బురఖా తీసేసిన బుద్ధిజీవి

బురఖా తీసేసిన బుద్ధిజీవి
– వాహెద్
అనవసరమైన అయోమయం లేకుండా ముందే చెప్పేస్తున్నాను, ఆ బుద్ధిజీవి పేరు రామచంద్రగుహ.
గుహ గారు ఇటీవల ముస్లిం మహిళలు ధరించే బురఖాకు, హిందు త్రిశూలానికి తేడా లేదని తీర్మానించేశాడు. గుహ గారు ఇంతకు ముందు మోడీని, అమిత్ షాను విమర్శించారు. ఆ తర్వాత ఆయనకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. ఆ విషయం కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన మోడీ గారిని మహాపురుషుడిగా కీర్తించేశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత గొప్ప ప్రధాని మోడీయే అని ఢంకాబజాయించి చెప్పేశారు. ఇవి కేవలం గుహగారి ఒకపరిచయానికి ఉపయోగపడే పంక్తులు మాత్రమే.
ప్రముఖ చరిత్రకారుడు, మేధావి, ఉదారవాదిగా చెప్పుకుంటూ ’’ఉదారవాదులు పాపం‘‘ అంటూ వ్యాసం రాసే రామచంద్రగుహ బురఖాను త్రిశూలంతో పోల్చారు కాని ఏ బురఖా అన్నది చెప్పలేదు.

ఎందుకంటే చాలా రకాల బురఖాలున్నాయి. కళ్ళు తప్ప మరేమీ కనబడకుండా ఆపాదమస్తకం ధరించే బురఖాలు, ముఖాన్ని వదిలేసి హెడ్ స్కార్ప్ ధరించే బురఖాలు, లాంగ్ కోటులా ఫ్యాషనబుల్ గా ఉన్న బురఖాలు, నల్లని బురఖాలు, రంగురంగుల బురఖాలు, డిజైనర్ బురఖాలు, అబయాగా పిలువబడే బురఖాలు, మోంటో బురఖాలు…. చాలా రకాలున్నాయి. వీటన్నింటిని త్రిశూలాలే అంటున్నారా లేక ఇందులో కొన్నింటిని మాత్రమే త్రిశూలాలుగాను, మిగిలిన వాటిని ఇతరత్రా ఆయుధాలుగాను ఆయన భావిస్తున్నారా తెలియదు. ఆయన కేవలం బురఖాకు మాత్రమే పరిమితమయ్యారా లేక ఉదారవాది కాబట్టి మంగళసూత్రాలు, నుదుటిన పెట్టుకునే బొట్టు వగైరాలను కూడా ఈ లిస్టులో చేరుస్తున్నారా అన్నది కూడా మనకు తెలియదు. ప్రముఖ పాత్రికేయుడు హర్ తోష్ సింగ్ బాల్ ట్వీట్ చేస్తూ ’’తర్వాతేంటి, ప్రజాజీవితంలోకి రావాలంటే తలపాగా (సిక్కులు ధరించేది) పక్కన పెట్టి రమ్మొంటారా‘‘ అనడిగాడు. మరో ప్రముఖ పాత్రికేయురాలు, సబా నక్వీ, ఈమె బురఖా ధరించగా నేనెన్నడూ చూడలేదు, ఈమె ట్వీట్ చేస్తూ ’’థాంక్యు, రామ్ గుహ .. నేనిక బురఖా ధరించడం మొదలెడతాను‘‘ అన్నది. ఈ ట్వీట్లకు జవాబిస్తూ రామచంద్రగుహగారు ’’ముస్లిం మహిళలు ఇంట్లో, కుటుంబసభ్యుల మధ్య బురఖా ధరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాని రాజకీయ ర్యాలీల్లో బురఖా ధరించి రావడమే సమస్య‘‘ అన్నాడు. అజ్ఞానానికి అవధుల్లేవని ఎందుకంటారో ఇప్పుడర్థమైంది. బురఖా ధరించేదే బయటకు వస్తున్నప్పుడు. గుహగారికి ఆ విషయం కూడా తెలియదా? గుహ వ్యాసంపై జోకులేస్తూ కూడా ట్వీట్లు వచ్చాయి. ’’రేపు ఘాగ్రా చోలీ ఏ.కే.47 అంటాడేమో… ఆ తర్వాత చీరకట్టు అణుబాంబు లాంటిది అంటాడా ఏంటి‘‘ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. కవితా కృష్ణన్ ట్వీట్ చేస్తూ ’’ఇస్లామోఫోబిక్ కామన్ సెన్సుకు గొప్ప ఉదాహరణ ఈ వ్యాసం. ఉదారవాదుల అభిప్రాయాల్లోకి కూడా చొచ్చుకు వచ్చేసింది. ఇది ఫాసిస్టులకు అవసరమైన అవకాశాలిస్తోంది‘‘ అన్నారు.
అసలేం జరిగిందో చూద్దాం –
ఇండియా టుడే కాంక్లేవ్ ఇటీవల జరిగింది. ఆ సందర్భంగా సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ముస్లిం సముదాయానికి సంబంధించి కాంక్లేవ్ లో అడిగిన ప్రశ్నలకు సోనియాగాంధీ ఇచ్చిన సమాధానాలపై హర్ష్ మందర్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఒక వ్యాసం రాశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ చెప్పిన మాట ఏంటంటే, కాంగ్రేసు ముస్లిముల పార్టీగా బిజేపి ప్రచారం చేయడం వల్ల కాంగ్రేసు నష్టపోయిందని. ఈ మాటలను విశ్లేషిస్తూ హర్షమందర్ ఏమన్నాడంటే, ముస్లిములకు దగ్గరగా ఉన్న పార్టీ అని ప్రజలు భావిస్తే రాజకీయంగా నష్టమని చాలా పార్టీలు భావిస్తున్నాయి. తన మాటలకు ఆధారంగా ఒక దళిత నాయకుడు చెప్పిన మాటగా ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పాడు. మా ర్యాలీల్లోకి పెద్ద సంఖ్యలో రండని ముస్లిములను ఆహ్వానిస్తూనే, టోపీలు, బురఖాలు ధరించి రావద్దని చెప్పాడంట. ఈ మాటలను ఉదాహరిస్తూ హర్ష మందర్ ఏమన్నాడంటే, ముస్లిములు రాజకీయరంగం నుంచి పూర్తిగా తప్పుకునే వాతావరణం సృష్టిస్తున్నారని చెప్పాడు. ఒక కాంగ్రేసు పార్లమెంటు సభ్యుడు ’’ముస్లిములు ఒక భారంగా మారుతున్నారు‘‘ అని చెప్పిన మాటలు కూడా ఆయన ఉదాహరించాడు.
హర్షమందర్ వాదనలో లోపాలు లేవని చెప్పలేం. ముస్లిము అనగానే హిందువులు వ్యతిరేకంగా మారిపోయే వాతవరణం ఉందంటే అది పూర్తి నిజం కూడా కాదు. ఎందుకంటే ఇటీవల బీహారులో ఆరారియా ఎన్నికల్లో గెలిచిన ఆర్జెడీ అభ్యర్థి సర్ఫరాజ్ ఆలమ్. పేరు చూడగానే ముస్లింగా అర్థమవుతోంది. కాంగ్రేసులో గులాం నబీ ఆజాద్, అహ్మద్ పాటిల్, ఏ.కే.ఆంటోని, ఆస్కర్ ఫెర్నాండజ్ వంటి ముస్లిం క్రయిస్తవ నాయకుల పేర్లు ప్రముఖంగానే వినబడుతున్నాయి. కాని గమనించవలసిన వాస్తవమేమంటే ముస్లిములకు దగ్గరగా ఉన్నట్లు కనబడితే హిందూ ఓట్లు కోల్పోతామన్న భయం పార్టీల్లో ఉంది. సోనియాగాంధీయే తాము ప్రయాణాల్లో ఉంటే దారిలో మందిరాలను తప్పక సందర్శిస్తామని చెప్పుకోవడం తమ హిందూ ఐడెంటిటినీ ప్రదర్శించడమే. హిందూ ఐడెంటిటి ప్రదర్శిస్తేనే దేశంలో రాజకీయంగా నిలబడగలమన్న భావం బలంగా ఉంది. దాంతో పాటు సాధ్యమైనంత వరకు ముస్లిములకు దూరంగా ఉన్నట్లు చెప్పుకోవడం కూడా అవసరమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ముస్లిములు రాజకీయంగా విజిబుల్ గా ఉండకూడదన్న భావన కూడా బలంగా కనబడుతోంది. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకుని హర్షమందర్ రాసిన వ్యాసం అది. ఇలాంటి భావాలకు బలం చేకూర్చేలా రాజకీయ పార్టీలు వ్యవహరించడం శోచనీయం. అపూర్వానంద్ ఈ విషయం గురించి రాస్తూ, 2014 సాధారణ ఎన్నికల్లోను, 2017 త్రిలోక్ పూర్ ఎన్నికల సందర్భంగాను హింసాకాండ జరిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ హిందువుల ఓట్లు కోల్పోతామన్న భయంతోనే మౌనం వహించింది అన్నారు. దేశంలో ముస్లిములను ఇలా రెండవతరగతి పౌరులుగా మార్చడాన్ని అడ్డుకోవాలని హర్షమందర్ వ్యాసంలో సారాంశం. హర్షమందర్ వ్యాసం సోనియాగాంధీని విమర్శిస్తూ సాగిన వ్యాసం. ఈ వ్యాసానికి గుహగారు జవాబు రాశాడు. ఆ జవాబులో ఆయన బురఖాను లాక్కొచ్చి దాన్ని త్రిశూలంతో పోల్చాడు. మేధావి అని పేరుపడాలంటే బురఖాను విమర్శిస్తే చాలు, ఆటోమేటిగ్గా ఆ పేరు వచ్చేస్తుంది. షార్ట్ కట్టు. దేనికైనా షార్టుకట్టు కనిపెట్టడంలో మనకు మనమే సాటి.
బురఖా ఆయుధమా? వీళ్లంతా బురఖాను చూసి భయంతో వణికిపోతున్నట్లు కనబడుతున్నారు. ఎంతమంది బొట్టు మీద రాస్తారో, ఎంత మంది మంగళసూత్రాల మీద రాస్తారో, ఎంత మంది కాలికి పెట్టుకునే మెట్టెల మీద రాస్తారో, నుదుటి సింధూరం మీద రాస్తారో చూద్దాం.
బురఖా అంటే ఇప్పుడు అందరికీ భయమే. రైట్ వింగ్ మతోన్మాదులకు భయమే. లెఫ్ట్ వింగ్ ఉదారవాదులకు భయమే. సంస్కర్తలుగా వేషాలేసుకునే సోకాల్డ్ ముస్లిం రిఫార్మిస్టులకు భయమే. వీళ్ళందరినీ కలిపే ఒకే ఒక్క వారధి బురఖా అంటే ఉన్న భయం.
హర్షమందర్ తన వ్యాసంలో ఒక దళిత నాయకుడు ముస్లిములను టోపీలు, బురఖాలతో రావద్దని చెప్పిన మాటలపై గుహ ఏమన్నాడంటే, రాజకీయ ర్యాలీల్లో కాషాయం ధరించి, త్రిశూలాలు ఊపుతూ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్నట్లే, బురఖా ఆయుధం కాకపోయినా, అది కూడా త్రిశూలం వంటిదే, ఇది మతానికి సంబంధించిన రియాక్షనరీ, పురాతనకాలాల చిహ్నం. కాబట్టి దీన్ని వ్యతిరేకించడం అసహనం కాదు, ఇది ఉధారవాదం. ఇది విముక్తి.
గుహ చెబుతున్న విముక్తి ఏమిటంటే, ముస్లిములు తమ గుర్తింపును, గుర్తింపు చిహ్నాలను అన్నింటిని వదిలేసి ముస్లిములుగా చెప్పుకోవడం కూడా మానేసి బతకాలి. అప్పుడు మాత్రమే విముక్తి లభిస్తుంది. ఇలాంటి ఉదారవాదాన్ని ఏమనాలి. బురఖా ముస్లిం మహిళలకు ప్రతిబంధకంగా ఉందని గుహ భావిస్తుంటే బహుశా ఆయన అజ్ఞానంలో బతుకుతున్నాడు.
నోబుల్ శాంతి బహుమతి అందుకున్న ఎమన్ మహిళ తవక్కల్ కార్మాన్ ను అక్కడ జర్నలిస్టులు కావాలనే ఆమె ధరించిన బురఖా గురించి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు గుహలాంటి ఉదారవాదులు మరోసారి చదువుకోవాలి. ’’మీ వంటి మేధావి, విద్యావేత్త బురఖా ధరించడం మీ స్థాయికి తగింది కాదేమో‘‘ అని అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ ’’ప్రారంభకాలంలో మనషులు దుస్తులు ధరించేవారు కాదు. ఆదిమజాతులు నగ్నంగానే ఉండేవి. మేధోశక్తి వికసించడంతో పాటు దుస్తులు ధరించడం కూడా ప్రారంభమైంది. నేను ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు మనిషి సాధించిన అత్యున్నత స్థాయి మేధోవికాసానికి, నాగరికతకు సంబంధించినవి. వీటిని వదిలేయడమంటే మళ్ళీ వెనక్కి పోవడమే అవుతుంది‘‘ అని జవాబిచ్చింది. నోబుల్ శాంతి బహుమతి గ్రహీత అయిన కర్మాన్ కూడా విముక్తి చెందని మహిళ అని గుహగారి వంటి సోకాల్డ్ ఉదారవాదుల అభిప్రాయమా?
ఎక్కడో ఎమన్ మహిళ ఉదాహరణ ఎందుకు మన హైదరాబాదు పాతబస్తీలోనే బోయింగ్ విమానాలను నడిపే పైలట్ బురఖా ధరించే నడుపుతుంది. ఆమె తన శిక్షణాకాలంలో కూడా బురఖా ధరించే శిక్షణ పూర్తి చేసుకుంది. ఆమె పేరు కెప్టెన్ సయిదా ఫాతిమా. ఎయిర్ బస్ 320 నడపుతుంది. అమెరికన్ టీ.వీ.లో హిజాబ్ తో వార్తలు చదవడం అసాధ్యం అని తోటివారు చెప్పినా తన ప్రతిభతో జర్నలిస్టుగా రాణిస్తోంది తాహిరా రహ్మాన్. కెనడా టోరంటోలో కూడా గిన్నెలా మాసా బురఖా ధరించే వార్తలు చదువుతుంది. అమ్మా అల్ హద్దాద్ దుబాయ్ కి చెందిన అథ్లెట్, అమన హద్దాద్ వెయిట్ లిఫ్టర్, మనాల్ రుస్తుం స్విమ్మర్, ఇబ్తిహాజ్ ముహమ్మద్ ఫెన్సింగ్ లో అమెరికా తరఫున బురఖా ధరించి ఒలింపిక్స్ లో పాల్గొంది. నైక్ సంస్థ హిజాబ్ స్పోర్ట్స్ గేర్ తయారు చేయడానికి వీళ్ళే కారణం. అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా కొనసాగిన ప్రతిఘటనల్లో అమెరికా పతాకాన్ని హిజాబ్ గా ధరించి ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీ జామియా మిల్లియా ఇస్లామియాలో చదివిన రోషినీ మిస్బా హిజాబీ బైకర్ గా పేరుపొందింది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఒక జాబితాలా రాస్తూ పోవచ్చు. హిజాబ్ ధరించి, బురఖా ధరించి ముస్లిమ్ మహిళలు సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పాల్గొంటున్నారు. బహుశా రామచంద్ర గుహ ఆయనలాంటి ఉదారవాదులకు ఈ జ్ఞానం లోపించింది. కార్లు, బైకులు నడుపుతున్న బురఖా ధరించిన అమ్మాయిలను చూసైనా ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేయవలసింది.
అమ్మాయిలను ఇంటి నాలుగ్గోడలకే పరిమితం చేయడం, వారిని చదువుకు దూరం చేయడం వంటివి నిస్సందేహంగా ఖండించవలసిన రుగ్మతలు. ముస్లిముల్లో ఈ రుగ్మతలు ఉన్నాయి. వాటిని తొలగించే సంస్కరణలు జరగాలి. చైతన్యం రావాలి. అమ్మాయిల పట్ల వివక్ష కేవలం ముస్లిముల్లోనే ఉందనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకటి లేదు. ఇతరుల్లోను పెద్దస్థాయిలో ఈ వివక్ష ఉంది. సామాజికంగా ఈ వివక్షకు వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలు వేరు. దాన్ని బురఖాతో ముడిపెట్టడం వేరు. బురఖా ధరించి విజయాలు సాధించిన అనేకమంది ఉదాహరణలు మనముందున్నాయి. బురఖా ధరించి కాలేజీలకు, స్కూళ్ళకు, కార్యాలయాలకు, ఇంకా అనేక సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న మహిళలను చూస్తూ కూడా ముస్లిం మహిళలు బురఖా ధరించడం వల్లనే వెనుకబడిపోయారని మాట్లాడేవారిని ఏమనాలి. బురఖాను విమర్శిస్తూ కవిత్వం రాస్తే చాలు, కథలు రాస్తే చాలు అది గొప్ప సాహిత్యం అనబడే వాతావరణంలో ఉన్నాం. వివక్ష అనేది సమాజంలో ఎన్ని రూపాలుగా ఉంటుందో అర్ధం చేసుకునే ప్రయత్నం కన్నా, ముస్లిం మహిళలు ఏం ధరించాలి అని చెప్పడమే చాలా మందికి ఆసక్తికరమైన ఉదారవాద యాక్టివిటీ. మహిళలు ఏం ధరించాలన్నది చెప్పడానికి చేసే ఈ ప్రయత్నాలు కూడా ఫక్తు పురుషాహంకారమే అన్నది అర్ధం చేసుకునే వాతావరణం ఉందా?
సమస్య ఏమిటంటే ’’మంచి ముస్లిములు (గుడ్ ముస్లిమ్)‘‘ అనే ట్యాగ్ తగిలించాలన్న ఉబలాటం చాలా మందికి ఉంది. మతతత్వ రైట్ వింగ్ ప్రబుద్దుల దృష్టిలో గుడ్ ముస్లిం అంటే శాకాహారి, బక్రీద్ రోజున ఖుర్బానీగా కేకు కోస్తాడు, భారతమాతాకి జై అని ఎప్పుడనమంటే అప్పుడు అంటాడు, ఆవు దరిదాపుల్లోకి ఎప్పుడూ వెళ్ళడు. ఉర్దూకి బదులు గ్రాంధికంగా వినిపించినా సరే హిందీ మాట్లాడతాడు (ఇది ఉత్తరభారతానికి పరిమితం). ఇక ఉదారవాదుల దృష్టిలో మంచి ముస్లిమ్ అంటే బిర్యానీ తింటాడు, ఆతిథ్యమిస్తే బిరియానీ పెడతాడు, కబబులు తింటాడు. ఉర్దూ కవిత్వం చదువుతాడు. సూఫీ కవిత్వం చదువుతాడు. గజల్ గానసమ్మేళనాలు నిర్వహిస్తాడు. షామె గజల్ నిర్వహిస్తాడు. టోపీ పెట్టుకోడు, బురఖా ధరించడాన్ని వ్యతిరేకిస్తాడు (నేను కేవలం మేల్ జెండర్ లో ఈ వాక్యాలు రాయడానికి వెనుక అర్థాలు, అంతరార్థాలు ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు చెప్పుకోవచ్చు).
ఎవడిష్టం వచ్చినట్లు వాడు ఏమైనా చెప్పుకోవచ్చు. గుహ గారు లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఉదాహరణ చూపించాడు. సాదిక్ ఖాన్ టోపీ పెట్టుకోడు, గెడ్డం లేదు. ఆయన భార్య బురఖా ధరించదు. కాబట్టి సాదిక్ ఖాన్ మంచి ముస్లిం. ఆయన ఖాన్ తో మాట్లాడాడా, ఇంటర్వ్యు తీసుకున్నాడా, బురఖా గురించి ఖాన్ దంపతుల అభిప్రాయాలను రికార్డు చేశాడా? ఖాన్ టోపీ పెట్టుకున్నా, ఆయన భార్య బురఖా ధరించినా లండన్ ప్రజలు ఎన్నుకునే వారేమో.. అలా లండన్ ప్రజలు ఆయన్ను ఎన్నుకోవడం జరగదని చెప్పడానికి గుహ ఏమన్నా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాడా? తన బుర్రలోని చెత్తను సాదిక్ ఖాన్ ఆలోచనలుగా చెప్పడమే ఉదారవాదమా. ఇలాంటి ఉదారవాదమే లెనిన్ గురించి కూడా గుహ మాట్లాడాడు. త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేసినప్పుడు మాట్లాడుతూ లెనిన్ విదేశీయుడు, టెర్రరిస్టు, ఆయన విగ్రహాలు మనకెందుకు, భగత్ సింగ్ కు లెనిన్ గురించి పూర్తి సమాచారం తెలియదు కాబట్టి లెనిన్ పట్ల భగత్ సింగ్ అభిమానం పెంచుకుని ఉండవచ్చన్నాడు. భగత్ సింగ్ కు లెనిన్ గురించి పూర్తి సమాచారం తెలియదని ఈయనేమైనా భగత్ సింగును కలిసి మాట్లాడి వచ్చాడా? ఉదారవాది ట్యాగు ఒకటి కట్టుకుని మంచి ముస్లిములు, చెడ్డ ముస్లిములంటూ ముస్లిములకు ట్యాగులు కట్టే ఈ ఉదారవాది ఇప్పుడు తన బురఖా వదిలేశాడు. సాదిక్ ఖాన్ దంపతుల ఆలోచనలు బురఖా గురించి ఏమిటన్నది ఈయనకు తెలియదు. అయినా వారి ఆలోచనలుగా చెప్పేస్తాడు. లండన్ ప్రజలు ఆయన్ను టోపి పెట్టుకుంటే ఎన్నుకునేవారో లేదో తెలియకపోయినా ఎన్నుకునే వారు కాదని చెప్పేస్తాడు. హషీం ఆమ్లా ఇంత పొడుగు గెడ్డం పెట్టుకుని దక్షిణాఫ్రికా టీములో ఆడుతున్నాడు. ఇబ్తిహాజ్ బురఖా ధరించి అమెరికా తరఫున ఒలింపిక్స్ లో ఆడింది. ఆమె గౌరవార్థం బార్బీ కంపెనీ హిజాబీ డాల్ మార్కెట్టులో విడుదల చేసింది. వారిద్దరు తమ తమ రంగాల్లో ముస్లిమేతర ప్రాబల్యం ఉన్న సమాజాల్లో రాణించినప్పుడు, లండన్ లో సాదిక్ ఖాన్ ఒకవేళ గెడ్డం పెట్టుకున్నా, టోపీ పెట్టుకున్నా, బురఖా తొడిగిన భార్య ఉన్నా గెలిచేవాడేమో. కాదని గుహ అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాడు?
ప్రధాన జీవనస్రవంతిలో కలిసిపోవాలని చెప్పే ఈ పెద్దలు వాస్తవాలను గుర్తిస్తున్నట్లు కనబడ్డం లేదు. బురఖా ధరించడం అస్సలు అలవాటు లేని ముస్లిం కుటుంబానికైనా సరే హిందూ లొకాలిటీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందా? బురఖా వదిలేసిన మంచి ముస్లిములు కదా వారికెందుకు దొరకడం లేదు. యాక్టర్ ఇమ్రాన్ హాష్మీ టోపీ పెట్టుకోడు, గెడ్డం లేదు. బురఖా గురించి ఆయన అభిప్రాయాలేమిటో తెలియవు కాని బురఖా లేని అమ్మాయిలతోనో కనిపిస్తాడు. కాని ఆయనక్కూడా ముంబయిలో ముస్లిం కాబట్టి ఫ్లాట్ దొరకలేదు. బురఖా, టోపీ, గెడ్డం, ప్రధానస్రవంతి అంటూ ఈ సోకాల్డ్ ఉదారవాదులు ఎవరిని మోసం చేస్తున్నారు?
రామచంద్రగుహ తన వ్యాసం ద్వారా చెప్పిందేమిటంటే, ముస్లిములకు నీతిబోధ చేశాడు. టోపీలు పెట్టుకోకండి, గెడ్డం పెంచకండి, బురఖాలు తొడక్కండి. ప్రధానస్రవంతిలోకి వచ్చేయండి. సరే వచ్చేస్తారు… ఆ తర్వాత. ముస్లిం నాయకులు ఒకవేళ ముస్లిం ప్రజలందరినీ ఈ నీతిసూత్రాలు పాటించాలని చెప్పి ఒప్పించారే అనుకుందాం… ఆ తర్వాత… మతోన్మాద విద్వేష ప్రచారం ఆగిపోతుందా? మతకలహాలు ఆగిపోతాయా? రిపబ్లిక్ డే రోజున ముస్లిములు జాతీయ జెండా ఎగరేసే కార్యక్రమాన్ని అడ్డుకుని, అక్కడ కాషాయం ఎగరేయాలని నిర్బంధించడం ఆగిపోతుందా. కాస్గంజ్ లో ఏం జరిగిందో అలాంటి సంఘటనలు ఆగిపోతాయా? గోమాంసం పేరుతో ముష్కరమూకలు దాడులు చేసి చంపేయడం ఆగిపోతుందా? ముస్లిములకు హిందూ లొకాలిటీలో ఇళ్ళు అద్దెకు దొరుకుతాయా? వివక్ష లేకుండా ముస్లిములకు ఉద్యోగాలు దొరుకుతాయా? గోరఖ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకుండా మరణిస్తున్న పిల్లలను కాపాడ్డానికి ప్రయత్నించిన డా. కఫీల్ ఖాన్ కు గెడ్డం ఉందా? ఆయన ఇప్పుడు జైల్లో ఎందుకున్నాడు? రామచంద్రగుహ వంటి ఉదారవాదులు ముసుగులు తీసేసి మంచి పని చేశారు. ఎవరేమిటో ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతోంది.
రామచంద్రగుహ వంటి వాళ్ళు తమ సోకాల్డ్ ఉదారవాద నిరంకుశత్వాన్ని ముస్లిముల నెత్తిన రుద్దాలనుకుంటున్నారు. అన్నివిధాల అణిచివేతలకు గురవుతున్న ముస్లిం ఉదారవాదులు చెప్పే మంచి ముస్లిం ట్యాగు కోసం ప్రయత్నించినా, హిందూత్వవాదులు చెప్పే మంచి ముస్లిం ట్యాగు కోసం ప్రయత్నించినా తన గుర్తింపును మొత్తం తాకట్టు పెట్టుకున్నా సరే అతనికి వివక్ష తప్పదన్నది జగమెరిగిన సత్యం. గుహ లాంటి వారు ఇప్పుడు సెక్యులరిజం గురించి, ఉదారవాదం గురించి, ప్రధానస్రవంతి గురించి ముస్లిములకు ఇలాంటి లెక్చర్లివ్వడం ఎందుకంటే, ఒక సముదాయంగా ముస్లిములైనా, దళితులైనా తమ గుర్తింపుతో ముందుకు వస్తే నిరంకుశ, పెత్తందారి వర్గాల ఆధిపత్యానికి గండి పడుతుంది. పెత్తందారి వర్గాల ఆధిపత్యాన్ని ముఖ్యంగా ఉత్పత్తి వనరులపై, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై వారి నియంత్రణను కాపాడ్డానికే ఈ లెక్చర్లు. సెక్యులరిజం అంటే మైనారిటీలందరూ తమ గుర్తింపును వదిలేసి, గుహగారిలా మారిపోవడం కాదు.
బురఖా త్రిశూలమా కాదా అనేది అసలు చర్చ కాదు. అసలు చర్చ సోనియాగాంధీ చెప్పిన మాటలపై హర్షమందర్ రాసిన అభిప్రాయాలు. కాని చర్చను బురఖా, త్రిశూలం స్థాయికి దిగజార్చినవాడు రామచంద్రగుహ.
భారత రాజకీయాల్లో ముస్లిములు అంటరానివారుగా మారిపోయిన తీరును హర్షమందర్ తన వ్యాసంలో చర్చించారు. ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యల్లోను ’’మనం‘‘, ’’వాళ్ళు‘‘ లాంటి పదాలు కొందరు ఉపయోగిస్తున్న వాస్తవాన్ని ఎవరు కాదనలేరు. ముస్లిముల పట్ల వైరం, విద్వేషం రెచ్చగొట్టడం వల్ల రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడమన్నది నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. ఈ పాపంలో కాంగ్రేసుకు కూడా భాగం ఉంది. రామచంద్ర గుహ ఇంతకు ముందు వ్యాసాల్లో భారత ముస్లిముల సమస్యల గురించి చర్చించలేదని కాదు. నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే కాంగ్రేసు, బిజేపి పార్టీలు రెండింటిని ఆయన ఇంతకు ముందు రాసిన వ్యాసాల్లో భారత ముస్లిముల సమస్యలకు కారణంగా చిత్రించారు. ముస్లిములకు ఈ పార్టీలు న్యాయం చేయలేదని అన్నారు. ఈ వ్యాసం ఆయన 2008లో టెలీగ్రాఫ్ లో రాశాడు. కాని అప్పటికి ఇప్పటికీ ఆయన అభిప్రాయాల్లో చాలా మార్పు వచ్చేసినట్లు కనబడుతోంది. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని వాతావరణం ఒకటుంది. రాజకీయ పార్టీలు ముస్లిముల విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ఇంతకు ముందు వాదించిన వ్యక్తి ఇప్పుడు ముస్లిముల వెనుకబాటుకు కారణం వారు ప్రజాజీవితంలో తమ గుర్తింపును ప్రకటించే మతచిహ్నాలను ధరించడమే అన్నట్లు మాట్లాడుతున్నాడు. దీని భావమేమిటి? హిందూత్వ, మతతత్వ రాజకీయాలు పెరుగుతున్నప్పుడు, పశుమాంసం సాకుతో దాడులను ఖండించడానికి కూడా ఇష్టపడని రాజకీయ నాయకత్వం ఉన్నప్పుడు ముస్లిములు తమ గుర్తింపు చిహ్నాలను ధరించడమే వారి వెనుకబాటుకు కారణమన్నట్లు మాట్లాడడమంటే, ముస్లిములను మరింత అణిచివేసే కుట్రలకు సహకరించడమే. పైగా గుహ ఆదర్శముస్లిములుగా చెప్పిన పేర్లను పరిశీలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్, గుజరాత్ నరమేధం జరిగిన రెండు సంవత్సరాలకే బిజేపి టిక్కట్లుపై 2004 లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసిన వ్యక్తి. నరేంద్రమోడీని పొగడడానికి, భారత ముస్లిములను తిట్టడానికి దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోని వ్యక్తి. రామచంద్రగుహ ఏం చెబుతున్నారో ఆయనకైనా అర్ధమవుతుందా?
రామచంద్రగుహ వ్యాసాన్ని చదివిన తర్వాత అర్ధమయ్యే విషయం ఒక్కటే. ఇస్లామోఫోబియా అందరిలోను పేరుకుపోయింది. ముస్లిములను ఆధునీకరించడమే ఉదారవాదంగా మారిపోయింది. ముస్లిములను ఆధునీకరించడానికి కంకణం కట్టుకున్న ఈ ఉదారవాదులు ఆ క్రమంలో మతోన్మాద శక్తులకు అవసరమైన సహకారం అందిస్తున్నామన్నది తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తారు. ముస్లిములను ఆధునీకరించడం అటు మతతత్వ శక్తులు కూడా చేస్తున్నాయి. ముస్లిములతో సంప్రదించకుండానే త్రిపుల్ తలాక్ బిల్లు తయారు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టేశారు. లోపాలపుట్టలా ఉందని విమర్శలు వచ్చినా సరే అది ఆధునీకరించడంలో భాగంగా చేశామని గొప్పలు చెప్పుకుంటారు. చాలా మంది అర్ధం చేసుకోవలసిన విషయమేమంటే, బ్రిటీషు ప్రభుత్వం ఉన్నప్పుడు భారతీయులు మాడ్రన్ కాదని, సివిలైజుడు కాదని, మతం మత్తులో ఉన్నారని, మూఢనమ్మకాలున్నాయని వాదించేది. అణిచివేతలకు పాల్పడే ప్రతిఒక్కడు చేసే వాదన ఇలాగే ఉంటుంది. ఈ వాదన ఇప్పుడు ముస్లిములకు వ్యతిరేకంగా అటు మతోన్మాదులు, ఇటు ఉదారవాదులు కలిసి చేస్తున్నారు.

Writer can be reached at – [email protected]

Leave a Reply

Your email address will not be published.