ముస్లింల బాధ – అనాధల బాధ!!

“కృష్ణశాస్త్రి బాధ – ప్రపంచం బాధ,
ప్రపంచంపు బాధ – శ్రీశ్రీ బాధ”

ఇది అప్పుడెప్పుడో చలం చెప్పిన మాట.
ప్రస్తుత కాలానికి మార్చి రాస్తే,

“ముస్లింల చేతిలో ఎవరైనా బాధలు అనుభవిస్తే – అది ప్రపంచపు బాధ,
ముస్లింలు ఎవరిచేతిలోనైనా బాధలకు గురైతే – అది అనాధల బాధ” – అని చెప్పాల్సి ఉంటుంది.

సద్దాం హుస్సేన్ – తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, ఇరాక్ లోని కొన్ని తెగలపై అణచివేత చర్యలు చేపట్టాడు. నియంతలెవరైనా చేసేది అదే కదా. కానీ, ఆ బాధిత తెగల బాధ ప్రపంచం బాధైంది. సద్ధాం హుస్సేన్ చేసిన అకృత్యాలను పదింతలు చేసి, ప్రపంచ మీడియా పదే,పదే ప్రసారం చేసింది. అతని దగ్గర జనహనన ఆయుధాలున్నాయని నాటో దలాలు ఇరాక్ పై దండయాత్ర చేసి సద్దాం ను మట్టుపెట్టాయి. అంతా ఐపోయాక, అశ్వద్దామతహ కుంజరహా అన్నట్లు – ‘జనహనన ఆయుధాలు ‘ ప్రపంచజనాలను వెర్రోల్లను చేయడానికి వాడిన పాచిక మాత్రమే అని అగ్రరాజ్యాలు పళ్ళికిలిస్తూ చెప్పాయి.
ఇరాక్ పై వివిధ రకాల ఆంక్షలు విధించి – అక్కడ మందులు దొరక్కుండా చేసి, 5 లక్షల మంది చిన్నారులు చనిపోయిన విషయం మాత్రం, ప్రపంచం బాధ అవ్వదు.

గడాఫీ – ఈయన జీవితం మరీ ట్రాజెడీ. ఈయన చేసిన చెడు పనేంటో చాలా మందికి తెలీదు గానీ, ఈయన పేరు వినంగానే ‘చెడ్డోడు’ అని మైండ్ లో ఫిక్స్ అయ్యేలా చేశారు. ఈయన హయాంలో లిబియా, ఆఫ్రికాలో కెల్లా అత్యంత అభివృద్ధి చెందిన దేశం. దేశంలోని ఆయిల్ నిక్షేపాల్ని జాతీయం చేసి, వాటి ద్వారా వచ్చే సంపదను దేశ ప్రజలందరికీ పంచిపెట్టాడు. అధికారాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో కొన్ని గ్రూపులతో తగాదాలు పెట్టుకున్నాడు. ఆ గ్రూపుల బాధ ప్రపంచం బాధైంది. మళ్ళీ నాటో దలాలే, లిబియాను ఆ బాధల్నుండీ విముక్తికలిగించే పవిత్ర కార్యాన్ని భుజాలపై వేసుకుని, గడాఫీని మట్టుపెట్టాయి. గడాఫీ అనంతరం – లిబియా పరిస్థితి -కుక్కలు చింపిన విస్తరాకులా తయారైంది. ఓ గ్రూపు, మరో గ్రూపు ప్రజల్ని బంధించి, బానిసలుగా మార్కేట్లో నిలబెట్టి అమ్ముతున్నారు. కాని, ఇప్పుడు అక్కడ ప్రపంచం బాధ తీరిపోయింది, కాబట్టి వాటి గురించి మనం మాట్లాడకూడదు.

సిరియా – బషర్ అల్ అసద్ – ప్రపంచం బాధకు తరువాతి టార్గెట్ తనే అని కొంచెం ముందుగానే తెలుసుకున్నాడు. రష్యా, ఇరాన్ లకు తన బాధను చెప్పుకుని, కాస్తంత తెలివిగా ఎత్తులు వేయడంతో, సద్ధాం,గడాఫీలకు పట్టిన గతే తనకు పట్టకుండా ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. ఇప్పటికి కూడా, అక్కడ ఏం జరుగుతుందో, అంత చిన్న దేశంలో అమెరికా,బ్రిటన్ లాంటి దేశాలకు కలగజేసుకోవాల్సిన అవసరం ఏంటో, మధ్యలో ఈ ఐసిస్ ఎక్కడనుండీ ఊడిపడిందో, దానికి కావలసిన ఆయుధ,అంగ బలాలు ఎవరు సమకూరుస్తున్నారో – చాలా మందికి ఏ మాత్రం అర్థం కాదు.

ఈ దేశాలన్నిట్లో కొందరు బాధితులున్న మాట నిజం. కానీ, ఆ బాధితులు ఓ రకంగా అదృష్టవంతులు – ఎందుకంటే వారి బాధ ప్రపంచం బాధైంది. వారిని బాధల్నుండీ విముక్తి కల్గించే ప్రవిత్ర బాధ్యతను, నాటో, ఐక్యరాజ్యసమితి లాంటివి తమ భుజస్కంధాలపై వేసుకున్నాయి.

కానీ, ఇదే ప్రపంచంలో వేరే బాధితులు కూడా ఉన్నారు.

పాలస్తీనా : అర్థరాత్రి కొందరు మీ ఇంటి తలుపు తట్టారు. ‘బయట చలికి తాలలేక పోతున్నాం, కొంచెం మీ ఇంట్లోకి రానివ్వమని’ ప్రాధేయపడ్డారు. మీరు జాలిపడి రానిచ్చారు. నాలుగు రోజుల తర్వాత – ‘సరిగ్గా ఇదే స్థలంలో, రెండు వేల సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఉండేవారు. ఆ లెక్కన ఈ స్థలం మాది. కాబట్టి, మీరు అర్జెంటుగా పెట్టా బేడా సర్దుకుని ఇల్లువదిలి వెల్లిపొమ్మని’ – ఆ వచ్చిన వారు మీకు ఆర్డర్ వేశారు. మీ ఇల్లూ,పోలాలూ అన్నీ లాకున్నారు. మీ ఇంటి కుర్రాడు, వారిపై చేయెత్తబోతే, ‘ఆ ఇంట్లోని తీవ్రవాదులు మమ్మల్ని చంపేస్తున్నారు బాబోయ్’ – అని శోకాలు తీశారు. మీ కుర్రోన్నే కాల్చి చంపారు.

అప్పుడు మీకేమనిపిస్తుంది..?

పాలస్తీనా వారిది సరిగ్గా అదే బాధ. 70 ఏళ్ళ ముందు, ప్రపంచపటంలో ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఉన్నదంతా పాలస్తీనానే. ఇప్పుడక్కడ పాలస్తీనా, చుక్కలు,చుక్కలుగా మాత్రమే కనిపిస్తుంది. మిగతాదంతా ఇజ్రాయెలే. కానీ, ప్రపంచానికి ఆ బాధ పట్టదు. ఐక్యరాజ్యసమితీ, నాటోలు వారివైపు కన్నెత్తి కూడా చూడవు. ఎందుకంటే -బాధితులు ముస్లింలు కదా.

రోహింగ్యా : అక్కడ లక్షల సంఖ్యలో ముస్లింలు చంపబడ్డారు, ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఇల్లల్లోనుండీ తరిమి వేయబడ్డారు, వేలల్లో ముస్లిం యువతులు సామూహిక మానభంగాలకు గురయ్యారు. ఊర్లకు ఊర్లు మాయమైపోయాయి. అది – ‘క్రైం అగైన్స్ట్ హ్యూమానిటీ’, ‘జెనోసైడ్’ అని స్టేటెంట్లు ఇవ్వడం తప్ప, ఐక్యరాజ్యసమితి చేసిందేమీలేదు. మయన్మార్ పై ఒక్కటంటే ఒక్కటీ ఆంక్ష కూడా విధించింది లేదు. నాటో దలాలు ఎక్కడ తొంగొని ఉన్నాయో తెలీదు. ఎందుకంటే, బాధితులు ముస్లింలు కదా.

ఇలాంటిదే చైనాలోని ఉఇగర్ ప్రాంతం. ఇలా మానహక్కుల ఉల్లంఘన బాహాటంగా జరిగే ముస్లిం ప్రాంతాలు అనేకం అందరికీ తెలిసినవే. . ముస్లిం ప్రాంతాల్లో రాత్రికి రాత్రి అరెస్టులు, గృహనిర్భంధాలూ చేయొచ్చు. ఏ నేరంచేయకున్నా రోజులతరబడి జైల్లలో వేయొచ్చు. జర్నలిస్టులు,విద్యార్థులు, మహిళలు.. ఎవరైనా సరే, ఏమైనా చేసేయొచ్చు. అక్కడ ప్రాధమిక హక్కులు, మానవ హక్కులు ఉండవు. ఎవరైనా తిరగబడి, ఓ చిన్న రాయి చేతికి తీసుకున్నా, వారిని తీవ్రవాదులుగా డిక్లేర్ చేసి యుద్ధట్యాంకులతో తొక్కి చంపొచ్చు. పెల్లెట్ గన్స్ తో గుడ్డోల్లను చేసేయొచ్చు. ప్రపంచానికి వారిపై బాధ కాదు కదా, కనీస సానుభూతి కూడా ఉండదు. ఎందుకంటే, అది ఆయా దేశాల అంతర్గత అంశమట. ఆహా, ఏం న్యాయం, ఏం నిబద్ధత. అన్నట్లు అంతర్జాతీయ న్యాయస్థానమనీ, ఒకటేదో ఉండాలే.. అదిప్పుడేం చేస్తుంది? ఏదో చేస్తుంటూందిలే.. టర్కీనో, తజకిస్తాన్ నో నిందించాల్సి వచ్చినప్పుడు పిక్చర్లోకి వస్తుంది.

మొత్తానికి – “ముస్లింల చేతిలో ఎవరైనా బాధలు అనుభవిస్తే – అది ప్రపంచపు బాధ,
ముస్లింలు ఎవరిచేతిలోనైనా బాధలకు గురైతే – అది అనాధల బాధ” – అనేది మాత్రం క్లియర్. ఎందుకు,ఏమిటీ అనేవి తర్వాత మాట్లాడుకుందాం.

శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.