశం వచ్చిన తర్వాత, ఆయన బహుదేవతారాధననూ,విగ్రహారాధననూ నిరసిస్తూ, ఇస్లాం ని బోధించడం మొదలుపెట్టారు. ఆయన అనుచరగణం క్రమంగా పెరుగుతుండటంతో, ఖురైష్ మరియు ఇతర తెగల వారు, మహమ్మద్ ప్రవక్తను హత్య చేయాలని పధకం రచించారు.

ఈ విషయం గ్రహించిన ప్రవక్త, తమ అనుచరగణంతో క్రీ.శ.622లో మక్కావదలి మదీనాకు వలస వెళ్ళారు. మదీనాలో ప్రవక్త బోధనలకు ఆకర్షితులై అనేక తెగలు ఇస్లాం ని స్వీకరించాయి. ఈ తెగలకు, మరియు ఖురైష్ తెగకు చెందిన బిడారు వర్తక బృందాలకు మధ్య కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగి అవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీశాయి.

మదీనాలోని ముస్లింలకు, మరియు మక్కాలోని ఖురైష్ లకు మధ్య మూడు యుద్ధాలు జరిగాయి.

1. బద్ర్ యుద్దం: దీనిలో ముస్లింలు తమ కన్నా 3 రెట్లు పెద్దదైన ఖురైష్ సైన్యాన్ని ఓడించి అఖండ విజయాన్ని సాధించారు.
2. ఉహుద్ యుద్దం: మొదట్లో దీనిలో కూడా ముస్లింలదే పైచేయిగా ఉండింది. కానీ, కొందరు విలుకాల్లు, తమకు కేటాయించిన స్థలాల నుండి పక్కకు వచ్చి, వారి వ్యూహం మొత్తం చెదిరిపోవడంతో, ముస్లింలు తీవ్ర నష్టాన్ని చవి చేశారు. సాక్షాత్తూ మహమ్మద్ ప్రవక్త కూడా ఈ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డారు.
3. కందక యుద్దం: సుమారు పదివేల మంది ఖురైష్ సైన్యం మదీనాను చుట్టుముట్టారు. ఇది మదీనాలోని మొత్తం జనాభా కన్నా ఎక్కువ. కానీ, మహమ్మద్ ప్రవక్త అనుసరించిన ఓ తెలివైన వ్యూహం వల్ల ఖురైష్ సైనికులు మదీనాలోకి కాలు పెట్టలేక పోయారు. అది – మదీనా చుట్టూ కందకాలు తవ్వడం. దీని వల్ల వారు నెల రోజుల పాటు ప్రయత్నించినప్పటికీ, మదీనాలోకి ప్రవేశించడంలో సఫలీకృతం కాలేకపోయారు. చివరికి తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలు ఐపోవడం మరియు భీకరమైన ఎడారి తుపాన్ల వల్ల, యుద్ధాన్ని మధ్యలోనే విరమించి మక్కాకు తిరుగుప్రయాణమయ్యారు.

పదివేల మంది సైన్యంతో వెళ్ళీ కూడా ముస్లింలను ఏమీ చేయలేకపోవడాన్ని ఖురైష్ లు చాలా అవమానంగా భావించారు. ముస్లింలను దెబ్బ కొట్టడానికి మరో అవకాశం కోసం పథకాలు రచించసాగారు.ఇలాంటి పరిస్థితుల్లో, ఒకానొక రోజు – “మనందరం మక్కా కు వెళ్ళబోతున్నాం, యుద్ధం చేయడానికి కాదు, యాత్రికులుగా”. అని మహమ్మద్ ప్రవక్త ప్రకటించారు.

ఈ ప్రకటన ప్రవక్త అనుచరులను మొదట అయోమయానికి గురిచేసింది. యాత్రికులుగా వెళ్ళడమంటే, జంతువుల్ని బలి ఇవ్వడానికి అవసరమయ్యే కొన్ని చిన్నపాటి కత్తుల్ని తప్ప, ఏ ఇతర ఆయుధాల్ని ధరించి వెళ్ళకూడదు. మరో వైపు తమను చావుదెబ్బ కొట్టడానికి ఖురైష్ లు అవకాశం కోసం కాచుక్కూర్చుని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుధాలు లేకుండా మక్కాలోకి అడుగుపెట్టడమంటే, అది ఆత్మహత్యా సదృశ్యమే. అయినప్పటికీ, ప్రవక్త మీద ఉన్న నమ్మకం, ప్రవక్తకు అందే దైవ సందేశం మీద ఉన్న అచంచల విశ్వాసం కారణంగా 1400 మంది ముస్లింలు మక్కా యాత్రకి బయలు దేరారు. కాబా ప్రశస్తికి, అక్కడి వాణిజ్యానికి యాత్రికులే కీలకం కాబట్టి, దాని సమ్రక్షకులుగా ఉంటున్న ఖురైష్ తెగవారు మరియు ఇతర మక్కా ప్రజలు కొన్ని నియమాలకు చాలా నిష్టగా కట్టుబడిఉండేవారు.

అవి – కాబాను సందర్శించడానికి వచ్చే ఏ ఒక్క యాత్రికునికీ హాని తలపెట్టరాదు. ఏ ఒక్క యాత్రికునికీ కాబా చుట్టూ ప్రదక్షీనాలు చేయడంలో ఆటంకం కలిగించరాదు. కానీ, వీరు మహమ్మద్ ప్రవక్త, మరియు అతని అనుచరుల విషయంలో కూడా ఈ నియమానికి కట్టుబడి ఉంటారని ఎలాంటి గ్యారెంటీ లేదు. ముస్లిం యాత్రికులు మక్కా పొలిమేరల్లోని హుదేబియా అనే ప్రాంతానికి చేరి, తాము యుద్ధం కోరుకోవడం లేదనీ, కేవలం కాబాను సందర్శించడానికి యాత్రికులుగా మాత్రమే వచ్చామనీ, కావున తమను ఇతర యాత్రికుల్లాగానే మక్కాలోకి అనుమతించాలని ఖురైష్ పెద్దలకు కబురు పంపారు.
200 మంది ఖురైష్ ల సైన్యం హుదేబియాకి వచ్చి ముస్లింల దగ్గర కాబా దగ్గర బలి ఇవ్వడానికి తెచ్చుకున్న జంతువులు, తప్ప ఏ ఇతర యుద్ధసామాగ్రీ లేదని నిర్ధారించుకుని వెళ్ళారు. కానీ, ఇప్పుడు వీరిని మక్కాలోకి అనుమతించడమా, లేదా అనే అంశం వారిని గందరగోళంలో పడేసింది. అనుమతిస్తే, తాము చంపాలనుకుంటున్న వారు తమ కళ్ళ ముందే దర్జాగా మక్కాలో విహరించి వెళ్ళినా ఏమీ చేయలేని దద్దమలని ఇతర తెగల ముందు చులకన ఐపోతామేమోననే భయం. మరో వైపు వీరిపై దాడిచేస్తే, నిరాయుధులైన, యాత్రికుల్ని చంపితే దాని వల్ల మక్కా చుట్టుపక్కల ఉన్న ఇతర తటస్థ తెగలన్నీ తమకు వ్యతిరేకంగా మారిపోతాయేమోననే భయం ఒక వైపు.. దీనితో ఏమి చేయాలో తెలియక వారు తలలు పట్టుకుని కూర్చున్నారు.
మరో వైపు ఖురైష్ లతో చర్చలు జరపడానికి మహమ్మద్ ప్రవక్త ముస్లింల రాయబారిగా పంపిన ఉత్మాన్ (ప్రవక్త అనంతరం ఈయన 3వ ఖలీఫాగా నియమించబడ్డారు), కొన్ని రోజుల వరకూ తిరిగి రాకపోవడంతో, ఖురైష్ లు ఆయనను చంపేసి ఉంటారనే వదంతులు వ్యాపించాయి. అదేగనక జరిగితే, ఖురైష్ లు యుద్ధానికి తెరలేపినట్లేననీ, తమ దగ్గరున్న కొద్దిపాటి ఆయుధాల్తోనే ఉమర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామనీ ప్రవక్త అనుచరులు శపధం చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ఖురైష్ లు ఉత్మాన్ తో పాటు, తమ తెగ పెద్ద అయిన సుహైల్-ఇబ్న్-అమర్ ని సంధి చర్చలకు పంపారు. దీని ప్రకారం, ఖురైష్ లు ప్రతిపాదించిన అంశాలు-
1. ముస్లింలను యాత్రకు అనుమతిస్తారు. కానీ అది ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం. అంటే, ఇప్పుడు మాత్రం, హుదేబియా నుండి వెనుతిరిగి మళ్ళీ తరువాతి సంవత్సరం రావాల్సి ఉంటుంది.
2. మక్కానుండి ఎవరైనా ఇస్లాం స్వీకరించి మదీనాకు వస్తే, వారిని తిరిగి మక్కావారికి అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ, మదీనానుండి ఎవరైనా, ఇస్లాం వదిలి మక్కాకు వస్తే వారిని తిరిగి మదీనాకు పంపబడదు.
3.పదేళ్ళ పాటు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం నిషిద్దం.
4. మక్కావారు, మదీనా వారు స్వేచ్చగా వాణిజ్య కార్యకలాపాలు సాగించుకోవచ్చు. ఇతర తెగలు మక్కా,మదీనాలలో తమకు నచ్చిన వారితో చేతులు కలపవచ్చు.
ఈ అంశాలు పూర్తి ఏకపక్షంగా, ఖురైష్ లకు అనుకూలంగా, ముస్లింలకు ప్రతికూలంగా ఉన్నాయని చూసిన వారికి ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది.
మరీ ముఖ్యంగా, ఈ ఒప్పంద పత్రానికి టైటిల్గా ప్రవక్త మేనల్లుడు అలీ(ర.అ) గారు,” ఖురైష్ పెద్దలకు మరియు దైవ ప్రవక్త అయిన మహమ్మద్ కు మధ్య ఒప్పందం” – అని పెడితే, తాము మహమ్మద్ ని దైవ ప్రవక్తగా ఒప్పుకోము కాబట్టి, ఆ పదాన్ని తీసేయాలని ఖురైష్ పెద్దలు పేచీ పెట్టారు.
తాను ఆ పని చేయనని అలీ కూడా పట్టు బడితే, చివరికి ప్రవక్తే ఆ పత్రాన్ని తీసుకుని, ‘దేవుని ప్రవక్త ‘ అనే పదాల్ని కొట్టివేశారు. ఈ మొత్తం పరిమాణాల్ని చూసి ముస్లింలు ఆవేశంతో రగిలిపోయారు. ఇంత దూరం వచ్చి కాబా దగ్గరకు వెళ్ళకుండా వెనుతిరగడమంటే, అది ఘోర అవమానంగా భావించారు.

మరీ ముఖ్యంగా, పైన చెప్పిన 2వ అంశం వారికి చాలా కఠినంగా అనిపించింది. కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖురైష్ వారితో రక్తపాత ఘర్షణని నివారించడమే ముఖ్యమనుకున్న ప్రవక్త, ఈ నియమాలన్నిటికీ ఒప్పుకున్నారు. తాము వెంట తెచ్చుకున్న జంతువుల్ని అక్కడే బలి ఇచ్చి వెనుతిరగవలసిందిగా తన అనుచరుల్ని ఆదేశించారు. కానీ, మామూలుగా ఐతే ప్రవక్త నోటి నుండీ ఒక్క ఆదేశం రాగానే, దానిని చేయడానికి పోటీపడే అనుచరులకు, ఈ అంశంలో మాత్రం ప్రవక్త నిర్ణయం మింగుడుపడలేదు.దీనితో, ప్రవక్త చెప్పాక కూడా ఏ ఒక్కరూ కదలకుండా అలాగే కూర్చున్నారు. ఉమర్-అల్-ఖత్తాబ్ ( ప్రవక్త తర్వాత 2వ ఖలీఫా) ఐతే, అసలు మీరు ఇంతకీ నిజంగానే ప్రవక్తేనా, మనం నిజమైన మార్గంలోనే వెల్తున్నామా అని ప్రవక్తని నిలదీసి అడిగారు.

దీనికి సమాధానంగా ప్రవక్త గారు, నాకు దేవుడి నుండీ అందిన సూచనలమేరకే నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఇంతకు మించి ఎక్కువగా నేనేదీ నిరూపించలేను అని చెప్పారు. అనుచరుల ఈ వైఖరికి తీవ్రంగా నొచ్చుకున్న ప్రవక్త, చివరికి తానే స్వయంగా కత్తి చేతబట్టి, తాను వెంట తెచ్చుకున్న ఒంటె ని బలి ఇచ్చారు. ఇది చూసి చలించిన ముస్లింలు, అందరూ లేచి ప్రవక్తకు మద్దతుగా నినాదాలిచ్చారు. వారు కూడా, తమ తమ ఒంటెల్ని బలి ఇచ్చారు. ఇక్కడి నుండీ ప్రవక్త అనుచరులు భారమైన మనసుతో వెనుతిరిగారు. కానీ, ఈ హుదేబియా సంధి ఇస్లామిక్ చరిత్రలో ఎంత కీలక ఘట్టమనేది కొద్ది రోజుల్లోనే నిరూపితమైంది.

మక్కా వారితో వర్తక,వాణిజ్యాలు పెరగడం వల్ల, ముస్లింలు తమ మతాన్ని స్వేచ్చగా ఆచరిస్తూ, ఇతరులకు దాని గురించి చెప్పడం చాలా సులువైపోయింది. దీనితో అసంఖ్యకంగా మక్కా మరియు దాని చుట్టుపక్కల ఉన్న తెగల ప్రజలు ఇస్లాంలోకి మారిపోయారు. అంతకు ముందు 17 ఏళ్ళనుండీ ఎంతమంది ఇస్లాం లోకి మారారో, హుదేబియా సంధి తర్వాత, కేవలం 2 సంవత్సరాల్లోనే దానికి రెట్టీంపు మంది ముస్లింలుగా మారారు.

మక్కాలోని ఖురైష్ లు కొందరు ముస్లింలుగా మారి మదీనాకి వెళ్ళగా, సంధి ప్రకారం ప్రవక్త వారిని తిరిగి మక్కాకు పంపించివేశారు. కానీ తిరిగి మక్కాకు వెలితే, అక్కడి ఖురైష్ లు తమను తీవ్రంగా హింసించడమో,చంపడమో చేస్తారని భయపడి, వీరు మక్కా కు దగ్గర్లోని సైఫ్ అల్ బహర్ అనే ప్రాంతంలో తాత్కాలిక ఆశ్రయం పొందారు. ఒకరి తర్వాత ఒకరుగా అక్కడికి సుమారు 80 మంది కొత్త ముస్లింలు వచ్చి పోగయ్యారు. వీరు తమ సంపదల్ని, ఆస్తిపాస్తుల్ని మక్కాలోనే వదలి రావడంతో, బతుకు తెరువుకోసం మరో దారిలేక, ఇతర ప్రాంతాలకు వర్తకానికి వెళ్ళే ఖురైష్ బృందాల్ని దోచుకోవడం మొదలుపెట్టారు. వీరి దాడులకు తీవ్ర నష్టాల్ని చవిచూసిన ఖురైష్ లు, హుదేబియా సంధిలోని 2వ అంశాన్ని రద్దు చేసి, వీరందరినీ మదీనాకు పిలిపించుకోవలసిందిగా మహమ్మద్ ప్రవక్తను వేడుకుంటూ ఉత్తరాలు రాశారు.

అలా వీరి అభ్యర్థన మేరకు 2వ అంశం రద్దు కాబడి, కొన్ని వందల సంఖ్యలో ఖురైష్ లు మదీనాకి వెళ్ళి ముస్లింలుగా మారిపోయారు. చివరికి 630లో, బను బక్ర్ అనే ఖురైష్ వర్గానికి చెందిన వ్యక్తి కొందరు ముస్లింలపై దాడి చేసి హతమార్చడంతో హుదేబియా సంధి మొత్తంగా వీగిపోయింది. ఏకపక్షంగా ఖురైష్ వర్గం సంధిని అతిక్రమించారు కాబట్టి, మహమ్మద్ ప్రవక్త తమ అసంఖ్యాక అనుచరగణంతో మక్కాకు ప్రయాణమై వచ్చారు. అప్పటికే దాదాపు అన్ని ప్రముఖ తెగలూ, మరియు అనేక మంది ఖురైష్ నాయకులు కూడా ముస్లింలుగా మారిపోయి ఉండటంతో, మహమ్మద్ ప్రవక్తకి ఎదురు నిలబడి పోరాడేవారే ఎవరూ లేకుండాపోయారు. మిగిలిన కొందరు ఖురైష్లు, ఇప్పుడు ప్రవక్త తమను ఏం చేస్తారోననే భయంతో బిక్కు,బిక్కు మంటూ ఇళ్ళలో దాక్కుండిపోయారు. ఎవరికీ, ఎలాంటి హానీ జరుపబోదనీ,వారందరినీ క్షమించి వదిలేస్తున్నట్లు ప్రవక్త ప్రకటించారు. ఈ రకంగా, ఒకప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి మక్కా వదిలి మదినాకు వలసవెల్లిన వ్యక్తి, కేవలం ఎనిమిదేళ్ళ తర్వాత, తిరుగులేని విజేతగా మళ్ళీ మక్కాలోకి అడుగుపెట్టారు. అది కూడా, ఒక్క నెత్తురు చుక్క కూడా చిందించకుండా.
-మహమ్మద్ హనీఫ్.యస్.
(మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ సంధర్భంగా)ఈ వ్యాసం డిసెంబర్ 2,2017 నాడు నమస్తే తెలంగాణా లో ప్రచురితం అయింది.

Leave a Reply

Your email address will not be published.