భగవంతునికి-భక్తునికి అనుసంధానకర్తలు !!

భగవంతునికి-భక్తునికి అనుసంధానకర్తలు !!
============================“అమ్మాయిలు ఇల్లొదిలి బయటికి వెళ్లారంటే, ఇక వారు చేయి జారిపోయినట్లే లెక్క. వాళ్ళని అస్సలు బయటికి పంపించకండి. ఈ చదువులు, స్కూళ్ళు,కాలేజీలు. అమ్మాయిలకు అస్సలు పనికి రావు. పూర్తి పరదా పాటించడం మన సాంప్రదాయం “

“అల్లా ముస్లింల కోసమే స్వర్గాన్ని సృష్టించాడు. దానిలో కేవలం ముస్లింలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ముస్లిమేతరులు ఎన్ని మంచిపనులు చేసినా, వారికి ప్రవేశం ఉండదు. ముస్లింలు మాత్రం, ఏమైనా పాపాలు చేసిఉంటే, దానికి తగ్గట్లు వారికి కొంతకాలం నరకంలో శిక్షలుంటాయి, కానీ , అంతిమంగా వారికి స్వర్గంలో ప్రవేశం ఉంటుంది”


ఏ తరగతిలో ఉన్నప్పుడో, సరిగ్గా గుర్తులేదుకానీ , మొత్తానికి హైస్కూల్ లో ఉన్నప్పుడు, ఎగ్జాక్ట్ గా ఇలాంటివే మాటలు , మా పోరుమామిళ్ల మసీదులో ఇమామ్ నోటినుండి జుమ్మా ప్రసంగాల్లో చాలా సార్లు విన్నాను. “ఈయనేంటి ఇలా చెప్తున్నాడు”, -అని మొదట్లో షాకయ్యాను. మరి పెద్దోళ్ళు ఎవరూ ఆయన్ని , ‘ఎందుకిలా మాట్లాడుతున్నావని ప్రశ్నించరా’ .. అనే అనుమానంతో చుట్టూ ఉన్నోళ్లను పరిశీలించేవాణ్ణి. వారిలో సగానికి సగం మంది కళ్ళుమూసుకుని , వింటున్నట్లు నటిస్తూనే , నిద్రపోతూ ఉండేవారు . ఇంకొందరు, ఈ ప్రసంగమేదో త్వరగా అయిపోయి , నమాజు పూర్తైపోతే , త్వరగా ఇంటికెళ్లిపోవచ్చు కదా అన్నట్లు అసహనంగా అక్కడి గోడగడియారం వైపు, ఆ కిటికిలోనుండి బయటికి చూస్తూ కనిపించేవారు. ఎవరో కొందరు ముసలివారు మాత్రమే ఆ ప్రసంగాల్ని సీరియస్ గా వినేవారు. ఇలాంటి కొన్ని ప్రసంగాల ఫలితంగా, అప్పట్లో నాకు కలిగిన ఇంప్రెషన్ ఏంటంటే – ఈ మసీదుల్లో ఇచ్చే ప్రసంగాలు, కేవలం ఈ చెవినుండి విని ఆ చెవినుండి వదిలేసేందుకే తప్ప, దానిలో సీరియస్ గా తీసుకునేదేం లేదు. అప్పటికే , మాయాబజార్, భక్త ప్రహ్లాద , యమగోల, యముడికి మొగుడు, బిస్మిల్లకి బర్కత్ లాంటి సినిమాలు చూసి ఉండటంతో, హిందూ మత గ్రంధాల్లో ఎలా ఐతే ఎంటర్టైమెంట్ కథలుంటాయో , అట్లే మసీదులో చెప్పే ఖురాన్, ప్రవక్త సంగతులు వంటివి కూడా ఎదో టైంపాస్ వ్యవహారమే అని నిర్ధారణ అయిపోయింది. దానికి ప్యారలల్ గా , స్కూల్లో చదివిన డార్విన్ కోతి సిద్ధాంతం ఎలాగూ ఉండనే ఉంది. కాబట్టి వీటన్నిటి ఫలితంగా నేను నాస్తికునిగా, రెండురోజుల( రంజాన్, బక్రీద్) ముస్లిం గా మారిపోవడం ఆటోమేటిక్ గా జరిగిపోయింది.

**********
ఇప్పుడు రెండు అంశాల గురించి కొంచెం సైకో అనలాలసిస్ చేద్దాం.

1 నాకు మసీదు ప్రసంగాలు, ఇస్లాం పై ఎందుకు అవర్షన్ (నిరాసక్తత, వ్యతిరేకత) ను కలిగించాయి
2 మా మసీదు ఇమామ్ గారు ఎందుకు అలాంటి ప్రసంగాలు ఇచ్చేవారు

ముందుగా , అప్పట్లో నేను చదివిన ప్రభుత్వ పాఠశాలలో, కో ఎడ్యుకేషన్ ఉండేది. నేను ఒన్ ఆఫ్ ద టాపర్స్ . అంటే , టీచర్ల దృష్టిలో -‘ వీడికి బాగా చదువొచ్చు’ అనే ఇంప్రెషన్ ఉండే కొందరు స్టూడెంట్లలో నేనొకణ్ణి. ఈ సోకాల్డ్ టాపర్స్ లిస్ట్ లో కొందరు అమ్మాయిలు కూడా ఉండేవారు. ఒక్కోసారి యూనిట్ పరీక్షల్లో వాళ్లకి నాకంటే ఎక్కువ మార్కులే వచ్చేవి. టీచర్స్ కొచ్చెన్ అడిగినప్పుడు, నాకంటే ముందు వాళ్ళే చేయెత్తి కరెక్ట్ ఆన్సర్ చెప్పేవాళ్లు. సహజంగా, టాపర్లు-టాపర్ల మధ్య ఓ రకమైన – అసూయతో కూడిన, దురాశ వాళ్ళ వచ్చిన, గౌరవం అనేది ఉంటుంది. అలాంటి సమయంలో, మసీదు ఇమామ్ గారు – ఆ అమ్మాయిలు బయటికిపోయి చెడిపోయారని చెబితే మరి నాకు చిరాకేయడం సహజమే కదా. సరిగ్గా అదే జరిగింది అప్పట్లో.

అప్పట్లో, నా చెడ్డి దుస్తుల్లో – ప్రసాదు, నర్సింహా, రఫీ, జిలాని, యాకోబు.. ఉండేవారు. . వీళ్ళందరూ మంచోళ్లన్నట్లు. అట్లే, మాకో అపోజిషన్ గ్యాంగ్ ఉండేది. దాంట్లో – కరీముల్లా, షరీఫు, రాజా, కిషోరు, బాషా. వీళ్ళందరూ ఉండేవారు.. ఆళ్లంతా చెడ్డ బ్యాచ్ అన్నట్లు. అంటే తొoడిగాళ్ళు. మాతో బౌలింగ్ వేయించుకుని వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు. తీరా మా బ్యాటింగ్ వచ్చాక , ఏదో ఓ సాకు చూపి ఎగ్గొట్టి వెళ్లేవారు, అవుట్ అయినా, నాటవుట్ అని కొట్లాడుడు, పరీక్షల్లో కాపీ కొట్టుడు, వీరి పాపాల లిస్టు.. అబ్బో చాలా ఉంది. అలాంటిది – ఆ అపోజిషన్ బ్యాచ్ లో ఉన్న కరీముల్లా,బాషా, షరీఫు లు స్వర్గానికి పోతారా, మా బ్యాచ్ లో ఉన్న మంచోళ్ళు ఐన – ప్రసాదు, నర్సింహా, యాకోబు లు మాత్రం నరకానికి పోతారా?” ఈ ఇమామ్ మతుండే మాట్లాడుతున్నాడా… ఇదేదో పక్కా మోసం లా ఉందే!!! – అదీ అప్పటి నా లాజిక్..

ఇక రెండవ పాయింట్ చూద్దాం. ఇమామ్ ఎందుకలా మాట్లాడారు?
అప్పట్లో చాలావరకూ ఇమామ్ లందరూ యూ.పీ, బీహార్, ఢిల్లీ లాంటి ప్రాంతాలనుండి, నార్త్ ఇండియా నుండే వచ్చేవారు. వీరికి హిందీ/ఉర్దూ తప్ప ఇంకో భాష వచ్చేది కాదు. ఐదుపూటలా నమాజు చేయడం(ఆయనతో పాటే ఇతరులు ఆయన వెనుక నిలబడి నమాజు చేస్తారు) , శుక్రవారం మధ్యాహ్నం నమాజులో ఖుద్బా ప్రసంగం చేయడం, రోజూ కొంత హదీసు పుస్తకాలు చదివి వినిపించడం – ఇవీ ఆయన విధులు.ఈ పనులు చేసినందుకు, స్థానిక మసీదు కమిటీ వారు ఆయనకు నెలకింత అని జీతం ఇస్తారు. ఆ మసీదు దగ్గర్లోనే ఆయన కుటుంబం ఉండటానికి ఓ చిన్న ఇల్లుకూడా సమకూర్చుతారు. ఆయనకు కమిటీ వారు ఇచ్చే జీతం చాలా తక్కువ. అది తప్ప ఆయనకు ఇతర ఆదాయమార్గాలేవీ ఉండేవి కావు. ఈ మాత్రం జీతం కూడా తమ యూపీ,బీహార్లలో వచ్చే అవకాశం లేకపోవడం వల్ల కాబోలు, వారు తమ సొంత ఊర్లను వదిలి మా ఊరులాంటి మారుమూల ప్రాంతాలకు వచ్చేవారు.

మొత్తం మీద చూస్తే, ఆ ఇమామ్ లది పాపం చాలా దయనీయ,పేదరికంతో కూడిన జీవితం. “ఈ జీవితం కేవలం దేవుడు పెట్టే పరీక్ష. అసలైన జీవితం మరణానంతరమే ఉంటుంది ” – అని చెప్పడం ఈజీ. కానీ, దానిని మనసావాచా నమ్మడం, ఆచరించడం అందరికీ సాధ్యం కాదు. మంచి బట్టలు, వస్తువులు, స్కూటర్లు, బైకులు, సొంత ఇల్లు.. ఇలాంటి అనేక సౌకర్యాలు, ఆకర్షనీయమైన అంశాలు రోజూ కళ్ళముందే కనిపిస్తుంటే, వాటిని పూర్తిగా అనుభవించేసి – “అబ్బే, ఇవన్నీ వేస్ట్, వీటిలో మజా లేదు” అనేవిషయం అనుభవపూర్వకంగా తెలుసుకోవడం.. వాటిపై ఆసక్తి కోల్పోవడం ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. అలాంటివారు, ఆ సౌకర్యాలనన్నిటినీ వదిలేసి ప్రశాంతంగా, సుఖంగా ఉండగలరు.

కానీ, ఇవి కళ్ళముందే రోజూ కనిపించి టెంప్ట్ చేస్తుంటే, వాటిని అందుకునే అవకాశం ఏమాత్రం లేకపోవడం, ఎలాంటి వ్యక్తినైనా తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఇది ఒక్కోసారి, ఆ సౌకర్యాలపై ద్వేషాన్ని కూడా కలిగిస్తుంది. అది ఏదో ఓ రూపంలో బయటపడుతుంది. ఈ రకంగా, మా ఇమామ్ లకు తమ చుట్టూ ఉన్న మెటీరియలిస్టిక్ సమాజంపై తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. ఆ వ్యతిరేకతే తమ ప్రసంగాల్లో కనిపిస్తుండేది.

కానీ, మన చుట్టూ ఉన్న మెటీరియలిస్టిక్ సమాజం కూడా, ప్రతి వ్యక్తికీ ఏదో రూపంలో బ్రెయిన్ వాష్ చేస్తునే ఉంటుంది. అవి – “బాగా చదివి మార్కులు, ర్యాంకులు,సీట్లు సాధించాలి. వాటి ఆధారంగా డబ్బులు,కార్లు,మిద్దెలు,మేడలు పోగేయాలి. సమాజంలో గొప్పవారిగా చలామనీ అవ్వాలి, సెలబ్రిటీలైపోవాలి.పది మందీ మెచ్చుకోవాలి”-. ఇలా సమాజం కూడా అనేక ప్రసంగాల్ని చెవులు చిల్లులు పడేలా పదే,పదే చెబుతూ ఉంటుంది. .

చాలా మందికిలాగానే, నాపై కూడా మసీదులోని ఇమామ్ ప్రసంగాల కంటే – సమాజం ప్రసంగాలే ఎక్కువ ప్రభావం చూపాయి. దాని ఫలితమే – నేను రెండు రోజుల ముస్లిం గా మారేలా చేశాయి.

సీన్ కట్ చేస్తే –

నా బీటెక్ ఐపోయింది. దేశంలో కెల్లా టాప్ యం.యన్.సీ లుగా చెప్పుకునే కంపెనీల్లో ఉద్యోగాలూ వచ్చాయి. “వాట్ నెక్స్ట్”… అనే ఆలోచనలు మొదలయ్యాయి.. అదే సమయంలో, చుట్టూ జరుగుతున్న సంఘటనలు, వివిధ పుస్తకాలు చదివి,విని తెలుసుకున్న విషయాలు – “జీవితానికి అర్థమంటూ ఉందా”, “నీతి-న్యాయం, మంచి-చెడు లాంటివి ఉన్నాయా, లేవా”.. లాంటి ప్రశ్నలూ ముసురుకున్నాయి.

అప్పుడే .. నా చేతికందిన అస్త్రాలు – గూగుల్, యూటూబ్.

వీటి ఆధారంగా తవ్వుకుంటూపోతే చాలా విషయాలు తెలిసాయి. ముఖ్యంగా – భక్తునికీ-భగవంతునికీ కొత్త అనుసంధాన కర్తలు చాలా మంది తగిలారు. వీరు, మా ఊరి మసీదు ఇమామ్ లలాగా కేవలం మదరసాల్లో ఖురాన్ బై-హార్ట్ చేసివచ్చినోల్లు కాదు. పేదరికంలో ఉంటూ, పేదరికం దేవుడు పెట్టే పరీక్ష అని నిర్వేదంగా చెప్పేవారు కాదు. మతాన్ని రాజకీయంగానో,వ్యాపారంగానో మార్చి వేల కోట్ల మాఫియా స్థావరాలను ఏర్పరచుకున్నోల్లు కాదు.వీరు కేవలం నాలాంటివారు. ప్రపంచవ్యాప్తంగా, ప్రముఖ యూనివర్సిటీల్లో చదివినవారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్ల లాంటి ఉద్యోగాలు చేసుకుంటూ సాధారణ, సౌకర్యవంతమైన జీవితం గడిపేవారు. జీవితం పట్ల, చావు-పుట్టుకల పట్ల ఉన్న కుతూహలం లో, ఆసక్తితో వివిధ ఫిలాసఫీలను స్టడీచేసి,చివరికి విశ్వాసులుగా మారినవారు. వీరిలో చాలా మంది అసలు ముస్లిం కుటుంబాల్లో పుట్టినవారు కూడా కాదు.

ఆ లిస్ట్ చాలా, చాలా పెద్దది. ప్రస్తుతానికి నాకు గుర్తొస్తున్న పేర్లు

1. ప్రముఖ ఫ్రెంచ్ ఫిలాసఫర్ మరియు మెటాఫిజిషియన్ – రెనె గెనన్ ( René Guénon , Later became – Abd al-Wāḥid Yaḥyá)
-మెటాఫిజిక్స్,ఇస్లాం, హిందుఇజం,క్రిష్టియానిటీ, వెస్ట్రన్ సివిలైజేషన్ వంటి వివిధ అంశాలపై 20పైగా పుస్తకాలు రాశారు.
Famous Book – The Crisis of The Modern World.

2.జర్మన్ తత్వవేత్త – ఫ్రెత్ షోన్ (Frithjof Schuon , Later became – Īsā Nūr al-Dīn)
మెటాఫిజిక్స్, హిందూ ఫిలాసఫీ, ఇస్లాం, తత్వశాస్త్రాలపై 30 పైగా పుస్తకాలు, అసంఖ్యాక పరిశొధణాత్మక వ్యాసాలు రాశారు.
ఇతను రాసిన -Understanding Islam ఓ క్లాసిక్ బుక్.
ఈయన రచనలు, ప్రసంగాలతో ప్రభావితమైన – మార్టిన్ లింగ్స్ – అనంతరం “MUHAMMAD” అనే పుస్తకం రాశారు. ప్రవక్త జీవితం పై వచ్చిన ఇంగ్లీష్ పుస్తకాలన్నిట్లోకి ఇదే ఇప్పటివరకూ మోస్ట్ పాపులర్ పుస్తకం.

3.అమెరికన్ మ్యాథమ్యాటిక్స్ ప్రొఫెసర్ – డాక్టర్. గ్యారీ మిల్లర్.
ఈయన రాసిన – ‘ద అమేజింగ్ ఖురాన్’ అనే పాపులర్ పుస్తకం , ఖురాన్ ని లాజికల్ గా విష్లేశిస్తుంది.

4.ప్రొఫెసర్ ఆఫ్ కాన్సస్ యూనివర్సిటీ – డాక్టర్. జెఫ్రీ ల్యాంగ్
ఈయన రాసిన ” EVEN Angles Ask”, Struggling to Surrender అనేవి అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈయన స్పీచ్లు అనేకం యూటూబ్ లో ఉన్నాయి.

5.జర్నలిజం, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్ – యాస్మిన్ మొగాహెద్.
ఈమె రాసిన Reclaim Your Heart అనే పుస్తకం అనేక పునర్ముద్రణలు పొందింది. శ్రోతల్ని కట్టిపడేసే ఉపన్యాసాలకు ఈవిడ ప్రసిద్ధి.

6.క్యాంబ్రిడ్గ్ యూనివర్సిటీ లెక్చరర్ – తిమొతి జాన్ వింటర్
అబ్దుల్ హకీం మురాద్ గా మారిన ఈయన, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు పొందాడు. యూరప్ సమాజంపై, ఆధునిక మానవ విలువలుగా చెప్పబడుతున్న అనేక అంశాలపై ఇస్లామ్ ప్రభావాన్ని, అనేక పరిశొధనాత్మక పుస్తకాల ద్వారా వివరించాడు.

7.జార్జ్ టౌన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ – జొనాధన్ ఎ.సి.బ్రౌన్. Jonathan A.C. Brown
చూడ్డానికి హాలీవుడ్ హీరోలా కనిపించే ఈయన,ఓ ప్రాక్టీసింగ్ ముస్లిం అనీ, అరబిక్ భాషలో నిష్ణాతుడనీ, పురాతన హదీసు గ్రంధాలన్నిటినీ ముందేసుకుని , కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేశాడని, ఆయన స్పీచులు విన్నాకగానీ, ఆయన రాసిన అనేకపుస్తకాల్లో ఒకటైన, ” MISQUOTING MUHAMMAD ” అనే పుస్తకం చదివాక గానీ అర్థం అవ్వదు.

8.టైంస్ కాలమిస్ట్ – లెజ్లీ హాజిల్టన్.
ఈమె ప్రవక్త జీవితంపై అనేక సంవత్సరాల పాటు పరిశొధనలు చేసి రాసిన – The First Muslim , పుస్తకం, ప్రవక్త జీవితంలోని కీలక ఘట్టాల్ని, దానివెనకున్న మానవాతీత అంశాల్ని చెప్పకనే చెప్తుంది.

వీరు ఇస్లాం/ఖురాన్/మహమ్మద్ ప్రవక్త ల గురించి రాసిన అనేక పరిశోధాత్మక పుస్తకాలు/వ్యాసాలు/ప్రసంగాలు లక్షలాది మెదల్లను కదిలించాయి. ఏ ఇంటర్నెట్ ద్వారా ఇస్లామోఫోబియా విస్తరిస్తుందో, అదే ఇంటర్నెట్ ద్వారా, దానికి ప్యారలల్ గా ఇస్లామిక్ వాయిస్ కూడా అత్యంత బలంగా, ప్రభావవంతంగా వ్యాపిస్తుండటం, ఓ ఆసక్తికర పరిణామం.

– మహమ్మద్ హనీఫ్
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.